నుదుటిన పెద్ద బొట్టు, ప్రశాంతమైన చూపు, హాjైున నవ్వుతో కూడిన గాంభీర్యం ఆమె సొంతం. తొలిసారి ఆమెను చూసినప్పుడు నాకయితే అక్కయ్యతో మాట్లాడినట్లే అనిపించింది. మితభాషి కాదుగానీ, అవసరమైనపుడు క్లుప్తంగా స్పష్టమైన జవాబు ఇవ్వడం
ఆమె విధానం. అప్పటికి ఆమె పేరు పరిచయమై మూడేళ్ళయినా ముఖాముఖి కలిసింది మాత్రం 1996 ఆగస్టు లేదా సెప్టెంబర్ కాలంలో. సమయం సామ్రాజ్య లక్ష్మి అనే పూర్తి పేరు గల ఎస్.ఎస్. లక్ష్మిగారు 2023 ఏప్రిల్ 17న విజయవాడలో కనుమూశారు. ఎస్.ఎస్. లక్ష్మి అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ తను ఐదున్నర సంవత్సరాలు నడిపిన మాసపత్రిక పేరుతో ‘ఆహ్వానం’ లక్ష్మిగా తెలుగు పాఠకలోకానికి నేడు చిరస్మరణీయురాలు.
ఇటీవలకాలంలో కొంతకాలమే నడిచి అమోఘమైన సేవలు అందించిన పత్రికలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటే మనకు కాసింత గౌరవం, కొండంత ఆనందంతో పాటు వాటిని మించిన విషాదం ముంచుకు వస్తాయి. సంగీతమూ, హాస్యం కోసం ఉదాత్తమైన సేవగా కొన్నేళ్ళపాటు కె ఐ వరప్రసాద రెడ్డి ‘హాసం’ పత్రికను నడిపారు. అంతకు ముందు సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రకళలకు గొప్ప స్థానం కల్పిస్తూ నండూరి పార్థసారథి నడిపిన ‘రసమయి’ మాసపత్రిక అలాంటిదే. ఇలాంటి పత్రికలు మరికొన్ని ఉన్నాయి. అలాంటి విలక్షణమైన సేవ చేసిన ‘ఆహ్వానం’ మాసపత్రిక విశిష్టమైంది.
1993 ఏప్రిల్ నుంచి 1998 జులై నెలవరకూ ఎస్.ఎస్. లక్ష్మిగారు విజయవాడ నుంచి ఈ సకుటుంబ తెలుగు మాసపత్రికను నిర్వహించారు. పి. రామచంద్రప్రసాద్, ఎస్.వి. భుజంగరాయశర్మ, ఎర్నేని వెంకటేశ్వరరావు, సంజీవదేవ్, ఆవుల సాంబశివరావు, నోరి దత్తాత్రేయుడు, బాలాంత్రపు రజనీకాంతరావు, ఇస్మాయిల్, రావెల సాంబశివరావు, బాలబంధు బి.వి.నరసింహారావు, పి. సత్యవతి, రావెల సోమయ్య గార్లు సలహాదారులు. వీరి నేపథ్యాన్ని, పాండిత్య ప్రతిభలను గమనిస్తే ఆ ‘ఆహ్వానం’ పత్రిక తీరుతెన్నులేమిటో మనకు సులువుగా బోధపడతాయి. స్వేచ్ఛాయుత చింతన, సహజ సౌజన్యంతో కూడిన మంచితనం, ఉత్తమ అభిరుచులను పెంపొందించడం కోసం ఈ మాసపత్రికను ప్రారంభించినట్లు లక్ష్మి తొలి సంచిక సంపాదకీయంలో ప్రస్ఫుటం చేశారు. ప్రతి నెలా ఒక నవల ఇవ్వడంతోపాటు ఆణిముత్యం లాంటి ఒక పాత నవలను, ఒక పాత కథను పరిచయం చెయ్యడం ఇంకా సంగీతం, చిత్రకళ, శిల్పం, సైన్సు, ఆరోగ్యం, సెక్స్, ఆధునిక మహిళ, పిల్లల్లో శాస్త్రీయ దృష్టి, యువతరానికి వాస్తవిక జీవితపు అవగాహన వంటి విషయాలను స్పృశిస్తూ శీర్షికలుండేవి.
