వాకిలి ఊడ్చి లోపలికి వస్తూ ఒక్క క్షణం ఆగి లోనికి వెళ్ళిన యాదమ్మ ముగ్గు డబ్బాతో వచ్చి మళ్ళీ ఆగింది. పేపర్ చదివే నన్ను ఏదో అడగాలని ఆగిందని నాకు అర్థమైంది.
ఏమిటన్నట్లుగా చూసిన నా కళ్ళల్లోకి చూస్తూ ‘‘కోడి తల తెగ్గోసినట్లు, గొర్రె తల నరికినట్టు చేసింది ఆ తల్లి. పిల్లలకు బతుకునిచ్చే తల్లి. ఆ ఆడపిల్లల బతుకు ముక్కలు చేసి కాకులకు, గద్దలకు వేసి… కోడి సుతం తన పిల్లలను కాకులు, గద్దలు ఎత్తుకుపోకుంట కాపాడుకుంటది. ఏదైనా ఆపద ఉందంటే ముక్కుతో చీల్చి చెండాడుతది. అసొంటిది వావివరసలు లేకుంట మేకపిల్ల మీదికి గిత్తను తోలింది ఆ తల్లి… థూ… ఏం పుట్టుక అది’’ కనిపించని ఆ తల్లిని ఈసడిరచుకుంటూ కలత చెందిన మనసుతో పనిలో జొరబడిరది యాదమ్మ.
నాలుగిళ్ళలో పనిచేసే యాదమ్మ ఎక్కడో ఎవరి నోటో విన్న మాటలు ఆమెను కలచి వేసినప్పుడో, సంతోషం కలిగించినప్పుడో లేదా ఏదైనా సందేహం వచ్చినప్పుడో నా దగ్గర వెలిబుచ్చడం ఆమెకు, నాకు అలవాటే. రెండు రోజుల క్రితం ఆ వార్త చదివినప్పుడు నాకు చాలా ఆగ్రహం కలిగింది. ఆమెకు అమ్మ అనే పదానికి అర్థం తెలుసా… వావి వరుసలు మరిచింది. కన్నబిడ్డలు అనే విచక్షణ వదిలింది. ఎవరూ చేయని పని, చేయకూడని పని చేసింది. అమ్మతనానికి, ఆడతనానికి మచ్చ తెచ్చిందని ఆవేశపడ్డాను.
కన్నతల్లి కసాయి బుద్ధి… కన్నతల్లి కాదు నరరూప రాక్షసి… తనకు పిల్లలు పుట్టరని రెండో భర్తకు అప్పగించిన కన్నతల్లి… కన్నతల్లి దారుణం… కూతుళ్ళను భర్త పక్కలోకి పంపిన తల్లి… అంటూ హెడ్డింగ్స్ చూసినప్పుడు మనసు కకావికలమైంది. కానీ ఆలోచిస్తే ఆవేశం, ఆగ్రహం తగ్గిపోయింది. ఇప్పుడు నా ఆగ్రహం ఆ తల్లిపై కాదు, మన వ్యవస్థల మీదనే.
ఆ తల్లి చేసింది ముమ్మాటికీ తప్పే. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన నేరమే. ఇద్దరు బిడ్డల తర్వాత ఆ తల్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించు కుంది. మొదటి భర్త మరణం తర్వాత రెండో పెళ్ళి చేసుకుంది. అతనికి కొడుకు కావాలని కోరిక. బిడ్డను ఇవ్వలేని ఆమెను కాదని మరో పెళ్ళికి సిద్ధమయ్యాడు. తన భద్రత కోసం, అతని కోరిక తీర్చడం కోసం యుక్త వయసుకు వచ్చిన, బడికి వెళ్ళి చదువుకునే కూతుళ్ళను అతనికి అప్పగించింది ఆ తల్లి.
తనను కనమని ఏ బిడ్డా కోరదు. తమ సుఖం, సంతోషం, సంతృప్తి కోసం భార్య, భర్త పిల్లల్ని కంటారు. కన్నందుకు ఆ బిడ్డల బాగోగులు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కన్నారు కదా అని ఆ బిడ్డలను ఏమైనా చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఉన్నదా? లేదు, వారికి లేదు కదా. మరి ఆ తల్లి ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది?
