‘‘పెళ్ళి చేసుకుని, ఇల్లు చూసుకుని, చల్లగా కాలం గడపాలోయ్, మనమెల్లరు సుఖముగనుండాలోయ్’’, అన్నారు ఘంటసాల.
‘‘చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, ఇంటిలోనే పోరు, ఇంతింత గాదయా’’, అన్నారు వేమన.
‘‘ఏకాంత వాసము, ఏకాంత మందిరము, ఏకాంతవేళలు’’ అంటూ చాలా రొమాంటి సైజ్ చేసి పడేశారు మన సాహిత్యకారులు.
మనిషి సంఘజీవి. ఈ లక్షణం ఎన్నో జీవరాశులకు ఉంది. చీమలు, కోతులు, తేనెటీగలు, తోడేళ్ళు… ఇవన్నీ సంఘజీవులే. ఇది ఒక బయోలాజికల్ అవసరం వంటిదే. కొందరు సిద్ధులు, సన్యాసులు మాత్రం ఒంటరిగా ఎక్కడో హిమాలయాల వంటి స్థలాలలో సంచరిస్తుంటారని చదువుకున్నాము. కాబట్టి ఇటువంటి ఎక్సెప్షన్స్ వదిలితే మనిషి సంఘజీవే.
మనిషి కుటుంబజీవి కూడానా? కుటుం బాన్ని మనం అనుకూలత కోసం ఏర్పరచు కున్నాం. స్వంత ఆస్తులు కాపాడుకోవడానికి, కొన్ని నియమాలను పాటించడానికి, మగవారి ఆధిపత్యం కాపాడడానికి, కులాన్ని రక్షించుకోవడానికి, ఇలా సమాజంలో ఒక క్రమంలోకి తెచ్చే పద్ధతులలో కుటుంబం కూడా ఒక పద్ధతిగా ఏర్పడిరది.
అయితే కుటుంబంలో ఉన్న మధు రిమనూ, భద్రతనూ విస్మరించలేము. అది మన ఇల్లు, మన కుటుంబం. మనకి నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఆకలేసినా, నిద్ర పట్టకపోయినా, కష్టం చెప్పుకోవాలన్నా, పని చేయించు కోవాలన్నా కుటుంబంతో
ఉన్నప్పుడు ఉండే వెసులుబాటు వేరే.
కానీ హింస మాటో?
కుటుంబంలో ఉండే హింస కూడా మామూలుది కాదు. ఆడవారిపై సాగే హింస కొన్నిసార్లన్నా బయటకు కనబడుతుంది. మగవారిపై సాగే హింసకు ఆ దిక్కు కూడా లేదు. ఇక ‘‘నువ్వు రాకపోతే నేను వెళ్ళను. నువ్వు నేను చెప్పిన మాట వింటేనే తింటాను’’ వంటి మాటలు కుటుంబంలో తరచూ విని ఇది ప్రేమకు ఆనవాళ్ళని కొట్టిపారేస్తాం, కానీ అందులో ఉండే కో`డిపెండెన్సీ (co dependency) అనే ఒక విపరీతమైన బుద్ధిలేని తనాన్ని ఎవరమూ ప్రస్తావించము.
పిల్లలు వద్దా? కావాలి. ప్రేమ వద్దా? కావాలి. శారీరక సుఖం వద్దా? కావాలి. కానీ ‘సంపూర్ణ కుటుంబమే’ దీనికి ప్రాతిపదిక అనుకుంటేనే మింగుడు పడడం లేదు.
మనది ఎదుగుతున్న సమాజం. ఇందులో అందరికీ చోటు ఇవ్వడానికి చాలామందిని ప్రయత్నిస్తున్నాము. మరి మహిళలు, పురుషులు ఉన్న కుటుంబాలే కాదు, క్వీర్ వ్యక్తుల కుటుంబాల గురించి ఆలోచించారా? హిజ్రాల కుటుంబ వ్యవస్థ మాటేమిటి? అది మనకు ఎంతవరకు తెలుసు?
