అమ్మా… మీ సలహా కావాలమ్మా’’ వస్తూనే హడావిడిగా అన్నది యాదమ్మ.
‘‘ఏంటో చెప్పు’’
‘‘నా చెల్లి బిడ్డ కబడ్డీ ఆట బాగా ఆడుతది. ఢల్లీి దాంక పోతందుకు సెలక్ట్ అయినది.’’
‘‘సంతోషమే కదా…’’
‘‘సంతోసమేనమ్మా. కానీ తోలేదే లేదంటున్నడు నా మరిది. పోరేమో పోతనని ఏడ్వబట్టింది. ఆటల్ల ఆడపిల్లల పదిలం
ఉండనియ్యరని ఎవరో చెప్పింరట. రేపు ఏదన్న జరగరానిది జరిగితే బిడ్డ పెండ్లి ఎట్ల చేసేది. అయ్యో నా బిడ్డకు అన్యాయం జరిగింది అంటే ఎవడు వింటడు. పెద్ద పెద్దోళ్ళతోనే అయితలేదట. ఇగ నేనెంత? నా బిడ్డ ఎంత? అంటున్నడు. ఛీ… నేను ఆడ పుట్టుక ఎందు కు పుట్టిన, మొగపిల్ల గాడ్నయితే మంచిగుండు అని ఏడుస్తున్నది’’ అన్నది యాదమ్మ.
‘‘అయ్యో… అమ్మాయిని పంపండి. ఆడపిల్ల అని వాకిట్లో దూడను కట్టేసినట్టు పెట్టుకుంటామంటే ఎలా. ఆటల్లో అందరూ రాణించలేరు. మీ అమ్మాయి రాణిస్తున్నదంటే గొప్ప విషయం. ఆడపిల్ల ఇంట్లో నుంచి కాలు బయటపెట్టిన దగ్గరనుండి గుంట నక్కలు కాచుకుని ఉంటాయి. కాళ్ళకడ్డు పడుతూ కాలకూట విషం చిమ్మే నాగులుంటాయి. పొంచి ఉంచి దాడి చేసే మృగాలు
ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. బయట సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనేలా మనం ఆడపిల్లల్ని పెంచాలి’’ అంటూ ఏవో తోచిన సలహాలు ఇచ్చాను యాదమ్మకు.
కానీ, నా మనసంతా కకావికలమైంది. మాకు న్యాయం చెయ్యండని, తమ కెరీర్ పణంగా పెట్టి గత ఐదు నెలలుగా భారత మహిళా రెజ్లర్లు గళమెత్తినా, నిరసనలు తెలుపుతున్నా నిందితుడిపై కనీస చర్యలు లేవు. న్యాయం జరగకపోగా బాధితులనే నేరస్థులను చేసి రోడ్లపై ఈడ్చుకుపోతున్నారు. ఇటువంటివి చూసిన తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని ముందుకు నడిపించగలరా?
రెజ్లర్లు పతకాలు సాధించినప్పుడు చప్పట్లు కొట్టడం, సంబరాలు చేసుకోవడమే కాదు వారికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలవాలి కదా. రెజ్లర్లుగా ప్రపంచ పటంపై దేశ ఖ్యాతి ప్రతిష్టలు ఇనుమడిరపచేస్తున్న ఆడపిల్లలు మాతృ దేశంలో లైంగిక వేధిం పులు, అవమానాలు, శారీరక మానసిక హింస అనుభవిస్తూ న్యాయం కోసం రోడ్డెక్కా ల్సిన పరిస్థితి రావడం ఒకవైపు భారతదేశానికి అవమానకరం, అప్రతిష్ట, మరోవైపు భవిష్య త్తులో క్రీడల్లో అడుగుపెట్టే ఆడపిల్లలందరికీ ఇబ్బంది కలిగించే పరిణామం.
