నేను, ఉషాసీతాలక్ష్మి, ఆర్.లక్ష్మి ముగ్గురం మహిళా రైతుల పైన ఒక అధ్యయనంలో భాగంగా మిత్రులు నర్సన్న, పద్మలను కలవటానికి అరణ్య ఫార్మ్‌కి వెళ్ళాము. అది జహీరాబాద్ దగ్గర బిడకన్నె గ్రామం సమీపంలో ఉన్న 11 ఎకరాల శాశ్వత వ్యవసాయ క్షేత్రం (Aranya Permaculture Academy).
మేము వెళ్ళేసరికి ఉదయం 11 అయింది. బయట ఎండ మండిపోతోంది. అక్కడికి వెళ్ళి పచ్చని చెట్ల కిందకు చేరగానే చల్లగా హాయిగా అనిపించింది. అరణ్యలో సహజ పద్ధతులలో బయట నుండి ఎటువంటి ఉత్పాదకాలు తేకుండా స్వయం పోషకంగా సుస్థిర పద్ధతులలో సాగే శాశ్వత వ్యవసాయం (Permanent agriculture) గురించి శిక్షణనిస్తారు. అనేకమంది చదువుకున్న వాళ్ళు దేశం నలుమూలల నుండి, కొంతమంది విదేశాల నుండి కూడా వచ్చి ప్రతినెలా 15 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కోర్సులలో అక్కడే ఉండి చాలా ఆసక్తిగా పాల్గొంటారు. మేము వెళ్ళేసరికి ఒక బ్యాచ్‌కి కోర్సు నడుస్తోంది. వాళ్ళలో 80% మంది యువతీ యువకులు, చదువుకున్న వారు. ప్రకృతికి దగ్గరగా ఉండి, మట్టిలో చెప్పులు లేకుండా నడవటాన్నీ, నేలపై కూర్చుని భోజనం చేయటాన్నీ ఇష్టపడేవాళ్ళు. అక్కడికి ఒకసారి వచ్చినవాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరని, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారని నర్సన్న చెప్పాడు. వాళ్ళలో కొంతమంది అక్కడే వాలంటీర్లుగా ఉండిపోయారు. అటువంటి వారికి అరణ్య ఎప్పుడూ తలుపులు తెరిచి ఆహ్వానిస్తుందని అరణ్య నిర్వాహకులు నర్సన్న, పద్మ చెబుతుంటే చాలా అబ్బురం అనిపించింది.
అక్కడ ప్రకృతి సహజంగా పెరుగుతున్న రకరకాల చెట్లు, మొక్కలు, పెంచుతున్న కూరగాయల మొక్కలు, పండ్ల చెట్లు, రకరకాల పంటలు, మట్టికి ఎండ తగలకుండా అనేక పొరల ఆకులు కప్పి మల్చింగ్ పద్ధతిలో భూసారాన్ని కాపాడటం, ఎరువులు, పాల కోసం ఆవులు, బర్రెలను పెంచటం, రకరకాల విత్తనాలను భద్రపరచిన విత్తనాల ఖజానా నిర్వహణ ఇవన్నీ చూడటం ఒకెత్తు అయితే, అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు మరింత ఆసక్తిని కలిగించాయి. ఒక చెట్టుపైన పాకిన తీగను అక్కడ వాలంటీరుగా ఉన్న ప్రణీత్ మాకు చూపించి అది బహువార్షిక పాలకూర అని చెప్పగానే అటువంటి తెలియని ఎన్ని ఉన్నాయో కదా అక్కడే ఉండిపోతే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కదా అనిపించింది.
ఆ ఊరిలో అరణ్య ఏర్పరచిన బిడకన్నె మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పిఓ) గురించి తెలుసుకోవటం మరింత ఉత్సాహాన్నిచ్చింది. 2018లో రిజిస్టర్ చేసిన ఈ ఎఫ్పిఓలో 150 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. వారిలో 95% ఎస్సి మహిళలు. వాళ్ళే దానికి డైరెక్టర్లు. ఈ ఎఫ్పిఓ సభ్యులు పండిరచిన అనేక రకాల పప్పులు, చిరు ధాన్యాలు, ఇతర పంటలను సేకరించి అరణ్య ఫార్మ్‌లో సంఘం కోసం కేటాయించిన కార్యాలయంలో వాటిని శుద్ధి చేసి, విలువను జోడిరచి ప్యాకింగ్ చేసి అమ్మకం చేస్తారు.
దాదాపు 30 ఏళ్ళ క్రితం డిడిఎస్ సహకారంతో ఆ ఊరిలో ఏర్పడిన మహిళా సంఘం సభ్యులు 28 మంది దళిత మహిళలకు 24 ఎకరాల ఎస్సి కార్పొరేషన్ భూములను భూ కొనుగోలు పథకం క్రింద ఇచ్చిన మొట్టమొదటి గ్రామం బిడకన్నె. అలా వచ్చిన భూములను వాళ్ళు కష్టపడి సాగు చేసుకుని రకరకాల పంటలు పండిరచుకుని, కూలి పని చేసుకుని ఆ మహిళలు మరికొంత భూమి కొనుక్కున్నారనీ, బిడకన్నె గ్రామంలో దాదాపు 200 ఎస్సి కుటుంబాలు ఉంటే ప్రస్తుతం భూమి లేని కుటుంబాలు చాలా తక్కువని నర్సన్న చెబుతుంటే చాలా సంతోషం అనిపించింది. వ్యవసాయం చేసుకునే వాళ్ళ చేతిలో, అందులోనూ మహిళల పేరుమీద భూమి ఉండటం అనేది ఎంత ముఖ్యమో, ఎన్ని అద్భుతాలు చేయవచ్చో ఆ గ్రామం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.
మా పాత స్నేహితురాలు తుల్జమ్మ, బిడకన్నె మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్. ఆమెను, సమ్మమ్మ అనే మరొక సీనియర్ నాయకురాలిని చాలా ఏళ్ళ తర్వాత కలుసుకోవటం కూడా చాలా అనందాన్నిచ్చింది. వాళ్ళతో మాట్లాడుతుంటే దళిత మహిళలకు భూమి హక్కులు కల్పించి, అవసరమైన సమాచారం, అవగాహన కల్పిస్తే వాళ్ళు ఎంతటి బలమైన నాయకులుగా తయారవుతారో కళ్ళారా చూశాము.
అరణ్య బెల్లం తయారీ యూనిట్‌ను కూడా నిర్వహిస్తోంది. ఎఫ్పిఓ సభ్యులు, ఇతరులు పండిరచే చెరకును సేకరించి అక్కడ సేంద్రీయ బెల్లం తయారుచేస్తారు. బెల్లం ముద్దలు, బెల్లం పొడి కూడా చేస్తామని, దాన్ని తానే నిర్వహిస్తానని తుల్జమ్మ గర్వంగా చెప్పింది.
ఈ ఎఫ్పిఓ సభ్యులకు అరణ్య సంస్థ తరపున కోవిడ్‌కు ముందు ఆవులు, ఆ తర్వాత బర్రెలు ఇచ్చారు. వాటినుండి ఎరువు ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయటానికి, పాలద్వారా ఆదాయం, పోషకాహారం సమకూరటానికి ఇచ్చారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో పిల్లలు, పెద్దలు అందరూ బయటికి వెళ్ళడానికి వీలులేక ఇళ్ళలో ఉన్నప్పుడు ఆవులు, బర్రెలను అందరూ బాగా మేపుకుని సంరక్షణ చేశారని, ఇతర గ్రామాల విషయం ఏమో కానీ తమ గ్రామంలో మాత్రం లాక్డౌన్ ద్వారా ఒక మంచి జరిగిందని పద్మ చెప్పింది.
