గమనమే గమ్యం – ఓల్గా

విశాలాక్షి తన ఆడంబరాన్నీ, అతిశయాన్నీ చూపించే తీరు శారదకు నచ్చదు. చిరాకు తెప్పిస్తుంది. ఐనా చిన్ననాటి స్నేహం ఒకరకంగా రక్తసంబంధం లాంటిదే. విశాలాక్షిని చివాట్లు పెట్టగలదు శారద. చివరకు వెళ్ళింది. భోజనాలయ్యాక శారద ఇక వెళ్తానంటే…

‘‘ఉండు. నీతో మాట్లాడాలనే పిల్చానివాళ. నువ్వేంటి హిందూకోడ్‌ బిల్లు విషయంలో మరీ విచ్చలవిడిగా మాట్లాడుతున్నావట. సెక్రటరీదాకా వచ్చాయా మాటలు. నువ్వు ఉన్నట్లే అందరూ ఉండాలంటే కుదురుతుందా? అందరినీ నీలా మారమంటావా?’’
‘‘నాలా ఒక్కరు కూడా మారరు విశాలా… అసలు నీ సమస్య ఏంటి చెప్పు?’’
‘‘నా సమస్యా? పెళ్ళిమీద కనీస గౌరవం లేని నిన్ను ఆ కమిటీలో వెయ్యటం. నువ్వందులో మీ చలంగారి సిద్ధాంతాన్ని చొప్పించాలని ప్రయత్నించటం’’ శారదకు విశాలను చూస్తే జాలనిపించింది, చిరాకు వచ్చింది.
‘‘పెళ్ళి అతి పవిత్రం, జన్మజన్మల బంధం, స్వర్గంలో నిర్ణయించబడతాయని నమ్మేవాళ్ళకు ఈ కమిటీలు ఎందుకు? స్వర్గాన్ని నమ్ముకుని ఉండొచ్చుగా. పెళ్ళి… స్త్రీ పురుషుల సంబంధం మానవ సమాజం ఏర్పడిన నాటినుంచీ మానవుల చేత ఎన్నో రకాలుగా మార్చబడిరది. ఆ సంగతి నీకు తెలియకపోతే తెలుసుకో. మార్పులు… కొత్త మార్పులు వస్తాయి. రావాలి. అందరికీ అన్ని అవకాశాలూ అందుబాటులో ఉండాలి. విశాలా, మార్పు అనేది లేకపోతే, స్త్రీల గురించిన ఆలోచనలో, పెళ్ళి గురించిన ఆలోచనలో ఎన్నో మార్పులు రాకపోతే నువ్వివాళ ఇలా ఉండేదానివేనా ఆలోచించు. నీకు అనుకూలమైన మార్పుల్ని ఆహ్వానిస్తావు. అవి నీకు అర్థమవుతాయి. నీకు అనుభవంలోకి వస్తాయి. కానీ మిగిలిన స్త్రీల విషయంలో రావాల్సిన మార్పుల గురించి కనీసం తెలుసుకుందామనుకోవు. నువ్వు చాలా మారాలోయ్‌. నువ్వు చాలా గట్టిదానివి, పట్టుదల గలదానివి. కావలసినవి సాధించుకున్నావు. కానీ అందరూ అలా ఉండరు. బలహీనులు, నీకున్న అవకాశాలు లేనివాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకో. తెలుసుకోలేకపోతే నీ తెలివి, నీ ఉద్యోగం అన్నీ వృధా… వృధా… వృధా.’’ విశాలాక్షి ముఖం చిన్నబోయింది.
‘‘సరేలే, ఆ సంగతులు వదిలేద్దాం. మీ అమ్మాయి ఏం చేస్తోంది?’’ అంది విశాలాక్షి.
‘‘నువ్వు పెద్ద తేనెతుట్టను కదిలించి, మళ్ళీ మెడకు గంధం రాస్తానంటే ఎట్లా విశాలా. మన అభిప్రాయాలు కలవవు. ఏం చేద్దాం? ఆ సంగతి గ్రహిద్దాం. నేను మాట్లాడే విషయాల గురించి నువ్వు సీరియస్‌గా ఆలోచించు. అప్పుడు మనమింకా మంచి స్నేహితులమవుతాం. నీ వల్ల దేశానికి కూడా మేలు జరుగుతుంది’’ అంటూ లేచింది శారద.
ఇంటికి వెళ్ళే దారంతా విశాల తనకు చెప్పదల్చుకున్న విషయం మనసులో జోరీగలా రొద చేస్తూనే ఉంది.
సెక్రటేరియట్‌లో తన గురించి గౌరవం లేదు. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో విశాల పాత్ర కూడా ఉండి ఉండొచ్చు.
దేశ రాజదాని ఢల్లీి… విశాలమైన రోడ్లు, భవనాలు, పార్లమెంటు, దేశ భవిష్యత్తుని నిర్ణయించి శాసించగల కేంద్రం. కానీ ఇది ఒక కుగ్రామం. శాసనాలు మనుధర్మ శాస్త్ర జననాలు… మార్పు సహించని అధికారులు.
