‘‘ఎవరైనా నామీద ఇంత గుడ్డ కప్పండి ప్లీజ్’’ కాల్ సెంటర్‌లో నైట్‌డ్యూటీ పూర్తిచేసుకుని స్కూటీ మీద ఇంటికొస్తున్న నాకు సిటీలో సైడ్ రోడ్‌లో పక్కనున్న ఫుట్‌పాత్ మీద నుంచి కీచుగొంతుతో వచ్చిన అభ్యర్థన వినబడిరది. స్కూటీ దిగి అటుగా వెళ్ళాను.
నా మెదడు క్షణం స్పృహ కోల్పోయింది.
అక్కడ… నైచ్యానికి పరాకాష్ట చూశాను నేను.
అమానవత్వానికి చిరునామా కన్పించింది. స్ట్రీట్ లైట్ల గుడ్డికాంతిలో వేకువన నాలుగు గంటల సమయంలో ఒక మహిళ రెండు కాళ్ళు పొట్టలోకి ముడుచుకుని సిగ్గుతో కుంచించుకుపోయిన తన ముఖాన్ని, శరీర సౌందర్యాన్ని మోకాళ్ళ మధ్య దాచుకుని కూర్చొని ఉండడం కన్పించింది. ఆమె ఒంటిమీద ఒక్క నూలు పోగు కూడా లేదు.
నా పాదాల శబ్దానికి తలెత్తి చూసిన ఆమె కళ్ళల్లో అవమానభారం… జనవరి మాసం చలిలో కూడా ఒంటి నిండా స్వేదం, కంపిస్తున్న శరీరం. క్షణం తర్వాత ఆమె కంటి చూపులో అవమానం తగ్గి అభ్యర్థన చోటు చేసుకుంది.
‘‘నా స్త్రీత్వాన్ని కాపాడండి’’ అన్నట్టుంది కన్నీటి చెమ్మలో ఆ నిస్సహాయమైన చూపు.
అటూ ఇటూ చూశాను, అన్నీ షాపులే. ఇంకా తెరవలేదు. నా పర్సులో డబ్బులున్నాయి. కానీ అవి ఆమెకు అవసరం లేదు. ఆమెకు కావాల్సింది తనని తాను దాచుకోవడానికి ఇంత బట్ట.
దురదృష్టం… ఈ రోజు నేను ప్యాంట్, టాప్ వేసుకున్నాను. చుడీదార్ వేసుకునుండుంటే చున్నీ అన్నా కప్పేదాన్ని.
నేను స్పృహ తెచ్చుకున్నాను.
‘‘దామ్మా… నా చాటుగా నడువు. ఈ పక్కనే కొత్తగా అపార్ట్‌మెంట్ కడుతున్నారు. అందులో కాసేపు దాక్కో. నేను ఇంటికెళ్ళి చీర తెస్తాను.’’
‘‘చీకటి గుహలా ఉన్న కొత్త కట్టడం మెట్ల కింద, నా సెల్‌ఫోన్ టార్చ్ కాంతితో కూర్చోబెట్టి వెనక్కు తిరిగాను.
‘‘త్వరగా వస్తారా? ఇక్కడకు వర్కర్స్ ఎవరన్నా వస్తారేమో!’’ భయంగా చూసిందామె.
పాతిక సంవత్సరాలు కూడా ఉండవు. ఎంతటి కష్టం వచ్చింది ఆ పిల్లకు!
‘‘అప్పుడే రారులే నేను త్వరగా వచ్చేస్తాను.’’
‘‘నేను ఇలా నడుచుకుంటూ రావడం ఎవరైనా చూశారో ఏమో!’’ దిగులుగా గొణుక్కుంది ఆ అమ్మాయి.
‘‘ఇలా ఎందుకు జరిగింది?’’ అడిగేసి నాలుక కరుచుకున్నాను. అలాంటి ప్రశ్న అడిగే సందర్భమా ఇది?
