రాజ్యాంగ రచనా కార్యక్రమంలో అఖండ విజయం సాధించిన అంబేద్కర్ మరో విప్లవాత్మకమైన ప్రణాళికను చేపట్టారు. ఇది మరో సమరం. హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేసి, దానిని సమకాలీన సమాజానికి అనుగుణంగా రూపొందించడానికి పదేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
1941లో భారత ప్రభుత్వం బి.ఎస్.రావు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఇందుకోసమే వేసింది. ఈ కమిటీ దేశమంతా పర్యటించి అనేకుల అభిప్రాయాలు సేకరించి హిందూకోడ్ బిల్లును తయారుచేసింది. అలా రూపుదిద్దుకున్న ఈ బిల్లు 1946 నుండి సెంట్రల్ అసెంబ్లీలో నలుగుతూ ఉండిపోయింది. నవసమాజ నిర్మాణ కుతూహలాయత్త చిత్తుడైన అంబేద్కర్ దీన్ని సునిశితంగా పరిశీలించారు. సమష్టి కుటుంబం, స్త్రీల ఆస్తి హక్కులను గురించిన కొన్ని విషయాలు ఆయనను కలతపెట్టాయి.
ఈ బిల్లును చక్కగా సవరించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకున్నారు. సంఘంలో స్త్రీలకు తగిన ప్రాధాన్యాన్నిస్తూ దాన్ని తీర్చిదిద్దారు. అంబేద్కర్ ఈ బిల్లు విషయం పరిశీలిస్తున్నారనగానే దేశంలోని మేధావులంతా రెండు వర్గాలుగా చీలిపోయి చర్చలు, వాదోపవాదాలు మొదలుపెట్టేశారు. సంస్కరణవాదులొక వంక, సనాతనులు మరో వంక. దీనికోసం ఊరూరా సంఘాలు ఏర్పడ్డాయి. పత్రికలు వెలిశాయి. తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. సమాజాన్ని ప్రగతిపథం వైపు మళ్ళించాలని ఒక వర్గం ఆవేశపడుతుంటే, పూర్వాచారాలు మంటగలుస్తున్నాయని ఆవేదనతో మరో వర్గం ఆక్రోశించింది. వేద పురాణ శాస్త్ర పరిజ్ఞానం ఇరుపక్షాల వారిలోనూ పుష్కరంంగా ఉంది. విద్యా వివేకాలలో ఎవరూ తీసిపోరు. ఒకవైపు మనువు, రెండోవైపు అభినవ మనువు. ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ చర్చల వల్ల ఆనాటి సమాజానికొక నూతన దృక్పథం, నవ్యస్ఫూర్తి అలవడ్డాయని చెప్పక తప్పదు. అంత భావపరివర్తనకు కారకుడు అంబేద్కర్. మార్పును ఇష్టపడని ఛాందసులు నిర్భయంగా తమ మనసులోని మాట చెప్పలేక ఏవేవో కుంటిసాకులతో దీన్ని అడ్డగించాలని చూశారు. తమ సంకుచిత మనస్తత్వాన్ని పదిమంది ముందు ఒప్పుకునే ఔదార్యం లేపప్పుడు దానికేదో ముసుగు వేయక తప్పదు మరి. మొదటి సాధారణ ఎన్నికల తర్వాత ఈ విషయం ఆలోచించవచ్చు, ఇప్పుడు తొందరెందుకు అనేవారు కొందరుÑ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఇవి కాలరాస్తున్నాయని మరికొందరు… ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
1950 జనవరి 11న బొంబాయిలోని సిద్ధార్థ కళాశాలలో మాట్లాడుతూ అంబేద్కర్ ఈ బిల్లు గురించి చెప్పారు, ‘‘ఈ బిల్లు విప్లవాత్మకంగా, మౌలికమైన మార్పులతో కూడి ఉందనటం పొరపాటు. సంప్రదాయాన్ని ఇది ఏ విధంగానూ నిరసించటం లేదు. సమాజ వికాసానికి, వ్యక్తుల శ్రేయస్సుకూ కొత్త ద్వారాలు తెరుస్తోంది, అంతే. స్వతంత్ర భారతదేశపు రాజ్యాంగం ప్రకారం మొత్తం దేశానికి ఉపయుక్తమయ్యే సివిల్ కోడ్‌ను ఏర్పాటు చేయాలని అభిలషిస్తోంది. ‘హిందూ లా’ లోని కొన్ని అంశాలను సవరించి, విస్తరించి శ్రేయోరాజ్యం సాధించడమే మన ధ్యేయం. ఈ సవరణలను ప్రతిఘటించే శక్తి హిందూ సమాజానికి ఉందని తెలుసు కానీ, దేశ ఐక్యతకు అవసరం కాబట్టి ఈ సవరణలు చేస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘సవరించిన ఈ న్యాయసూత్రాలు సులువుగా అర్థమవుతాయి. దేశానికంతటికీ వర్తిస్తాయి. దీని ప్రకారం హిందువు ఎవరినైనా పెంచుకోవచ్చు. ఆస్తి విషయంలో తన ఇష్టానుసారం వీలునామా రాయవచ్చు. హిందూ శాస్త్రాలు, స్మృతులే ఈ బిల్లుకు ఆధారం. ఆస్తి విషయంలో దాయభాగం ఉండనే ఉంది. విడాకులు ` కౌటిల్యుడు, పరాశరుడు చెప్పిన ప్రకారమే ఇందులో ఉంది. ఇక స్త్రీ ఆస్తి హక్కులు బృహస్పతి స్మృతి ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి’’ అని అంబేద్కర్ వివరించారు. శాస్త్రాలు, స్మృతులు ఆయనవలె అధ్యయనం చేసినవారు దేశంలో తక్కువ.
అదేరోజు సాయంత్రం (1950 జనవరి 11న) బొంబాయిలోని నిమ్నజాతుల సమాఖ్య వారు పారెల్లో ఒక సభ ఏర్పాటు చేసి భారత రాజ్యాంగపు ప్రతిని ఒక బంగారు తొడుగులో పెట్టి అంబేద్కర్‌కు బహుకరించారు. వారు తనపట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు ముగ్ధుడయ్యారు అంబేద్కర్. నిమ్నజాతులకు తనపట్ల వైమనస్యం కలిగిందనీ, తన నాయకత్వపు పరిధి సన్నగిల్లుతోందనీ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఎంత అర్థరహితమైనదో ఈ సభ నిరూపిస్తున్నదని ఆయన అన్నారు. అంతవరకూ తనను ముస్లింలకూ, ఆంగ్లేయులకూ హితవరిగా భావిస్తున్న హిందువులు తమ తప్పు గ్రహించి రాజ్యాంగ రచనను తనకు అప్పగించడం, తాను ఆ అవకాశాన్ని వినియోగించడం గురించి ప్రస్తావించారు. ఇంతకుముందటి అంబేద్కర్ ఉపన్యాసాలకూ, ఈ ఉపన్యాసానికి చాలా భేదం ఉంది. నిమ్నజాతులు తమకోసమే కాక మొత్తం దేశం కోసం కృషి చేయాలని ఈసారి అంబేద్కర్ ప్రబోధించడం విశేషం. ఇంతవరకు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించవలసిందిగా ఆయన నిమ్నజాతులను కోరలేదు. ఎందుకంటే వారి భవిష్యత్తే వారికి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు నిమ్నజాతులకు కూడా ఇతర ప్రజలతో పాటు దేశ సంక్షేమానికి పాటుపడవలసిన సమయం వచ్చిందనీ, దేశం పట్ల తమ నిర్లిప్తతను వారు వదిలిపెట్టాలనీ అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగ రచనానంతరం అంబేద్కర్ ఆలోచనా సరళి కొంత మారింది. తాను రూపొందించిన రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర భారతదేశంలో నిమ్నజాతులు కూడా ఇతరులతో పాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పురోగమించగలరనే నమ్మకం ఆయనకు కలగడమే ఇందుకు కారణం.
జనవరి 29న ఢల్లీిలోని మహారాష్ట్ర సంఘాలు అంబేద్కర్‌ని సన్మానించాయి. అంబేద్కర్‌కు తన రాష్ట్రమన్నా, తన వారన్నా ఎంతో అభిమానం. మహారాష్ట్రులు చాలా నిక్కచ్చి మనుషులనీ, కర్తవ్యపరాయణులనీ తరచూ చెప్తుండేవారు.
ఈసారి ఆయన జన్మదినం మరింత వైభవంగా జరిగింది. ఆ సందర్భంగా బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాగ్లా ఒక సభకు అధ్యక్షత వహించారు. నిమ్నజాతుల నాయకునిగానే కాకుండా భారతదేశ నాయకునిగా అంబేద్కర్ సేవలను శ్లాఘించారు. చాగ్లా, అంబేద్కర్లు ఇంచుమించు ఒక్కసారే లాయర్లుగా ప్రాక్టీసు ప్రారంభించారు. బొంబాయి న్యాయ కళాశాలలో ఇద్దరూ ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పారు. వారి పరిచయం అప్పటిది.
