ఆనగనగా ఒక తోట ఉండేది. ఆ తోటలో మూడు చెట్లు ఉండేవి. చెట్ల పేర్లు మామిడి, వేప, కొబ్బరి. వాటి యజమాని పేరు రామయ్య. రామయ్య ఒకరోజు మామిడిచెట్టుకి ఎరువులు వేసాడు. దాంతో మామిడిచెట్టుకి గర్వం వచ్చింది. ఎవరితోను బాగా మాట్లాడేది కాదు.
వేపచెట్టుని ఎగతాళి చేసేది. వేపచెట్టు రోజూ చాలా బాధపడేది. కానీ కొబ్బరి చెట్టు, మామిడి చెట్టుకి ఎంత బుద్ధి చెప్పినా వినలేదు. యజమానికి మామిడికాయలు ఇస్తున్నాను అనే గర్వం వచ్చింది. దానితో మామిడిచెట్టుకి ఇంకా గర్వం హెచ్చింది. అందునా, యజమాని మామిడిచెట్టుని బాగా చూసుకునేవాడు. అందుకనే మామిడిచెట్టుకు ఇంకా గర్వం పెరిగింది. కానీ ఒకరోజు మామిడిచెట్టుకి తెగులు రానే వచ్చింది. అప్పుడు యజమాని వేపచెట్టు నుండి కొన్ని ఆకులను ఇంకా వేప పూతను తీసుకొని దంచి మామిడిచెట్టుకి వేసాడు. కానీ, మామిడిచెట్టు ఎప్పుడూ వేపచెట్టును ఎగతాళి చేసేది.
కొబ్బరిచెట్టు అన్నది, ‘‘చూసేవా ఎప్పుడూ ఎగతాళి చేసే వేపచెట్టు నీకు సహాయం చేసింది. కానీ వేప ఎప్పుడూ నీమీద గర్వం చూపించలేదు. చూపించి వుంటే నువ్వు ఇప్పుడు ఇలా ఉండేదానివి కాదు.’’
అప్పుడు మామిడిచెట్టు, వేపచెట్టుతో నన్ను క్షమించు అని అడిగినది.
‘‘అదేమిటి, ఎప్పుడూ నిన్ను నేను మిత్రుడిలాగే చూస్తాను. ఎప్పుడూ నిన్ను చూసి గర్వ పడతాను,’’ అన్నది వేపచెట్టు.
ఎప్పుడూ ఎవరినీ ఎగతాళి చేయకూడదు. మనం గొప్ప స్థానంలో ఉన్నప్పుడు అందరికీ సహాయం చేయాలి. ఇదే ఈ కథలోని నీతి.
`