మేకప్ వేసుకున్న నవ్వు
మూల మలుపుపై
ఎదురవుతుంది
రోజూ..!
ఆ నవ్వు
వెలిసిపోయిన చోట హంగులద్దడంలో నేర్పరని పడమటింటి కిటికీ చెప్తుంది.
బీటలు వారిన గోడల మధ్యనుండి
పాకురు పట్టిన మురికి మాటల చీము కారుతోందక్కడ
తోడు నీడ అన్న చేయి…
తన, పర, అన్న
పరంపరల్లో కొట్టుకుంటూ
జీవితాన్ని మరిచి ఊగిసలాడుతోందక్కడే
పేగు తెంచుకున్న బంధం
కావరం ఎక్కిన సకిలింపులకి బెదురుతున్న కళ్ళు, కాళ్ళు కంపిస్తున్నాయి.
రాధా మనోహరాలు అల్లుకున్న గోడకు కట్టిన బతుకు తీగకి
ముతక చర్మం ఒక్కటి వెళ్ళాడుతూ…
అవసరంవున్నా, లేకున్నా
చదువుకు పోయే
ఫాస్ట్ న్యూస్ నైంటిలో చెప్పినట్టు
అధర్మాన్ని ధర్మ బద్దం ఎలా చేయాలో మనుసూక్తి వర్ణిస్తోంటే..
చెవులకు తాళాలు పెట్టి
అందలం ఎక్కిన టాక్స్ల్లో
హారతి కర్పూరం అయిన నెల బాడుగ
రోడ్డుకీడుస్తున్న బతుకునీ, అరిగిపోయిన చెప్పుల్లో కాలునీ,.. నిలబెట్టలేక
నవ్వుని
కొంగుకి ముడివేసుకున్నదో ‘ఒంటిరెక్క’.