అనువాదం: ఎ.సునీత
జాతి, జాత్యహంకార వాస్తవాన్ని, స్త్రీవాద ఆలోచనా పరులు గుర్తించాలనే డిమాండ్ అమెరికన్ స్త్రీవాద స్వరూపాన్ని సమూలంగా మార్చిన విషయాల్లో ప్రధానమైంది. మన దేశంలో తెల్ల జాతి ఆడవాళ్ళందరికీ తాము నల్ల జాతి స్త్రీలు, ఇతర రంగుల స్త్రీల కంటే భిన్నస్థాయిలో ఉంటామనే విషయం బాగానే తెలుసు. చిన్న పిల్లలుగా
ఉన్నప్పుడే టెలివిజన్‌లో, మాగజైన్లలో తమ బొమ్మలు మాత్రమే కనపడినప్పుడే వారికి ఆ విషయం అర్థమైపోతుంది. తెల్ల రంగులో లేని పిల్లలు, పెద్దవాళ్ళు వాటిలో కనపడక పోవటానికి కారణం కేవలం వాళ్ళు తెల్ల రంగులో లేకపోవటమేనన్న విషయం కూడా వారికి అర్థమవుతుంది. తెల్ల జాతి ఆడవాళ్ళందరికీ తమ రంగు వల్ల తమకి విశేషాధికారం లభిస్తుందని తెలుసు. వాళ్ళు దీన్ని అంగీకరించక పోవటానికి, తెలిసినా ఆ జ్ఞానాన్ని తొక్కి పెట్టటానికి గల కారణం వారి అజ్ఞానం కాదు. వాళ్ళు ఆ విషయాన్ని గుర్తించటానికి నిరాకరించటమే దానికి కారణం.
1960లలో పౌర హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న రాజకీయ చైతన్యవంతులయిన తెల్ల జాతి ఆడవాళ్ళకి, తమకి, నల్లజాతి స్త్రీలకి మధ్య ఉండే తేడాలు స్పష్టంగా అర్థమయ్యాయి. వాళ్ళు ఆ చారిత్రాత్మక సమయంలో రాసిన డైరీలు, జ్ఞాపకాలు ఈ చైతన్యానికి సాక్ష్యాధారాలు. కానీ ఈ వ్యక్తులే పౌర హక్కుల ఉద్యమంలో తమ కళ్ళతో తాము చూసి నేర్చుకున్న ఈ తేడాల గురించిన జ్ఞానాన్ని తొక్కి పెట్టారు, నిరాకరించారు. జాత్యహంకారం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన జాత్యహంకారం వారిని వదిలిపోలేదు. తాము నల్లజాతి స్త్రీల కంటే ఉన్నతులమని, వారి కంటే తాము ఎక్కువ చదువుకున్నామని, ఎక్కువ విషయాలు తెలుసనీ, తామే స్త్రీ విముక్తి ఉద్యమానికి ‘నాయకత్వం’ వహించగలమనే భావనలు వారిని వదిలిపోలేదు.
ఒక రకంగా తమ ముందు తరంలో జాత్యహంకార నిర్మూలన కోసం పోరాడిన ఆబాలిషనిస్టుల బాటలలోనే వీళ్ళూ పయనించారు. తెల్లజాతి ఆడవాళ్ళకి, నల్ల జాతి ప్రజలకి ఓటు హక్కు కోసం పోరాడిన ఆయా ఆబాలిషనిస్టు స్త్రీలు, అమెరికన్ రాజ్యం ఎప్పుడయితే నల్లజాతి మగవాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి, తెల్ల జాతి ఆడవాళ్ళకి జెండర్ పేరుతో ఓటు హక్కును నిరాకరించిందో, వాళ్ళు తమ జాతి పురుషులతో కలిసిపోయి, నల్ల జాతి పురుషులకు కూడా ఓటు హక్కు వద్దనే జాత్యహంకార అజెండాని తలెత్తుకున్నారు. నల్ల జాతి ప్రజలు తమకు అన్ని హక్కులు కావాలని మిలిటెంట్‌గా ఉద్యమించినప్పుడే తమకి కూడా హక్కులు కావాలని ఇప్పటి తెల్ల జాతి ఆడవాళ్ళు అడగటం మొదలు పెట్టారు. వీళ్ళల్లో కొంతమంది, పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నప్పుడే, తమకి సెక్సిజం, సెక్సిస్టు అణచివేత గురించిన చైతన్యం కలిగిందని చెప్పుకున్నారు. మరి అదే నిజమయితే, రాజకీయ బేధాల గురించి ఆ ఉద్యమంలో వారికి లభించిన కొత్త స్పృహ సమకాలీన స్త్రీవాద ఉద్యమానికి సంబంధించిన నవారి సిద్ధాంతీకరణలో కూడా ప్రతిఫలించాలి.
