నేటి ధర్మం – షేక్‌ మస్తాన్‌ వలి

పెళ్ళైంది. చుట్టాలెళ్ళిపోయారు.
కూతుర్ని అత్తారింటికి పంపి ఊపిరి తీసుకున్నా. దానికింకే లోటు ఉండదు. భర్తకు మంచి ఉద్యోగం, అత్తింటివారు సౌమ్యులు.

ఇక మిగిలింది కొడుకే. వాడి ఎం.సి.ఎ. మార్చికి పూర్తవుతుంది. ఆపై ఉద్యోగం రాగానే ఓ పిల్లను ముడిపెడ్తే ఆ భారం తీరిపోతుంది. అప్పుడు పూర్తిగా ఫ్రీ అవుతా.
సాధారణంగా కుటుంబాల్లో ఈ బాధ్యతలు దంపతులిద్దరు నెరవేరుస్తుంటారు. కానీ నా కథ వేరు! నా బాధ వేరు.
పెళ్ళి హడావిడి తగ్గినా యిల్లంతా చిందరవందరగా ఉంది. వారం నుండి పనుల ఒత్తిడుల్లో సరైన విశ్రాంతి లేదు. అందుకేనేమో నిద్ర ముంచుకొచ్చింది. మంచంపై ఉన్న సామాన్లు ఓ మూలకు నెట్టి నడుం వాల్చాను.
వంటగదిలో అమ్మ పెడ్తున్న సాంబారు వాసన గుబాళిస్తోంది. ‘‘రేపు సౌదీకెళ్ళిపోతే… తిరిగి వచ్చేదాకా అది తినే యోగముండదు’’ అనుకుంటుంటే మగత కప్పేసింది.
‘‘శాంతా! ప్రయాణానికి సామాన్లు సర్దుకో. నీకిష్టమైన పచ్చళ్ళు సీసాల్లో పెట్టా. అవి కూడా ప్యాక్‌ చేసుకో!’’ అమ్మ ఒకటే రొద పెడుతోంది. ‘‘ప్లీజమ్మా! కాసేపు పడుకోనియ్యి. చాలా అలసటగుంది’’ నే పెద్దగా అరిచా. అంతే! ఆమె నన్నొదిలి వంట పనుల్లో మునిగిపోయింది. నే మంచంపై వాటం మార్చి పడుకున్నా.
‘‘అమ్మాయ్‌ శాంతా! ఏం చేస్తున్నావ్‌?’’ నిద్రలో పెద మామయ్య గొంతు లీలగా వినిపించి మెలకువొచ్చింది.
‘‘అరెరె… అందరూ వచ్చారే! రండన్నయ్యా! రా… రా… తమ్ముడూ! రా… బాబూ! రండి… కూర్చోండి’’ అమ్మ స్వాగత వచనాలు వినిపిస్తున్నాయి. ‘‘అబ్బా! ఈ నసగాళ్ళిప్పుడు తగలడ్డారేంటో?’’ మనస్సు ఆక్షేపిస్తుంటే లేచి ఒళ్ళు విరుచుకున్నా. ఇంతలో అమ్మ వచ్చి రమ్మని సైగ చేసింది. అయిష్టంగానే లేచి చీర సవరించుకొని, జుట్టు ముడేసుకుంటూ వెళ్ళి గడపపై కూర్చున్నా.
పెద మామయ్య, చిన మామయ్య, మా వారి అన్నలు తీరిగ్గా కూర్చొని అమ్మ పెట్టిన స్వీట్‌, హాట్‌ తింటున్నారు. నన్ను చూడగానే పళ్ళికిలించారు. నేనైతే నవ్వలేదు.
‘‘ఆఁ… ఏంటమ్మాయ్‌? మొత్తానికి అరేబియాకెళ్ళి సంపాదనలో పడ్డావ్‌! చాలా సంతోషం! పిల్ల పెళ్ళి గొప్పగా చేశావ్‌. ఇంతకూ… నెల జీతం ఏ మాత్రం ఉంటుందో…?’’ పెద మామయ్య నా స్థూలాదాయాన్ని గురించి అడిగాడు.
‘‘మనిషి రంగు తేలావ్‌! అక్కడ ఏ.సి.లోనే కాలక్షేపమటగా! మరి… పైసలు చాలానే వస్తాయటగా. నెలకే మాత్రం వెనకేస్తుంటావ్‌?’’ చిన మామయ్య నా నికరాదాయం వివరాలడిగాడు.