‘‘నన్ను బలవంతంగా తాగించి… నా శరీరాన్ని మలినం చేసి ఇక్కడ పడేసినట్టున్నారు’’ గొంతులో దుఃఖం అడ్డుపడి క్షణం ఆగిందామె.
‘‘కిరాతకులు నా శరీరాన్ని దోచారు. నా బట్టల్ని కూడా దోచుకోవాలా?’’ ఆమె ఇక ఆగలేక ఏడ్చేసింది. ఆ క్షణంలో నేను ఏకైక ఆత్మీయురాలిలా అన్పించినట్లున్నాను ఆమెకు.
‘‘వద్దు… వద్దు… చెప్పొద్దు. ఏడవకమ్మా నేను ఇంటికెళ్ళి చీర తీసుకుని చప్పున వచ్చేస్తాను.’’
ఆమె కళ్ళు ఆశగా చూశాయి, భయంగా చూశాయి.
‘‘నేను నీకు చీర తెస్తాను. భయపడకు’’.
ఈసారి ఆమె చూపుల్లో ఆశ.
నేను త్వరత్వరగా వెళ్ళి స్కూటీ ఎక్కాను. డ్ర్రైవ్ చేస్తున్నానే కానీ నా మెదడు నిండా ఆలోచనలు. కొన్ని విషాదమైనవి… కొన్ని విప్లవాత్మకమైనవి… కొన్ని నిర్వీర్యాన్ని నింపుకొన్నవి. ఆ అమ్మాయి దారుణ పరిస్థితి నా హృదయాన్ని పిండేస్తోంది.
దారిలో నా ప్రాణస్నేహితురాలు కూరల బుట్టతో నడుచుకుంటూ వెళ్తూ నన్ను చూసి చెయ్యి ఊపింది.
‘‘సమయానికి కనబడ్డావు లిఫ్ట్ ఇవ్వవే, కాళ్ళు పీకుతున్నాయి’’ అంది.
కను చీకటిలో ముడుచుకుని కూర్చుని నావైపు భయంగా, ఆశగా చూసిన ఆ దీనురాలు నా కళ్ళముందు ఓ దృశ్యంలా కన్పిస్తోంది.
నా నిశ్శబ్దాన్ని మరోలా భావించిన దీపిక మరలా పెదాలు కదిలించింది. నన్ను ఏదైనా అడిగే స్వతంత్రం, ధైర్యం మా స్నేహానికి ఉంది.
‘‘మీ ఇంటి దగ్గర దింపెయ్ విశ్వా అక్కడ నుండి మా ఇల్లు ఎంత దూరం? నాలుగడుగులే కదా! నడిచి వెళ్ళిపోతాలే’’
‘‘ఎందుకులే దీపూ ఇంటి దగ్గరే దింపుతాను. ఎక్కు…’’ పాపం కాళ్ళు ఎంతగా నొప్పెడుతున్నాయో దానికి. ఛార్జీలు పెంచుకున్న ఆటోలు ఎక్కలేని ఆర్థిక దౌర్భల్యం దీపూది. ఆ ఆటోవాళ్ళు మాత్రం ఏం చేస్తారు డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే.
దీపూ ఛప్పున స్కూటీ ఎక్కింది.
‘‘బుద్ధుందా నీకు ఇంత చీకట్లోనా మార్కెట్‌కెళ్ళేది?’’ కోపంగా అన్నాను. నా స్నేహితురాలికి ఏదో అవుతుందని నా భయం. కొన్ని నిమిషాల క్రితం నేను చూసిన జుగుప్సాకరమైన దృశ్యంలో నుండి నేనింకా బయటపడలేదు.
వెనకనుండి చిన్న నవ్వు వినిపించింది, ‘‘చీప్‌గా, ఫ్రెష్‌గా రైతుల దగ్గర కొనుక్కోవచ్చని వెళ్ళానులే’’.
దీపిక దగ్గర నుండి నేను జవాబుని ఆశించలేదు, ఆమె నవ్వుని ఆస్వాదించలేదు.
నలుగురూ తిరిగే ఫుట్‌పాత్ మీద ఓ అబల నిస్సహాయంగా చూసిన చూపు గుర్తొస్తోంది.
దిగులుగా ఉంది…
వేదనగా ఉంది…
కన్నీళ్ళు రావడంలేదు…
గుండె భారంగా ఉంది…
ఆ భారాన్ని దింపుకోవాలనుంది.
మనసు విప్పి చెప్పుకోగలిగిన నేస్తం పక్కనుంది. అంతే… మనసు తెరిచేశాను, అంతా చెప్పేశాను.
నాకు ఆమె ముఖంలో భావాలు తెలీలేదు కానీ తన నిట్టూర్పు విన్పించింది. ఆ నిట్టూర్పులో అసహ్యం, ఆశ్చర్యం, ఆవేదన ధ్వనించాయి.
‘‘దీపూ! ఆ అమ్మాయి అంతసేపు అక్కడ ఉండకుండా ఏ ఆటోనో ఎక్కి వెళ్ళిపోయుండొచ్చు కదే!’’ దిగులుగా అన్నాను.
‘‘ఆ ఆటో డ్రైవర్ మాత్రం మగాడు కాదా? ఈ సమాజంలో మనిషి కాదా? వాడు ఊరుకుంటాడా?’’
‘‘కొందరు బంగారు కొండలు కూడా ఉంటారు కదా!’’ గొణిగాను.
‘‘పిచ్చిదానివా ఏం? ఎవరు మంచో ఎవరు చెడ్డో ఎలా తెలుసుకోవడం’’ ఆమె కంఠంలో కసి.
‘‘పోనీ సందుల్లో, గొందుల్లో నడిచి ఇంటికి వెళ్ళుండొచ్చు కదా!’’
‘‘ఎంత అమాయకురాలివే విశ్వా… ఆ అమ్మాయి పిచ్చిదని జనం రాళ్ళతో కొట్టరా?’’
‘‘జనం లేరు కదా!’’
‘‘మరి… ఇంట్లో భర్త ఉంటే. భార్య పాతివ్రత్యం గంగలో కలిసిందని వెలివేయడా?’’
‘‘నిజమే… కానీ దీపూ… ఇప్పుడు వితంతువుల్ని, విడాకులైన ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకోవడానికి ముందుకొస్తున్నారు కదా! రేప్ చేయబడిన వాళ్ళను ఎందుకు వెలివేస్తున్నట్లు!’’
‘‘అందరికీ ఎక్కడ పెళ్ళిళ్ళవుతున్నాయే. ఆడపిల్లల దగ్గర డబ్బు దండిగా ఉంటేనే మగాళ్ళు నువ్వన్నట్టు వితంతువుల్ని, విడాకులు ఇవ్వబడిన వాళ్ళను పెళ్ళి చేసుకునేది. డబ్బు ముందు వాళ్ళ శీల ప్రసక్తి రాదు.’’
‘‘అయితే ఎంతకాలమని ఈ అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి?’’ ఆవేశంగా అన్నాను.
తల్లిదండ్రులు, అరాచకానికి బలైన తమ కూతుళ్ళను కొంగుచాటున దాచుకుని గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నంత వరకు పోవు’’ ఇంకా ఎక్కువ ఆవేశపడిరది దీపిక.
‘‘కొందరు కోర్టుకెక్కుతున్నారు. కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. అయినా భయం లేకుండా పోయింది. అత్యాచారాలు చేసి పట్టుబడిన అమానుషుల్ని బలవంతంగా సర్జరీ చేయించాలి. ఏమంటావు దీపూ’’ నా మనసులో కచ్చిని బయటపెట్టాను.
‘‘నిజమే… ఆపు మీ ఇల్లు వచ్చేసింది’’.