కానీ వాళ్ళు స్త్రీ వాద ఉద్యమంలోకి ఈ తేడాలని నిరాకరిస్తూ, తుడిచేస్తూ ప్రవేశించారు. రేస్, జెండర్ పక్క పక్కన కలిసి ఉంటాయని చెప్పకపోవటమే కాక, రేస్‌ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉద్యమంలోకి అందరు ఆడవాళ్ళని ఆహ్వానించినప్పటికీ, జెండర్‌ని మాత్రమే ముందు పెట్టడం వల్ల తెల్లజాతి ఆడవాళ్ళు నాయకత్వ స్థానంలోకి ప్రవేశించి, ఉద్యమం తమదేనని చెప్పుకోగలిగారు. ఆడవాళ్ళందరూ సహోదరిలే అన్న ఆదర్శ నినాదం కూడా జాతి తేడాలని, జాత్యహంకార వ్యతిరేక పోరాటాలని నాయకత్వ స్థానంలోని తెల్ల జాతి స్త్రీలు అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల, నల్ల జాతి ఆడవాళ్ళని ఆకర్షించలేకపోయింది. ఉద్యమం పుట్టినప్పటి నుంచి క్రియాశీల పాత్ర పోషించిన నల్ల జాతి స్త్రీలు ‘తమ స్థానం’లోనే ఉండి పోయారు. ఉద్యమం ప్రారంభమయినప్పుడు నల్ల జాతి, తెల్ల జాతి ప్రజల మధ్య పరస్పర సంబంధాలు అరుదుగా ఉండేవి. జాతుల మధ్య సెగ్రిగేషన్ (వేరుపడడం) అప్పుడప్పుడే తొలగుతోంది. చాలామంది నల్ల జాతి ప్రజలకు, తెల్ల జాతి ప్రజలను సమాన స్థాయిలో కలవటం అప్పుడప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో నల్ల్ల జాతి స్త్రీలకి జాతి సమస్యని కూడా స్త్రీ ఉద్యమం పరిగణించాలని చెప్పటం కష్టమైంది. తమ అనుభవంలో తెల్ల జాతి స్త్రీలని ప్రధానంగా అణచివేతకు గురిచేసే వారిగానూ, దోపిడీదారులుగానో చూసిన నల్లజాతి స్త్రీలకి, ‘అందరు స్త్రీలు సోదరిలే’ అన్న నినాదం అద్భుతంగా అనిపించి ఉండొచ్చు.
1970ల చివరిలో, 1980ల మొదట్లో వచ్చిన యువతరం నల్ల జాతి స్త్రీలు, ఇతర రంగుల స్త్రీలు తెల్ల జాతి స్త్రీల రేసిజాన్ని సవాలు చేశారు. మా ముందు తరం వాళ్ళు ప్రధానంగా తెల్ల జాతి ప్రజలు అత్యధికంగా ఉండే సంస్థల్లో చదువుకున్నారు కానీ మాలో చాలా మందికి అటువంటి అనుభవం లేదు. మాకెప్పుడూ ‘మా స్థానం’లోనే బ్రతకాల్సిన అగత్యం కలగలేదు. అందువల్ల మా ముందు తరంతో పోలిస్తే స్త్రీవాద ఉద్యమంలో రేసిజాన్ని, తెల్ల జాత్యహంకారాన్ని విమర్శించటానికి మేము ఎక్కువ సంసిద్ధులమై ఉన్నాం.