‘‘అక్కడ… ఇక్కడ ఖర్చులు పోను… బాగానే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉందనుకుంటానమ్మాయ్‌!’’ మావారి అన్నదీ అదే వరస.
అంతేగాని… దేశం కాని దేశంలో ఎలాగుంటున్నావని గానీ, పెళ్ళి ఖర్చులకు డబ్బులెలా చేశావని గాని, ఒక్కరు కూడా అడిగిన పాపాన పోలేదు. అయినా… నా పిచ్చిగాని అలాంటి సానుభూతి వారి నుండి కోరుకోవటం దురాశే అవుతుంది.
ఎదుటివాళ్ళలా పోటీపడి అడుగుతున్నా నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. అందుకే మౌనంగా చూస్తుండిపోయా.
‘‘చెప్పవేంటే శాంతా? పెద్దవాళ్ళేదో అడుగుతున్నారుగా!’’ అమ్మ తన సహజ ధోరణిలో అదిలించింది.
‘‘పెద్ద… వారు… ఎవరమ్మా? ఈ మనసులేని కసాయిలేనా? అసలు వీరికి నేనెందుకు సమాధానం చెప్పాలి.
వీళ్ళు నాకేం సహాయం చేశారని… లెక్కలడగటానికొచ్చారు! మనపట్ల కనీస బాధ్యతలేని… వీరిని నేను ఖాతరు చేయాలా? ఎక్కడిదమ్మా ఈ న్యాయం?’’ నాలో తర్కం చెలరేగుతుంటే… కళ్ళముందు గతం కదలాడసాగింది.
… … …
అప్పటికి అమ్మానాన్నల పెళ్ళై పదిహేనేళ్ళు. అయినా పిల్లలు కలగలేదు. దాంతో ఈ పెద్ద మనుషుల ప్రోద్బలం మేరకు మా మూడో మేనమామ చిన్నకొడుకు గిరిని పెంపకానికై మా వాళ్ళ వద్దకు చేర్చారు. ఆనాటి అతని వయస్సు ఎనిమిదేళ్ళు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అతను క్రమపద్ధతిలో పెరగలేదు. ఉన్న అమ్మ, అన్నల అజమాయిషీ కూడా అంతంత మాత్రమే. ఇక మా వాళ్ళ గారాబంతో పెట్రేగిన అతను చెడు అలవాట్లకు లోనయ్యాడు. చదువు మాత్రం ఏ కోశానా అబ్బలేదు.
గుడ్డిలో మెల్లలా గిరి వచ్చిన నాలుగేళ్ళకు మా అమ్మ కడుపు పండి నే పుట్టాను. దాంతో మురిసిన మా వాళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టి పెంచుకోసాగారు. కానీ దురదృష్టం వెంటాడి నా ఏడవ ఏటనే నాన్న చనిపోయాడు. ఆపై అమ్మే వ్యాపారం చూసుకుంటూ కుటుంబ భారాన్ని మోయసాగింది.
ఇక గిరి బావకు నే పుట్టడమే ఇష్టంలేదు. మొదటినుండి నన్ను శత్రువులాగే చూసేవాడు. అతను చూపులకే కాదు… చేతలకు కూడా వెధవే. ఎప్పుడూ జులాయిగా తిరిగేవాడు. నేనైతే బుద్ధిగా చదువుకునేదాన్ని.
నా పదమూడో ఏట పెద్దమనిషినయ్యా. అప్పుడు అమ్మ చుట్టాలనందరినీ పిలిచి సంబరంగా పేరంటం చేసింది.
అదిగో… ఈ పెద్దలు మళ్ళీ అప్పుడొచ్చారు.
ఆ సందర్భంగా వాళ్ళు ‘‘అమ్మాయి ఈడేరింది… శుభం! మీ బాగోగులు చూట్టానికి నీకా… భర్త లేడు. అందుకని ఆమెను గిరికిచ్చి ముడిపెడ్తే అల్లుడితో పాటు కూతురూ నీ దగ్గరే పడుంటుంది. దాంతో అల్లరి చిల్లరిగా తిరిగేవాడికి బాధ్యత తెలిసొస్తుంది! ఇది ఉభయ కుశలోపరి!’’ అని అమ్మకు ఓ సలహా పడేశారు.