ప్రజాస్వామ్యం అర్థం తెలియని వాతావరణం. చట్టాలలోనే కాదు… అవే కాస్త నయం. అవినీతి చాపకింద నీరులా పాకుతోంది. దీనినిలాగే సాగనిస్తే ఏదో ఒకనాటికి ఆ అవినీతి చెదలు పార్లమెంటుని తినేస్తుంది. కుప్పకూల్చేస్తుంది. దీనిని ఆపేదెట్లా.
ఒకసారి నెహ్రుతో మాట్లాడి తన అసంతృప్తి అంతా చెబితే…
ఆయనకు తెలియదా? కానీ తనూ అంతా తెలుసుకుందని ఆయనకు చెప్పటం మంచిది. ఈ పార్లమెంటులో ఎన్నో చేయాలనుకుంది. కనీసపు పనులు కూడా జరగటం లేదు. అవినీతిని ఆపలేకపోవటం దుర్భరంగా ఉంది. దీనికంటే తన పరిధిలో తను డాక్టరుగా, చిన్న చిన్న సంస్కరణల కోసం పని చేసినా ప్రయోజనం ఎక్కువ ఉంటుందనిపిస్తోంది. ఇక్కడకు రాకముందు నెహ్రు సోషలిస్టు విధానాల మీద చిన్నపాటి నమ్మకం ఉండేది. అది కూడా పోతోంది. అది ఆయనతో చెప్పటం నిజాయితీగా ఉంటుంది.
శారద పార్లమెంటు సభ్యురాలై నాలుగేళ్ళయింది. తన నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన కొన్ని పనులు చేయగలిగింది కానీ ఎంతో తేలికగా జరిగే ఆ పనులకు కూడా స్థానిక నాయకుల నుండి ఏవో అభ్యంతరాలు వచ్చేవి. వాళ్ళు కల్పించే ఆటంకాలను దాటటానికే ఎక్కువ సమయం, శక్తి ఖర్చవుతున్నాయి. మగవాళ్ళ అహంకారాలు, ఎంత డాక్టరయినా ఒక ఆడదాని మాట వినాల్సి రావటానికి వాళ్ళు పడే అవస్థలూ చూస్తుంటే శారదకు ఒకవైపు కోపం, మరోవైపు నిరుత్సాహం. తాను ప్రతి విషయాన్నీ చట్టప్రకారం రూల్స్‌ అన్నీ వివరించి చెప్పి ఒప్పించగలుగుతోంది. కానీ రాజకీయాలలో ఆసక్తి ఉండి, పెద్దగా విషయ పరిజ్ఞానం లేని ఆడవాళ్ళను వీళ్ళు బతకనిస్తారా? అసలు రాజకీయాల్లోకి రానివ్వరు. నాయకులుగా ఎదగనివ్వరు. అధికారం అస్సలు ఇవ్వరు. తనకే ఇంత కష్టంగా ఉంటే మామూలు స్త్రీలకింకెంత కష్టం? హైదరాబాద్‌లో సదాలక్ష్మి అసెంబ్లీలో చేసే పోరాటాలు తెలుస్తున్నాయి. ఈశ్వరీబాయి రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలిగా ఎదుగుతున్న తీరు కూడా గమనిస్తోంది. నాయకులుగా ఇలాంటివాళ్ళు వందల సంఖ్యలో రావాలి. అలా వస్తే తప్ప మంచి మార్పులు రావనేది అర్థమవుతోంది. ఇంకొక సంవత్సరం తర్వాత రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని శారదకు అనిపించలేదు. పార్లమెంటులో చేయగలిగింది ఎంత స్వల్పమో అర్థమైంది. పాలసీలు చేయటంలో స్త్రీలపరంగా ఆలోచించే వాతావరణమే లేదు. ఎగతాళి, వ్యంగ్యం తప్ప స్త్రీల సమస్యలను అర్థం చేసుకునేవారే లేరక్కడ. నెహ్రూకి అర్థమయినా ఆయనొక్కడివల్లా ఏమీ జరగదనేది కూడా శారదకు ఈ నాలుగేళ్ళలో తెలిసి వచ్చింది. ఐనా ఒకసారి తన అసంతృప్తిని నెహ్రూతో పంచుకోవాలనిపించింది శారదకు. సమయం కోసం అడిగితే ఆయన కాదనకుండా ఇచ్చాడు.