1993లో నేను అనంతపురంలో పనిచేసే కాలంలో ఓసారి విజయవాడ వెళ్ళినప్పుడు సైన్సు రచయిత పురాణపండ రంగనాథ్‌ను కలిసినప్పుడు కావచ్చు. బహుశ ఆయన సలహా మీద గాంధీనగర్ లోనే వున్న ‘ఆహ్వానం’ పత్రిక కార్యాలయానికి వెళ్ళినట్టు గుర్తు. నిజానికి ఆ సమయంలోనే లక్ష్మిగారిని కలిసి వుండాల్సింది. అయితే ఆ రోజు వారు అందుబాటులో లేకపోవడంతో సహాయ సంపాదకులైన రచయిత్రి డి. సుజాతాదేవిని కలిశాను. వారు తమ పత్రిక గురించి వివరించి సైన్సు వ్యాసాలు రాయమని కోరినట్టు గుర్తు. అలా ఆహ్వానం పత్రికలో 1993 నవంబరు సంచిక నుంచి ’శోధన’ శీర్షికలో రెండు నెలల కొకసారి నా సైన్సు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.
1996 జులై మాసంలో బదిలీమీద నేను విజయవాడ వెళ్ళిన తర్వాత లక్ష్మిగారిని కలవడమూ, సైన్సు వ్యాసాలతోబాటు పుస్తక సమీక్షలు చేయమని ఆమె కోరడమూ సంభవించాయి. ‘రిగ్గింగ్’ అనే నా కథ ‘ఆహ్వానం’ పత్రికలో ప్రచురింపబడటం నా వరకు విశేషం. ఆ రోజులలోనే కవి వేగుంట మోహన్ ప్రసాద్, ఎవరీ నాగసూరి వేణుగోపాల్ ? సైన్సు, సాహిత్యం అన్నీ రాస్తున్నారని నా ముందే ఆకాశవాణి ఆఫీసులో తను ఆశ్చర్యపోతూ నన్ను అభినందించారు. దీనికి కారణం ఆహ్వానం పత్రికే.
‘ఆహ్వానం’ లక్ష్మిగారు రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ విజయవంతంగానే ఆ మాసపత్రికను మనమందరం గర్వపడే రీతిలో నడిపారు. నిజానికి ఆమె ఒక నిఖార్సయిన సాహసి. లేకపోతే ప్రపంచీకరణ ఉధృతం మొదలై, అన్ని అభ్యుదయ భావాలూ క్రమంగా వాణిజ్య విశృంఖలతకు దాసోహం అంటూ తప్పుకొంటున్న వేళలో ఎటువంటి పత్రికా నేపథ్యం లేని ఓ సగటు మహిళ ఒంటి చేత్తో ఉదాత్తమయిన పత్రికను తీసుకురావడానికి ఎలా ముందుకు వస్తారు. ‘అంతరంగ పరిమళం’ పేరున ‘ఆహ్వానం’ సంపాదకీయాలను 150 పేజీల పుస్తకంగా 2010 ఫిబ్రవరిలో ఆమె రాజా పబ్లికేషన్స్ పేరున వెలువరించారు.
ఈ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో తన గురించి ఇలా ప్రస్తావించుకున్నారు. తన మనోప్రపంచానికి పునాదులు పడిన విషయం గురించి చెబుతూ వేటపాలెం దగ్గర ఉండే పందిళ్లపల్లి అంటే తన మనసు ఎంత ప్రతిస్పందిస్తుందో, తన తండ్రి గుర్తుకు వస్తే అంత కన్నా ఎక్కువ స్పందిస్తుందని ఇలా వివరిస్తారు – నిజానికి నాన్నని సన్నిహితంగా చూసింది నాకు 8 సంవత్సరాల వయస్సు వరకే. తరవాత ఆయన ఈ లోకంలో లేరు. ఆ లేత వయసులో ఆయన నాపై వేసిన ముద్ర నా స్వభావాన్ని తీర్చి దిద్ది, నాకొక ప్రత్యేక వ్యక్తిత్వాన్నిచ్చిందనే చెప్పాలి. ఆయన అభిరుచులు, అలవాట్లు, ఆలోచనా విధానం అంతా నాకు తెలుసన్నట్టుగా ఆయన వ్యక్తిత్వపు ఛాయలు నాలో సజీవంగా నిలిచిపోయాయి, ఆయన భౌతిక శరీరం మాత్రమే మరణించినట్టు, ఆయన తలపులు నాకు ఎనలేని ఉత్తేజాన్ని మనో నిబ్బరాన్ని అందిస్తుంటాయి.