భర్తను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మకు పెద్దవారనుకునే వారి మాట పాటించక తప్పలేదు. ఆపై ‘‘ఈ సంబంధం ఇష్టమేనా?’’ అని నన్నడిగిన వారే లేరు.
ఇక విధి బలీయమైంది! అంత చిన్న వయసులోనే ఏ మాత్రం ఇష్టంలేని గిరి బావకు ఇల్లాలినయి సంసార జీవితంలోకి నెట్టబడ్డాను.
పెళ్ళికి వేంచేసిన ఈ పెద్దలు ఇంకో ఘనకార్యం వెలగబెట్టారు. విందు భోజనం పీకలదాకా మెక్కి ‘‘ఏమ్మా… ఇక అమ్మాయికి చదువెందుకు? గిరిగాడికదెలాగూ అబ్బలేదు. మరి… ఈ పిల్లను ఇంకా ముందుకు చదివిస్తే దాంపత్యం పొసగదు. కాబట్టి బడి మాన్పించి కూతురికి ఇంటి పనులు నేర్పించు!’’ అనే సలహాతో అమ్మను పరోక్షంగా శాసించారు.
ఫలితం… నా చదువు ఎనిమిదో తరగతితోనే ఆగిపోయింది. నాకిప్పటికీ బాగా గుర్తే! స్కూల్‌ వదిలొచ్చేటప్పుడు నేను వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చలేక అమ్మ తల్లడిల్లింది. అలా నా చదువు అర్థంతరంగా ముగిసిపోయింది.
పెళ్ళయ్యాక గిరి ఆగడాలు ఎక్కువయ్యాయి. అతని ఆటో మెకానిక్‌ సంపాదన అమ్మకు ఇచ్చినట్టే ఇచ్చి, దానికి రెట్టింపుగా ఆమె వద్దనుండి డబ్బులు గుంజి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. అదేమని అడిగినందుకు నన్ను, అమ్మను పెద్ద పెద్ద అరుపులతో ఓటించి వదిలేవాడు. అదెలాగో భరిస్తున్న మాకు అతని తాగుడు వ్యసనం, పరాయి స్త్రీలతో సంబంధం పిడుగు పాటయ్యాయి.
దానికి విరుగుడుగా ఏదో ఒకటి చేయాలనుకున్నా. కానీ ఈలోగానే చేయిదాటి పోయింది. సంవత్సరానికే తల్లినై ఆడపిల్లను కన్నాను.
క్రమేపీ గిరి ఇంటికి రావడం తగ్గించాడు. నేనెంత గొడవ చేసినా అతనికి చీమకుట్టినట్లు కూడా ఉండేది కాదు. పైగా చేయి చేసుకోసాగాడు. అయినా ఖర్మ అని సరిపెట్టుకుని బ్రతకసాగాను.
ఈలోగా ఆస్తి సగానికి పైగా హరించుకుపోయింది. అటు బిడ్డ బాధ్యతతో, ఇటు భర్త నిరాదరణతో చిక్కిశల్యమయ్యాను. అడపా దడపా ఇంటికొచ్చే గిరి అకస్మాత్తుగా మకాం మార్చి ఉంపుడుగత్తెతో కాపురం పెట్టాడు. అనుకోని ఈ అవాంతరాలతో అమ్మ కృంగిపోయింది. అయినా ఆమెకు సంసార భారం తప్పలేదు.
మెల్లగా ఐదేళ్ళు గడిచిపోయాయి. ఈ జరిగిన కాలంలో మా ప్రబుద్ధుడు పూర్తిగా ముండకే అంకితమయ్యాడు.
దాంతో విసిగిపోయిన అమ్మ ఈ పెద్దల్ని సమావేశపర్చి ‘‘గిరికి పుట్టిన బిడ్డను వాడికే అప్పగించి శాంతకు విడాకులిప్పించండి. ఆపై దానికేదో ఒక సంబంధం చూసి రెండో పెళ్ళి చేస్తా. అంతేగాని దాని జీవితం మోడైపోవటం… చూడలేను!’’ అంటూ వాపోయింది. దానికి నేనూ వత్తాసిచ్చాను.