‘‘స్త్రీలకు రాజకీయాలలో ఇప్పుడున్న చోటు చాలదు. దానికోసం మీరేం చేయబోతున్నారు? ప్రభుత్వ పరంగా పారిశ్రామిక అభివృద్ధికి జరగాల్సిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి ఎందుకు? మిశ్రమ ఆర్థిక విధానంలో ఇంతవరకూ చెప్పుకోదగిన ప్రభుత్వ రంగ సంస్థలు రావటం లేదు. ఏ శక్తులు దానికి అడ్డుపడుతున్నాయో మీకు తెలుసు. ఎందుకలా జరగనిస్తున్నారు?’’ ఇలా ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతూ పోయింది శారద. నెహ్రు సమాధానాలు ఇస్తూనే ఉన్నాడు ఒక రాజకీయ వేత్తలా…
‘‘అన్నీ జరుగుతాయి. సమయం పడుతుంది. స్వతంత్రం వచ్చిన పన్నెండేళ్ళలోనే అంతా మారిపోవటం జరగదు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇపుడిపుడే అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చాం కదా… నిధులు మెల్లిగా వెళ్తాయి. స్త్రీలకు రాజకీయాలలో చోటు తప్పకుండా దొరుకుతుంది.’’
‘‘మిస్టర్‌ నెహ్రూ! మీరు ప్రధానమంత్రినని కాసేపు మర్చిపోండి. ఒక మామూలు మనిషిగా మారండి. పార్లమెంటులో జరుగుతున్న రాజకీయ విధానం మీకు సంతృప్తినిస్తోందా? పెరుగుతున్న అవినీతిని చూస్తుంటే మీకు నిద్ర పడుతోందా? దీన్ని ఎవరైనా కంట్రోల్‌ చేయగలరని మీరు నమ్ముతున్నారా? ఈ ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని మీరనుకుంటున్నారా?’’
‘‘వెల్‌ డాక్టర్‌! ప్రశ్నలడగటం తేలిక. అడిగారు. నన్ను మామూలు మనిషిగా మాధానం ఇమ్మన్నారు. కానీ నేను ప్రధానమంత్రిని. ప్రధానమంత్రిగా నేను మీకు చెప్పదల్చుకున్నదేమిటంటే నేను నిస్సహాయుడిని. నిజంగా నిస్సహాయుడిని. నేను ఇంత నిస్సహాయత్వంలోనూ ఏదో చేస్తున్నాను. ఇంతకంటే చేయలేకపోతున్నాను. రాజకీయాల సంగతి మనం ఒకరికొకరం చెప్పుకోనవసరంలేదు. వీటిని మార్చాలి. ఎలాగో తెలియదు. తోచినది చేసుకుంటూ పోవటం తప్ప మరో మార్గం లేదు. ఒక్కోసారి నాకూ నిరాశ కమ్ముకొస్తుంది. కానీ దేశ నిర్మాణ బాధ్యతను ఒదులుకోలేను. వీటన్నిటిలోంచే మనం పైకి లేవాలి. ఇంతకంటే నేనేం చెప్పలేను.’’
‘‘ఎస్‌ ప్రైమ్మినిస్టర్‌. మీరు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. పురుషులు. అందువల్ల మీకు ఎంతో నిరాశలోనూ ఆశ కన్పించటం సహజం. ఒక స్త్రీగా, పార్లమెంటు సభ్యురాలిగా చెబుతున్నాను. నాకు స్త్రీల పరంగా ఏ ఆశా కనిపించటం లేదు. వెనుకబడిన వర్గాల పరంగా అసలే కనిపించటం లేదు. దుర్గాబాయి రాజకీయాలకు దూరంగా సంస్థలను నిర్మించుకుంటూ ఎందుకు పనిచేస్తోందో నాకిప్పుడు బాగా అర్థమవుతోంది. అలాంటి వ్యక్తులకూ, సంస్థలకూ మీరు సహకరిస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. ఒకటి నేనూ ఒప్పుకుంటాను. మీరు, మరి కొద్దిమంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి. మీరు మీ నిస్సహాయత్వాన్నించి బయటపడాలని కోరుకుంటున్నాను…’’ నెహ్రు గారికి నమస్కారంచేసి వచ్చేసింది శారద.
మళ్ళీ ఎన్నికలొచ్చాయి. శారద వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంది. స్త్రీలకు రాజకీయాలలో పాల్గొనే శిక్షణ అవసరం అనే అభిప్రాయం శారదలో బలపడిరది. సంఖ్యలో కూడా స్త్రీలు శాసనసభల్లో, పార్లమెంటులో బలపడితే గాని వారి పరిస్థితి మెరుగుపడదన్న తన అభిప్రాయాన్ని అన్నపూర్ణతో, సరస్వతితో చర్చించింది. వారూ అంగీకరించారు.
ఇంతలో భారత్‌`చైనాల సరిహద్దు సమస్య, యుద్ధం వచ్చి పడ్డాయి. కమ్యూనిస్టులు చైనాను బలపరుస్తున్నారంటూ ప్రభుత్వం కమ్యూనిస్టు నాయకులను అరెస్ట్‌ చేయటం మొదలుపెట్టింది.