స్త్రీలందరూ ఒక లైంగిక వర్గం / కులానికి చెందుతారనే భావనతో ఉద్యమించి ‘అందరి పీడన’ అనే నినాదం చుట్టూ తిప్పటానికి ప్రయత్నించిన తెల్ల జాతి స్త్రీలు, స్త్రీల మధ్య ఉండే తేడాలని గుర్తించటానికి అస్సలు సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. ఈ తేడాలు వారి మధ్య ఉండే సమ్మిళిత అనుభవాలని కప్పేసేంత ప్రభావం కలవి. ఆయా తేడాలలో అందరికీ తెలిసిన తేడా, రేస్ పరమయిన తేడా.
నేను 1970లలో ‘ఐస్డ్ ఏ ఉమెన్: బ్లాక్ ఉమెన్ అండ్ ఫెమినిజం’ పుస్తక మొదటి ప్రతిని రాశాను. నాకప్పుడు 19 ఏళ్ళు. అప్పటి వరకూ నేను పూర్తి స్థాయి ఉద్యోగం చెయ్యలేదు. అమెరికాలో జాతులను వేరుగా ఉంచే ఒక చిన్న పట్నంలో పుట్టి, పెరిగి స్టాన్‌ఫర్డ్ విశ్వ విద్యాలయంలో చేరాను. పితృస్వామ్య ఆలోచనని ఎదిరిస్తూ పెరిగిన నేను కాలేజీలో స్త్రీవాద రాజకీయాలని స్వంతం చేసుకున్నాను. స్త్రీవాద తరగతి గదుల్లో, చైతన్యం పెంచే గుంపులో ఒకే ఒక్క నల్ల జాతి స్త్రీగా ఉన్న క్రమంలో రేస్, జెండర్‌ల గురించి సిద్ధాంతపరంగా ఆలోచించటం మొదలుపెట్టాను. అప్పుడే రేసిస్ట్ పక్షపాతాలు, స్త్రీవాద ఆలోచనలని ప్రభావితం చేస్తున్న తీరుని గుర్తించి, వాటిని మార్చాలనే పిలుపునిచ్చాను. ఇతర చోట్ల కూడా నల్ల జాతి స్త్రీలు, ఇతర రంగుల స్త్రీలు ఇటువంటి విమర్శనే లేవనెత్తారు.
ఆ రోజుల్లో జాతిపరమైన తేడాలు, జాత్యహంకారాలని పట్టించుకోవటం ఇష్టంలేని తెల్లజాతి ఆడవాళ్ళు మమ్మల్ని వాటి గురించి మాట్లాడినందుకు ఉద్యమ ద్రోహులని ముద్ర వేశారు. జెండర్ నుండి దృష్టిని మళ్ళిస్తున్నామనే తప్పుడు భావనతో మమ్మల్ని చూశారు. నిజానికి మేము ఆడవాళ్ళని, వారి సామాజిక స్థాయిని వాస్తవ దృష్టితో చూడాలని, స్త్రీ వాద రాజకీయాలకి అదే అసలైన భూమిక నేర్పిస్తుందని వాదించేవాళ్ళం. ‘స్త్రీలందరూ సోదరిలే’ అనే భావనకున్న శక్తిని తగ్గించటం మా ఉద్దేశ్యం కాదు. నిజమైన సోదరిత్వం రావటానికి అవసరమయ్యే వాస్తవ సంఫీుభావ రాజకీయాలను తీసుకురావటం మా లక్ష్యం. తెల్ల జాతి స్త్రీలు తమ జాత్యహంకారాన్ని వదులుకోకుండా, స్త్రీవాద ఉద్యమం మౌలికంగా జాత్యహంకార వ్యతిరేక ఉద్యమంగా మారకుండా తెల్ల జాతి ఆడవాళ్ళకి, నల్ల జాతి ఆడవాళ్ళకి మధ్య నిజమైన సోదరిత్వం రాదని మాకు తెలుసు.