‘‘ఏంటీ… శ్యామలక్కా! పెద్దదానివి అలా మాట్లాడుతావ్‌? భర్త బ్రతికుండగానే భార్యకు వేరే పెళ్ళేంటి? అయినా… ఆడదానికా మాత్రం ఓర్పు లేకపోతే ఎలా? జీవితమన్నాక ఇలాంటివన్నీ సహజమే! ఏమైనా మేమంతా లేమా? ఆ గిరిగాడ్ని దారిలో పెట్టమా!’’ అని మాపై ఎదురు దాడికి దిగి మెల్లగా జారుకున్నారు.
తర్వాత వాళ్ళేమి మాయ చేశారో గానీ గిరి మళ్ళీ ఇంటికొచ్చాడు. అలా జరిగినందుకు మాకొరిగిందేమీ లేకపోగా, అతని అలవాట్లతో మిగిలి ఉన్న కాస్త ఆస్తీ కరిగిపోయింది. చివరకు ఇల్లొకటి మిగిలింది. పైగా దురదృష్టం వెంటాడి మరోమారు నన్ను తల్లిని చేసింది. ఈ సారి బాబు పుట్టాడు. ఈలోగా అమ్మ చేసే వ్యాపారం బాగా దెబ్బతింది. దాంతో మేం గిరికి డబ్బిచ్చే స్థితి నుండి అడిగే స్థితికి దిగజారాం. అంతే! అతను మమ్మల్ని వదిలేసి శాశ్వతంగా ఉడాయించాడు.
ఇలా ఇరవై రెండేళ్ళకే ఇద్దరి బిడ్డల తల్లినై నిస్సహాయ స్థితికి చేరుకున్నాను.
చదువు లేదు. ఆస్తి లేదు. హామీలిచ్చిన పెద్దలు పత్తా లేరు! కాకుంటే పిల్లల తల్లిగా మిగిలిన నేను, మళ్ళీ పెళ్ళికి పనికిరానని వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు.
కొంతకాలమెలాగో గడిచింది. వ్యాపారం పూర్తిగా దెబ్బ తింటంతో అమ్మ నగలు, సామాన్లు ఒకటొకటిగా అమ్మేయసాగింది. కొన్నాళ్ళకింకేమీ మిగల్లేదు. అంతకంటే ఆ పెద్ద వయస్సులో ఆమేమి చేయగలదు? అందుకే నేనే ఏదో ఒకటి చేయాలనుకున్నా.
ఆ పరిస్థితుల్లో మా పక్కింటావిడ జాలి తలచి వాళ్ళాయన శంకరం ద్వారా నేను టైలరింగ్‌ నేర్చుకునేలా ఏర్పాటు చేసింది. మొదట్లో వారి షాప్‌లో చేతికుట్టు పని నాకప్పగించారు. దానిపై వచ్చే సంపాదనతో ఎలాగో ఇల్లు లాక్కొచ్చేదాన్ని. క్రమేపీ టైలరింగ్‌లో నాకు ప్రావీణ్యమొచ్చింది. ఆదాయమూ పెరిగింది. ఇక పిల్లల్ని స్కూళ్ళకు పంపించసాగాను. కుప్పకూలనున్న మా కుటుంబాన్నలా ఆదుకున్న శంకరం దంపతులపై నేనెంతో కృతజ్ఞతతో ఉండేదాన్ని.
కానీ ఈ సంతోషమూ ఎంతో కాలం నిల్వలేదు. నాకు, శంకరానికి అక్రమ సంబంధం అంటగట్టి… ఈ పెద్దలే అతన్ని నానామాటలన్నారు. ఆపై నన్నతని షాపుకెళ్ళకుండా చేశారు. ఇన్నాళ్ళు గిరిబావ ఏ తప్పు చేసినా ఆక్షేపించని ఈ దొరలు… నేనో మగవాడి వద్ద పొట్టకూటికి పని చేయటం కూడా సహించలేకపోయారు. పైగా ఓ అభాండం వేసి ఆ దారీ మూసేశారు.
అయితే ఈ సంఘటన నా ధైర్యాన్ని పెంచింది. జీవితపు అగాధాన ఆసరాగా దొరికిన వృత్తిని మెరుగు చేసుకున్నా. ఎలాగో ఓ కుట్టు మిషన్‌ సంపాదించి ఇంటి దగ్గరే టైలరింగ్‌ మొదలుపెట్టా. రాత్రింబవళ్ళు శ్రమించా. మెల్లగా ఇంకో మిషన్‌ కొని, వేరే అమ్మాయిని నెల జీతంపై పని చేయించసాగాను. అలా… అలా… నాకు వృత్తిలో మంచి పేరొచ్చింది.