ఈ విషయాలను పరిశీలిస్తే ఆమె ఎంత సాధారణ నేపథ్యం నుంచి వచ్చారో కొంత బోధపడుతుంది. లక్ష్మిగారి ప్రాణ మిత్రురాలు సుశీలా నాగరాజు (మైసూరు) ఫేస్ బుక్‌లో రాసినట్టు ఆగిపోయిన హైస్కూలు చదువు ఉపవాసాలతో కూడా తాత గారింట కొనసాగని విషాదం ఆమెది. మరి ‘ఆహ్వానం’ నడిపే సామర్థ్యం లక్ష్మికి ఎలా సొంతమయ్యింది? భాషా పటిన గానీ, పాండిత్య ప్రతిభ గానీ నాకు లేవు. కనీసం హైస్కూలు విద్య కూడా ఎరుగను. నాకున్నది ఒక్క భావుకతా బలమేనని గట్టిగా చెప్పగలను. ఇంతకు మించి ఏ అర్హతా నాకు లేదు అని ఆమె చెప్పుకున్నట్టు మనం గమనించవచ్చు. తీర్పులు చెప్పడానికి సాహసించని సౌజన్యశీలం, స్వేచ్ఛాయుత చింతనతోపాటు, ఆనాటి తెలుగు సమాజంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేసుకోవడంలోనే ఆమె భావవైశాల్యాన్ని, ఉదాత్త సౌశీల్యాన్ని గమనించవచ్చు. ఎస్వీ భుజంగరాయ శర్మ స్ఫూర్తి తోనే ఆ పత్రిక మొదలైంది. భుజంగరాయ శర్మ అంటే లక్ష్మి గారికి గురువుగా ఆరాధన. రాధ, మాళవిక, వరూధిని, ద్రౌపది, శకుంతల వంటి నాయికలపై విజయవాడ ఆకాశవాణి కోసం భుజంగరాయ శర్మ చేసిన ప్రసంగాలను 1989 మార్చిలో లక్ష్మి ‘దీపమాలిక’ పేరుతో పుస్తకంగా ప్రచురించారు. అంతకు ముందు ఐదు పుస్తకాలు వేశారని తెలుస్తోంది. వివరాలు తెలియవు కానీ ఈ ‘దీపమాలిక’ కు రాసిన పీఠిక విలువైనది.
లక్ష్మి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. రెండో కుమారుడు రాజా పదేళ్ల వయసులో కన్నుమూశారు. మూడో కుమారుడికి తాను గౌరవించే సంజీవ్ దేవ్ పేరుతో రెండో కుమారుడి పేరు కలిసి సంజీవ్ దేవ్ రాజా అనే పేరు పెట్టుకున్నారు. భర్త రామారావు పోలీసు అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ పదిహేనేళ్ల క్రితం మరణించారు. లక్ష్మి గారి సాహసాన్ని అడ్డగించని సహృదయత రామారావుది.
70-80 ఏళ్ళు పైబడిన లక్ష్మిగారి మిత్రత్వం గురించీ పత్రికా సాహసం గురించీ రావెల సోమయ్య, ఓల్గా కుటుంబరావు, వాడ్రేవు వీరలక్ష్మి, సుశీలా నాగరాజు, చంద్రలత వంటి ఏ కొందరో రాసిన పోస్టులు నాకు ఫేస్ బుక్‌లో కనబడ్డాయి. పత్రికలలో స్థానిక వార్తలలో స్వల్ప అనారోగ్యంతో లక్ష్మి గారు కనుమూసినట్లు క్లుప్త సమాచారం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. బంగారు రామాచారి(కోదాడ) వంటి మిత్రులు ‘ఆహ్వానం’ పత్రిక పాతసంచికలను పంచుతున్నారు.
హడావుడి, హంగు ఆర్భాటం, ప్రచారం, మెరుపులు, మాత్రమే ప్రధానంగా ఉండే సమాజానికి లక్ష్మిలాంటి నిశ్శబ్ద సాహసి అంతర్ధానాన్ని గమనించే తీరిక వుండదు. మైనారిటీగా మిగిలిపోయిన ఉత్తమ అభిరుచి గల ఏ కొందరైనా అందుబాటులో ఉన్న 60 పై చిలుకు ‘ఆహ్వానం’ సంచికలను అధ్యయనం చెయ్యాలి. ఆహ్వానపు అద్దం ద్వారా లక్ష్మిగారి మూర్తిమత్వాన్ని చిత్రిక పట్టాలి.