Breakup Stories అనే ఒక షార్ట్‌ ఫిల్మ్‌ గురించి – రమాదేవి చేలూరు

మూడు దశాబ్దాల కాలం నుంచి ‘సహజీవనం’ అనే మానవ సంబంధాలకు సంబంధించిన ఒక పదం వినపడుతోంది. వివాహం అనే తంతును పక్కన పెట్టి, స్త్రీ పురుషులిరువురూ కలిసి జీవించడాన్ని సహజీవనం అంటున్నారు.

లివింగ్‌ రిలేషన్లో వున్నామని అంటుంటారు. ఆ తర్వాత బ్రేక్‌అప్‌ అనే పదమొకటి వాడుకలోకొచ్చింది. ఈ సహజీవనం, బ్రేక్‌అప్‌ ప్రక్రియలు వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛను ప్రతిబింబిస్తాయి. తనకు ఇష్టంలేని వ్యక్తితో ప్రేమను గానీ, సహజీవనాన్ని గానీ, పెళ్ళి బంధాన్ని గానీ తెంచుకునే స్వేచ్ఛకు బ్రేక్‌అప్‌ అని అంటున్నారు. ఇదెంతో ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ, బ్రేక్‌అప్‌ తర్వాత వాళ్ళలో ఎంతో మానసిక ఒత్తిడి, భవిష్యత్తు పట్ల అగమ్యగోచరం కూడా లేకపోలేదు. బ్రేక్‌అప్‌ తర్వాత ఎవర్ని నమ్మాలి, ఎవరు తమని నిజంగా ప్రేమిస్తారనే ప్రశ్నలు మొదలవుతాయి. ఎంత కాలం, ఎంత మందితో బ్రేక్‌అప్‌ చెప్పాలి? ఎప్పటికైనా మనసుకు నచ్చిన వ్యక్తి దొరక్కపోరనే విశ్వాసంతో ముందుకు నడక సాగించాలా? ఎలా? ఎటు వెళ్ళాలి? ఒంటరితనం మనిషిని పిచ్చిగా తయారు చేస్తుంది. పాత జ్ఞాపకాల అలలను తీరం చేర్చడం కష్టంగా ఉంటుంది. నిరాశ నిస్పృహలతో ముందుకు సాగాల్సి వస్తుంది.
స్త్రీ కోణం నుంచీ ఈ విషయాన్ని చర్చిస్తే, ఇప్పటి సమాజంలో ఎక్కువ శాతం మంది స్త్రీలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. కాలేజీలోనో, ఆఫీసులోనో తమకు నచ్చిన వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆకర్షణతో, ప్రేమతో (?) సహజీవనం చేస్తున్నారు, లేకుంటే పెళ్ళి చేసుకుంటున్నారు.
పల్లెల్లో, జిల్లా కేంద్రాల్లో, చిన్న పట్టణాలలో ప్రేమలు, ఆకర్షణలు, ఛాటింగ్స్‌ ఉన్నాయి కానీ సహజీవనం చేసే వీలులేదు. మహా పట్టణాల్లో మాత్రమే సహజీవనానికి వీలుంది. ఇప్పుడు మహా పట్టణాల్లో సహజీవనాన్ని కోరుకుంటున్న వాళ్ళకి ఇళ్ళు అద్దెకు దొరుకుతున్నాయి, కలిసి జీవిస్తున్నారు. నచ్చకపోతే బ్రేక్‌అప్‌ చెప్పేస్తున్నారు. అన్నీ గమనిస్తున్న తల్లిదండ్రుల జోక్యం కొంతవరకే ఉంది. కలిసి జీవిస్తున్నారు కాబట్టి పెళ్ళి చేస్తా రండని పెద్దలు పిలిచినంతలో, వీళ్ళు బంధానికి బ్రేక్‌అప్‌ చెప్పకుంటున్నారు. సహజీవనం చెయ్యకపోయినా, ప్రేమలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మధ్య మనస్పర్థలు వస్తే బ్రేక్‌అప్‌ చెప్పుకుంటున్నారు. ప్రేమ మొదలైనప్పుడు అంతా సజావుగా సాగుతుంది. మనసనే పుస్తకాన్ని విశ్లేషిస్తూ చదివితే ఎదుటివారిలో అన్నీ తప్పులే. అప్పుడు యు టర్న్‌. ఇప్పటి సమాజంలో యువత పరిస్థితి ఇదే.