ఈ క్రమంలో పదేళ్ళు జరిగాక అదృష్టం కలిసొచ్చి సౌదీ అరేబియాలో ఉద్యోగం దొరికింది. కానీ వెళ్ళేందుకు ముప్ఫై వేలు పైకం అవసరమైంది. మరి… అంత మొత్తం ఎక్కడ్నుంచి తేవాలి? చివరకు అమ్మ ప్రోద్భలంతో ఈ పెద్దల్నే అడిగా.
‘‘అబ్బా! అంత దూరమెందుకమ్మా? అ పనేదో ఇక్కడే చేసుకోరాదా? అయినా… అంత పెద్ద మొత్తం ఏ కుదవా లేకుండా ఎవరిస్తారమ్మా?’’ అంటూ వారు మా ఇంటిపై ఎక్కుపెట్టారు.
అలాంటప్పుడు వారికెందుకులే అని ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుని సౌదీకి ప్రయాణం కట్టా. ఎదిగే పిల్లల భారం ఒంటరైన అమ్మపై వదిలేసి, ముప్ఫై ఏళ్ళకే మొండి ధైర్యంతో విదేశీ యానం చేశా.
స్వంత దేశాన్ని వదిలేసి పరాయి గడ్డన చేరిన నా బాధలు వర్ణనాతీతం.
అక్కడ ఊరు వేరు… ఉనికి వేరు… గాలి వేరు… నీరు వేరు… వేషభాషలు వేరు… ఆచార వ్యవహారాలు వేరు… అన్నింటికీ అలవాటు పడటానికి నాకు బాగానే సమయం పట్టింది. కాకుంటే ఎప్పుడో స్కూల్లో చదువుకున్న హిందీ కొంతమేరకు ఉపయోగపడిరది. మిగిలిన పని మూగసైగలతో జరిగిపోయేది.
నాలాగే జీవనోపాధి కోసం వచ్చిన దేశవిదేశాల మహిళా దర్జీలనందర్నీ ఒక పెద్ద ఎ.సి. భవనంలో పెట్టి పని చేయించేవారు. ఆపై నివాసం కూడా అందులోనే ఉండేది. ఆ ఇంటికున్న ఒకే గవాక్షం గుండానే మాకు ఆకాశం కనిపించేది. నిజానికి అదోరకం జైలు. ఇక మేమందరం గడియారం ముళ్ళతో పోటీపడి పనిచేసేవాళ్ళం.
మా సంస్థ యజమాని ఒక అరబ్‌ స్త్రీ. ఆమె ఎత్తుగా, లావుగా, చూపులకు భయం కొల్పుతుండేది. పనిలో ఏ చిన్న పొరపాటు దొర్లినా చీల్చి చెండాడేది. ఏదైనా ఒక తప్పు రెండోసారి జరిగిందంటే, వెంటనే సదరు ఉద్యోగిని అకౌంట్‌ లెక్కకట్టి, పైకం చేతిలో పెట్టి ఇంటికి పంపించేది. వాళ్ళెంత గింజుకుని క్షమాపణ అడిగినా తిరిగి పనిలోకి చేర్చుకోవడానికి అంగీకరించేది కాదు. నెలకొక్క శలవు మాత్రమే ఉండేది. ఆ రోజే మేము మార్కెట్‌ నుంచి కావాల్సిన సామాన్లు తెచ్చుకునేవాళ్ళం. అంతకు మించి మాకింకే సాంఘిక జీవితముండేది కాదు. అయితే అక్కడ చేరిన మేమందరం ఒకే రకం పక్షులం కనుక పరస్పరం సహకరించుకొని ఇంటిపని, వంటపని ఉమ్మడిగా చేసుకొని ఆనందించేవాళ్ళం.
కొన్ని నెలల దాకా పిల్లలు గుర్తొచ్చి ఏడ్చేదాన్ని. ముసలితనంలో అమ్మపై భారమెక్కువ వేశానని కుమిలిపోయేదాన్ని.
ఎలాగో… అన్నింటిని అధిగమించి డబ్బు సంపాదించే యంత్రంగా మారి, పిచ్చుక పిల్లల కోసం ఒక్కొక్క గింజ ప్రోగు చేసినట్లుగా డబ్బు జమ చేసి… అప్పు తీర్చి ఆపై కొంత మిగిలించగలిగాను.
