నేపథ్యం: జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరానితనం చుట్టూ ఉన్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ రాసినా, ఏదైనా వేదిక మీద మాట్లాడినా, చెప్పాల్సిన విషయాన్ని
తడుముకోకుండా, నసగకుండా చెప్పడం జూపాక సుభద్ర లక్షణం. నిజాన్ని నిర్భయంగా, కుండబద్దలు కొట్టినట్లుగా ముట్లాడటం కొందరికే సాధ్యమవుతుంది. అటువంటి గొంతుల్లో జూపాక సుభద్ర గొంతు మరింత పదునయింది.
ఈ సమాజం ముందుగా నిర్ణయించిన విలువల ప్రకారమే ప్రజల జీవితం నడుస్తుందని, ఎవరికి వారికి ఈ సమాజం ప్రత్యేక విలువలు, ప్రత్యేక స్థానాలు నిర్ణయించిందని సుభద్ర కథలు చెబుతాయి. భారతీయ సమాజంలో, భారతీయ చరిత్రలో సాహిత్యంలో, ఎవరికి వారు వారికి కేటాయించిన మెట్టు మీద నిలబడి వారి స్థాయిని బట్టి రాజపూజ్యమో, అవమానమో పొందుతూనే ఉన్నారు. పై మెట్టు మీద ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాల త్రాసులో ఇరువైపులా రాజపూజ్యమే ఉండగా మెట్టు దిగుతున్న కొద్దీ, బహుజన కులాల త్రాసులో అవమానం పాలు పెరిగి రాజపూజ్యం తగ్గుతూ త్రాసు అసమానమై పోయింది. ఇక దళిత మహిళ దగ్గరకొచ్చేసరికి త్రాసులో రాజపూజ్యం శూన్యమైపోయి రెండు పక్కలా అవమానమే విస్తరించి ఉంటుంది. ఇది ఒకనాటి కథ కాదు. వెట్టిచాకిరీలో వేల యేండ్ల కింద దించిన తల ఒంగిపోయి, శ్రమలో క్రుంగిపోయి, గౌరవమో.. రాజపూజ్యమో ఒకటుంటుందని ఎరగకనే కోటానుకోట్ల దళిత తల్లుల జీవితం ముగిసిపోయింది. వారి పేరుకి, వారి బతుక్కి ఒక గుర్తింపు, ఒక విలువ, ఒక గౌరవం లేదనే చరిత్ర పైపై మెరుగుల అబద్ధాలను నెత్తికెత్తుకొని తిరుగుతోంది. అటువంటి అబద్ధాల చరిత్ర లోతుల్ని బద్ధలు కొట్టి వాస్తవాలను వెలికితీయాల్సిన బాధ్యత ఈ దేశపు మూలవాసుల మీద ఉంది. వాస్తవాల మీద నిలబడి నిజమైన చరిత్రను నిర్మించాల్సిన అవసరం ఉంది. అలా చరిత్రను వెలికి తీయడానికి ఎక్కడి వరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు వారి మూలాల్లోకి వెళ్ళి వారి అమ్మల చరిత్ర, అమ్మమ్మల చరిత్ర, తాతల చరిత్ర వెలికి తీస్తే చాలు.