… … …
బ్రేక్‌అప్‌ స్టోరీస్‌ గురించి, మూడు జంటల పరిస్థితి గురించీ షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. సమకాలీన సమాజంలో, యువ స్త్రీ పురుష సంబంధాల గురించీ, వారి మానసిక ఒత్తిడిని, సమస్యల్ని, వారి స్వేచ్ఛనీ, ఆత్మాభిమానంతో నిలబడటాన్నీ స్త్రీ కోణం నుంచి చర్చించారు. అభినందించదగ్గ ఫిల్మ్‌ ఇది. మొదటి జంటలో… బ్రేక్‌అప్‌ చెప్పినా గానీ మళ్ళీ ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని అమ్మాయిని బతిమాలుతుంటాడు అబ్బాయి. ఆ అమ్మాయి ససేమిరా ఒప్పుకోదు. వాళ్ళ బంధానికి బ్రేక్‌అప్‌ చెప్పేసినా కూడా ఆఫీసుకొచ్చి విసిగిస్తుంటాడు. ఆ అబ్బాయి అనుమానపు పిశాచి. ఆ అమ్మాయి తన స్నేహితులతో, కొలీగ్స్‌తో మాట్లాడకూడదనీ, ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్ళకూడదని ఆంక్షలు పెడుతుంటాడు. ఎందుకు వెళ్ళకూడదో కూడా చెపుతాడు. మగవాళ్ళు మంచివాళ్ళు కాదని, అడ్వాంటేజ్‌ తీసుకుంటారని, అందుకే అందరికీ దూరంగా ఉండాలని అంటాడు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం గల అబ్బాయితో జీవితాన్ని పంచుకోవటం కష్టమని ఆ అమ్మాయి ఆ బంధాన్ని తెంచుకుంటుంది.
రెండవ జంట… ఇద్దరూ సహజీవనం చేస్తున్నప్పుడు పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకుంటారు. అమ్మాయికి వేరే ఊర్లో యాడ్‌ ఏజెన్సీలో జాబ్‌ వచ్చి వెళ్తూ, పొడుగాటి జుట్టును కట్‌ చేసి, బాయ్‌కట్‌లా స్టైలిష్‌గా మార్చుకుంటుంది. అబ్బాయి వాగ్వివాదానికి దిగుతాడు. అబ్బాయి వాళ్ళ అమ్మకి పెద్ద జడ ఇష్టమని, పెళ్ళికి ముందు ఇలా జుట్టు కట్‌ చేసుకోకూడదని, యాడ్‌ ఏజెన్సీలో జాబ్‌ చేయడం కూడా తనకు ఇష్టం లేదని వాదిస్తాడు. ఏ జాబ్‌ చేయాలో, ఏ ఊర్లో చేయాలో, జుట్టు ఎంత ఉంచుకోవాలో ఆ స్వేచ్ఛ తనకుందని, అబ్బాయి ఇష్టాలతో, వాళ్ళ అమ్మ ఇష్టాయిష్టాలతో తనకనవసరమని తెగేసి చెప్పి బ్యాగ్‌ తీసుకుని బయలుదేరిపోతుంది. బస్టాప్‌ వరకు వచ్చి సెండాఫ్‌ ఇస్తాడని ఆశిస్తుందామె. కానీ, ఆ అబ్బాయి సెండాఫ్‌ ఇవ్వడు. అలా బ్రేక్‌అప్‌ అవుతుంది వాళ్ళ బంధం.
మూడవ జంట… తెల్లారి పెళ్ళి పెట్టుకొని అమ్మాయి కనపడకుండా పోతుంది. వెంటనే అబ్బాయి ఆ అమ్మాయిని వెతికి, కలిసి మాట్లాడుతాడు. ఆమెకి పెళ్ళంటే భయమని, ఆ బంధాన్ని నిలబెట్టుకునే ధైర్యం, శక్తి తనకు లేదని చెబుతుంది. కారణం, అదివరకే ఆమెకి పెళ్ళి, విడాకులు అయి ఉంటాయి. అందుకే ఈ పెళ్ళి తంతుకు దూరంగా ఉండటమే ఇష్టమని చెబుతుంది. భర్తతో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. కలిసి ఉండేందుకు మాత్రం ఒప్పుకుంటుంది. అబ్బాయి అందుకు ఒప్పుకుంటాడు.