రేస్ గురించిన విమర్శనాత్మక ఆలోచన స్త్రీవాద ఉద్యమాన్ని నాశనం చెయ్యలేదు. పైగా దాన్ని చాలా బలపరిచింది. రేస్‌ని నిరాకరించే ధోరణి వదిలేసిన తర్వాత అన్ని స్థాయిల్లో భిన్నత్వాన్ని గురించిన వాస్తవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తెల్ల జాతి స్త్రీల ప్రయోజనాల్ని మాత్రమే పట్టించుకునే ఉద్యమ స్థానంలో అన్ని రకాల స్త్రీల ప్రయోజనాల్ని పట్టించుకునే ఉద్యమాన్ని మేము నిర్మించగలిగాము. అందరు స్త్రీల జీవిత వాస్తవాల గురించి మాట్లాడుకోగలిగే సహోదరిత్వ భావనని స్త్రీవాద ఆలోచనా ప్రపంచంలోకి తీసుకురాగలిగాం. సామాజిక న్యాయం కోసం పోరాడే సమకాలీన ఉద్యమాల్లో పాలుపంచుకొంటున్న వ్యక్తులు స్త్రీవాదంలో రేస్ గురించి తమలో తాము సంఘర్షించుకుని సిద్ధాంతాన్ని, ఆచరణని మార్చుకున్న దృష్ట్యాంతాలు అరుదు. ఒక పక్క న్యాయం, విముక్తికి కట్టుబడి ఉంటూనే, ఉద్యమ విమర్శని సవాలుగా తీసుకోవటం దాని బలానికి, శక్తికి నిదర్శనం. అంతకు ముందు రేస్ విషయాల గురించి పక్కదారి పట్టినప్పటికీ, స్త్రీవాద ఆలోచనా పరుల్లో మార్పు కోసం, విముక్తి కోసం, పోరాటం కోసం మారాలనే ఇచ్ఛ, పాత నమ్మకాలు, ఊహలని పట్టుకు వేలాడే అవసరాన్ని బలహీనపరిచింది.
సంవత్సరాల తరబడి స్త్రీవాద ఆలోచనా పరుల్లో రేస్ గురించి పట్టించుకోవటానికున్న అయిష్టతకి నేను ప్రత్యక్ష సాక్షిని. తెల్ల జాత్యహంకారాన్ని వదులుకోవటానికి, స్త్రీల మధ్య సహోదరిత్వానికి జాత్యహంకార స్త్రీవాద ఉద్యమం ఒకటే మార్గమని ఒప్పుకోవటానికి సిద్ధపడని అప్పటి స్త్రీవాద ఆలోచనా పరులకి నేనే సాక్షిని. అలాగే, ఒక్కొక్కళ్ళుగా తమలోని తెల్ల జాత్యహంకారాన్ని బద్దలు కొట్టుకుని వారు తమ చైతన్యాన్ని విప్లవీకరించుకున్న ప్రక్రియకు కూడా నేనే సాక్షిని. ఆ అద్భుతమైన మార్పులు స్త్రీవాద ఉద్యమంలో నా నమ్మకాన్ని పునరుద్ధరించాయి. స్త్రీలందరితో నాకుండే సంఫీుభావాన్ని బలపరిచాయి.