పైకి తల్లి స్వార్థం కనిపిస్తుంది. దాన్ని ఆగ్రహిస్తున్నాం, ఆడిపోసుకుంటున్నాం కానీ, వెనుక ఉన్న పరిస్థితులు ఏమిటి? అసలు నేరస్థురాలు ఆమె ఒక్కటేనా?
పితృస్వామ్యం ఆడవాళ్ళపై చేసే పెత్తనం, దాష్టీకం, దౌర్జన్యం మనకు తెలియనివి కాదు. పురుషాధిక్య సమాజంలో ఆమె చదువు, పెళ్ళి, సెక్స్, కుటుంబం ఏదీ ఆమె చేతిలో ఉండదుÑ అన్నీ అతని చేతుల్లోనే. అతడు బలవంతుడుగా కుటుంబంలో, సమాజంలో ఆధిపత్యం చెలాయించడం చూస్తూ ఎదిగిన ఆడపిల్లలపై ఆ ప్రభావం ఉండకుండా
ఉంటుందా? పురుషాధిపత్యాన్ని వేల
ఏళ్ళుగా ఒంటబట్టించుకున్నారుగా మరి! ఆడవాళ్ళలోనూ ఉంది.
పెళ్ళాం తన కాళ్ళ దగ్గర పడి ఉండాల నుకునే మగాడి మనస్తత్వానికి లోపల ఏరులై పారే కన్నీటిని దిగమింగి, ఒదిగి ఒదిగి, సహనంతో ఉండమని ఆమెకు బోధిం చింది ఎవరు? ఎవరినీ ఏమీ నిందించలేని ఆ తల్లి తన బతుకు భద్రత కోసం ఎంచు కున్న మార్గం కన్నబిడ్డల ద్వారా భర్తకు మగ సంతానం ఇవ్వడం.
మన వ్యవస్థలు… అంటే పితృస్వామిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ, కట్టుబాట్లు, అధికార పంపిణీ, సామాజిక సంస్థలు, ఆచారాలు, సంప్రదాయాలు, మతం, కులం, వర్గం, విలువలు అన్నీ పురుషుడికి ఇచ్చిన విలువ, గౌరవం మహిళలకు ఇవ్వడం లేదు.
మగవాడిని కాదని బతకలేమని, మగవాడు లేని బతుకు బతుకే కాదని ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా వాళ్ళ మెదళ్ళలో నింపేశారు. ఆమెపై సర్వహక్కులూ తనవిగా భావించే అతను పునరుత్పత్తి విషయంలో తన మాటే చెల్లుబాటు చేసుకోవడం ఆమెకు తెలియనిది కాదు. పితృస్వామ్య విష సంస్కృతి అవలక్షణం ఆమె నరనరాల్లోనూ ఇంకిపోవడం వల్లనే ఇలా చేయగలిగింది. అందుకే తప్పు ఆమెది మాత్రమే కాదు, ఈ విష సంస్కృతి మెదళ్ళలో నింపుతున్న వ్యవస్థలది. ఆమెకు ఆ పరిస్థితులు కల్పించిన వ్యవస్థలు కదా? ఆమె నేరస్థురాలు అయినప్పుడు వ్యవస్థలు కూడా నేరం చేసినట్లే కదా!
ఇలాంటి వ్యవస్థల వల్లనే గద్వాల్‌లో కులాంతర వివాహం చేసుకున్న బిడ్డకు కర్మ కాండలు జరిపించాడో తండ్రి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను అర్థనగ్నంగా ఊరేగిం చడం, హింసా సాధనంగా మహిళను ఉపయోగించుకోవడం కూడా అందులో భాగమే.
కాలం మారినప్పటికీ, ఆధునికం అవుతున్నప్పటికీ, మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని అనుకుంటున్నప్పటికీ పురుషస్వామ్య వ్యవస్థలను ఛేదించుకుని వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా మిగిలే ఉంది. అయితే ఆమె గెలుపును, ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదు.