ఆలోచనాపరులైన పాఠకులకు ఆహ్వానం తొలి నమస్కారాలు ఒక్కమాట:
మంచితనానికి మానవతకు అర్థం మనిషి. ఈనాడే కాదు ఏనాడైనా ఏ సమాజంలోనైనా మనిషి పెంచుకోదగినవి, పదిలంగా నిలుపుకోదగినవి మూడేవిలువలు. మొదటిది
స్వేచ్ఛా చింతన. స్వేచ్చా చింతనతోనే మానవుడు ఆటవిక దశనుండి అణుయుగ దశవరకు ఎదిగి ఆధునిక మానవునిగా పరిణతి చెంది సృష్టి రహస్యాలను ఛేదించగలుగుతున్నాడు. ఈ క్రమంలో తన గమనానికి అడ్డువచ్చే అనేక బంధాల్ని అధిగమించి స్వేచ్చాపధంలో నిరంతర ప్రస్థానం సాగిస్తూ సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నాడు.
రెండవది… సహజమైన సౌజన్యం, మంచితనం, పదిమంది బాగుకోసం ఆలోచించటం, పదిమంది బాగులోనే తన బాగుందనుకోవటం, పదిమంది బాగులోనే తన బాగుందనుకోవటం, పదిమంది అభ్యుదయంలోనే తన అభ్యుదయం ఉందనుకోవటం మంచితనానికి కొండగుర్తుగా భావించవచ్చు. మంచితనం మానుషత్వం నాన్న మహానుభావులే తమలోని స్వార్థాన్ని త్యజించి ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొని సమాజాన్ని ముందుకి నడపగలిగారు.
మూడవది మంచి అభిరుచి. ఒక మంచి భావానికి, సుశ్రావ్యమైన గానానికి ఒక సుమనోహర దృశ్యానికి అప్రయత్నంగా సహజంగా స్పందించడం. ఈ స్పందించే శక్తి మంచి అభిరుచికి మూలం. అంతేకాదు స్పందించే శక్తి వ్యక్తిని సమాజంలోనే సమస్యలకు, సాటి మనిషి కష్టాలకు కన్నీళ్ళకు కూడా కరిగింపచేసి మనిషిగా తనవంతు కర్తవ్యాన్ని గుర్తించేటట్లు చేస్తుంది.
ఈ మూడు విలువలు మనిషిని మానవతను మార్చే విలువలు. మనిషిలోని మానవతను పెంచి మనిషికి పరిపూర్ణతనిచ్చే విలువలు. ఈ పత్రిక ద్వారా మేమందించే ప్రతి రచన ఈ విలువల్ని పెంచేవిగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
శ్రుతి, ఆకృతి, శివ, శోధన, స్పూర్తి, శీర్షికలు మా అవగాహనకు మించినవే అయినా అయా రంగాలలో నిష్ణాతులైన వారి సహాకారిన్ని స్వీకరించాం. ఈ శీర్షికల ద్వారా పాఠకుల అభిరుచిని పెంపొందించాలని ప్రయత్నిస్తున్నాం. రీతిక ఇదొక సరికొత్త శీర్షిక. యువతరానికి వాస్తవిక జీవితపు అవగాహనను, సమకాలీన సమాజంలోని సమస్యల పట్ల ఆలోచనను రేకెత్తించటంతో పాటుగా వారికి ఆహ్లాదాన్ని అందివ్వటానికి కూడా ఈ శీర్షిక ద్వారా ప్రత్నిస్తున్నాం.
పిల్లల్లో శాస్త్రీయదృష్టిని కలిగించటానికి, ఆసక్తిని, జిజ్ఞాసను పెంచుకోవటానికి తగినవిధంగా ‘‘డుంబు’’ శీర్షిక తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతినెల ఒక సమగ్ర నవలతో పాటుగా ఒక పాత నవలను, కథను పరిచయం చేస్తూ నిజమైన సాహిత్యపు విలువల్ని ఈ తరం వారి దృష్టికి తెస్తున్నాం.
మానసిక వికలాంగులపట్ల మన సంఘానికిగానీ, ప్రభుత్వానికిగానీ, తల్లిదండ్రులకు గానీ, శాస్త్రీయమైన అవగాహన లేదనే చెప్పాలి. మానసిక వికలాంగుల్ని సాటి పౌరులుగా గుర్తించి వీరిపట్ల మనం బాధ్యతతో వ్యవహరించటం నేర్చుకోవాలి. ప్రతినెల వీరికి సంబంధించిన వివరాలతో వీరికి ఉపకరించే అంశాలతో ఈ శీర్షిక నడపటానికి ప్రయత్నిస్తున్నాం. అంతేకాదు భవిష్యత్తులో మా శక్తి మేరకు ఇటువంటి సంస్థలకు చేయూత నివ్వాలని సంకల్పించాం.
ఇలా మేము అనుకున్న లక్ష్యాల వైపుగా ముందుగా సాగే ప్రయత్నంలో తొలి అడుగువేయటానికి ఈ సంచిక ద్వారా ప్రయత్నించాం. తరువాత వేసే ప్రతి అడుగు మమ్మల్ని మా లక్ష్యానికి చేరువ చేసే ప్రయత్నంలో మీ సహకారాన్ని. మీ ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని కోరుతున్నాం.