‘‘నాన్ దేవర అడియాళి (నేను దేవదాసిని)’’ అని నిస్సంకోచంగా ప్రకటించుకొన్న మహిళా విదుషీమణి బెంగుళూరు నాగరత్నమ్మ (1878`1952) తెలుగు సాహితీ, సంగీత రంగాలకు ఎనలేని సేవలందించారు. ఆనాటి, శతాబ్ది కాలం నాటి సామాజిక వ్యవస్థలో పురుష
అహంకార, ఆధిక్యానికి కేవలం భోగవస్తువుగా బాలికలు, బాల్య వివాహాలతో బలవుతున్న రోజులలో దేవదాసిల పేరిట, ఉంపుడు కత్తెలు, ఉంచుకోవడాలు వేశ్యా వృత్తి ధర్మంగా నిస్సిగ్గుగా మహిళల జీవితాలలో పురుష ప్రపంచం చితి మంటల దౌష్ట్యంతో సమాజం నడుస్తున్న కాలంలో, కర్ణాటకలోని నంజన్‌గుడ్‌లో 1876లో తంజనాయకి అమ్మమ్మగా లక్ష్మమ్మ జన్మించారు. 14వ ఏట తల్లి రామవధూటి మరణించటంతో సహృదయుడైన మునిసమప్ప ఆదరించారు. తీవ్రమైన సంఘర్షణలు ఎదుర్కొంటూ అదృష్టవశాత్తు మైసూరు ఆస్థాన విద్వాంసుడు గిరిభట్టు దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు. కంచిలో సంగీత విద్య అభ్యసించారు. సంస్కృత పాండిత్యం, సంగీతంలో అద్భుత వీణా వాయిద్య కారిణిగా గుర్తింపు సాధించారు. ఆ రోజులలో లబ్ద ప్రతిష్టుడైన మహోన్నత సంగీత స్రష్ట, వీణా శేషన్నగారి ఇంట, తొలి కచేరీ చేసే అవకాశం లభించింది. అదే ఆమెను మైసూరు ఆస్థాన విదుషిని చేసింది. కానీ 1894లో మైసూరు సంస్థాన పాలకుడు జయచామరాజు ఒడయార్ మరణించారు. 16వ ఏట ఆమెను మైసూరు హైకోర్టు న్యాయమూర్తి నరహరిరావు, సంగీత కళకు నెలవయిన మద్రాస్‌కు పంపించారు. నాగరత్నమ్మ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కన్నడంతో పాటు తమిళం, తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యత, ప్రజ్ఞా నైపుణ్యం కలిగిన సంగీత కళాకారిణిగా మద్రాస్ సంభావించింది. అనతికాలంలోనే ఆమె విద్వన్మణిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. కానీ నాటి సామాజిక అణచివేతలపై పోరాటం తప్పలేదు.
ముద్దు పళని ` రాధికా సాంత్వనం
దక్షిణాంధ్ర యుగ తెలుగు వాజ్ఞయం విలసిల్లిన కాలంలో తంజావూరు పాలక రాజుల పాలనలో, కరడు కట్టిన ప్రాచీన దురాచార కోరలలో చిక్కుకొన్న రాజాశ్రయాలలోని నాటి మహిళా కవయిత్రులు గణిక జాణలుగా, కవయిత్రులుగా శృంగార సాహిత్యం సృష్టించిన చరిత్ర ఉంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్’ అనే సూక్తిని అనుసరించి ఆ కాలంలో ముద్దుపళని, ప్రతాపసింగ్ మహారాష్ట్ర పాలనలో (1740`1762) సుప్రసిద్ధ కవయిత్రిగా రాధికా సాంత్వనం రచించారు. ఆ కాలంలో శ్రీ కృష్ణ భక్తి కవిత్వం వేలం వెర్రిగా శృంగారపరమైంది. దేవదాసి, వేశ్యా లంపటత్వం రాజ్యం చేసే ఆ రోజులలో ప్రతాపసింహుని భోగపత్ని ముద్దుపళని రచనను, తదనంతర కాలంలో తెలుగు ప్రాచీన సాహిత్యంలోని ఎన్నో అనర్ఘ రత్నాలను (వేమన పద్యాలు ఇత్యాదిగా) వెలికి తీసిన సి.పి.బ్రౌన్ దొర 1887లో, మరొక ప్రముఖుడు వెంకట నరుసు 1907లో పట్టించుకోకపోతే రాధికా సాంత్వనం కాలగర్భంలో కనుమరుగై ఉండేది. ఇళాదేవి అనే యుక్త వయస్కురాలిని, శ్రీకృష్ణునికి సమర్పించే రాధ కథనంగా, రాసక్రీడా రణరంగం, విప్రలంభ శృంగారం చోటుచేసుకొన్న అశ్లీల, అసభ్య, శృంగార రచనగా తెలుగునాటి సంస్కరణ, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం (1848`1919) 1887 నాటి గ్రంథ సంపుటిలో రాధికా సాంత్వనం కావ్యంలోని తెలుగు, సంస్కృత భాషా వైదుష్యాన్ని ప్రశంసించినా, అశ్లీల, శృంగార కవిత్వంగా విమర్శించారు. కవుల చరిత్రలో చేర్చలేదు.
ఒక మహిళ, అందులోనూ దేవదాసి కావడం కారణంగానే నాటి పండితులు, ముద్దుపళనిని (1730`1790) తిరస్కరిచి అవమానించారని నాగరత్నమ్మ భావించారు. అందుకే
‘‘చిన్ని కృష్ణుని కరుణా విశేషమునకు
బాత్రురాలకు మా ముద్దుపళని, ముద్దు
లొలుక వ్రాసినదని, దీని నుద్ధరింప
సాహసించిన యీ నన్ను …………..
అని తాను రాధికా సాంత్వనాన్ని, అంతకుముందు ప్రచురణలలో తొలగించిన భాగాలను రాత ప్రతులతో సరిచూసి ముందుమాటలో, వీరేశలింగం గారి విమర్శను తిప్పికొడుతూ కందుకూరి రచనలలో కూడా పచ్చి శృంగారం ఉందని ఆరోపించారు. నాగరత్నమ్మ ముందు మాటతో ఉన్న రాధికా సాంత్వనం 1910లో వావిళ్ళ సంస్థ ప్రచురించింది. ఆమె అంత ప్రయత్నం చేయడం వల్లనే ఆ అమూల్య గ్రంథం తెలుగు సాహిత్యానికి దక్కింది. కానీ వీరేశలింగం గారి అనుచర వర్గంతో ఆమెకు పోరాటం తప్పలేదు. బ్రిటిష్ ప్రభుత్వం 1912లో ‘రాధికా సాంత్వనం’ను నిషేధించగా, స్వాతంత్య్రానంతరం, అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం, తెలుగు సాహిత్య సరస్వతీ గళమేఖలలో అనర్ఘరత్నంగా ప్రశంసిస్తూ నిషేధాన్ని రద్దు చేశారు.
సద్గురు త్యాగరాజ సమాధి స్మృత్యంజలి
సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యులు, నాదబ్రహ్మ, యోగిగా జీవన్ముఖ్తులైన త్యాగరాజ స్వామి సిద్ధిపొందిన 74 సంవత్సరాల తర్వాత శిథిలావస్థలో ఉన్న ఆ పవిత్ర స్థలాన్ని పూర్తిగా కనుమరుగవకుండా సంరక్షించి, నేటికీ అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వర్తించడానికి కారకులు నాగరత్నమ్మ గారే. ఆమె ఆ రోజుల్లో మద్రాస్ శ్రీనివాసయ్యర్ వీది,¸ 7వ నెంబరు ఇంట్లో నలభై సంవత్సరాలుగా ఉన్నారు. అప్పుడు ఒక విచిత్ర సంఘటన సంభవించింది. ఆమె తన ఇంట భగవదత్తమైన పూజలు నిర్వర్తించుకొంటూ త్యాగరాజ స్వామి కీర్తనల సంగీత విద్వన్మణిగా ఉన్న ఆ రోజులలో త్యాగరాజ స్వామి శిష్యులు, సంగీత విద్వాన్ ఉమయాల్పురం పంచాపకేశ భాగవతులు, త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని ఆమెకు కానుకగా బహుకరించారు. ఆ మర్నాడే ఆమెకు గురువైన బిడారం కృష్ణప్ప సందేశం ప్రకారం ఆమె భాగవతుల సహాయంతో గురువయ్యార్ వెళ్ళి సమాధి స్థలాన్ని చూసి కన్నీళ్ళ పర్యంతమయ్యారు. దిగ్భ్రాంతికి గురైన ఆమె 31వ ఏట నుంచి మద్రాస్‌లో సంగీత కళాకారిణిగా తాను ఆరాధిస్తున్న త్యాగరాజస్వామి పవిత్ర సమాధి స్థలం అంత నిర్లక్ష్యానికి గురి కావడం, విపరీత వేదనకు గురిచేసింది. ఆమె రంగంలోకి దిగి తంజావూరు రాజవంశీయులతో సంప్రదించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని శుభ్రం చేయించింది. వెంటనే కార్యరంగంలోకి దిగి 27`10`1921న సమాధి, దేవాలయం ప్రారంభించి, మూడేళ్ళలో గర్భగృహ మండపం, విగ్రహ ప్రతిష్టాపన చేసి, 7`1`1925 నుండి ఆరాధన మహోత్సవాలను దిగ్విజయంగా ప్రారంభించారు. వందేళ్ళ నుండి ఆరాధనలో పాల్గొనడానికి మహిళలకు అవకాశం కల్పించడం కూడా నాగరత్నమ్మ కృషి ఫలితమే. తన యావదాస్తిని త్యాగరాజ సంస్కృతికి విల్లు ద్వారా సంక్రమింపచేశారు. 1952లో ఆమె మరణానంతరం, త్యాగయ్య స్మృతి మందిరం దగ్గరే ఆమె సమాధి నిర్మించి విగ్రహం ప్రతిషించారు.
దేవదాసీలంటే వేశ్యలు కాదని ప్రకటించి, తాను దేవదాసినని గర్వంగా చెప్పుకొనే నాగరత్నమ్మకు సంగీత విద్వన్మణిగా, రాజమహేంద్రవరంలో సన్మాన సందర్భంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి, ఆమె పాదానికి స్వయంగా గండపెండేరం బహుకరించడం, చిరస్మరణీయ ఘట్టం. కవి సమ్రాట్ విశ్వనాథ వారు పేర్కొన్నట్టుగా నాగరత్నమ్మ ‘తెల్గుల కీర్తి పంట’. ఒంటరి మహిళ, అందులో దేవదాసీగా గుర్తింపుతో, స్త్రీ వాదానికి అంకురార్పణగా, ఆదర్శనీయంగా ఆమె జీవించారు.