రేస్ గురించి జరిగిన విమర్శనాత్మక ఆలోచనలు స్త్రీవాద ఆలోచనని, సిద్ధాంతాన్ని మొత్తం సుసంపన్నం చేశాయి. ఆ ఆలోచనని ఆచరణలోకి తీసుకురావటమే ఇప్పటికీ సమస్యాత్మకంగా ఉంది. కొంతమంది తెల్ల జాతి స్త్రీవాద సిద్ధాంత కర్తలు రేస్‌ని స్త్రీవాద మేధో రంగంలోకి తీసుకువెళ్ళారు గానీ, ఆ ఆలోచనలేవీ కూడా తెల్లజాతి స్త్రీలకి, నల్ల (ఇతర రంగులు) జాతి స్త్రీల మధ్య ఉండే రోజువారీ సంబంధాలని పెద్దగా ప్రభావితం చెయ్యలేకపోయాయి. జాతి పరంగా విభజించబడిన సమాజంలో స్త్రీల మధ్య జాత్యహంకార వ్యతిరేక సంబంధాలు కష్టమే. ఎంత వైవిధ్యంతో కూడిన పని ప్రదేశాలు ఉన్పప్పటికీ అత్యధిక శాతం ప్రజలు ఇప్పటికీ తమ తమ గుంపుల్లోని ప్రజలతోనే ఎక్కువ కలుస్తుంటారు. రేసిజం, సెక్సిజం రెండూ కలిసి ఆడవాళ్ళ మధ్య హానికరమైన అవరోధాలని సృష్టిస్తాయి. ఈ పరిస్థితిని మార్చటానికి ఏ స్త్రీవాద వ్యూహాలూ ఇప్పటి వరకూ పెద్దగా పని చేయలేదు.
ఈ రకమైన ఇబ్బందులను తొలగించుకుని, తమ మధ్య ప్రేమ, రాజకీయ సంఫీుభావం ఏర్పర్చుకోవటంలో సఫలీకృతులయిన తెల్ల జాతి స్త్రీలు, నల్ల జాతి స్త్రీలు తమ తమ వ్యూహాలు, పద్ధతులని ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భిన్న జాతుల ఆడపిల్లల మధ్య ఉండే సంబంధాల గురించి ఆలోచించేవారు దాదాపు మనకు కనిపించరు. తెల్ల జాతి ఆడపిల్లలు, నల్ల జాతి ఆడపిల్లల కంటే ఎక్కువ సెక్సిస్టు భావజాల ప్రభావానికి లోనవుతారనే పక్షపాత స్త్రీ వాద మేథో చర్చ కారణంగా తెల్ల జాతి ఆడవాళ్ళ సమస్యలు, బాధలపై ఎక్కువ దృష్టి పెట్టాలనే ఒక జాత్యహంకార భావన బలపడిరది. నల్ల జాతి ఆడపిల్లలు తెల్ల జాతి ఆడపిల్లల కంటే భిన్నంగా సెక్సిస్టు ఆలోచనలని అంతర్లీనం చేసుకుని, వారికంటే భిన్నంగా దాన్ని వ్యక్తీకరించొచ్చు కానీ వారే ఎక్కువగా, మరింత తీవ్రంగా, ఇంకా చెప్పాలంటే కోలుకోలేని విధంగా దీనివల్ల బాధితులవుతారు.
స్త్రీవాద ఉద్యమం, ముఖ్యంగా దానిలోని దూరదృష్టి గల నల్ల జాతి యాక్టివిస్టుల పని, రేస్, రేసిజం పట్ల ఆలోచనలని మార్చి మొత్తం సమాజంపై సానుకూల ప్రభావానికి దారి తీసింది. ప్రధాన స్రవంతి సామాజిక విమర్శకులు ఈ విషయాన్ని గుర్తించడం అరుదు. స్త్రీవాద ఉద్యమంలో రేస్, రేసిజం గురించి విస్తృతంగా రాసిన స్త్రీవాద సిద్ధాంత కర్తగా ఇంకా మారాల్సింది చాలా ఉందని నాకు తెలుసు. కానీ, జరిగిన అపారమైన మార్పుని గుర్తించి, దాని గురించి సంబరంగా చెప్పుకోవడం కూడా చాలా అవసరం. ఆ సంబరం, మన విజయాన్ని అర్థం చేసుకోవటం, వాటిని మోడల్స్‌గా వాడుకోవటం అన్నీ కూడా ఒక విస్తృత జాత్యహంకార వ్యతిరేక స్త్రీవాద ఉద్యమాన్ని నిర్మించటానికి పునాదిగా పనికొస్తాయి.