స్కూటీ ఆపాను, ‘‘సారీ ఇంటిదాకా దింపలేకపోతున్నాను.’’
‘‘అర్థమైందిలేవే’’.
… … …
అమ్మతో విషయం చెప్పి చీర తీసుకెళ్ళాలని ఆత్రంగా లోపలికెళ్ళిన నేను నిర్ఘాంతపోయాను. అమ్మ మంచం మీద అడ్డదిడ్డంగా పడుంది. ఆమె కుడిచేయి మంచం మీద నుండి అచేతనంగా వాలిపోయి ఉంది. నాకు భయమేసింది. కళ్ళు తిరిగినట్టయ్యాయి. కోలుకుని అమ్మ దగ్గరకు నడిచాను. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. నాకు అర్థమయింది అమ్మ ఇక నాకు లేదని. అమ్మమీద పడి ఏడ్చాను. నా ఏడుపుకు చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళంతా చుట్టుకున్నారు. అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. ఇలాగే ఎన్నోమార్లు అమ్మను కౌగలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకొనుంటాను. ఎంతో మృదువుగా ఉండే అమ్మ నుదురు ఇప్పుడు బండరాయిలా ఉంది. ఉలిక్కిపడి వెనక్కి జరిగాను.
చుట్టుపక్కల వాళ్ళంతా నా పర్మిషన్ లేకుండా అమ్మను ఎత్తేసుకున్నారు. ఇంకొందరు కనబడిన చాప పరిచారు. దానిమీద అమ్మను పడుకోబెట్టారు. నేను అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకోబోయాను. అది అప్పటికే బిగుసుకుపోయింది. ఐస్ గడ్డలా ఉంది. ఆ చేయి నాకు ఎన్ని సేవలు చేసిందో! ఎందరి దగ్గర పనులు చేసి నన్ను చదివించిందో! నా కళ్ళల్లో నీళ్ళు రావడం లేదు. అవి నా గుండెల్లో గడ్డకట్టి గుండె భారాన్ని పెంచుతున్నాయి.
చప్పున ఆ అమ్మాయి గుర్తొచ్చింది… అమ్మను వదిలేసి ఆ అమ్మాయిని కాపాడాలా…? ఇంకెవరైనా ఆ పిల్లను ఆదుకోరా?
‘‘పాపం ఆ తల్లి ముగ్గుర్ని కన్నా విశ్వని మాత్రమే శివమ్మని ఇంతకాలం చూసుకుంది’’ అంటున్నారు ఎవరో. ఆ టాపిక్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నా మీద మనస్ఫూర్తిగానే జాలిపడ్డ వీళ్ళు నేను అమ్మను వదిలేసి వెళ్ళిపోతే… ఎన్ని నిందలు వేస్తారో?
‘‘తమ్ముడు, చెల్లి రాలేదామ్మా?’’
చప్పున లేచాను ‘‘ఫోన్ చేసొస్తాను’’ అని లోపలికెళ్ళాను.
నేను ఫోన్ తీసుకుని మొదట దీపికకు ఫోన్ చేశాను. దీపూని ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చీర కప్పేసి రమ్మని చెప్దామని. వాళ్ళమ్మ ఫోన్ తీసింది.
‘‘దీపూ రాగిణికి బాగోలేదని ఫోనొస్తే చూడడానికి ఏదో హాస్పిటల్‌కెళ్ళిందమ్మా’’ అని చెప్పింది.
హతాశురాలినయ్యాను.
నేను నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది.
నేను ఆలోచించాల్సింది అమ్మ గురించి కాదు. ప్రాణం పోయిన అమ్మకు స్పందనలుండవు. సర్వస్పందనలతో, సజీవంగా, వివస్త్రగా ఉన్న ఆ పిల్లకు నా అవసరం ఉంది. ఎవరైనా సహాయం చేస్తారో లేదో? తెల్లవారబోతోంది.
