మహిళల కోసం ఏర్పాటయ్యే సపోర్ట్‌ సెంటర్లు మానవీయంగా ఉండాలి – కొండవీటి సత్యవతి

చంకలో బిడ్డ, చెయ్యి పట్టుకున్న మరో బిడ్డతో, ఒంటిమీద దెబ్బలతో మహిళా పోలీస్‌ స్టేషన్‌కి వచ్చిందామె. చాలాసేపటి నుండి తనని పిలిచి మాట్లాడతారని, తనను ఇంట్లోంచి గెంటేసిన అత్తింటి వాళ్ళని, భర్తని పిలిపిస్తారని, తన సమస్యను పరిష్కరిస్తారని గంపెడాశతో ఎదురు చూస్తోంది. పొద్దుటి నుంచి పిల్లలు ఏమీ తినలేదు. ఎస్సై గారు రాలేదు

అని చెబుతున్నారు. ఎప్పుడొస్తారో ఏంటో. పోలీస్‌ స్టేషన్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న సపోర్ట్‌ సెంటర్‌ ఉంది. అక్కడ పనిచేసే కౌన్సిలర్‌ రెండు గంటలుగా ఒక గ్రూప్‌ కౌన్సిలింగ్‌లో ఉండడం వల్ల ఈమెను చూడలేదు. రూమ్‌ నుండి బయటికొచ్చిన కౌన్సిలర్‌ ఈమెను చూసి రూమ్‌ లోపలికి రమ్మని పిలిచింది. ఆమెను కూర్చోమని చెప్పింది. అంతవరకూ నిలబడే ఉన్న ఆమె బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది.
‘‘ఎంతసేపైంది మీరొచ్చి’’ అడిగింది కౌన్సిలర్‌.
‘‘చానాసేపైంది. ఎస్సై రాలేదనే చెబుతున్నారు’’.
వెంటనే కౌన్సిలర్‌ పిల్లలకి బిస్కెట్లు ఇచ్చింది. ఆకలిగా ఉన్నారేమో గబగబా తినేశారు. అటెండర్‌ని పిలిచి భోజనం తీసుకురమ్మని చెప్పి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టింది.
‘‘ఏం జరిగింది?’’
‘‘ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని చాలాకాలంగా నన్ను వేధిస్తున్నారు మా అత్తింటివాళ్ళు. కొట్టడం, ఇంట్లోకి డబ్బులివ్వక పోవడం, ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని సతాయిస్తున్నారు. రాత్రి నా మొగుడు ఫుల్‌గా తాగొచ్చి నన్ను, పిల్లల్ని కొట్టాడు. ఇంట్లోంచి గెంటేశాడు’’ అంటూ ఏడ్వసాగింది.
‘‘రాత్రి ఎక్కడున్నారు మరి’’
‘‘పక్కింట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళే ఈ పోలీస్‌ స్టేషన్‌ అడ్రస్‌ చెప్పారు. పొద్దున్నే వచ్చాను. ఇప్పటిదాకా ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు’’ అందామె.
‘‘నా భర్తను పిలిపించి మాట్లాడండి మేడం. ఈ పిల్లలిద్దరితో నేనెక్కడికి పోవాలి. ఇంట్లోకి రానీయరు. నాకెవరూ లేరు. అమ్మా, నాన్న కోవిడ్‌తో చనిపోయారు’’ ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.
‘‘ఏడవకమ్మా! తప్పక పిలిపిస్తాము. మీరు ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళనక్కరలేదు. సఖీ సెంటర్‌ అని మీలాంటి వాళ్ళ కోసం నడుస్తోంది. మిమ్మల్ని, పిల్లల్ని అక్కడ ఉండనిస్తారు.’’
‘‘మా ఆయన్ని పిలిపించి మా ఇంటికే పంపండి మేడం’’ అందామె.
‘‘తప్పకుండా మీ ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తాం. మీ కంప్లయింట్‌ తీసుకున్నాకనే మీ భర్తని పిలవగలుగుతాం. అందాకా మీరు, పిల్లలు సఖీ సెంటర్‌లో ఉండండి.’’