అలా నా సౌదీ జీవితం యాంత్రికంగా సాగింది.
ఏమైనా అమ్మాయికి చిన్న వయసులో పెళ్ళి చేయదలచుకోలేదు. అందుకే దాని డిగ్రీ అయ్యాకే ఆ ప్రయత్నం చేశా. దేవుడి దయవలన అరబ్‌లో నా కొలీగైన ఇంకో ఆమె కొడుకుతోనే సంబంధం కలుపుకున్నా. ఆ సందర్భంగా నిశ్చితార్ధానికి ఈ పెద్దలను మా అమ్మ ద్వారా ఆహ్వానించా.
అప్పుడు వాళ్ళు ‘‘చాల్లే శ్యామలక్కా! అక్కడెక్కడో ఒక ఆడామె ఇంకో ఆమెతో మాట్లాడి… అంతా ఆడపెత్తనం చేస్తే మధ్యలో మేమొచ్చి చేసేదేముంది?’’ అని తిరస్కారంగా మాట్లాడి ఆమెను వెనక్కు పంపారు.
అయినా ధైర్యంగా నిలబడి కావాల్సిన చుట్టపక్కాలను, స్నేహితులను పిలిచి వియ్యాలవారు మెచ్చుకునేలా ఒంటిచేత్తో పెళ్ళిని వైభవంగా చేశా. జరిగిన సంఘటనలు ఒకటొకటిగా మదిలో కదిలాయి.
… … …
‘‘ఏంటే శాంతా ఆ పరధ్యానం? పెద్దవాళ్ళకు బదులు చెప్పవేం?’’ అమ్మ మరో అరుపుతో ఉలిక్కిపడ్డ నేను ప్రస్తుతానికొచ్చి అందరివైపు తాపీగా చూశా.
నా మౌనంలో వారికే అర్థం స్ఫురించిందో గాని మా వారి అన్నయ్య ‘‘ఏరా గిరీ ఇలా రా! వచ్చి నీ భార్యకేం చెప్పాలనుకున్నావో చెప్పు! అలా సిగ్గుపడ్తూ నుంచుంటే ఆమెకెట్లా తెలుస్తుంది?’’ అంటూ కేక పెట్టాడు.
ఆ పిలుపుకి అప్పటిదాకా గుమ్మం బైట నక్కి ఉన్న గిరి బావ ముంగిలా వీథిలోంచి లోనికొచ్చాడు.
కబురెళ్ళినా కూతురి పెళ్ళికి రాని ఆ ప్రబుద్ధుడి వైపు ఎగాదిగా చూశా.
మనిషి ఎండిపోయి గుంటనక్కలాగున్నాడు. గడ్డం పెరిగింది. జుట్టు చిందర వందరగుంది. కళ్ళు పీక్కుపోయున్నాయి. గుడ్డలు మాసున్నాయి. నిలబడటానికి కూడా ఓపిక లేనట్టుంది. అందుకే ఓ మూలకు చేరగిలపడి నావైపొకసారి చూసి… ఆపై మాట్లాడే ధైర్యం లేకేమో తల దించుకున్నాడు. .
అందరూ మమ్మల్నే నిశితంగా గమనిస్తున్నారు.
నాకైతే ఏ భావమూ కలగలేదు. నిర్వేదం, నిర్లిప్తత నన్ను పూర్తిగా కప్పేశాయి. ఏ జ్ఞాపకాల మాటునా అతనిపై ప్రేమ మిగలలేదు. కాదు… కాదు… అతను మిగిలించలేదు. అందుకేనేమో అతనివైపు యాంత్రికంగా చూస్తుండిపోయా.
చాలాసేపు అక్కడ… నిశ్శబ్దమే రాజ్యమేలింది.