అంటరానితనం: సాంస్కృతిక, చారిత్రక అవగాహన కథలు
ఈ కథల ద్వారా జూపాక సుభద్ర ఒక సాంస్కృతిక చైతన్యానికి, చారిత్రక అవగాహనకు దారి వేసే ప్రయత్నం చేసింది. తిండి రాజకీయాల దగ్గర నుంచి వక్రీకరణకు గురవుతున్న చరిత్ర, రాజకీయాల వరకు అనేకాంశాలను చాలా సునిశితంగా విమర్శించింది. తన సాంస్కృతిక అస్తిత్వాన్ని బలంగా నిర్మించుకునే ప్రయత్నం చేసింది. సుభద్ర తన కథల ద్వారా మరుగున పడిన తన తల్లి గుర్తింపును తవ్వి తీసింది. ఈ దేశంలో దళితుల పేరుకి విలువ లేదు. గుర్తింపు లేదు. అసలు ఒక శుభ్రమైన, ఘనమైన పేరుండడానికి వీలులేదు. ఉంటే ఆ పేరు రూప విపరిణామమో, శబ్ద విపరిణామమో చెందుతుంది. ఒక అగౌరవ వాచకం పేరు చివరన వచ్చి చేరుతుంది. వెంకయ్య`యెంకjైు్య పోతాడు. వీరయ్య`ఈరిగాడై పోతాడు. ఇది పేరు విలువని కుదించడమే కాదు, ఆ మనిషి విలువని, ఆ మనిషి సామాజిక నేపథ్య విలువని దిగజార్చడం. అలాంటి మార్పునకు గురైన పేరు కనక వీరమ్మ. ఆనవాళ్ళు ఆగమైన అవ్వ ‘కనికిరి’ ఎంతో శ్రమకోర్చి పట్టుదలతో వెదికితే మరుగున పడిపోయింది. ప్రభుత్వ పాత రికార్డుల కట్టలోంచి వెదికి తీసిన పేరిది. తల్లి అసలు పేరుని బయటికి తీయడం ద్వారా ఆమె చుట్టూ సాలెగూడులా అల్లుకొన్న అగౌరవాల ఆధిపత్యాన్ని జూపాక సుభద్ర ఛేదించింది. ఇదే చరిత్ర పునర్నిర్మాణానికి తొలి మెట్టు.
జూపాక సుభద్ర ఈ కథ ద్వారా దళిత సమాజానికి ఒక అజెండాను ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల పాత కాగితాల కట్టల్లో మన గౌరవం, చరిత్ర, మన ఆస్తపాస్తులు కూడా ఉండిపోయాయని చెప్పకనే చెప్పింది.
దళిత బహుజనుల స్వేచ్ఛను నిరోధించాలని, వారి సంస్కృతిని అణచివేయాలని అనుకునే శక్తులు దేశంలో నిరంతరం ఏదో ఒక కార్యాచరణతో దళిత జాతుల మీద, వారి సంస్కృతి మీద దాడి చేయడం ఈ దేశంలో కొత్త కాదు. దళితుల తిండి మీద, విశ్వాసాల మీద నిరంతరం నిఘా పెట్టి పదే పదే టార్గెట్ చేయడం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనే శక్తులు దళితులకు వ్యతిరేకంగా ఎంతటి అబద్దాలను ప్రచారం చేస్తారు, సాంస్కృతిక దాడికి దిగుతారు, భౌతిక దాడులకు సిద్ధపడతారు. అందుకోసం దళిత బహుజనుల నుంచే కార్యకర్తలను సమకూర్చుకుంటారు. ఈ సాంస్కృతిక దురాక్రమణతో భారతీయ దళిత సమాజం వేల ఏళ్ళుగా పోరాడుతోంది. సమకాలీన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక సమాజంలో కూడా దళితులు తమ సమయాన్ని, శక్తిని తమ అభ్యున్నతి కోసం కాకుండా ఇటువంటి ప్రతిఘాత పోరాటాలను ఎదుర్కోవడానికి ఉపయోగించాల్సి రావడం విషాదం. ఈ సాంస్కృతిక దురాక్రమణల దొంగ దెబ్బను జూపాక సుభద్ర తన కథలన్నింటి ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా దళితుల బువ్వగిన్నె మీద రాబందు కళ్ళతో వాలిన పవిత్ర హంసలు దేశ సరిహద్దుల్లో నిఘాపెట్టినట్లు దళితుల ఆహారం మీద నిఘా పెట్టాయి. ఈ కుట్రను ‘బిందాస్ బీఫ్’ ‘నీసు నియ్యతి’ మాకు గిట్ల లేకపాయె, ‘ముద్దుకూర’ కథల ద్వారా వెలికితీసి కుట్ర రాజకీయాల రహస్యాన్ని ఛేదించింది. జ్ఞానం, వివేకం, ఆత్మగౌరవం దిశగా నడిచే దళితులకు సాంస్కృతిక నియ్యతిని అందించింది.