ఢల్లీిలో కూడా అంబేద్కర్ జన్మదినోత్సవాలు వైభవంగా జరిగాయి. హనుమంతయ్య గారి అధ్యక్షతన ఒక సభ జరిగింది. గిధ్వా అనే పార్లమెంట్ సభ్యుడు అంబేద్కర్‌ను ప్రశంసిస్తూ అంటరాని వారికి రాజకీయ హక్కులుండాలన్న విషయంలో అంబేద్కర్ వల్లనే గాంధీ ప్రభావితుడయ్యాడని అన్నారు.
హిందూకోడ్ బిల్లు తుది స్వరూపం గురించి అంబేద్కర్ అత్యంత శ్రద్ధతో కృషి చేశారు. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా హిందూ సమాజపు చట్రాన్ని కొంత వదులుచేసే సువర్ణావకాశం తనకు, ఒక మహర్‌కు లభించడం అనే ఆలోచనే ఆయనను ఉద్వేగపూరితుని చేసింది. ఆ ఊహతోనే ఉత్సాహం నింపుకున్నారు. ఆ బిల్లు తయారుచేయడం అత్యంత కష్టసాధ్యమైన పని. అయినా అందుకు నడుం బిగించారు. అంబేద్కర్ ఈ బిల్లు తయారుచేసేటప్పుడు ఒక గది పూర్తిగా ఇందుకు సంబంధించిన పుస్తకాలతోను, రాత ప్రతులతోను నిండి ఉండేది. తదేక దీక్షతో ఈ విషయాన్ని గురించి ఆలోచించి, చర్చించి ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. కళ్ళు పాడయ్యాయి. చదవడం, రాయడం మానెయ్యాలని డాక్టర్లు చెప్పారు. కాలు కూడా నొప్పిగా ఉండేది. ఆ నొప్పివల్ల కొన్ని కార్యక్రమాలే మానుకున్నారు. కానీ హిందూకోడ్ బిల్లును మాత్రం వదల్లేదు. ఆయన దృష్టంతా ఆ బిల్లు మీదే. ఆ బిల్లు పట్ల తన వైఖరిని, తాను చేయదలచుకున్న సవరణలను విశదీకరిస్తూ ముందుగానే నవంబరు (1950) నెలలో 32 పేజీల ప్రతిని తయారుచేసి పార్లమెంటు సభ్యులందరికీ పంపారు. అప్పటికే దేశంలో అలజడి రేగింది. హిందూ సంస్థల నుండి ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అంబేద్కర్ చేతిలో రూపొందిన హిందూకోడ్ బిల్లు సమాజ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేస్తుందని, తమ ప్రాముఖ్యం పోతుందని చాలామంది భయపడ్డారు.
ఈ బిల్లును స్వామి కర పత్రిజీ, జ్యోతిర్మఠం శంకరాచార్యులు వ్యతిరేకించారు. ప్రఖ్యాత వేదపండితుడు పండిట్ ధర్మదేవ్ విద్యావాచస్పతి సమర్ధించారు.
అంబేద్కర్ ఆ బిల్లును ఆ సమావేశాలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ దేశంలో వివిధ సంస్థల ఒత్తిడివల్ల న్యాయశాఖ దాన్ని పునఃపరిశీలనకు తీసుకుంది. ఈ బిల్లు చర్చకు రాకుండానే పార్లమెంటు 1951 ఫిబ్రవరికి వాయిదా పడిరది. అంబేద్కర్ చాలా నిరుత్సాహపడ్డారు.
ఈ బిల్లుతో హిందూ సమాజం విచ్ఛిన్నమైపోతుందని కొందరు జోస్యం చెప్పారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి తగిన వాతావరణం ఇంకా భారతదేశంలో ఏర్పడలేదన్నారు కొందరు కాంగ్రెస్ వారు. 1945 నాటి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఈ బిల్లు విషయం లేదని ప్రతిపక్షాలు వాదించాయి. రాష్ట్ర అసెంబ్లీ నుండి పరోక్షంగా ఏర్పడిన పార్లమెంటుకు ఈ బిల్లును ప్రవేశపెట్టే అధికారం లేదనీ, ఇది కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వం అనీ రకరకాల వ్యాఖ్యానాలు చేయసాగారు.