శారద ఆందోళన పడటం తప్ప ఏమీ చేయలేని తన పరిస్థితికి విచారపడుతూనే అవసరంలో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలకు తను చేయగలిగిన సాయం చేస్తూ వచ్చింది.
కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న విభేదాలను గురించి ఎవరో ఒకరు చెబుతూ ఉండేవారు.
ప్రజల సమస్యల పట్ల కాకుండా రష్యా, చైనా మార్గాలంటూ అంతంత విభేదాలు సృష్టించుకోవటం వల్ల పార్టీ చాలా నష్టపోతుందనిపించేది.
నాయకులందరి స్వభావాలూ శారదకు బాగా తెలుసు. అందువల్ల ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోననే ఆందోళన కూడా ఆమె మనసులో పెరుగుతోంది. అన్నపూర్ణ శారద ఆందోళనను చాలా తేలిగ్గా తీసివేసేది.
‘‘వాళ్ళు నిన్ను ఒద్దనుకున్నారు. నువ్వూ వాళ్ళను ఒదిలేశావు. ఇంకా ఆ పార్టీ గురించి అంత ఆందోళన పడతావెందుకు?’’ అని విసుక్కునేది.
‘‘నేనేమిటి అనేది కాదు అన్నపూర్ణా… దేశ భవిష్యత్తు గురించి మనం నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. కమ్యూనిస్టు పార్టీ పొరపాట్లు చెయ్యొచ్చు. పనిచేసేవాళ్ళే గదా పొరపాట్లు చేస్తారు. కానీ కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇవాళ కాకపోతే రేపు… మరొక రోజు… ప్రజలు కమ్యూనిజంలోని మంచి గ్రహిస్తారు. కానీ పార్టీ బలహీనమైతే, గందరగోళపడితే దేశానికి చాలా నష్టం. ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షమే కదా అసలైన ఆక్సిజన్‌. కమ్యూనిస్టులు బలమైన ప్రతిపక్షంగా ఉండాలి. హిందూకోడ్‌ బిల్లు ఈ మాత్రంగా వచ్చిందంటే అది కమ్యూనిస్టుల వల్లే. ప్రజా అనుకూల చట్టాలు వస్తున్నపుడు వాటిని మరింత అనుకూలంగా మార్చే పని ఎవరు చేస్తారు? ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గొంతులు ఎవరు విప్పుతారు? కమ్యూనిస్టులు తప్ప. వాళ్ళలో వాళ్ళు తగవులు పడుతూ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, ఉద్యమాలు నిర్మించకుండా పోతే ఎలా. నాకు చాలా ఆందోళనగా ఉంది. బి.పి. పెరిగిపోతోంది. ఇంకోవైపు నెహ్రు గారి ఆరోగ్యం సున్నితంగా ఉంది. చైనా యుద్ధం ఆయనను కుంగదీస్తోంది.’’
‘‘అదంతా నిన్ను కుంగదీస్తోంది. శారదా… మరీ ఎక్కువ ఆలోచించకు.’’
‘‘ఆలోచించకుండా ఎట్లా… అసలు సాధ్యమా. ఆలోచించటం కాదు సమస్య. ఆలోచించి దాన్ని కార్యరూపంలో పెట్టలేకపోవటం. చాలా ఒంటరిగా అనిపిస్తోంది అన్నపూర్ణా…’’
శారద ఆవేదన అర్థం చేసుకోగలిగేది అన్నపూర్ణ, సరస్వతులే.
ఒకోసారి వాళ్ళూ నిరాశలో కూరుకుపోయేవారు.
‘‘ఏంటో… స్వాతంత్య్రం రాకముందు ఎన్ని కలలు కన్నాం. ఇపుడు కలలు కూడా లేకుండా పోయాయి’’ అనేది అన్నపూర్ణ.
అపుడు శారద ఉత్సాహం తెచ్చుకునేది.
‘‘నాకు బోలెడు కలలున్నాయి. ఆ కలలో కోసమే ఈ జీవిత ప్రయాణం. ప్రయాణం చేస్తున్నంతసేపూ దిగులు పడటానికేమీ లేదోయ్‌. ఏం సాధించామంటే ఇంత దూరం ప్రయాణించటమే…’’
‘‘గమ్యం అంటూ లేకుండా…’’
‘‘గమ్యం ఒకటుండి అక్కడికి చేరుకోవటంతో ప్రయాణం ఆగిపోతుందనుకుంటే పొరపాటోయ్‌. గమ్యాలు అనంతాలు. ఒకటి చేరుకుంటే మరొకటి ఎదురు చూస్తుంటుంది మనకోసం. మనం నడుస్తూనే ఉండాలి. ఆగిపోకూడదు. ఆగిపోయామా… ఇంకేముంది…’’ అనేది శారద.