సంపూర్ణ కుటుంబం అంటే ఒక ఆడ, ఒక మగ, కొందరు పిల్లలు, కుదిరితే తల్లిదండ్రులు… అంతేనా? ఒక సమూహం కలిసి నిలబడలేదా?
ఒకవేళ శారీరక సుఖానికి ఇచ్చే నిర్వ చనం వేరైతే అది కుటుంబం కానట్టా? అసెక్సువల్ లేదా మగవారి ప్రమేయం లేని సమలైంగికులైన మహిళల మధ్య ఏర్పడే ప్రేమ సంపూర్ణమైన ప్రేమ కాదా? ఇద్దరు సమలైంగికులు ఒక కుటుంబం కాలేరా?
మహిళ ఎప్పుడూ మగవాడి సాంగత్యమే కోరుకోవాలా? ఒకవేళ కోరుకోవాలంటే అది కుటుంబ వ్యవస్థ అనే తొడుగు లేకుండా ఆ ప్రేమను అందుకోవడానికి అర్హత లేదా?
ఈ సాంగత్యం ఎల్లవేళలా అవసరమైన దేనా? దీనికి సంకెళ్ళు ఉన్నాయా? భర్త లేని కుటుంబాలు, కుటుంబాలు కావా? పెళ్ళిలో ఇరకని బంధాలు, బంధాలు కావా?
భర్త నుండి విడిపోతే ఒంటరి మహిళ అనే పేరు వేస్తారు కదా? ఆ ఒంటరితనం కావాలనుకునే వారు ఉండరా? ఎన్ని
పెళ్ళిళ్ళు తోడుకోసం జరుగుతున్నాయి? ఎన్ని పెళ్ళిళ్ళు కుటుంబ పరువు లేదా సోషల్ కండిషనింగ్ వలన సాగుతున్నాయి? పెళ్ళి చేసుకుని భాగస్వామితో కలిసి ఉంటూనే ఒంటరితనం అనుభవించే మనుషుల మాటేమిటి?
… … …
ఇంతకీ కుటుంబం, స్నేహితులు, సమూహం… వీటి మధ్య మనకు అర్థంకాని నిచ్చెనమెట్ల బంధాలేమైనా ఉన్నాయా?
… … …
చక్కని సాయంత్రం, బాల్కనీలో రికామీగా కూర్చొని ‘ఏ షామ్‌కీ తన్హాయియా…’ వింటుంటే మనసు హాయిగా డోలలూగు తోంది.
ఎదురు బాల్కనీలో ఆవిడ చేయూపి నవ్వితే మనసు తిరిగి నవ్వుతుంది. క్రింద ఆడుకుంటున్న పిల్లల పకపకలు తోడైతే పూవులు విరబూస్తాయి. ప్రేమిక తోడైతే, వెన్నెల విరగకాస్తుంది. మరికొందరు స్నేహితులొస్తే పదాల ఇంద్రధనుస్సులు విరుస్తాయి. పక్కింటి అంకుల్, ఆంటీ కాఫీ తాగేలోపే పిన్ని, బాబాయిలు అయిపోతారు. కానీ మరి కొంత సమయానికి ఏకాంతం కోసం మనసు వగస్తోంది.
సమూహంలో మనగలగడం, కుటుంబం లో ఇమడగలగడం, ఒంటరిగా జీవించ
గలగడం, ఈ మూడూ ఒకే కాలంలో సాగడం లేదా? ఈ మూడిరట్లో వొక్కటి ఎంచుకోవడం వ్యక్తి స్వేచ్ఛ కాదా? దానికి విఫలమైన బంధాలే కారణం కావాలా? ఏకాంతమూ, కుటుం బమూ, సమూహమూ… ముచ్చటగా మూడు మార్గాలు. కాంక్షణీయం, కడు రమణీయం, ఆనంద నిలయం.
అందుకే, ఎక్కడున్నా… మది పాడుతూనే ఉండాలి. ఇచటలో ఉన్న హాయి, మరెచటనూ లేదోయి…