కాంగ్రెస్ పార్టీలో ఈ బిల్లు గురించి విభేదాలు వచ్చాయి. అప్పుడే అమెరికా నుండి తిరిగి వచ్చిన నెహ్రు ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించారు. ఈ బిల్లును అంగీకరించకపోతే తన ప్రభుత్వమే రాజీనామా చేస్తుందన్నారు. పటేల్, రాజేంద్రప్రసాద్ లిద్దరూ ఈ బిల్లుకు వ్యతిరేకులు. 1951 ఫిబ్రవరి 5న అంబేద్కర్ హిందూకోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దానినెలాగైనా ఆమోదింపచేయాలని ప్రయత్నించారు. ఆయన ప్రతిపాదించిన ఈ బిల్లులోని ముఖ్యాంశాలు ` 1. మగపిల్లలకు కుటుంబ ఆస్తిలో ఎంత హక్కుందో, ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉండడం (ఆడ, మగ సంతానం ఒకే విధంగా చూపబడిరది). 2. స్త్రీలకు పిల్లలను దత్తత ఇచ్చే అధికారం పూర్వం లేదు. ఈ బిల్లు ప్రకారం భర్త అన్యమతంలోకి మారినా లేక గతించినా, తాను హిందువుగా ఉన్నన్నాళ్ళు స్త్రీ కూడా తన పిల్లలను దత్తతకివ్వవచ్చు, అలాగే దత్తత తీసుకోవచ్చు. 3. పూర్వం దత్తత తీసుకోబడిన కుర్రవాడు దత్తు తీసుకున్న తల్లికి ఆస్తిలో ఎట్టి హక్కు లేకుండా చేసేవాడు. దాన్ని మార్చి, ఆస్తిలో దత్తు కుమారునికి సగం, దత్తు తల్లికి సగం వచ్చేటట్లు ఈ బిల్లులో ఏర్పాటు చేశారు. 4. స్త్రీ పునర్వివాహం చేసుకుంటే ఆమెకు వారసత్వం వల్ల రావలసిన ఆస్తి హక్కు పోతోంది. 5. వివాహ విషయంలో ఏ శాఖకు, వర్గానికి చెందినవారు ఆ శాఖలో కానీ, ఇష్టం ఉన్నవారు అంతర్వర్ణ వివాహాలు కానీ చేసుకోవచ్చు. వివాహ విషయంలో పాత కొత్తల కలయిక ఇది. 6. బహు భార్యత్వం రద్దు. 7. భార్యాభర్తలు తమ వివాహాన్ని విడాకుల ద్వారా రద్దు చేసుకోవచ్చు. 8. వివాహం వలనే దత్తు కూడా ఏ వర్గంలో నుంచైనా చేసుకోవచ్చు. 9. ఒక కుటుంబంలోని భాగస్తులందరికీ ఆస్తిలో నిర్ణీత సమభాగాలుంటాయి. ఇది నిశ్చయంగా, పురోగమనాన్ని కాంక్షించే బిల్లు. అయినా దీన్ని చాలామంది వ్యతిరేకించారు. సాంఘిక సమస్యలలో ప్రభుత్వం జోక్యం
ఉండరాదని వారు బాహాటంగా చెప్పారు. మూఢ సంప్రదాయాలతో నిండి ఉన్న నాటి సమాజానికి ఈ బిల్లు పిడుగుపాటువలే తోచింది.
పండిట్ ఠాకూర్‌దాస్ భగవాన్‌దాస్ ఈ బిల్లు నుండి పంజాబ్‌ను మినహాయించాలని కోరాడు. సిక్కు నాయకుడు హుకుంసింగ్, హిందూకోడ్ బిల్లు సిక్కులను తమలో విలీనం చేసుకోవడానికి హిందువులు తలపెట్టిన ఎత్తుగడగా ప్రతిఘటించారు. సెక్యులర్ స్టేట్‌కు ఈ బిల్లు భిన్నంగా ఉందన్నారు మరికొందరు.
ఇది హిందూ దేశమంతటికీ, సిక్కులు, బౌద్ధులు, జైనులు… అందరికీ ఒకే బిల్లు. దాన్ని కాదనడం దేశ ఐక్యతకు గొడ్డలిపెట్టు. బుద్ధుడు కానీ, మహావీరుడు కానీ ప్రధానమైన హిందూ న్యాయసూత్రాలను కాదనలేదు. 1830 నాటికి ప్రీవీ కౌన్సిల్ సిక్కులకు హిందూ న్యాయశాస్త్రమే వర్తిస్తుందని చెప్పింది కదా! దేశానికంతటికీ చక్కని న్యాయ సూత్రాలను ప్రవేశపెడుతుంటే ఇందరు ఇన్ని రకాలుగా ప్రతిఘటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు అంబేద్కర్. ‘సెక్యులర్ స్టేట్ అని రాజ్యాంగంలో చెప్పిన దానికి దేశంలో మతం అనేది ఉండదని అర్థం కాదు. ప్రభుత్వం ఏ మతాన్నీ ఎవరిమీదా బలవంతంగా ఆరోపించదనే అర్థం’ అని చెప్పారు.