‘‘అదెక్కడుందో నాకు తెలవదు మేడం. ఎలా పోను ఈ పిల్లలతో.’’
అటెండర్‌ భోజనం తెచ్చింది.
‘‘మేం తీసుకెళతాంలే. ఇంకో మేడం వస్తుంది. మీరు అక్కడ కూర్చుని భోజనం చెయ్యండి.’’
ఆమె పిల్లల్ని తీసుకుని పక్క టేబుల్‌ వద్దకు వెళ్ళింది.
సిఐ దగ్గరకు వెళ్ళిన మరో కౌన్సిలర్‌ రూమ్‌లోకి వచ్చింది. ఈమె కేసు గురించి ఇద్దరూ మాట్లాడుకున్నాక సఖి సెంటర్‌కి కాల్‌ చేశారు. కేసు గురించి వివరించాక సఖి వెహికల్‌ పంపించగలరా అని అడిగింది కౌన్సిలర్‌. బయటకు వెళ్ళిందని, టైమ్‌ పడుతుందని చెప్పారు సఖి వాళ్ళు.
‘‘సరే! మేము తీసుకొచ్చి దిగబెడతాం. ఆమె భర్తను పిలిపించి మాట్లాడాలి. ఆమె షెల్టర్‌లో ఉన్నప్పుడే పిలిపిస్తే మంచిది కదా!’’ అంది కౌన్సిలర్‌.
‘‘ఆమె వచ్చాక, తనతో మాట్లాడి మేము ఏం చెయ్యాలో ప్లాన్‌ చేస్తాం’’ అంటూ సఖి కేస్‌వర్కర్‌ ఫోన్‌ పెట్టేసింది.
పిల్లలు, ఆమె తిన్నారు. ఆటో పిలిపించింది కౌన్సిలర్‌. ఏం భయపడవద్దని, సఖి సెంటర్‌లో కొన్ని రోజులు ఉండమని, ఆమె భర్తను పిలిపించి మాట్లాడతామని ధైర్యం చెప్పి ఆటోలో సఖి సెంటర్‌కి బయలుదేరారు. ఆమె ఆటోలో తన సమస్యలను చెబుతూ, ‘‘నేను చెప్పింది ఇంత సావకాశంగా ఎవరూ వినలేదు మేడం. అన్ని గంటలు పోలీస్‌ స్టేషన్‌లో నిలబడి ఉన్నా ఎవరూ ఏమైందమ్మా అని అడగలేదు. చాలా థాంక్స్‌ మేడం, పిల్లలకి, నాకు అన్నం కూడా పెట్టారు’’
‘‘ఎంతవరకు చదువుకున్నావమ్మా?’’
‘‘ఇంటర్‌ చదువుతున్నప్పుడే పెళ్ళి చేశారు. నాకు బాగా చదువుకోవాలని ఉండే. అప్పుడు నాకు పదిహేడేళ్ళు. పెళ్ళయ్యాక వెంటనే ఇద్దరాడపిల్లలు పుట్టడంతో నా కష్టాలకు అంతే లేకుండా పోయింది. అమ్మా నాన్న లేరు. తోడబుట్టిన
వాళ్ళు పట్టించుకోరు’’ ఏడ్వసాగింది.
‘‘బాధపడకమ్మా! మీ అత్తింటివాళ్ళని పిలిపించి మాట్లాడతాం కదా! అర్థరాత్రి అలా ఎలా గెంటేస్తాడసలు.’’
సఖి సెంటర్‌కు చేరుకున్నారు. సెంటర్‌ అడ్మిన్‌తో మాట్లాడి, వివరాలన్నీ చెప్పి ఆమెను అక్కడ జాయిన్‌ చేసింది కౌన్సిలర్‌.
‘‘మేడం! మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు’’ అడిగింది ఆమె.