దేశ విభజన చేసి సరిహద్దులలో, రెండు దేశాల ప్రజలలో ఒక ఆరని చిచ్చు రగిల్చి వెళ్ళిన బ్రిటిష్‌ వారి దుర్మార్గాన్ని అర్థం చేసుకోగలం. కానీ భారత్‌, చైనా సరిహద్దుల మధ్య యుద్ధాన్ని అర్థం చేసుకోవటం ఎలాగో చాలామందికి అర్థం కాలేదు. ఒక సోషలిస్టు దేశం దురాక్రమణ చెయ్యదనే వాదంతో కొందరు కమ్యూనిస్టులు ముందుకు వచ్చారు. మరికొందరు దాన్ని అంగీకరించలేకపోయారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విభేదించేవారు, ఏకీభవించేవారు దాదాపు రెండు గ్రూపులుగా విడిపోయారు.
యుద్ధ ప్రపంచంలో దేశభక్తి ఉప్పొంగటం సహజం. కొందరిని దేశద్రోహులుగా ముద్ర వేసినపుడు దేశభక్తి మరింత నిరూపితమవుతుంది. అనేకమంది కమ్యూనిస్టులు దేశద్రోహులుగా జైళ్ళపాలయ్యారు.
స్వరాజ్యం భర్త అరెస్టయ్యాడు. స్వరాజ్యం ఉద్యోగం కూడా ప్రమాదంలో పడిరది. కాలేజీలో సెలవుపెట్టి బెజవాడ వచ్చేసింది స్వరాజ్యం. ఈ యుద్ధం, ఈ అలజడి, ఈ అరెస్టులు స్వరాజ్యానికంతగా అర్థం కాలేదు. శారదాంబ స్వరాజ్యాన్ని ఓదార్చింది కానీ ఆమె మనసూ అలజడితో, అశాంతితో నిండిపోయాయి.
సోవియట్‌ యూనియన్‌, చైనా రెండు సోషలిస్టు శిబిరాలుగా ఏర్పడి ప్రపంచ ప్రజలను మంచికో చెడ్డకో ప్రభావితం చేయబోతున్నాయని ఆమెకు అర్థమయింది గానీ అది మింగుడు పడలేదు. అంధకారంలోని ప్రజలకు ఆశాదీపాలనుకున్నవి ఇలా మారిపోవటం ఏమిటన్న ప్రశ్నకు ప్రపంచ రాజకీయ అధ్యయన వేత్తలు ఏవో విశ్లేషణలు చేసి సమాధానాలు చెప్పవచ్చు. కానీ ప్రపంచాధిపత్యపు పోరులో సామాన్య ప్రజలు ఏమవుతారో పట్టించుకునేవారు లేకపోవటం విషాదం. ఆ విషాదం శారదాంబ మనసునిండా ముసురులా పట్టేసింది. సోషలిస్టు శిబిరంలో ఆధిపత్యం కోసం పోరులో సోషలిస్టు, కమ్యూనిస్టు విలువలన్నిటినీ కోల్పోతే ఈ ఆధిపత్యం దేనికోసం? ఇన్ని ఉద్యమాలు, ఇన్ని యుద్ధాలు, ఇన్ని బలిదానాలు ఏ ప్రపంచం కోసం చేశారో ప్రజలు… ఆ ప్రపంచం కేవలం ఒక కల అనే చేదు నిజం మింగడం ఎలా? ఆశ దేనిపైన పెట్టుకోవాలి? నిరాశ నుంచి ఎలా తప్పుకోవాలి. నిరాశలో మునిగిపోకుండా ఏ ఆధారాన్ని పట్టుకోవాలి? దీన్నంతా తట్టుకునే గుండె నిబ్బరం ఎక్కడనుంచి తెచ్చుకోవాలి?
శారదాంబ కమ్యూనిస్టు పార్టీలో లేకపోయినా జాతీయంగా, అంతర్జాతీయంగా వారి సిద్ధాంతాలలో, కార్యాచరణలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఉంది. స్టాలిన్‌ మరణించిన తర్వాత కృశ్చెవ్‌ అధికారంలోకి వచ్చి స్టాలిన్‌పై చేసిన ఆరోపణలు, శాంతియుత పరివర్తన ద్వారా కొన్ని దేశాల్లో సోషలిజం రావచ్చంటూ సోవియట్‌ పార్టీ చేసిన తీర్మానం అన్నిటినీ శారద ఆసక్తితో గమనిస్తూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవించిన కష్టాలు, నష్టాలు మొత్తం దేశం తల్లకిందులై మళ్ళీ కుదుర్చుకోవటానికి ప్రజలు చేయవలసి వచ్చిన త్యాగాలు, వీటన్నిటి ప్రభావం కావొచ్చు సోవియట్‌ యూనియన్‌ ప్రపంచ శాంతి మీద ప్రధానంగా కేంద్రీకరించి మాట్లాడుతూ, మిలటరీ పరంగా బలపడుతూ వస్తోంది. చైనా పార్టీ దీనినంగీకరించటానికి సిద్ధంగా లేదు. దేశాలకు స్వాతంత్య్రం, జాతులకు విముక్తి కలగకుండా శాంతి ఎలా సాధ్యమని వాదిస్తోంది. సామ్రాజ్యవాద దేశాలపై యుద్ధం తప్ప సామరస్యం ఎలా కుదురుతుందంటోంది? స్వరాజ్యానికి ఈ రాజకీయాలను వివరించే క్రమంలో శారదకు అసలు సమస్య ఆధిపత్యం అని తోచింది. ఆధిపత్యానికి ఎవరూ… కమ్యూనిస్టులతో సహా ఎవరూ మినహాయింపు కాదని లీలగా అనిపించేసరికి భయమెరుగని శారదకు ఏదో భయం ఆవహించింది. తాత్వికంగా ఈ ఆధిపత్య భావన గురించి భయం కలిగినపుడే, భౌతిక ప్రపంచంలో శారద ఏ రెండు విషయాల గురించి భయపడుతుందో ఆ రెండూ జరిగిపోయాయి.