1951 ఫిబ్రవరిలో ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చ మొదలవగానే సభ్యులు రకరకాల సందేహాలు లేవనెత్తారు. సత్యార్థ ప్రకాశికలో దయానంద సరస్వతి ఏమి చెప్పారు? అంటూ చర్చలు మొదలుపెట్టేవారు. ‘‘ఈ చర్చలకు చాలా సమయం పట్టేలా ఉంది. సమయం ఆదా చేసుకోవడానికి నేనొక సూచన చేస్తాను’’ అని అంబేద్కర్ ఏదో చెప్పబోతుండగా శ్రీ త్యాగి
(ఉత్తరప్రదేశ్ సభ్యుడు) లేచి ‘‘బిల్లు ఉపసంహరించుకో. అదే సమయం ఆదా చేసే గొప్ప మార్గం’’ అన్నాడు. అక్కడి ప్రసంగం అలా నడిచింది.
Dr.Ambedkar – May I make a suggestion in the interest of economy of time
Sri Tyagi – Withdraw the bill, that is the best economy of time
Dr. Ambedkard – That would be too much of an economy. If you look at the…(5.2.1951 నాటి ప్రసంగం నుంచి)
స్త్రీలను బలోపేతం చేయడానికి అంబేద్కర్ ఇలాంటి పరిహాసాలెన్నో సహించారు. చర్చ జరుగుతున్నన్ని రోజులూ, ఎవరో ఒకరు ‘‘బిల్లు ఉపసంహరించుకో’’ అని హెచ్చరిస్తున్నట్లే మాట్లాడేవారు.
అభిప్రాయ సేకరణ జరగాలన్న కొందరి వాదనను అంబేద్కర్ తోసిపుచ్చారు. పార్లమెంటుకు ప్రజాస్వామ్యంలో అన్ని అధికారాలు ఉన్నాయి, చట్టాలు చేయడానికి, మానేయడానికి పార్లమెంటుకు అధికారం ఉంది అన్నారు. మూడురోజుల వాద ప్రతివాదనల అనంతరం బిల్లును తర్వాతి సమావేశానికి (1951 సెప్టెంబరు) వాయిదా వేశారు. అంబేద్కర్‌ను నిరుత్సాహం ఆవహించింది.
ఈ రోజుల్లోనే అంబేద్కర్ వ్యాసం ‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది హిందూ విమెన్’ (‘The rise and fall of the Hindu Woman) అనేది కలకత్తా నుండి ప్రచురితమవుతున్న ‘మహాబోధి’ పత్రికలో వచ్చింది. హిందూ దేశంలో స్త్రీల స్థితి దిగజారిపోవడానికి బుద్ధుడే కారణమని చెప్తూ ‘ఈవ్స్ వీక్లీ’లో వచ్చిన ఒక వ్యాసానికి సమాధానంగా అంబేద్కర్ ఈ వ్యాసం రాశారు.
