బలిపీఠాలపై స్త్రీల జీవితాలు (గంటి భానుమతి ‘రాయలమ్మ కథ’ ) – అనిశెట్టి రజిత

మన ఘనతవహించిన సమాజం మన ప్రమేయం లేకుండానే మనల్ని కానివాళ్ళను చేస్తుంది. ఎందుకూ కొరగాని వాళ్ళుగా తక్కువ చేస్తుంది. విధి వల్ల వంచితులు కోకొల్లలు ఈ లోకంలో. స్త్రీల విషయంలో విధి, సమాజం, లోకం మాధ్యమాలుగా వాళ్ళ జీవితాలపై నిఘా పెట్టి

నియంత్రణల పిడిబాకుల్ని దించడానికి కాచుకొని ఉంటుంది. స్త్రీ అస్తిత్వాన్ని బలిపీఠంపైకి ఎక్కించే వరకు కుట్రలూ కుతంత్రాలూ చేస్తూనే ఉంటుంది. ‘రాయలమ్మ’ పేరు కొత్తగా చిత్రంగా ఉన్నా ఆమె సామాన్య స్త్రీ. ప్రేమార్థ్రతలు నిండుగా ఉన్న స్త్రీ. తన పేరు విషయంలో ఆమెకు చిన్నపాటి గర్వం. ముంగండ గ్రామవాసి జగన్నాథ పండితరాయలు వంశం పేరును ఆ గ్రామస్తులు అటు ఇటుగా మార్చి తమ పిల్లలకు పెట్టుకుంటారు. రాయలమ్మ పేరు అలా వచ్చింది.
పన్నెండో ఏట రాయలమ్మకు సిద్ధాంతితో పెళ్ళవుతుంది. ఉమ్మడి కుటుంబం. తెల్లవారింది మొదలు ఆమె ఇంటి పనుల్లో మునిగి తేలుతుంటే పంచాంగాల కట్ట ముందేసుకొని అరుగు మీద కూర్చుంటాడు సిద్ధాంతి. జనం రకరకాల విషయాలు కనుక్కునేందుకు కిక్కిరిసిపోతారు. ఆమె ముగ్గురు పిల్లలూ పూరిట్లోనే చనిపోతారు. ఆ దు:ఖం తీరకముందే పాము కరిచి సిద్ధాంతి పోతాడు. అన్ని రకాలుగా పంచాంగాలు చూసి మంచిరోజులు చెప్పే అతను రాయలమ్మకు ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇంక ఆమెకు ఎవరూ లేనట్టే.. ఆమె ఒంటరి జీవితపు ప్రయాణం మొదలవుతుంది. ఆ పెద్ద కుటుంబంలో వంటింటికీ సామాన్ల గదికీ ఆమె కదలికలు పరిమితమైపోతాయి. ఆమెకు ఎలాంటి కోపతాపాలు కలగకూడదని ఇంట్లోవాళ్ళు ముందే బంధం వేసేవాళ్ళు లౌక్యంగా. తక్కువ పూజలు చేస్తే ఎక్కువ ఫలితం ఎందుకిస్తాడు దేవుడు వచ్చే జన్మలో బాగుండాలని దేవుడిని కోరుకో అనేవాళ్ళు వచ్చే జన్మ వరకూ ఎందుకు ? ఈ జన్మలో మంచి ఫలితం ఎందుకివ్వడు దేవుడు.. ఎదురుచూడాలా అనిపించేది రాయలమ్మకు. అటు పుట్టింట్లో ఇటు భర్తింట్లో పనులకోసం జీవితాన్ని అంకితం చేసిన సమయంలో దూరపు బంధువులింట్లో తన అవసరమొచ్చి అక్కడికి చేరుతుంది. ఆమె ఇక తన జీతాన్నీ, జీవితాన్నీ తన చేతుల్లోకి తీసుకునే సమయమొచ్చిందని అనుకొంటుంది. బాధ్యతగా కాకుండా తనవాళ్ళకు చేసినట్లుగా ప్రేమతో పనులన్నీ చేసిపెడ్తుంది.