మే నెలలో నెహ్రు మరణించారు.
జులై నెలలో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలటం ఖాయమైంది.
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అవలీలగా తట్టుకున్న శారద ఈ రెండు పరిణామాలనూ తట్టుకోలేకపోయింది.
ఆమె హృదయం మీద నేరుగా పనిచేశాయీ సంఘటనలు.
ఈ చీలికలు ఇంతటితో ఆగవని కూడా ఆమెకు అర్థమవుతోంది.
భర్త జైలుపాలవటంతో స్వరాజ్యం పూర్తిగా నిరాశపడుతూ, డిప్రెషన్‌లోకి వెళుతుందేమో అన్న భయంతో అన్నపూర్ణ మనవరాలు అరుణజ్యోతిని తన దగ్గర ఉంచుకుని స్వరాజ్యాన్ని శారద దగ్గరికి పంపింది. శారద ఆమెకు హాస్పిటల్‌లో చిన్న చిన్న పనులు అప్పగించేది. భర్తలు జైలుపాలై ఆర్థికంగా చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలను ఆదుకోవటానికి తాను ఎవరికీ తెలియకుండా చేసే సహాయాలను ఇపుడు స్వరాజ్యం ద్వారా చేయిస్తోంది. ఇద్దరూ కలిసి పుస్తకాలు చదువుకునే సమయం ఎలాగూ ఉంది. ఏం చేసినా స్వరాజ్యం ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు.
శారదలో అప్పుడే మొలకెత్తుతున్న ఆధిపత్యం అనే తాత్త్విక భావనను అందుకోవటం స్వరాజ్యానికి కష్టమే అవుతోంది.
‘‘నిన్ను నువ్వు ఆధిపత్యాన్ని అమలు చేసే పరికరంగా వాడుకుంటావా? ఆధిపత్యం సృష్టించిన ఒక వ్యక్తిగానో, శక్తిగానో పనిచేస్తావా? లేక దానినుంచి స్వేచ్ఛ కోసం స్ట్రగుల్‌ అవుతూ, ఆ స్ట్రగుల్‌ జీవితమంతా చేస్తూ, నిరంతరం దాని కోసమే జీవిస్తూ, ప్రతిక్షణం నిన్ను నువ్వు బతికించుకోటానికి, వికసింపచేసుకోటానికి చేసే ఆ పోరాటమే జీవిత గమ్యమనుకుంటావా?’’ శారద తనను తాను రాపిడి పెట్టుకుంటూ, మెదడుని మండిరచుకంటూ మాట్లాడే మాటలు విని
‘‘పెద్దమ్మా… నాకేం అర్థం కావటం లేదు. ఆధిపత్య పరికరాన్నా నేను? అదేంటి’’ అని అడిగేది నిస్సహాయంగా.
‘‘నీకు వివరంగా చెప్పలేకపోతున్నా గానీ మానవులందరిలో ఈ ఆధిపత్యమనే క్రిమి చేరిపోయిందమ్మా. ఇన్ని వేల సంవత్సరాల మానవ పరిణామంలో, రాజ్య విస్తరణ కాంక్షలలో వర్ణ, వర్గ సంరక్షణ విధానాలలో, స్త్రీల అణచివేతలో ఈ ఆధిపత్యం కరడుగట్టి మానవులలో ప్రవేశించిందనిపిస్తోంది. ఇతరుల మీద ఒక ఆధిపత్యం నెరపకపోతే మనుషులు బతకలేరా?
ఆధిపత్యం సాగించాలంటే స్వేచ్ఛ కోరే మనుషులుండాలి కదా? స్వేచ్ఛను కోరకుండా బానిసలైన వాళ్ళమీద అమలు చేసే ఆధిపత్యం మళ్ళీ తృప్తినివ్వదు. స్వేచ్ఛా కాంక్ష రగులుతుంది. ఆ కాంక్ష
ఉధృతమై పోరాటాలూ, ఆ పోరాటాలలో మళ్ళీ ఆధిపత్య సంస్కృతి… దానిమీద తిరుగుబాటు… బైటి శత్రువు, లోపలి శత్రువు… కానీ బైటి శత్రువుని గుర్తించటం తేలిక, లోపలి శత్రువుని గుర్తించటం కష్టం…’’
శారద ఆలోచనల ధాటికి ఆమె గుండె తట్టుకోలేక పోతోంది.