‘‘మన కూర దినక కాల్లన్నీ గుంజుతున్నయే’’‘
‘మంచిగ కడుపు నిండా మన కూర దింటే ఏ రోగం రాదు’’
‘‘యిట్ల దింటినే పొలాలల్ల సెల్వల్ల మొండి కట్టం జేత్తము’’
‘‘సప్పటి తిండ్లు దింటే కాల్లు, రెక్కలు సల్లబడ్తయే’’
‘‘మేమేడ పంజేత్తము గా సప్పటి కూల్లు దిని’’
‘‘నీడన కూసుండెటోల్లకు సెల్లు బాటయితది, మాకేడ అయితది అనేటోళ్ళు’’
దళతులకి ‘ఉప్పులతో వంద G పప్పులోని పది తినే స్తోమత కానీ అవకాశం గానీ లేదు. మా ఆడోళ్ళవి ఉప్పుంటే తొక్కుండని, తొక్కుంటే ఉప్పుండని సంసారాలు’ అని అంటుంది జూపాక సుభద్ర. గ్రామీణ పేదరికంలో దళిత మహిళలు సరైన తిండిలేక రక్తహీనతతో, బలహీనతతో, పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. చాలీచాలని ఆదాయం కారణంగా మంచి ఆహారం పొందలేక పోతారు. అటువంటి వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తినిచ్చేది ‘బీఫ్’. పేదలకి అందుబాటులో ఉన్న అటువంటి ఆహారాన్ని కూడా వారికి అందకుండా చేయడం ద్వారా వారిని మరింత బలహీనపరచడం ఈ శక్తుల కుట్రలో దాగిన రహస్యం. ఈ కుట్ర సుభద్ర కథలు విడమర్చి చెప్పాయి. దీంతోపాటు ఈ కుట్రలో దాగి ఉన్న సాంస్కృతిక అణచివేత రహస్యాలను కూడా ఈ కథలు బహిర్గతం చేశాయి. ‘‘హాస్టల్స్‌లో చికెన్, మటన్ రైట్ రాయల్‌గా బెట్టినట్టు బీఫ్నెందుకు బెట్టరు?’’. హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు క్యారేజీలో మన కూర తేవొద్దని తల్లిదండ్రులకు చెబుతారు. ‘‘అపార్టుమెంటుల్లో నీసు/బీఫ్ మీద నిఘా ఉంటుంది. కొన్ని స్కూళ్ళల్లో టీచర్లు లంచ్ బాక్స్‌లు తెరిచి చూసి, నీసు తెచ్చుకున్న పిల్లల్ని వేరే కూర్చోబెట్టటం’’, ‘‘నాన్‌వెజ్ తింటే నాలుక మందం అయి చదువు రాద’’ని చెప్పడం, ‘‘కొత్త కానూన్ వచ్చిందని, ఊర్లో సూదరోల్లు గొడ్డుని కొయ్యనియ్యక పోవడం, కేసులు బెట్టి అరెస్టులు చేయించడం’’ వంటి సాంస్కృతిక అణచివేత నుంచి దళిత జాతి బయటపడాల్సిన అవసరాన్ని, బయటపడే మార్గాన్ని నిర్దేశించింది.