… … …
పొట్టి చేతుల తెల్ల రవిక మీది నుంచి చిన్న రుద్రాక్షల్ని వెండితీగెలో చుట్టి మాలజారుతుంటే, వేళ్ళకి వెంకన్నబాబున్న దర్భముడి వెండి ఉంగరం తెల్ల చీర కొంగును నెత్తిమీద నుండి కుడి భుజం మీదుగా ముందుకు దోపుకుంటుంది. ఆ ఇంటి పిల్లలయిన లక్ష్మి ఇద్దరు తమ్ముళ్లూ ఆ కొంగును లాగేసి గుండు మీద ఓ రెండు మొత్తులు మొత్తి వెళ్ళిపోతే రాయలమ్మ విసుక్కోకుండా నవ్వుతూ గుండు మీదికి చెంగుని లాక్కొని చెవుల వెనక్కి దాన్ని దోపి చెవుల్ని ముందుకు లాక్కునేది. ఆమె ఆ ఇంటి నుండి కాలుబయటపెట్టేది లేదు. ఎవరినుండీ ఏమి ఆశించేది కాదు. ఉన్నచోట ప్రేమగా సేవలూ పనులూ చేసిపెట్టడం ఆమె స్వభావం. దేవుడు నిన్ను అన్యాయం చేసాడనీ, నీకిన్ని కష్టాలు వచ్చిపడ్డాయనీ ఎప్పుడైనా బాధపడ్డావా అని లక్ష్మి అడిగితే. తనలాంటి వాళ్ళను ఎందరినో చూసాను కనుక తనూ అంతే అనుకుందట. మాకు అడ్డదారులుండవు, కష్టాపడవలసిందే.. రోజులు ఇలాగే గడపవలసిందే.. సూరీడికి వీపు చూపించి సూరీడంటే నీడల్ని పోగేసేవాడు అనటం అనుకోవడం అర్థంలేనిది అన్న వ్యక్తిత్వ వికాసం రాయలమ్మది. ఆమెకు మౌఖిక పాండిత్యం తండ్రి నుండి వచ్చింది. బాగా పుస్తకాలు చదివిన వాళ్ళే జీవితాలూ చదివే ఉంటారు అనుకోలేము. ఆమె ఏక సంథాగ్రహి. లక్ష్మి ఆమెకు రాయడం చదవడం నేర్పిస్తుంది. వంకర టింకర అక్షరాలతో ‘లెష్మి’ అని రాస్తుంది, పిలుస్తుంది.
… … …
ఆ ఇంటి పిల్లలు పెద్దవాళ్ళవుతారు ఉద్యోగాలూ పెళ్ళిళ్ళూ… లక్ష్మి తల్లికి ఇక పెద్దదయిన రాయలమ్మ అవసరం కనిపించడు. అవసరాలు తీరిన తరవాత విసిరి అవతల పారేయడం లోకం తీరు కదా. లక్ష్మి తల్లిని అలా రాయలమ్మను పంపించేయడం అన్యాయమనీ అదే మీ అమ్మ అయితే ఈ వయసులో పంపించేస్తావా అని ప్రశ్నిస్తుంది. రాయలమ్మ లక్ష్మిని తల్లికన్నా ఎక్కువగా తల్లిలా చూసుకున్నది. ఆమెతో స్నేహంగా తనలోని మాటలూ, విషయాలు చెప్పుకున్నది. ఇద్దరూ ఒకరికొకరు గురువులుగా, మిత్రులుగా ఉన్నారు. ఇంటి పెద్దమనిషిని ఒక ఆవులా, గేదెలా పంపించివేయాలన్నీ తల్లిదండ్రులు ఆలోచన ఆమెకు సహించలేదు. రాయలమ్మను ఎప్పుడు ఊరికి పంపించబోయినా చలికాలం ఊర్లో ఇలా ఉంటుంటదనీ ఎండాకాలం మరోలా వానాకాలం మరోలాంటి వాతావరణం గురించి చెప్తూ వెళ్ళడం దాటవేస్తుంటుంది. లక్ష్మితో నన్ను నీతో తీసుకుపోకూడదా అని జాలిగా అడుగుతుంది. లక్ష్మి కదిలిపోతుంది.
రాయలమ్మ ఊర్లో ఆస్తులకు సంబంధించి సంతకాలు ఏదో కావాలని… ఆమెను ముంగండ ఊరికి పంపించమన్న పిలుపు వస్తుంది. ఎంతో నచ్చజెప్పిన మీదట ఆ సంతాకాలేవో చేసేసి వెంటనే వచ్చేస్తాను అని ఉత్సాహం చూపుతుంది. ముంగండకు వెళ్ళిన రాయలమ్మ రెండు నెలల కాలంలోనే జబ్బుపడుతుంది. కబురు తెలిసిన లక్ష్మి కుటుంబం ఆమె చూడడానికి ముంగండ వెళతారు.