మూడు జంటలవి వేర్వేరు కారణాలు. ఈ ముగ్గురి సమస్యలు ఒక్కరికే కూడా ఉండవచ్చు. సమాజంలో బ్రేక్‌అప్‌ చెప్పేందుకు ఇంకా ఎన్నెన్నో ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఆత్మాభిమానానికి పెద్దపీట వేసే అమ్మాయిలకు తమ వ్యక్తిత్వం, తమ ఆలోచనలే ముఖ్యం. అందుకే నిర్మొహమాటంగా బంధాన్ని తెచ్చుకుంటున్నారు. ఇప్పటి యువత ప్రత్యేకత ఏమిటంటే, వాళ్ళ ఇష్టాలకు, స్వేచ్ఛకనుగుణంగా జీవించాలని అనుకుంటున్నారే తప్ప కుటుంబాన్ని, సమాజాన్ని, ఫాల్స్‌ ప్రిస్టేజిని పక్కన పెడుతున్నారు. స్వంత నిర్ఱయాలకు, ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తున్నారనటం వాస్తవం. చాలామంది ఇంతే. ఈ కాలపు యువత సహజీవనంలోను, వివాహ సంబంధంలోనూ ఎదుర్కొంటున్న సమస్యలను, పరిస్థితులను ఈ సినిమా దర్శకుడు దినేష్‌ గారు మనముందుంచారు. అంతే!!
నిజంగా చెప్పాలంటే, ఎవరి జీవన రహదారిని వాళ్ళే ఏర్పరచుకోవాలి. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎవరి గమ్యం వాళ్ళదే. ఇతరుల సలహాలు, సూచనలు పనికిరావు. ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో, తనదైన శైలిలో, తన ఆలోచనలకు అనుగుణంగా బతకాలని, నవ్య సమాజపు స్త్రీ అనుకుంటోంది. అందుకు దారుల్ని వెతుకుతోంది. ఆత్మాభిమానం ఒక పక్క, జీవన సహచరుడు మరో పక్క… ఏదో ఒకటి మాత్రమే కోరుకునే పరిస్థితి ఉంటే, ఎవరి నిర్ణయం వాళ్ళది. రెండు కత్తులూ ఒక ఒరలో ఇమడకపోవచ్చు. ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోవాలి. అన్ని జంటలకు ఇది వర్తించదు. సమాజంలో త్రికాలాల్లోను ఇదే ఛాలెంజ్‌ ఉంది, ఉంటుంది కూడా! ఒంటరిగా బతుకుతాను, నాకు తాడు బొంగరం అక్కర్లేదంటే, సమాజం నుంచీ రాళ్ళు పడి, తల బొప్పి కడుతుంది. అందుకే పెళ్ళి అనే బంధంలో చిక్కుకొని విలవిల్లాడేది.
సామాజిక నియమాలకు, కుటుంబ ఆంక్షలకు, పరువుకీ, స్త్రీ హృదయ స్పందనలకు, వ్యక్తిత్వానికి పొంతనే కుదరదు.
ఏ కాలంలో కానీ, సరైన జీవన సహచరులు దొరకటం అనేది ఒక బర్నింగ్‌ సమస్య. ఎప్పుడూ అడ్జస్ట్‌మెంట్‌ అనే మంత్రం జపిస్తూ, బతుకుతూ చచ్చి, కాలాన్ని నెట్టారు. అడ్జస్ట్‌మెంట్‌ కానివాళ్ళు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నూటికో కోటికో ఒక జంట ‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై’ అంటూ జీవించారు కానీ, ఈ భూమి పుట్టుక నుంచీ ఈ సమస్య ఉండనే ఉంది కాబట్టి, యువత సమాజం పట్ల, కుటుంబం పట్ల సాధ్యమైనంత వరకు బాధ్యతగా ఉంటూ, ఎప్పుడూ ప్రశాంతత వైపు అడుగులు వేస్తూ నడిస్తే మనసైన వారు ఎదురుపడకపోరు.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.