దాదాపు 500 కుటుంబాలున్న ఆ గ్రామంలోకి ప్రతిరోజూ 500 పాల ప్యాకెట్లు బయటినుండి వస్తాయని, దుకాణాలలో పాల ప్యాకెట్ కొనుక్కోవటానికి వచ్చిన వారికి ప్రతి ప్యాకెట్‌ను తిరిగి ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇస్తున్నట్లు ఎఫ్పిఓ సభ్యులు లెక్క కట్టారు. ఈ విషయాన్ని అరణ్య దృష్టికి తీసుకువచ్చినపుడు ఒకరోజు 1,000 ప్లాస్టిక్ కవర్ల చొప్పున నెలకు 30,000 ప్లాస్టిక్ కవర్లు ఊరిలో చెల్లాచెదురుగా పారవేస్తే అవి ఊరంతా పోగుపడడమే కాక మట్టిలోకి, పెంటకుప్పల్లోకి వెళ్ళి పర్యావరణానికి, పశువులకు, భూమికి నష్టం కలిగిస్తాయని, దాన్ని ఆపటానికి ఏదైనా చేయాలని అనుకున్నారు. ఎఫ్పిఓ సంఘం సభ్యులు ఉత్పత్తి చేసే పాలను గ్రామంలో దుకాణాలలో అమ్మటం ద్వారా బయటినుండి ప్లాస్టిక్ కవర్ల పాల ప్యాకెట్లు రాకుండా చేయొచ్చు కదా అని ఆలోచించి గ్రామంలో ఉన్న దుకాణదారులతో మాట్లాడారు. తాము ఉత్పత్తి చేసే పాలు తెచ్చి దుకాణాల దగ్గర అమ్మటానికి వారిని ఒప్పించిన తర్వాత గ్రామంలో దాని గురించి ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల జరిగే నష్టం, పర్యావరణానికి జరిగే హాని గురించి అనేక విధాలుగా ప్రచారం చేశారు. గ్రామ పంచాయతీ తరపున మైక్ ద్వారా చెప్పారు. చిన్న గుంపులలో సమావేశాలు పెట్టి చెప్పారు. ఆ విధంగా ఒక నాలుగైదు నెలు చేసిన తర్వాత గ్రామస్థులు సంఘం సభ్యులు అమ్ముతున్న పాలు కొనుక్కోవటం మొదలుపెట్టారు. ప్యాకెట్లు అయితే తీసుకెళ్ళటం సులభం, ఈ పాలు కొనాలంటే ఇంటినుండి గ్లాసులు, గిన్నెలు తేవాలి కదా అని కొంతమంది ఇబ్బంది వ్యక్తం చేశారు. మొత్తానికి అన్ని అడ్డంకులనూ ఎదుర్కొని గ్రామంలో సంఘం సభ్యులు పాలు అమ్మటం విజయవంతమైంది. దానికోసం ఎంత కష్టపడ్డారో పద్మ, తుల్జమ్మ చెబుతోంటే అది ఒక ఉద్యమంలా సాగిందని అనిపించింది.
చుట్టుపక్కల గ్రామాలలో పత్తి పంట ఉంది కదా అని తుల్జమ్మను అడిగినప్పుడు, ‘‘మా ఊళ్ళో పత్తి పంట వెయ్యరు. రైతులకు అప్పులు కూడా చాలా ఎక్కువ లేవు. ఇక్కడ రైతుల ఆత్మహత్యలు కూడా లేవు’’ అని ఆమె చాలా గర్వంగా చెప్పింది.
మధ్యాహ్నం సేంద్రీయ ఆహార పదార్థాలతో భోజనం, డైనింగ్ హాల్లో శిక్షణ కోర్సులో పాల్గొంటున్న వారందరూ హాయిగా నేలపై కూర్చుని భోజనం చేయటం, వారిలో కొంతమందితో పరిచయాలు, పద్మతో, నర్సన్నతో పాతకాలపు జ్ఞాపకాలు కలబోసుకోవటం, వాటన్నిటితో సమయం తెలియలేదు.
అరణ్య ఫార్మ్‌లో కాసిన పనస పండు తొనలు, మామిడి పండ్లు తిని మెల్లగా సాయంత్రం బయలుదేరాం. అలా రోజంతా చాలా ఆనందంగా, సంతృప్తిగా గడిచిపోయింది.