మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుకూలంగా ఆడవారి ప్రవర్తన కూడా మోడ్రన్‌గా మారుతూ పరిణితి చెందిన పతివ్రతలా ప్రవర్తించాలి.
అమ్మాయి సన్నగా నవ్వాలి, చిన్నగా మాట్లాడాలి. కోపం వస్తే లోలోపలే కుమిలి పోవాలి. దుఃఖాన్ని ఎవరి కంటబ డకుండా ఒక మూల కూర్చుని అనుభవించాలి. ఇంటిగుట్టు లోపల్లోపలే దాచుకోవాలి. అవమానిస్తే పైపైకి నవ్వి ఆత్మగౌరవపు మౌనపోరాటాలు చెయ్యాలి. సదా అనుకూలవతిjైు ఉండాలి.
మొన్న అమెజాన్ ప్రైమ్‌లో పరవై కూట్టిల్ వాళుం మాన్గళ్ (పక్షుల గూటిలో బ్రతికే జింకలు) సినిమా చూశాను. చాలా బాగా తీశారు. నా స్నేహితురాలు ఆ సినిమాను చూసి నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది ఆ సినిమాను చూడమని, చూశాను కూడా. నటీనటుల నటన చాలా బావుంది. సహజమైన చిత్రీకరణ. కానీ ఆ ఇల్లాలి మోడ్రన్ సహనం పట్ల నాకు అసహనంగా ఉంది.
సరే, కథ చెబుతాను. మెట్రోలో తారసపడే ఇద్దరు మధ్య వయస్కులు… ఒక ఆడ, ఒక మగ. ఇద్దరిలో త్వరలో ప్రేమ పుడుతుంది. కలుస్తూనే ఉంటారు. ఇంతలో అతను తన భార్యా పిల్లలతో మెట్రోలో ఆమెకు కనబడతాడు. ఆమెలో ఏ మార్పూ ఉండదు. ఇద్దరూ రోజూ కలుస్తుంటారు, టిఫిన్ డబ్బాలు మార్చు కుంటారు. అతని వర్క్ ప్లేస్‌కి ఆమె అప్పుడ ప్పుడూ వెళ్తుంది. అతని ఆరోగ్యం గురించి పట్టించుకున్నట్లే ఉంటుంది. అలసిపోయినప్పుడు అతన్ని విసిగించదు కూడా (మెట్రోలోనే).
ఇప్పుడు ఆమె అతని ఇంటికి వస్తుంది. అతని భార్య ఆమెతో మాట్లాడాలను కుంటుంది. భర్త, ఆమె, భార్య ఉంటారు. భార్య తన పిల్లలను మామగారితో బయటికి పంపిస్తుంది. చాలా నిమ్మళంగా ప్రవర్తిస్తుంది. ఈ మార్పుతో పిల్లలు ఇబ్బంది పడకూడదని, ఏ విధంగా వారిని అలవాటు చెయ్యాలో ఆలోచించాలని అతని ప్రియురాలితో చెబుతుంది. దీనికి ఉదాహరణగా అతనికి ఉన్న సిగరెట్ అలవాటుని ప్రస్తావిస్తుంది. పిల్లలతో తమ తండ్రి సిగరెట్ తాగట్లేదని, అతనికి పనిష్మెంట్ విధించారని, అందుకోసం అతను 1000 సిగరెట్లు తాగాలని అందుకే భర్త సిగరెట్లు తాగవలసి వస్తుందని పిల్లలతో అన్నానని చెబుతుంది. భర్త కూడా వెయ్యి సిగరెట్లు తాగాక మానేస్తానని భార్యకు మాట ఇస్తాడు.
అయితే అతను తన భార్యను కూడా ప్రేమించే పెళ్ళి చేసుకున్నాడు. ఆమెలో పెద్దగా తప్పులు ఉన్నట్లు కూడా చెప్పలేదు. భార్య మీద కాలక్రమేణా ప్రేమను కోల్పోయాడు. భార్య వెళ్ళిపోయింది. ప్రేమిక వచ్చింది. ఈ ట్రాన్సిట్‌ని ఇద్దరు ఆడవారు బాగా పోషించారు.
మధ్యలో అతని భార్య, అతని ప్రియురాలితో అంటుంది, ‘‘ముందు తెలియగానే గట్టిగా అరిచాను, అద్దం పగలగొట్టాను. కానీ అర్థం చేసుకున్న కొద్దీ ఇది పరిష్కారం కాదని తెలిసింది’’. భార్య ఆ ప్రియురాలిని ఎక్కడా నిందించదు, గౌరవంగా చూస్తుంది.
