అతడు అనేకం – వి. ప్రతిమ

రాయలసీమ రెండవ తరం రచయితల్లో అగ్రగణ్యుడిగా, ప్రముఖ దూర విద్యావేత్తగా, నిత్య పరిశోధకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా, ఉపన్యాసకుడిగా, ముఖ్యంగా తర్వాతి తరానికి దీపదారిగా జాతీయస్థాయిలో సుపరిచితుడైన కేతు విశ్వనాథరెడ్డి గారి హఠాన్మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు.

తీరని లోటు అన్న పదం కేవలం ఆయాచితంగా అంటున్నది కాదు, వాస్తవంగానే ఆయన మరణం మొత్తంగా సీమ సమాజానికే పూడ్చలేని లోటు.
విశ్వనాథ రెడ్డి గారు కడప జిల్లా కమలాపురం తాలూకా రంగసాయిపురంలో జన్మించారు. రంగసాయిపురం వారికి ప్రాణాధికమైన ప్రాంతం. ఆ మాటకొస్తే కడప జిల్లా గ్రామ సీమలతో వారికి అంతులేని అనుబంధం ఉంది.
ఊరిని, మట్టిని ప్రేమించేవాళ్ళు మనుషుల్ని ప్రేమించకుండా ఉంటారా? సమాజాన్ని ప్రేమించకుండా ఉండగలరా?
కడపలో వారికి అజో విభో కందాళం సంస్థ వారి ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం పండుగ జరిగినప్పుడు, సభానంతరం ఆ మరునాడు కొంతమంది మిత్రులను రంగసాయిపురం తీసుకెళ్ళి ఇష్టంగా ఆ ఊరినీ, వారి తల్లినీ చూపించారాయన… అదో ఆనందార్ణవం.
మట్టి చరిత్రను అనుభవంలోకి
తెచ్చిన మా పల్లె పట్టులకు
అనుభూతి చేయించిన మా
అమ్మకూ
అంటూ వారు తన తొలి కథల పుస్తకాన్ని అంకితం చేసిన తీరు అభినందనీయం.
కథ, నవల, సాహిత్య విమర్శ వంటి వివిధ ప్రక్రియల్లో కృషి చేయడమే కాకుండా ఎన్నో అవసరమైన సమీక్షలు, ఎందరో కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ ముందు మాటలు, పత్రికా వ్యాసాలు, మిక్కిలిగా ఉపన్యాసాలు అందించారాయన.
కే సభా, మధురాంతకం రాజారాం వంటి వారు ప్రారంభించిన ప్రాదేశిక సాహిత్య పరంపరని కొనసాగిస్తూ రాయలసీమ జీవనేతి వృత్తాలని, దేశీయ పాత్రలని సరళమైన శైలిలో చక్కటి కడప మాండలికాన్ని అద్ది విస్తారమైన సాహిత్యాన్ని తెలుగు సారస్వతానికి చేర్పు చేశారు విశ్వనాథ రెడ్డి గారు, రాయలసీమ ప్రాతినిధ్య రచయిత…
ఇతర ప్రాంతాలలో ఉన్న ఆధునికతా క్రమం కంటే రాయలసీమలో ఆధునికతా క్రమం భిన్నంగా ఉన్నదన్న, ఆలస్యంగా ప్రారంభమైందన్న, సామాజిక సాంస్కృతిక అవగాహనను కల్పించిన వాళ్ళలో మొదటి వారు ఆయన.
వీరి కథలు పాఠకుడిని చేయిపట్టి సీమ ప్రాంతాలలో ప్రయాణింపచేసి వివిధ పరిణామాలను లోతుగా తడిమేలా చేస్తాయి. ఆయన కథలన్నీ సూక్ష్మస్థాయిలో సీమ సమాజమే… ఆ విధంగా విశ్వనాథ రెడ్డి కథలు సీమ సారస్వత వివేచనని చాలా ముందుకు తీసుకెళ్ళాయని చెప్పాల్సి ఉంటుంది.
వృత్తి రీత్యా వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నప్పటికీ, చివరికి సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కి తరలి వెళ్ళినప్పటికీ, ఆయన తన మూలాలను వదులుకోలేదు. టీచర్‌ అయినా, లెక్చరర్‌ అయినా, ప్రొఫెసర్‌ అయినా, ఉద్యోగ కార్యకలాపాలలో సతమతమవుతున్నప్పటికీ, కడప గ్రామాల దీనస్థితిని, వెనుకబాటుతనాన్ని, సంస్కృతిని రచనలుగా మలచడంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు.