తన ఒంట్లో ఊరికి వెళ్ళడానికి ఏ కొంచెం ఇష్టం కూడా లేని ఆమె కదలలేక కదలలేక కబేళాకు తోలుకుపోడిన గొడ్డులా వెళ్ళిన రాయలమ్మ తాటాకు చాపమీద తెల్లబట్ట చుట్టుకొన్న అస్థి పంజరంలా ఉంటుంది. ఆమె మరీ ఇంత పెద్దదా అనుకుంటుంది లక్ష్మి. అక్కడి ఆడవాళ్ళు వంగి ఆమె చెవిలో ఏదో చెప్తే కళ్ళు తెరిచిన రాయలమ్మ వాళ్ళను గుర్తుపట్టదు. బంధువులు ఈ రెండు నెలలూ ఆమెను ఏమీ కష్టపెట్టకుండా ఎంత బాగా చూసుకున్నారో వంతులేసుకొని లక్ష్మి నాన్నకు చెప్తుంటారు. భౌతిక, భవబంధాలను విడిచిపెట్టి రాయలమ్మ ఆ పూట వెళ్ళిపోతుంది. ఆవిడ ఖర్మకాండలను ఏ లోటు లేకుండా చేయండని లక్ష్మి నాన్న యాభై వేలు బంధువుల ముఖాలు వెలిగిపోతుండగా చేతిలో పెడ్తాడు. తమ ఊరికి చేరిన లక్ష్మి స్టోర్‌రూమ్‌లో ఉన్న రాయలమ్మ పెట్టె తెరిచి చూస్తుంది. లక్ష్మి మూడేళ్ల నాటి నుండీ అన్నీ ఫోటోలు పిల్లలవి వివిధ దశల్లోవి ఉంటాయి. లక్ష్మి ఆమ్మమ్మ తోలు సంచిని లక్ష్మిని అడిగితీసుకున్న దాంట్లో ఆమె జీవితంలో ప్రతి కష్టం ప్రతి పైసా ఉంటుంది. ముప్పై ఏళ్ళ ఆ శ్రమ ఆ తోలు సంచిలో నిశ్శబ్దంగా ఒదిగిపోయి కనిపిస్తుంది. ఇంక ఆ పెట్టెలో ఏమీ ఉండదు. ఫోటోలు సంచీ తప్ప. ఆ ఫోటోల వెనుక వంకర టింకర అక్షరాలతో ‘లషిమి’ అని రాసి ఉంటుంది. నా పేరు తప్పు రాసావు అని పైకే అనేస్తుంది లక్ష్మి. సిగ్గుపడుతూ ఈసారి సరిగ్గా రాస్తానులే అంటున్నట్లుగా రాయలమ్మ ముఖం కనిపించి లక్ష్మి ఒక్కసారిగా భోరున ఏడుస్తుంది.
… … …
భర్త చనిపోతే … పిల్లలూ లేకపోతే… ఆ స్త్రీలు దాదాపు అనాధలవుతారు. లోకం అనాధలు, దిక్కులేనివాళ్ళనే అంటుంది. నిజానికి వీరంతా ఒంటరి స్త్రీలుగా భావించబడుతారు.చాలా మంది నా కర్మ ఇంతే అనుకుంటూ పూజలూ, పుణ్యస్నానాలూ, ఉపవాసాలతో బతుకు బండి ఒంటి చక్రంతో లాగిస్తుంటారు. ఇదీ వితంతువులుగా చేయబడిన స్త్రీల పరిస్థితి. సంఘం వాళ్ళ పట్ల క్రూరంగా వ్యవహరించే తీరువల్ల కసి పెరిగి నెగటివ్‌ మనస్తత్వం ఏర్పడి కోపిష్టులుగా, గయ్యాళులుగా, శాడిస్టులుగా ప్రవర్తిస్తుంటారు కొందరు.
వాళ్ళు అందరిలా మనుషులే ! సామాన్యులే ! ప్రాణులే ! సంఘజీవులే ! అయినా తిరస్క ృతులు, మలినులు, సంఘం చేత అస్తవ్యస్తంగా చెక్కబడిన నిర్జీవ శిల్పాలు ! మానవ సంవేదనలూ సంబంధాలూ ఎంత బలమైనవో అంతే క్రూరమైనవి. రాయలమ్మ లక్ష్మి కుటుంబాన్ని సొంతం చేసుకుని ప్రేమతో పని చేస్తుంది. లక్ష్మి తప్ప మిగితా అందరూ అంతంత మాత్రంగానే ఉంటారు అయినా వాళ్ళ నుండి దూరం పోవడం అంటే రాయలమ్మకు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంలాంటిదే.