ఆ అమ్మాయికి సాయం చేస్తానని, చీర తెస్తానని ప్రామిస్ చేసింది తను. ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది ఆ పిల్ల. నేను తెగించాను. నా గుండెల్లో అమ్మ మీద ఉన్న ప్రేమను ఘనీభవింపచేసుకున్నాను. బీరువా దగ్గరకెళ్ళి అమ్మ చీర, లంగా, జాకెట్టును నా పెద్ద హ్యాండ్ బ్యాగ్‌లో కుక్కుకున్నాను. మరో జరీ చీరను చేతుల్లోకి తీసుకున్నాను. అది పెద్ద పండుగకు అమ్మకు తను కొనిచ్చిన చీర. ఇంకా అమ్మ దాన్ని కట్టనేలేదు. ద్రవించిన కళ్ళను తుడుచుకున్నాను. సెల్‌ఫోన్‌ని బ్యాగ్‌లో పెట్టుకుని, హాల్లోకి వచ్చాను.
‘‘పిన్నీ! ఈ చీరను అమ్మమీద కప్పండి. తమ్ముడు ఫోన్‌లో దొరకలేదు. మీకెవ్వరికీ వాడి ఇల్లు తెలీదు. ఈ మధ్యనే మారాడు. వెళ్ళి తీసుకొస్తాను’’ అనేసి వేగంగా బయటపడ్డాను.
‘‘అమ్మ శవాన్ని వదిలేసి…’’ నా వెనుక ఎవరో సాగదీస్తున్నారు. నేను ఆగదల్చుకోలేదు. కానీ కాస్త బాధనిపించింది. నిన్నటిదాకా శివమ్మ అని పిలిచిన వీళ్ళు ‘శవం’ అంటున్నారు. ప్రాణం పోయిన మరుక్షణంలోనే మనిషి పేరు మారాల్సిందేనా?
ఎంత నిర్భయంగా అబద్ధమాడేసింది తను! ఇలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం తప్పు కాదనిపించింది నాకు.
… … …
నేను వెళ్ళేసరికి ఎలా కూర్చోబెట్టానో ఆ దయనీయురాలు అలానే కూర్చొనుంది. నా చేతిలో బట్టల్ని ఆబగా లాక్కుని చుట్టేసుకుంటోంది.
‘‘ఎలాంటి అఘాయిత్యం చేయవు కదా!’’
‘‘అఘాయిత్యం అంటే ఆత్మహత్యా?’’ పైట లాగి భుజం చుట్టూ కప్పుకుంటూ మరలా అంది ‘‘ఎవరో చేసిన దుశ్చర్య వల్ల నేను ఏదో చేసుకుని అమ్మకు కడుపు మంట కలిగించడం న్యాయమా ఆంటీ? మీరు చెప్పండాంటీ నేను మలినమయ్యానా?’’
‘‘నువ్వు ఏ రకంగానూ మలినం కాలేదమ్మా. నువ్వు ఆలోచించిన తీరు నాకు చాలా నచ్చింది. ముందు ముందు నీకు చాలా జీవితముంది. ఇలాగే ధైర్యంగా నిలబడు’’ అనేసి వెనక్కు తిరగబోయి ఆగాను. ఇంటికెళ్తే తమ్ముడి గురించి అడుగుతారు. స్పృహ వచ్చినదానిలా హ్యాండ్‌బ్యాగ్ నుండి మొబైల్ తీశాను. తమ్ముడికి ఫోన్ చేశాను.
‘‘కార్తీక్… చాలాసేపటి నుంచి నుండి ఫోన్ చేస్తుంటే నువ్వు రిసీవ్ చేసుకోలేదు’’ ముందు జాగ్రత్తపడి మరో అబద్ధమూ ఆడాను. నేను సంఘజీవిని కదా మరి!