మన దేశ ప్రతిష్ట కోసం ప్రత్యర్థి దేశాలతో పోరాడి పతకాలు సాధించుకొచ్చిన ఆ బిడ్డలు తమ భద్రత కోసం, గౌరవం కోసం మన దేశంలోనే పోరాడాల్సిన దుస్థితికి కారణం ఆడపిల్లల సమస్య విని వెంటనే పరిష్కారం అందించాల్సిన బాధ్యత క్రీడా సమాఖ్యలో లేకపోవడం. అసలు క్రీడా సమాఖ్యలో, సెలక్షన్ కమిటీల్లో కోచ్‌లుగా మహిళలు ఎక్కువ లేకపోవడం, తమ బాధ చెప్పుకునే అవకాశం ఆడపిల్లలకు లేకపోవడంతో పాటు సమస్యను చెప్పినప్పటికీ జవాబుదారీతనం లేకపోవడం.
ఆడపిల్లల అవయవాలను ఎక్కడపడితే అక్కడ తడమడం, లైంగిక కోరికలు తీర్చమని వేధించడం లేదంటే వారిని ప్రొఫెషనల్‌గా ఇబ్బందులకు గురిచేస్తూ మానసికంగా హింసించడం వంటి ఆరోపణలు ఎదుర్కొం టున్న వ్యక్తి ఒక పార్లమెంటు సభ్యుడు, 12 ఏళ్ళుగా భారత రెజ్లర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు అయిన బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్. తండ్రి లాంటి బ్రిజ్ భూషణ్ మీద రెజ్లర్లు చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ రెజ్లర్లను ట్రోల్ చేస్తున్నారు.
హత్యలు, దోపిడీలు చేయడం వంటి అనేక నేరారోపణలు, క్రిమినల్ కేసులు
ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, బాధితుల పక్షాన నిలిచి భరోసా కల్పించాల్సిన, బాధ్యతగా వ్యవహరించాల్సిన పాలకులు ఎవరి పక్షమో చెప్పకనే చెబుతున్నారు.
బేటీ పఢావో బేటీ బచావో నినాద ప్రాయమేనా? శుష్క వాగ్దానాలేనా? ద్వంద్వ ప్రమాణాలతో దోషులను శిక్షించడం పట్ల నిర్లక్ష్యం దేన్ని సూచిస్తుంది? బాధిత ఆడపిల్లలకు ఈ దేశంలో న్యాయం కోరే హక్కు, న్యాయం కోసం పోరాడే హక్కు లేదా? ఉంటే రెజ్లర్ల గొంతు నొక్కే ప్రయత్నా లెందుకు? వాళ్ళ గోడు ఎందుకు వినిపించు కోవడం లేదు. ఇలా అయితే ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉంటుందా?
దేశంలో ఇంత జరుగుతూ ఉంటే మహిళా కమిషన్ ఎక్కడ నిద్రపోతున్నది? మహిళల హక్కులకు భంగం కలిగినప్పుడు ముందుండాల్సిన జాతీయ మహిళా కమిషన్ మన్ను తిన్న పాములా పడి ఉన్నదేంటి? వేరే సంఘటనల్లో స్పందించిన మహిళా కమిషన్ ఇప్పుడెందుకు మౌనవ్రతం చేపట్టింది? ఈ మధ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్పందించిన మహిళా కమిషన్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ విషయంలో స్పందన కరువైందెందుకు? పక్షపాతమెందుకు?
బలవంతులకు ఒక న్యాయం బలహీ నులకు ఒక న్యాయమా? పోక్సో చట్టం కొందరి కోసమేనా?
ఏడుస్తూ, భయపడుతూ వెనక్కి వెనక్కి ఎంతకాలం? కరణం మల్లీశ్వరి, సానియా మీర్జా, పౌర సంఘాలతో, సంస్థలతో పాటు మనమూ చేయి కలిపి రెజ్లర్లకు సంఫీుభావం తెలుపుదాం. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చచ్చే రోజు వస్తుంది. తప్పకుండా రావాలి.