మన సమాజంలో పెళ్ళి అనేది ఒక undeniable విలువ అయిపోయింది. ఒక మనిషికి మరొకరు, వారికి పిల్లలు… ఇదీ లెక్క. జనాభా లెక్కల నుండి ఆసుపత్రిలో అడ్మిషన్ వరకు కుటుంబానికుండే లీగల్ స్టేటస్‌లో బలం మరెక్కడా లేదంటే తప్పు కాదేమో.
పెళ్ళి కానివారు, పెళ్ళయి విడిపోయిన వారు, పెళ్ళి అయినట్లే ఉండి ఒకరితో మరొకరికి సంబంధం లేనివారు,
పెళ్ళి చేసుకున్నా మరొక తోడును వెతుక్కుంటూ వెళ్ళిపోయినవారు,
పెళ్ళి వద్దనుకున్నవారు,
తోడులేని వారు, అసలు తోడే వద్దను కున్నవారు,
భాగస్వామి చనిపోయిన వారు, భాగస్వామి అందుబాటులో లేనివారు…
ఒంటరి అన్న మాట కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిందే కదా! కుటుంబంలో ఒంటరులు, ఒంటరితనాన్ని అనుభవించని స్వతంత్రులు… ఈ రెండిరటికీ తేడాను అర్థం చేసుకోవాలి కదా. కేవలం కుటుంబం లేదన్న కారణానికే ఒక వ్యక్తిని ఒంటరి అని ఎలా అనేస్తాం? పైగా ఆ ఒంట రితనం కావాలనుకునే ఎంచుకున్నదైతే?
వీరంతా ఒంటరులా? లేక స్వతంత్రులా?
జీవితాలలో మార్పులొచ్చాయి. ఎంపికలో మార్పులొచ్చాయి. జీవన శైలిలో మార్పులొచ్చాయి.
కానీ వ్యవస్థ? ఈ మార్పులకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామా?
… … …
నిజమే, కుటుంబం వలన ఒకరి ప ట్ల ఒకరికి బాధ్యత ఉంటుంది. ఒకరి క్షేమం, భద్రత పట్ల మరొకరికి జవాబుదారీతనం ఉంటుంది. స్నేహితుల మధ్య అక్కర ఉంటుందేమో! కానీ జవాబుదారీతనం లేనప్పుడు బాధ్యతలను ఎలా నెరపగలము?
అంతేకాదు కుటుంబం కలిసి ఉన్నప్పుడు ఆర్థికమో లేక ఆరోగ్యమో… ఈ కష్టనష్టాలను పంచుకోవడమే కాదు, నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతాము. స్నేహితుల మధ్య అటువంటి వెసులుబాటు ఎక్కడ?
వ్యవస్థకు ఎదురెళ్ళి కొందరు, వ్యవస్థలో ఇమడలేక కొందరు, వ్యవస్థ చోటివ్వక కొందరు స్వతంత్రంగా జీవిస్తారు. నా జీవితం, నా స్వేచ్ఛ అనే విశృంఖల బావు టాను ఎగురవేసిన యువతను ఒంటరి మహిళలుగా చిత్రీకరించే సమయాల్లో, పిల్లలు విదేశాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటారా? మొన్నటి కరోనా కాలం గుర్తుకు వస్తుందా?
సరే, ఇవన్నీ నగరాల్లోని ఫస్ట్ వరల్డ్ మిసెరీస్ అనుకుందాం. పల్లెటూర్లలో శ్రామిక వర్గాలలో ఏమవుతోంది? వీరంతా స్వతం త్రులు కారా? ఈ ఒంటరితనపు ఎంపిక ఒక్క నగరాల్లోనే కాదు, ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న ఆడవారందరిలో రెపరెపలాడే జ్యోతిలా ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది.
ఇంకొంత కాలంలో మహిళ కుటుంబాలలో ఇమిడేది తనను భరించగలిగే భర్త కోసం కాదు, తన సంతోషానికి తావిని తీసుకురాగలిగిన చెలిమి కోసమే అని నమ్మడమే మిగిలి ఉంది. ఈ జ్ఞానాన్ని పొందిన మహిళ ప్రస్తుతం కుటుంబ వ్యవస్థను బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదు.
కానీ కుటుంబంలో ఉన్న సౌకర్యం, భద్రత వేరే కదా.
అయితే ఒంటరి వ్యక్తులకు ప్రేమికులుండరా, బంధువులుండరా లేక పిల్లలు ఉండరా? వారి వ్యక్తిగత ఆత్మీయ సమావేశాలుండవా? ఉన్నట్టుండి ఆరోగ్య సమస్య వచ్చి ఒక మేజర్ ఆపరేషన్ కోసం మెడికో లీగల్ డాక్యుమెంటరీ సంతకం చేయాలంటే, ఆ సంతకం చేసే అర్హత ఉన్నవారెవరు?
ఒకవేళ ఆసుపత్రిలో ఉంటే, లేక ఉన్నట్టుండి చనిపోతే, మన పిల్లల సంగతేంటి!
కొంతమంది విషయంలో అయితే వారి పుస్తకాలు, హార్ట్ డిస్కుల సంగతేంటి? దాచుకున్న డబ్బులు లేక ఆస్తుల సంగతేంటి? వారి శరీరమూ, అవయవాల సంగతేంటి? ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ అమలు చేసేది ఎవరు? వారికున్న హక్కులేంటి?
… … …
కాబట్టి అక్కలూ… స్వతంత్ర బావుటాను ఎగరేసిన స్వయంభువులూ…!!
వ్యవస్థ ఇంకా ఈ మార్పులను గుర్తించలేదు. తోడు ఒకరు లేకున్నా అది కూడా భాగ్యమే అని తెలుసుకోవట్లేదు. మరి మన సంగతేంటి?
సామూహిక జీవనం, ట్రస్టు, కమ్యూనిటీ హోమ్స్, లాయర్లతో భేటీ, హెల్త్ ఇన్సూరెస్సులు, డిఎన్‌ఆర్ స్టేట్‌మెంట్లు, మన తరపున నిర్ణయం తీసుకోగలిగే ఆ నలుగురినీ పుట్టుకను, జీవితాన్నే కాదు, అనారోగ్యాన్ని, మరణాన్ని ప్రణాళికతో ఎదుర్కోవలసిన అవసరమున్నది.
వ్యవస్థాపిక నిర్మాణానిదేముంది… సినిమా ఆఖరున పోలీసులొచ్చినట్లు దాని మార్పులతో అది ఆఖరున వచ్చే తీరుతుంది.
అందాకా భద్రం మరి.