మలితనం అంటరానితనం కథలు: తొలితరం దళితులు అనుభవించిన అంటరానితనం దాటి, మలితరం దళితులు అనేక ఆధునిక రూపాలలో అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు. అటువంటి మలితరం దళితులు అనుభవిస్తున్న అంటరానితనాన్ని ప్రతిబింబించే కథలు రాసింది జూపాక సుభద్ర. అలాంటి నేపథ్యమున్న కథలు ఈ పుస్తకంలో నాలుగున్నాయి. చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళకు, పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళకు ఇంకా అంటరానితనం ఎక్కడుంది అని అడుగుతున్న వాళ్ళకు సమాధానం ఈ కథలు. ఈ నాలుగు కథల్లోను ఒక ఆత్మ కథాత్మకత మనకు కనిపిస్తుంది. చదువుకునే వయసులో, ఉద్యోగంలో స్థిరపడిన కాలంలో, కాస్త మెరుగైన జీవితం అనుభవించే స్థితిలో ఎదుర్కొంటున్న ఆధునిక అంటరానితనం రూపాలను ఈ కథల్లో చూపెట్టింది సుభద్ర. ఎంత చదువుకున్నా, ఎలాంటి ఉద్యోగం చేసినా ఈ సమాజం దళితుల్ని మొహం చూసి గుర్తుపడుతుంది. దళితులకు మొహం ఒక క్యాస్ట్ సర్టిఫికెట్. అవతలివాళ్ళకు ఈ మొహాలు చూడగానే అలుసుగా అనిపిస్తుంది. ఎంత మాటైనా అనేయొచ్చనే ధైర్యం వస్తుంది. ‘మంచిగ మూడు పూటలు తింటున్నా కూడా మొకంల పురాతరాల దైన్యం, ఆకలి, అవమానాలన్నీ క్యారీ అవుతాయేమో. అవతల వాళ్ళలో వెంటనే ఒక ఆధిపత్యపు అహంకారం నిద్రలేస్తుంది. నల్లగా, బక్కగా ఉన్నవాళ్ళ పట్ల వ్యతిరేకత, చులకన భావం ఒక్కసారిగా బయటికొస్తాయి. అలా కొందరిని చూడగానే మనిషిలో, మనసులో, మొహంలో కనిపించే అసమనం, అసహ్యం ఒక పెద్ద సుదీర్ఘ రోగం. అటువంటి రోగంతో ఉన్న మూకల్ని దళిత సమాజం తరతరాలుగా భరిస్తూ ఉంది.
హోదాలో ఉన్న దళితుల్ని అవసరాలకి వాడుకుంటూనే అవకాశం దొరికినప్పుడు ఆధిపత్యాన్ని, అంటరానితనాన్ని ప్రదర్శించే భాగ్యలక్ష్మి లాంటి వాళ్ళను జూపాక సుభద్ర గుర్తించింది. అటువంటి వాళ్ళ పట్ల స్పృహతో ఉండాలని చెబుతుంది. కూటికి పేదలు, ఇళ్ళల్లో పాచిపని చేసుకొని బతికే స్థాయిలో ఉన్నవారు కూడా వారికంటే మెరుగైన ఆర్థిక స్థితిలో ఉన్న దళితుల పట్ల కూడా అంటరానితనం పాటిస్తారని, కులం తెలిస్తే వాళ్ళిళ్ళల్లో పని చేయరని, చీదరించుకుంటారన్న వాస్తవాన్ని ‘‘కూటికి పేదనైనా’’ కథ చెబుతుంది.
కుల వివక్ష, అంటరానితనం కేవలం పై కులాల నుంచే కాక తమ సమీప కులాల నుంచి కూడా ఉంటాయన్న సూక్ష్మ వాస్తవాన్ని సుభద్ర సునిశిత దృష్టితో ఈ కథల్లో ప్రస్తావించింది. సమీప బి.సి. కులాలతో పాటు మాలలు కూడా కులంతో పాటు అవకాశమొస్తే మాదిగల పట్ల అంటరానితనం చూపిస్తారని, చివరికి ఆదివాసీల మనసులో కూడా అటువంటి భావజాలం ఉందని సుభద్ర కథలు చెబుతాయి. దళితుల్లో కొందరు బ్రాహ్మనైజ్ అయినట్లుగానే ఆదివాసిల్లో కూడా హిందువైజేషన్ ఎక్కువైందని సాంస్కృతిక పరాయీకరణకు ఆదివాసీలు గురవుతున్నారని సామాజిక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరాయీకరణలో ఆదివాసీలు తమను తాము కోల్పోతున్న విషయాన్ని కూడా సుభద్ర ‘‘తీర్థం బోతున్న తిమ్మక్క’’ కథలో చెబుతుంది. ఆదివాసీలు రకరకాల తెగలుగా ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉన్నారు. కానీ బ్రాహ్మణీకరణ, హైందవీకరణ వాళ్ళను సొంత సాంస్కృతిక అస్తిత్వం నుంచి ఎంత పరాయీకరణకు గురిచేసిందో సుభద్ర కథ చెబుతుంది. తన బాల్యం నాటికి, ఇప్పటికీ జరిగిన సాంస్కృతిక మార్పుని ఈ కథలో చెప్పింది. ఈ కథల్లో జూపాక సుభద్ర మనకు అనేక పాత్రల్ని పరిచయం చేస్తుంది. అనేక రూపాలలో వివక్షను మోస్తున్న ఈ పాత్రల జీవితాల్లో వాస్తవాలని మన కళ్ళ ముందుకు తెస్తూ పొరలు పొరలుగా విస్తరించి ఉన్న అణచివేతను, పితృస్వామ్య క్రూరత్వాన్ని జూపాక సుభద్ర ఈ పాత్రల ద్వారా చూపెడుతుంది. కాళ్ళు చచ్చుబడి నడవలేక, కూర్చుని దేకే ప్రశాంతి మహిళగా, దళితురాలిగా, వికలాంగురాలిగా ఎంత వివక్షను అనుభవించినా, తన అస్తిత్వాన్ని చెరిపివేసే పెళ్ళిని నిక్కచ్చిగా కాలదన్ని ఆత్మగౌరవాన్ని మించింది లేదని నిరూపించింది.