ఆమెకు ఏమయ్యింది ? ఎందుకు చనిపోయింది ? మానసికమైన రుగ్మతా ? శారీరకమైన రోగమా ఏర్పడిరది ? ముప్పై ఏళ్ళుగా తన ఊపిర్లన్నీ ఆ కుటుంబ వ్యక్తుల పైనే పెట్టుకున్నదన్నది మాత్రం స్పష్టం. ఆర్థ్రతనూ ప్రేమనూ పొందలేక నిర్లక్ష్యానికీ అవమనానికీ గురవుతూ శవప్రాయపు శరీరాల్లోకి జీవ గంజిని కొద్ది కొద్దిగా వొంపుకుంటూ ఆశలనూ ఆశయాలనూ అణిచిపెట్టుకుంటూ బతుకు భారంగా గడిపే అనేక మంది వితంతు స్త్రీల దు:ఖ కథలకు ‘రాయలమ్మ’ కథ సజీవమైన నిదర్శనం.
మూఢత్వం, దురహంకారం, ప్రేమరాహిత్యం, స్వార్థకాంక్షల్లో పడి మనిషితత్వానికీ మానవత్యానికీ ఘోర అపకారం చేస్తూ చట్టాల్లోకిరాని నేరస్తులుగా సమాజాన్ని విచ్ఛిన్నం, అసంబద్ధం చేస్తున్న సామాజికులదే ఈ పాపమంతా. ‘రాయలమ్మ’ కథా కాలం ఎప్పటిది అన్న చర్చ అనవసరం. కథా కాలం ప్రారంభం మనం ఊహించవచ్చు. ఈ కాలంలో పరిస్థితులు ఆ విధంగా ఊండవేమో అని అనుకోలేము. ఎప్పుడైనా సమాజ ప్రవర్తన మానవీయతకు వ్యతిరేకంగానే ఉంటుంది.
మనిషిని మనిషిగా గౌరవించడంలో, ప్రేమించడంలో వెనుకబడి ఉంటుంది. సమాజపు హితం కోరని, హేతువు కాని సంప్రదాయాలూ, ఆచారాల్లో మనం కూరుకుపోయి ఉన్నాము. బ్రాహ్మణ్య సంస్క ృతి బంతులాటలడుతుంటే పితృస్వామ్యం పాచికలాటలతో వినోదిస్తుంటుంది. అది మారలేదు. మనమూ మారలేదు. మనుషుల్ని మృగత్వమే తప్ప తెలివిడి వివేకం ఉన్న మనుషులుగా చూడలేకపోతున్నామే అదే విషాదం. మానవ సంబంధాలు అలుక్కపోయి అంతరించిపోయాయి. ఇసుకలో రాసిన అక్షరాల్లా చెదిరిపోయి ఇసుకతో కట్టిన పిచ్చుకగూళ్ళలా కుప్పకూలిపోయి, పిడికిట్లో పట్టిన ఇసుకలా జారిపోయి.. దైన్యంగా ఉన్నాయి. ‘రాయలమ్మ’లు కథ కోసం కల్పితాలుగా సృష్టించబడిన పాత్రలు కాదు. సంక్షుభిత నిజ జీవనపథంలోంచి వచ్చిన పాత్రలే. ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడినా ఇలాంటి కథాంశాలు చదివినా హృదయం ద్రవిస్తుంది. వారి నుదుట ఎవ్వరో మానవాతీతులు రాసినవి కాదు ఆ తక్కువ రాతలు. కర్కశ సమాజం దిగ్గొట్టిన మేకులు ఆ రాతలు.
రచయిత్రి గంటి భానుమతి 300 లకు పైగా కథల రచన చేసారు. పదుల సంఖ్యలో నవలలూ ఎన్నో వ్యాసాలూ రాసారు. పది కథా సంపుటాలు, పదకొండు నవలూ, వ్యాసాల సంపుటీ ప్రచురించారు. 2015లో ప్రచురించిన ‘సాగర మథనం’ కథా సంపుటిలో ‘రాయలమ్మ’ కథ ప్రత్యేకంగా కనిపిస్తుంది. లోకుల కుళ్ళునూ లోకంలోని కాలుష్యాన్నీ బహిరంగం చేస్తుంది. వ్యవస్థను శుభ్రం చేయడం పరిశుభ్రంగా పెట్టడం మన బాధ్యతేనని చాచికొట్టి తెలియజేస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.