స్వరాజ్యం తన నిరాశను మర్చిపోయి శారద శరీరంతో, మెదడుతో చేస్తోన్న కఠోర పరిశ్రమను తగ్గించాలని చూసేది.
‘‘పెద్దమ్మా నువ్వు చాలా అశాంతి పడుతున్నావు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా అశాంతి వేరు. కానీ నీ అశాంతి నిన్ను తినేస్తోంది పెద్దమ్మా. అంత ఆలోచించకు. సినిమాకు వెళ్దామా ఇవాళ?’’
‘‘పలాయనం వైపు ప్రయాణం కాదు నాది’’ అంటూనే ఆలోచనల్లో మునిగిపోయేది. ఆమెను ఆ ఆలోచనల నుండి రక్షిస్తోంది సామాన్య ప్రజలు. తమ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చే మామూలు స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, రకరకాల బాధల్లో ఉన్నవారు. వారి సమస్యలు ఎలాగైనా పరిష్కరించి వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడాలనే కాంక్ష ఆమె జీవన తత్త్వ కాంక్ష. ఆ పనులలో ఈ ఆలోచనలకు కొంత అంతరాయం కలిగేది. రాత్రిళ్ళు మాత్రం పుస్తకాలు, చర్చలు, ఆవేశాలు, అశాంతులు, అలసటలు.
సూర్యం కూడా అక్కను చూసి భయపడుతున్నాడు.
‘‘మా నాన్న కూడా చరిత్రకు సంబంధించిన పరిశోధనల్లో మునిగి, ఆ ఆలోచనల తీవ్రతతోనే అనారోగ్యం పాలయ్యాడు. ఆయన గుండె బలహీనమయింది. మళ్ళీ ఇప్పుడు అక్కను చూస్తుంటే భయంగా ఉంది. స్వరాజ్యం నువ్వు మీ అమ్మాయిని తీసుకురా. పిల్లలతో ఆటలతో కాలం గడిపితేనన్నా ఇవన్నీ కాస్త వెనకపడతాయేమో’’ అనటంతో అరుణజ్యోతి భవిష్యత్‌ దీపంలా ఆ ఇల్లు వెలిగింది. శారద, స్వరాజ్యం మళ్ళీ నవ్వుతున్నారు. శారద ఇంట్లో ఉన్నంతసేపూ ఆమె కళ్ళముందు పిల్లలుండేలా చేస్తున్నాడు సూర్యం.
ఆ రోజు ఎవరో విద్యార్థి శారద కోసం వచ్చాడు. శారద ఆ పిల్లవాడు చెప్పేది ఓపికగా విన్నది. కాలేజీ ఫీజు కట్టడానికి ఆ కుర్రాడికి సమయానికి డబ్బు అందలేదు. డబ్బు సమకూర్చుకుని వెళ్ళేసరికి సీటు లేదన్నారు. సంవత్సరం వృధా అవుతుందనే వ్యధతో ఏడుస్తున్న ఆ కుర్రవాడికి ఎవరో డాక్టర్‌ శారదాంబ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ అబ్బాయిని తీసుకుని ప్రిన్సిపాల్‌తో మాట్లాడదామని వెళ్ళింది శారద.
‘‘డబ్బు అందటంలో ఒక్కరోజు ఆలస్యానికి ఒక సంవత్సరం వృధా కావటమేంటి? ఈ అబ్బాయిని కాలేజీలో చేర్చుకోండి’’ అంది శారద. ప్రిన్సిపాల్‌ ససేమిరా కాదన్నాడు. ఆ అనటంలో అతను కనబరచిన అహంభావం, అధికార దర్పం, అమానుషత్వం శారద హృదయాన్ని కలచివేశాయి. బాధ, అవమానం, కోపంతో ఆమె బైటికి నడిచింది.
‘‘మరో కాలేజీలో సీటు దొరకక పోదు. ప్రయత్నిద్దాం. రేపు రా’’ అని తను ఇంటికి వెళ్ళింది.
రూల్స్‌, వాటిని దాటకూడని కంట్రోళ్ళు, వాటి అమలుపై అధికారం, అది ఆధిపత్యంగా మారి మానవత్వాన్ని సంహరించటం… ఒక చిన్న ఘటన ఎంత తాత్త్విక భావననైనా రగిలించవచ్చు.
తప్పులు, నేరాలు, క్రమశిక్షణలు, శిక్షలు, ఆధిపత్యం ఆ కళాశాల అధికారి మాటల్లో శారదకు విశ్వరూపంలో కనిపించింది.