‘ఓ సర్పంచి వల(స)పోత’, ‘రాణిర్కమ్’ కథల ద్వారా చిన్న చిన్న పదవులెక్కిన దళిత స్త్రీలు గ్రామానికి సేవ చేయడం కోసం, పదవి ద్వారా తమకొచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడం కోసం అప్పుల పాలైనా సరే, చాకిరీ చేసైనా సరే విడవకుండా పనిచేసే తపనని ఈ కథలో చెప్పింది.
నిజానికి దళిత మహిళలకు రిజర్వేషన్లలో దక్కిన సర్పంచి పదవులు చాలాచోట్ల వారి మెడలకు గుదిబండలుగా మారాయి. పెత్తనం చేసే ఊరి పెద్దల చేతిలో కీలుబొమ్మగా చేసే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల తమను తాము నిరూపించుకునేందుకు ఊరికేదో చేసి అప్పుల పాలయ్యారు. అటువంటి పరిస్థితులను ఈ కథల్లో ఎంతో నేర్పుగా చెప్పింది సుభద్ర. దళితవాదం, అంబేద్కరిజం తమ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అని చెబుతున్నాయి. రాజ్యాధికార తొలిమెట్టు ఊరిలో సర్పంచి పదవి దగ్గరే మొదలవుతుంది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా తమను తాము పాలకులుగా నిరూపించుకునే అవకాశం వదులుకోవద్దని, ముఖ్యంగా దళిత మహిళలు రాజ్యాధికారం విషయంలో ఎలా ఆలోచించాలో ఈ కథల్లో చెప్పింది సుభద్ర. రాజరికాల కాలం పోయినా రాణిర్కమ్ రావాలని కాంక్షిస్తుంది.
కథల ఆకాంక్ష: జూపాక సుభద్ర ఒక స్నేహితురాలిగా మన పక్కన కూర్చుని తెలంగాణ భాషలో చాలా అలవోకగా కథ చెబుతున్నట్లుగా నడుస్తాయి ఈ కథలు. మధ్య మధ్య తెలంగాణను ప్రతిబింబించే సింగరేణి లాంటి పోలికలు, గొడ్డుకూర వాసనలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. సుభద్ర కథలు దళిత సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబించడంతో పాటు దళితుల ప్రాధాన్యతాంశాలుగా ఎన్నుకోవలసిన విషయాలను ఈ కథల ద్వారా స్ట్రెస్ చేసి మరీ చెప్పింది. చదువు సంస్కృతి చరిత్ర ఆత్మగౌరవ ప్రాధాన్యతలను గుర్తించాలని ఈ కథల్లో పాత్రల ద్వారా మనకర్థమవుతుంది.
‘రిజర్వేషన్ బోగీ’ కథలు దళిత యువతరానికి కొత్త చూపుని ఇస్తున్నాయి. తెలంగాణ దళిత జీవనపు అనేక పార్శ్వాలను ప్రతిబింబించిన ఈ కథలు దళిత స్త్రీల ఆత్మగౌరవాన్ని, ప్రజాస్వామిక విముక్తిని కోరుకుంటున్నాయి.