ఇప్పుడు ఆమె ఇంట్లో ఇంకో కొత్త వ్యక్తి, తన స్థానాన్ని తీసుకుంటున్న వ్యక్తి. మొత్తానికి ముగ్గురూ ఒక ప్రణాళిక ప్రకారం కో`పేరెంటింగ్ చేస్తారు. భార్య వేరే ఊరిలో ఉద్యోగం వెతుక్కుంటుంది. భర్త దగ్గరకు అతని ప్రియురాలు వస్తుంది. ముగ్గురూ కలిసి పిల్లలను తీసుకుని అప్పుడప్పుడూ విహార యాత్రలకు
వెళ్తుంటారు. దీంతో కథ ముగుస్తుంది.
పోలీగామి అనేది ఎప్పటినుండో మన చరిత్రలో ఉంది, అదింకా కొనసాగుతోంది. వైవాహికేతర సంబంధాలు పెళ్ళి పుట్టినప్పటి నుండి ఉన్నాయి, కొనసాగుతున్నాయి. కానీ ఈ అనుకూలవతిjైున భార్య నిర్వచనం కాస్తా మార్చి తను చేసిన మార్పులకు భర్త బాధ్యత తీసుకోలేడా? ఇదే అతను తన భార్య వేరేవారితో ప్రేమలో ఉందంటే అదే విధంగా ఇంకో మగవాడిని ఇంటికి పిలిచి మర్యాదలు చేసి పిల్లల్ని అప్పజెప్పి వెళ్ళిపోతాడా? పైగా ఈ భార్య అతని ప్రేమికను ఒక్క మాట కూడా అనదు.
సిస్టం మొత్తం మగవారికి ఎంత అను కూలంగా ఉండగలదో, మగవారు ఎంత ఎంటైటిల్మెంట్‌తో ఇటువంటి పనులు చేయగలరో చెప్పకనే చెప్పిన సినిమా. ఇందులో భార్య ఎంత ఇన్‌వాల్వ్ అయిందో చెప్పారు. భర్త గిల్టీగానే కనిపించాడు. అతని భార్య ఇంతగా ఇవాల్వ్ అయినా (ఎదిగినా) బాత్రూమ్‌లోకి వెళ్ళి ఏడ్చేస్తుంది. భర్త ప్రియురాలికి భోజనం వండి వడ్డిస్తుంది.
ప్రేమ నిలకడగా ఉండే భావోద్వేగం కాకపోవచ్చు. అది ఒకరిపై కలగొచ్చు, పోవచ్చు. నిజమే కానీ ఈ ప్రక్రియలో వాస్తవికంగా జరిగే మార్పులను గురించి భార్య మాత్రమే బాధ్యత తీసుకున్నట్టుగా చూపిస్తున్నారు. ఆమె నుండి ప్రియురాలికి కూడా.
అవతల ప్రియురాలు కూడా భార్య స్థానాన్ని తీసుకుందామనుకుంది. మరి ఈ ప్రేమ కూడా అంతరించి పోవచ్చు అనే ఆలోచన ఉందా? ఇంట్లో ఉండి, పిల్లల్ని చూసుకుంటూ ఉండే భార్య టిఫిన్ బాక్స్ పంపితే ఆ బాక్స్‌ను ప్రియురాలికి ఇచ్చేస్తాడు భర్త. ఆ ప్రేమికురాలు మళ్ళీ తన బాక్స్‌ను అతనికి ఇస్తుంది. ఇద్దరు ఆడవాళ్ళు బాగానే గారాబం చేస్తున్నారు.
భార్య వంటింటి గురించి చాలా పొసెసివ్ అని చెబుతాడు భర్త. ఉద్యోగం చేయని, పిల్లల్ని పెంచే, వంటగదిని తన సామ్రాజ్యంగా కొలిచే ఆడమనిషి, తనది అనుకున్న భర్తను, పిల్లల్ని, ఇంటిని, ముఖ్యంగా వంటగదిని వేరే స్త్రీకి హుందాగా వదిలి వెళ్ళిపోయింది.
ఇది రాస్తుంటే నాకు రెండు ఆలోచనలు వస్తున్నాయి. ‘ఇంత చాకిరీ చేసిన నాకు ఒరిగిందేమీ లేదు. నువ్వు ఈ స్థానం కోసం ఆరాటపడుతున్నావుగా! వచ్చి ఇవే పనులు చేసి నీ ప్రేమను పరీక్షించుకో’ అని అతని ప్రేమికకు అతని భార్య నిశ్శబ్దమైన సవాలు విసిరి వెళ్ళినట్లు, లేదా ‘నా భర్తను నేను ప్రేమించాను కాబట్టి, అతన్ని, పిల్లలను ఇబ్బంది పెట్టకుండా అనుకూలవతిగా, అయిన భార్యగా నా కాల పరిమితి తీరిపోయింది అని ఒప్పుకుని హుందా గా వెళ్ళిపోతున్నాను’ అని. మొదటి కారణమే అయితే ఎంత బావుండు. ఈసారి మరో సినిమా ఆ కోణంలో తీస్తే సంతోషిస్తా.