‘‘అవసరమైతే వస్తాను. వీళ్ళు నీ విషయాలన్నీ చూస్తారు. నీకు, పిల్లలకు బట్టలూ, రోజువారీ ఉపయోగించుకునే వస్తువులన్నీ ఇస్తారు. ఇక్కడ పేరా మెడికల్‌ కూడా ఉంటారు. నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళతారు. అసుపత్రి పక్కనే ఉంది. ఓ వారం రోజులు నిశ్చింతగా ఉండు ఇక్కడ. కౌన్సిలర్‌లు నీతో మాట్లాడతారు. ఏం చెయ్యాలో ప్లాన్‌ చేస్తారు. సరేనా?’’
‘‘సరే మేడం చాలా చాలా థాంక్స్‌’’ అంటూ రెండు చేతులూ జోడిరచింది.
సఖీ సెంటర్‌ అడ్మిన్‌కి చెప్పేసి పోలీస్‌ స్టేషన్‌కి బయలుదేరింది కౌన్సిలర్‌. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు. ఎంతో సంఘర్షణ.
ఓ వారం రోజుల్లో తమ సపోర్ట్‌ సెంటర్‌ని ఇక్కడి నుండి తరలించాలి. పోలీసులే సొంతంగా ఒక కౌన్సిలింగ్‌ సెంటర్‌ పెడతారట. అదెలా ఉంటుందో తెలియదు. తమ సెంటర్‌ లేకపోతే ఇలాంటి బాధితులంతా ఏమవుతారో! కొత్త సెంటర్‌లలో కౌన్సిలింగ్‌ ఎలా
ఉంటుందో ఏమో! ఆమె ఆలోచనలు సాగుతుండగానే ఆటో పోలీస్‌ స్టేషన్‌ ముందాగింది.
తాను పనిచేసే సంస్థ విధి విధానాల ప్రకారం తమ సెంటర్‌కి వచ్చిన బాధిత మహిళలకు భోజనం ఏర్పాటు చేయడం, వాళ్ళవద్ద డబ్బుల్లేకపోతే ప్రయాణ ఖర్చులివ్వడం, వారికి న్యాయ సలహాలు ఇప్పించడం చేస్తున్నారు. వారికి మానసిక సమస్యలుంటే సైకాలజిస్ట్‌కి రిఫర్‌ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.
ఆటో దిగి సెంటర్‌లోకి వెళ్ళిన కౌన్సిలర్‌ తన రూమ్‌లోకి వెళ్ళింది. అప్పటికి ఎస్సై వచ్చారు. ఈ కేసు వివరాలు ఆమెకు చెప్పినప్పుడు ‘‘మీ సెంటర్‌ తీసేస్తే మాకు చాలా కష్టమౌతుంది. మీలా మేము సర్వైవర్‌లకి కావలసిన సహాయాలు చెయ్యలేం. ముఖ్యంగా వాళ్ళకి ఫుడ్‌, ట్రావెల్‌ ఇవ్వడం సాధ్యం కాదు. కొత్త సెంటర్లొస్తున్నాయి కానీ అక్కడ కౌన్సిలింగ్‌ మాత్రమే ఉంటుంది’’ అంది ఎస్సై.
‘‘అవును మేడం! నేనూ అదే ఆలోచిస్తున్నాను. గృహ హింస బాధితులు చాలాసార్లు కట్టుబట్టలతో వస్తారు. సఖి సెంటర్లున్నా కానీ పోలీస్‌ స్టేషన్లకే వస్తాం. కొత్తగా ఏర్పాటవుతున్న కౌన్సిలింగ్‌ సెంటర్లలో బాధిత మహిళలు, పిల్లల కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు, కొంత బడ్జెట్‌ కేటాయింపులు ఉంటే బావుంటుంది. ఈ విషయమై పై అధికారులతో మాట్లాడాలని మా సంస్థ ప్రయత్నిస్తోంది’’ అంది కౌన్సిలర్‌.
‘‘అలా అయితే చాలా బావుంటుంది. కొత్త సెంటర్లలో ఆ ఏర్పాట్లుంటే మాకూ బావుంటుంది.’’
ఆమె వెళ్ళిపోయాక కౌన్సిలర్లు ఇద్దరూ ఆ విషయమై మాట్లాడుకున్నారు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.