ఇప్పటి వరకు మాట్లాడనివి మన పుట్టిళ్ళ కథలు – కొండవీటి సత్యవతి

న్యూఢల్లీిలో పనిచేస్తున్న ‘శక్తిశాలిని’ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వారు చేపట్టి పూర్తి చేసిన ఒక అధ్యయన రిపోర్ట్‌ను పంపించారు. ‘అన్కహీ’ ఇప్పటివరకు మాట్లాడనిది పేరుతో ఈ అధ్యయనం జరిగింది.

మహిళలు, పిల్లల అంశాలతో శక్తిశాలిని సంస్థ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నది. సాధారణంగా మహిళలు, పిల్లలమీద జరిగే హింస అత్తింట్లో భర్త అతని కుటుంబ సభ్యుల ద్వారానే జరుగుతుందని నమ్ముతూ ఉన్నాం. దాని కనుగుణంగానే స్త్రీల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. గృహహింస అత్తింట్లోనే జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే గృహహింస నిరోధక చట్టం 2005 అమలులోకి వచ్చింది.
అత్తింట్లో జరిగే గృహహింస గురించి ఇన్ని సంవత్సరాలుగా చాలా అధ్యయనాలు జరిగాయి. చట్టాలొచ్చాయి. మరి పుట్టింట్లో ఏం జరుగుతోంది ఈ అంశం గురించి మనమెప్పుడూ మాట్లాడలేదు. అలాగే మనతో రక్త సంబంధం ఉన్నవాళ్ళు మన మీద హింసకు పాల్పడరు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి మన నమ్మకం ఇలాగే ఉంటుంది. తప్పకుండా ఈ నమ్మకంలో నిజముంది. ఎందుకంటే పిల్లల గురించి తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ నిజమే కావచ్చు. కానీ చాలాసార్లు ఇదొక భ్రమగా కూడా తేలవచ్చు. మొత్తం నిజం కాకపోవచ్చని చాలా మంది అనుభవాలు చెబుతున్నాయి.
మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, హానిచేయరు అని బలంగా నమ్మినపుడు చాలా సార్లు మన కెదురయ్యే అనుభవాలు అందుకు భిన్నంగా ఉండొచ్చు. పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు తల్లిదండ్రులకు సంబంధించిన క్రూరమైన ప్రవర్తనలకి బిత్తరపోయే పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా తమ ఛాయిసెస్‌ విషయంలో, బయట ప్రపంచంతో సంబంధాల విషయం, తమ స్నేహాలు, చదువు సంధ్యలు గురించి అమ్మాయిలని తల్లిదండ్రులు కట్టడి చేయడం, అది కూడా వారి మీద ప్రేమతోను, భద్రత కోసం, సంరక్షణ పేరుతోను ఈ కట్టడులుంటాయి. ఈ కట్టడులను దాటడం అమ్మాయిలకు చాలా కష్టమౌతుంది. ఎందుకంటే నీ మీద ప్రేమతోనే, నీ రక్షణ కోసమే కదా మేము ఇలా చేస్తున్నాం అని పుట్టింట్లో తల్లిదండ్రులు అమ్మాయిల మీద అనేక ఆంక్షలు విధిస్తుంటారు. చాలా సార్లు అది హింసకి దారి తీస్తుంది. తమని ధిక్కరించిందనే నెపం పెట్టి కూతుళ్ళను కొట్టి, తిట్టి ఇళ్ళల్లో బంధించేది పుట్టింటి వాళ్ళే. కుటుంబ గౌరవం, పరువు ప్రతిష్టలు, కులమత అంతరాల సంబంధాలు ఇవన్నీ కలగలిసి ఉంది కూతుళ్ళ మీద హింసగా రూపాంతరం చెందుతుంది.
కోవిడ్‌ ఉపద్రవం సమయంలో, ముఖ్యంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో మహిళల మీద గృహహింస విపరీతంగా పెరిగింది. గృహహింస కేసులు మామూలు కన్నా పదిరెట్లు పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. గృహహింసే రెండో రకమైన పేండమిక్‌గా అవుతుందా అన్నంత ఉదృతంగా కేసులు నమోదయ్యాయని తమ హెల్ప్‌లైన్‌కి వచ్చిన కేసుల ఆధారంగా శక్తిశాలినీ సంస్థ చెబుతోంది. అలాగే భూమిక హెల్ప్‌లైన్‌ కూడా చాలా గృహహింస సంబంధిత కేసుల్ని రిసీవ్‌ చేసుకుంది. సాధారణంగా అత్తింట ఆరళ్ళు, హింసకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదయ్యాయి.
అయితే అనూహ్యంగా పుట్టింట విపరీతమైన హింసనెదుర్కొంటూ హెల్ప్‌లైన్స్‌కి కాల్స్‌ చేసిన సింగిల్‌ ఉమన్‌ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండడం విభ్రమని కలిగించే అంశం. వీరంతా వివాహాల నుంచి బయటకు వచ్చి, ఎప్పటికీ వివాహం చేసుకోకుండా పుట్టిళ్ళలో ఉన్నవారు. తల్లిదండ్రుల నుంచి, బంధువర్గం నుంచి, స్వంత రక్త సంబంధీకుల నుంచి విపరీతంగా గృహహింసను ఎదుర్కొన్న వాళ్ళు.
శక్తిశాలినీ సంస్థ విడుదల చేసిన ‘‘అన్‌కహీ’’ రిపోర్ట్‌లో ఎంతో మంది అమ్మాయిలు తమ అనుభవాలను వివరంగా చెప్పారు. ఇంటర్వ్యూలో పెండమిక్‌ సమయంలో తమ ‘‘స్వంత’’ ఇళ్ళల్లో తమ తండ్రులు, తల్లులు తమ పట్ల వ్యవహరించిన తీరును పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలో ఇళ్ళల్లో ఉండిపోయిన తండ్రులు తమ కూతుళ్ళ పట్ల వ్యవహరించిన అమానుష ధోరణి గురించి, తమ సోదరుల్ని, తమని ఎంత వివక్షతో చూసేవారో చెప్పారు. బయటకు వెళ్ళనీయకుండా, స్నేహితులతో కలవనీయకుండా, మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించకుండా ఎన్నెన్ని ఎలాంటి ఆంక్షలను విధించారో ఉదాహరణలతో సహా ఇంటర్వ్యూలో చెప్పారు.
శక్తిశాలినీ వారి అధ్యయన రిపోర్ట్‌ మీద విస్కృతంగా చర్చ జరగాలని నాకు అనిపించింది. అత్తింటి హింస గురించి చాలా సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం. అర్థం చేసుకుని దానికనుగుణంగా ఎన్నో చర్యలు తీసుకున్నాం. చట్టాలు, సహాయ సంస్థలు ఏర్పాటయ్యాయి. అవగాహన కల్పిస్తున్నాం ఆ అంశం మీద.
మరి పుట్టింటి కథేంటి? ఇక్కడ జరుగుతున్న హింసమీద ఎలాంటి అవగాహన కల్పించాలి. అమ్మాయిలు తమ ఆకాంక్షలని, ఆశయాలని తీర్చుకోవడానికి, తమ తమ చాయిసెస్‌ని ఉపయోగించుకోవడాన్ని ఎలా వారిని బలోపేతం చెయ్యలి. ముఖ్యంగా పుట్టింట్లో కూడా గృహహింస ఉంది అనేది అర్థం చేసుకుని అంగీకరిస్తే అపుడు దాని మీద ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలో ఆలోచించవచ్చు. ఈ అంశాన్ని అందరూ తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా అడుగులు పడాలి.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.