మనిషిపై మనిషి చేసే, అమలు చేయాలని చూసే ఆధిపత్యం కూడా యుద్ధమే. ఈ యుద్ధానికి ఆయుధాలు, సైన్యాలు, ట్యాంకర్లు, బాంబులు, విమానాలు అక్కర్లేదు. ఇది యుద్ధమని ఎవరికీ తెలియదు. యుద్ధపు తీరుల గురించి, యుద్ధ విన్యాసాల గురించి, యుద్ధ ఫలితాల గురించి ఎవరూ చర్చించరు. నిశ్శబ్దంగా, రహస్యంగా జరిగే యుద్ధం సమాజం లోలోపల దాగిన ఈ ఆధిపత్యం. ఐతే ఆ నిశ్శబ్దం అప్పుడప్పుడూ బద్దలై అనేక చోట్ల సంఘర్షణలు రేపుతుంది. సాంఘిక వ్యవస్థల్లో, ఆర్థిక అసమానతల్లో, జాతుల్లో, మతాల్లో, రంగుల్లో, రూపుల్లో, భాషల్లో, ప్రాంతాల్లో, మన లోపలి లోతుల్లో ఆ సంఘర్షణలు బద్ధలై, ఆ రహస్య నిశ్శబ్ద యుద్ధం ఒకనాడు బహిరంగమవుతుంది. విస్ఫోటనం. విలయం. మనిషి మరింతగా చచ్చి, అమానవులు మరింత బలవంతులై, ఆధిపత్యం మళ్ళీ రహస్యమై…’’ స్వరాజ్యం ఆ రోజు శారదను ఆపలేకపోయింది. ఎంతోసేపు ఆ విషయం మాట్లాడుతూనే ఉంది.
శారదాంబ ఆ రోజు భోజనం చేయలేకపోయింది. సూర్యం, నటాషా, స్వరాజ్యంలు బలవంతంగా కూర్చోబెట్టారు. పద్మ పక్కనే కూర్చుని తినిపించింది. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకుని అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు. స్వరాజ్యం శారద దగ్గరకు వచ్చింది.
‘‘పెద్దమ్మా నువ్వివాళ చాలా అన్‌రెస్ట్‌గా ఉన్నావు’’ అంది పక్కన కూచుంటూ. శారద నవ్వింది.
‘‘ఊ… నిజమే. ఆ ప్రిన్సిపాల్‌ వ్యవహారం ఎన్నో ఆలోచనలు రేపింది.’’
‘‘ఆధిపత్యం గురించేనా?’’
‘‘ఔను. నా ఆధిపత్యం గురించి కూడా… చాలా ఆలోచించాను. కానీ ఇపుడు చాలా ప్రశాంతంగా ఉంది స్వరాజ్యం. ఈ మధ్య కాలంలో సమాజం గురించి, మార్పు గురించి, మన జీవిత ప్రయాణాల గురించీ ఎన్నో సందేహాలు. ఇప్పుడు నాకంతా స్పష్టంగా ఉంది. మనం పోరాడుతామా, బానిసత్వంలోకి జారిపోతామా అనేది మనం మనుషులుగా ఉన్నామా లేదా అనేదానికి గుర్తు. స్వరాజ్యం… ఆధిపత్యం ఒక్కచోట ఒక్క రూపంలో లేదమ్మా. అన్నిటినీ గుర్తించాలి మనం. మనతో సహా…’’
వెలుగుతున్న శారదాంబ కళ్ళు చూస్తుంటే స్వరాజ్యానికి ఆ తేజస్సు చూసి భయం వేసింది.
‘‘పెద్దమ్మా! నువ్వింక నిద్రపో. నాకూ నిద్రొస్తోంది’’ అంటూ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళింది.
సూర్యంతో ఏదో చెప్పాలనిపించింది కానీ ఎందుకో ఒద్దనుకుని, పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది.
మర్నాడు ఉదయం నెమ్మదిగా స్నానం ముగించి ‘‘నిద్రలేని రాత్రివల్ల వచ్చిందా ఇంత బలహీనత, ఈ నీరసం’’ అనుకుంటూ నాలుగడుగులు వేసిన శారదాంబ కుప్పకూలిపోయింది. సూర్యం, నటాషా పరిగెత్తుకు వచ్చి లేపుతుంటే సూర్యానికి అర్థమైంది అక్క ఇక లేదని. అతనికి స్పృహ తప్పింది. స్వరాజ్యానికి అంతా అయోమయంగా ఉంది. నటాషా, పద్మలకు ఏమీ అర్థం కాలేదు.
క్షణాల్లో బెజవాడంతా శారదాంబ ఇంటి ముందు ఉందా అన్నట్లయింది. అందరి కళ్ళూ కన్నీళ్ళతో మసకబారాయి. ఆధునిక స్త్రీనని గర్వించిన కళ్ళు ఆధునికతలోని ఆధిపత్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో మూతబడిపోయాయి.
` సమాప్తం

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.