కాలపు చలన సూత్రాలతో పాటుగా ముందుకు నడిచిన విశ్వనాథరెడ్డి, తన కాలపు సంక్లిష్టతలోంచి, ఊపిరాడనితనం లోంచి, తీవ్రమైన ఒత్తిడి లోంచి… అస్తిత్వ ఉద్యమాల రాకడకి ముందే సమాజంలోని అన్ని రకాల అసమానతల పట్ల స్పందించి స్త్రీ చైతన్య కథలు, దళితవాడ కథలు, వర్గ పోరాట కథలు అందించడం చెప్పుకోదగ్గ విషయం.
మనం మన గురించి, మన సమాజం గురించి ఆలోచించే సంస్కృతి నుంచి మనకు తెలియకుండానే దూరంగా జరిగిపోతున్న క్రమంలో ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఒక తాత్విక దృక్పథంతో తెగిపోతున్న భూమి సంబంధాలను, విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాలను, గ్రామీణ జీవన విధ్వంసాన్ని కడప గ్రామ సీమల నేపథ్యం నుండి, ఆ గ్రామాలలోని మట్టి మనుషుల కోణం నుండి కథలుగా మలిచి, సున్నితమైన స్వరంతోనే అయినా కటువుగా సాహిత్యానికి చేర్పు చేసిన మహా రచయిత విశ్వనాథ రెడ్డి గారు… సీమ రచయితలకు ఆయన ప్రాతస్మరణీయుడు… దీపదారి…
ఇదంతా ఒక ఎత్తయితే ఆచార్య చేకూరి రామారావు గారితో కలిసి డాక్టర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భాషా బోధనలో అభ్యుదయానికి అంకురార్పణ చేసి భాషా సాహిత్య బోధనలో ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చారు. ఆయన రూపొందించిన పాఠ్యప్రణాళిక అత్యంత అభ్యుదయకరమైనది, ప్రగతిశీలమైనది.
ఎక్కడెక్కడో ఉండిపోయిన కొడవటిగంటి కుటుంబరావు ప్రామాణిక సాహిత్యాన్ని సేకరించి సంపాదకత్వం వహించి 14 సంపుటాలుగా ప్రచురించిన కేతు అపర భగీరధుడని విజ్ఞుల అభిప్రాయం.
సాహిత్య రంగంలో తుమ్మల సీతారామయ్య బంగారు పతకం నుండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దాకా అనేకానేక పురస్కారాలు వారిని వరించాయి.
పొగడ్తకు పొంగక, తెగడ్తకు కుంగక నిమ్మలంగా ఉండే విశ్వనాథ రెడ్డి గారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు, వారి లోతైన పరిశోధక గ్రంథం కడప గ్రామ నామాలకు ఆలపాటి కృష్ణయ్య, సీతమ్మ పురస్కారం అందడం మరో విశేషం.
అరసం నాయకుడిగా, అభ్యుదయ రచయితగా, సీమ సాహిత్యకారుడిగా, భాషా శాస్త్రవేత్తగా, సంపాదకుడిగా, పరిశోధకుడిగా విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా చింతనాపరుడిగా ఆయన చేసిన నిరంతరాయ కృషి చిరకాలం నిలిచి వెలుగుతుంది.
చాలాసార్లు మనం అనుకుంటాం గానీ విశ్వనాథ రెడ్డి గారు సీమ రచయిత అని… నిజానికి ఆయన జాతీయ రచయిత. ప్రాంతీయమైన ఘటనలు, సందర్బాలు, వైరుధ్యాల నేపథ్యంలో నుండి మొత్తంగా వర్గ సమాజ లక్షణాలను పాఠకుల చేత వీక్షింపచేసిన విశ్వ రచయిత విశ్వనాథ రెడ్డి.
వారికి భూమిక స్త్రీ వాద పత్రిక కన్నీటి నివాళి అర్పిస్తోంది.
వారి కథల్లోని స్త్రీల గురించి మరోసారి ముచ్చటించుకుందాం. `

Share
This entry was posted in గెస్ట్ ఎడిటోరియల్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.