‘‘అమ్మ చనిపోయిందిరా’’
‘‘ఆ! ఇప్పుడే వస్తున్నాను’’ ఫోన్ పెట్టేశాడు వాడు. చెల్లికి చెప్పాను.
‘‘అయ్యో… అక్కా దిగులుపడకు మేమంతా ఉన్నాం నీకు’’ అంది రమ.
ఫోన్ పెట్టేశాను.
ఎవరున్నారు నాకు! కార్తీక్ అసమర్ధుడు, అమాయకుడు, భార్య మాట జవదాటలేనివాడు. రమ… అది వచ్చినా ఎన్నాళ్ళు ఉండగలదు? తను వెళ్ళి చెల్లి దగ్గర ఉండగలదా? ఆమె భర్త కూడా మగాడే కదా! ఇక్కడా తనను ఆదుకోవడానికి సమాజం ఒకటి ముళ్ళ కంపలా ఉంది కదా!
తను ఒంటరిగా మిగిలిపోయిన సత్యం రమ చెప్పేదాకా… నాకు గుర్తురాలేదు. ఏడుపు తన్నుకొచ్చింది.
‘‘ఆంటీ… ఆంటీ… ఏడవకండి ఆంటీ. చనిపోయిన అమ్మను వదిలేసి నన్ను కాపాడడానికి వచ్చారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పనాంటీ’’ నా కాళ్ళు తాకబోయింది ఆ అమ్మాయి.
‘‘వద్దొద్దు. నాకు కృతజ్ఞతలు వద్దు లే’’ ఆమెను లేపాను. నేను ఈ సమాజంలో ఒక అబలను. మరో దుర్బలను చూసి స్పందించానంతే…
అమ్మ గుర్తుకొచ్చింది. పాపం అమ్మ! ఆమె చనిపోయిన దానికంటే… ముగ్గురు బిడ్డలు ఉండీ, ఎవ్వరూ దగ్గర లేనప్పుడు ప్రాణం విడిచిందనేదే నన్నెక్కువగా బాధిస్తోంది. ఆ అమ్మాయికి కూడా చెప్పకుండా స్కూటీ ఎక్కాను.
… … …
అమ్మ చుట్టూ జనం… కొందరు పాతవాళ్ళు వెళ్ళిపోయారు. కొందరు కొత్తవాళ్ళు వచ్చి చేరారు. తమ్ముడు ఇంకా రాలేదు. ‘హమ్మయ్య’ అని నిట్టూర్చాను. ఇలాంటి దుఃఖాల్లో కూడా మన మనసు లౌకికంగా ఆలోచించడం ఎంత చిత్రం!
‘‘కార్తీక్ ఏడే?’’ అమ్మ చిన్న చెల్లెలు. ఎలా తెలుసుకుని వచ్చిందో… అడుగుతోంది.
‘‘వెనక వస్తున్నాడు పిన్నీ’’
‘‘ప్రాణం పోయేటప్పుడు మీరెవరూ లేరట కదా! పాపం అక్క… చివరి శ్వాస తీసుకునేటప్పుడు మీ కోసం ఎంత తపించిందో’’ పిన్ని కన్నీళ్ళు పెట్టుకుంది.
నేను అమ్మను చుట్టేసుకుని ఏడ్చాను.
నిశ్శబ్దంగా అమ్మను అడిగాను ‘‘అమ్మా! ఇలాంటి స్థితిలో నిన్ను వదిలి ఒక అపరిచితురాల్ని కాపాడడానికి వెళ్ళటం తప్పా?’’ అమ్మ పెదాలు కదపలేదు. ఇక ఎప్పటికీ కదలవు. అయినా…
‘‘ఈ రోజు శవమైన నేను నిన్న కట్టిన చీర ఓ అమ్మాయి రేపటి జీవితాన్ని కాపాడిరదంటే… అది తప్పెలా అవుతుందిరా కన్నా…’’ అని అమ్మ అన్నట్లు అన్పించింది నాకు.