ఆపై పెదమామయ్య కలుగజేసుకుని ‘‘ఆఁ! ఏం లేదమ్మాయ్‌! మీ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక… ఆ ఉంచుకున్నది వీడ్ని చూస్తుందా ఏందీ? అందుకే బయటకు గెంటేసింది. వీడా… ఉన్నదంతా పూడ్చి దానికి పెట్టాడాయే! అదేమో… ఆస్తి దొబ్బి, వేరే వాడితో ఉడాయించింది. ఇప్పుడు వీడికా… జబ్బు ముదిరింది. మొత్తానికి పూట గడవని స్థితి. పోనీ… వీడ్ని వాళ్ళన్న దగ్గరకు పంపుదామంటే, అక్కడ వదిన ఒప్పుకోవటం లేదు. అలా వాడు అన్నింటికీ చెడాడు! ఎవరికేది తప్పినా భార్యగా నీకు తప్పదుగా! ఎంత చెడ్డా వీడు నీ పిల్లలకు తండ్రేగా! మరి… మరి… అందుకని వీడి ఖర్చులకు గాను నెలకో మూడువేల రూపాయలు పంపమని నిన్నడగడానికి వచ్చాడమ్మా. తీరా వచ్చాక వెధవ అడగడానికి సిగ్గు పడ్తున్నాడు…’’ అంటూ చమత్కారంగా ముగించాడు.
వెంటనే మా బావ ‘‘అవునమ్మా! ఈ పరిస్థితుల్లో వీడిని ఎవరు దగ్గర పెట్టుకోగలరు? ఒకవేళ… అలా డబ్బులు పంపటానికి ఇష్టం లేకపోతే వీడ్ని అత్తమ్మ దగ్గర పిల్లోడికి తోడుగా పెడదామనుకుంటున్నా. ఏదైనా నీ ఇష్టప్రకారమే చేద్దాం!’’ అని పెద్దరికంగా అన్నాడు. ‘‘ఇప్పుడు నువ్వు తప్ప వీడికి దిక్కెవరూ లేరమ్మా!’’ సంగతి తప్పదన్నట్లు చిన్న మామయ్య నావైపు చూశాడు.
ఇక గిరి బావ గుంట నక్కలా నా నిర్ణయానికై ఎదురు చూస్తున్నాడు.
అంతే! వారి మాటలు, చేతలు నన్నొక్కసారిగా కుదిపేశాయి. మనస్సున మంటలు గుప్పుమన్నాయి. కళ్ళు ఎరుపెక్కాయి.
పాపం! ఇంకా లోకం పురాణ కాలంలోనే పయనిస్తోందని వీరి భ్రమేమో! మగడెన్ని అకార్యాలు చేసినా, బయట వెలయాలితో కులికినా, ఇంటికి రాగానే భార్య అతని కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తలపై చల్లుకోవాలని వీరి ఆలోచనేమో! నా సకల కష్టాలకు కారకుడైన ఓ మగ పురుగుకు సహాయం చేయమని అడగడానికి వీరికెన్ని గుండెలు? ఇదేనేమో మగ ధర్మకంటే?!!
ప్రతీకారానికి పరాకాష్టగా లేచి అందరి గూబ గుయ్యిమనిపిద్దామనుకుంది. నిజంగా ఎంత సిగ్గులేనితనం! వీళ్ళకు మాటలతో సమాధానం చెప్పాలనిపించలేదు. అందుకే చివాలున లేచి నా ఎడమ కాలి బాత్రూమ్‌ స్లిప్పర్‌ను చేతిలోకి తీసుకుని దాన్నటూ ఇటూ తిప్పి చూడసాగాను. అంతే! పెద్దలు ఖంగుతిని బెదురుచూపులు చూస్తున్నారు. గిరి, అతని అన్నయ్యలైతే పరుగులాంటి నడకతో వీథి గుమ్మం వద్దకు జారుకున్నారు. అమ్మ నిర్ఘాంతపోయి నావైపు చూస్తోంది.
నేను మాత్రం మహా తాపీగా చేతిలోని స్లిప్పర్స్‌ను తిరిగి కాలికేసుకుని ‘‘చూడమ్మా! ఈ పే…ద్ద…లు వెళ్ళాక పనిమనిషి చేత వీథి గుమ్మాన్ని ఫినాయిల్‌తో కడిగించు! ఇక కాసేపు నన్ను డిస్ట్రర్బ్‌ చేయొద్దు నిద్రపోవాలి!’’ అని సీరియస్‌గా పడగ్గదిలోకి వెళ్ళి ధబాలున తలుపేసుకున్నా. ఆపై పెద్దలు తోక ముడిచి వెళ్ళిన శబ్దాలు కర్ణపేయంగా వినిపించాయి. మగధర్మం నేటి ధర్మం కాదని ఋజువు చేసినందుకేమో నాకు మహదానందంగా ఉంది.
అందుకే… చాలాకాలం తర్వాత హాయిగా నిద్రపోయా.
(కుమార్తె పర్వీన్‌ బాబీ సహకారంతో…)

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.