అమితంగా గ్రంథ సంచయనం చేసి, శాస్త్ర విషయాలలో అపారమైన పాండిత్యం సంపాదించిన అంబేద్కర్ రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పటికి నిగ్రహం కోల్పోయేవాడు. కాంగ్రెస్ మీద కోపంతో కొంచెం అతిగానే మాట్లాడేవాడు. ముఖ్యంగా దళిత జాతుల విషయాలలో సవర్ణ హిందువులపై విరుచుకుపడేవాడు. ఢల్లీిలో 1951 ఏప్రిల్ 15న అంబేద్కర్ భవన్‌కి శంకుస్థాపన చేస్తూ, ఆయన దళిత జాతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించిన తీరు చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ప్రధాని నెహ్రు తన నిరసనను వెల్లడిస్తూ అంబేద్కర్‌కు లేఖ రాశారు. అలాంటి ధోరణిలో మాట్లాడే అంబేద్కర్ కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగరాదని కొందరన్నారు. ఆ వ్యాఖ్యానాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని కొందరు, జాతిని గురించి అతడీ విధంగా మాట్లాడడంలో తప్పు లేదని మరి కొందరు వాదప్రతివాదనలు సాగించారు. అతని మాటలకు విలేఖరులు విపరీతార్థాలు తీశారని ఆయన అనుచరులు వాదించారు. పార్లమెంటులో ఈ విషయమై చర్చ జరిగింది. నెహ్రు మంత్రిమండలికి రాజీనామా చెయ్యాలనీ, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలనీ, అంబేద్కర్ రాజీనామా చెయ్యాలనీ రకరకాల సలహాలు వచ్చాయి. అభిమానధనుడైన అంబేద్కర్ ఇవన్నీ సహించి మంత్రివర్గంలో ఉండటానికి కారణం హిందూకోడ్ బిల్లు. వచ్చే ఎన్నికలలోపే ఈ బిల్లును పార్లమెంటు చేత ఆమోదింపచేయాలన్న గాఢమైన కోరికే ఆయనను ఆపి ఉంచిందని సన్నిహితులకు మాత్రమే తెలుసు.
అంబేద్కర్ మంచి వక్త. చక్కని ఛలోక్తులు విసిరేవారు. పార్లమెంటులో ప్రజా ప్రతినిధుల బిల్లును ప్రవేశపెడుతూ 1951 మే నెలలో ఆయన 90 నిమిషాలపాటు ఉపన్యసించారు. ప్రజా ప్రతినిధులు ఎలా ఉండాలో చెబుతూ, ‘‘పార్లమెంటు బృంద గాయనీమణుల సంగీత కచేరీలాగ మారిపోకూడదు. ప్రభుత్వం ఏది చెప్పినా విధేయంగా, ‘అవును’ అని వంత పాడడం ప్రజాప్రతినిధులు చేయవలసిన పని కాదు’’ అని అనగానే సభ్యులంతా గొల్లున నవ్వారు. ఎంతో గంభీరంగా ఉన్న వాతావరణం ఉల్లాసంగా మారిపోయింది. ‘‘ఒక సభ్యుడు పార్లమెంటేరియన్ గానూ, పర్మిట్ హోల్డర్ గానూ ఉండదల్చుకుంటే కుదరదు. ఏదో ఒకటి ఎంచుకోవాలి’’ అని అంబేద్కర్ చెబుతుంటే బెంగాల్‌కు చెందిన లక్ష్మీకాంత్ మైత్రా లేచి ‘‘ఏది లాభదాయకం?’’ అని సలహా అడిగాడు. తన చతురోక్తులతో, ఉపమానాలతో అంబేద్కర్ సభకు జీవం పోసిన సందర్భాలు అనేకం.
మే నెలలో బుద్ధ జయంతి ఉత్సవాల సమయంలో ఢల్లీిలో మాట్లాడుతూ, అంబేద్కర్ మరోసారి హిందూ మతాన్ని విమర్శించాడు. సంఘంలోని దురలవాట్లు, హింసాకాండ, దౌర్జన్యం, ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి, లంచగొండితనం మొదలైనవన్నీ హిందూ మత క్షీణతను సూచిస్తున్నాయనీ, ఈ సమయంలో బౌద్ధ ధర్మమొక్కటే హిందూ దేశానికి శరణ్యమనీ అన్నారు. ఆ సమావేశానికి ఫ్రాన్స్ రాయబారి అధ్యక్షత వహించారు. ఢల్లీిలోని విదేశీ రాయబారులు చాలామంది ఆ సమావేశంలో ఉన్నారు.
హిందూకోడ్ బిల్లును ఎలాగైనా పార్లమెంటు చేత ఆమోదింపచేయాలని చూస్తున్న అంబేద్కర్, అందుకోసమే మంత్రివర్గంలోని సహచరులతో ఎలాగో నెట్టుకొస్తున్న అంబేద్కర్, పదే పదే హిందూ మతాన్ని విమర్శించడాన్ని పత్రికలు విమర్శించాయి. చారిత్రకంగా అతను చెప్పినది నిజం కాదని నిరూపించడానికి ప్రయత్నించాయి. అయితే హిందూ నాయకులు మాత్రం అంబేద్కర్ మాటలు (మతానికి సంబంధించినంత వరకు) పట్టించుకోవడం మానేశారు. 1951 జులై, ఆగస్టు నెలల్లో అంబేద్కర్ ఔరంగాబాద్‌లో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అక్కడ వారు కొత్తగా సెప్టెంబరు 1న ఒక కళాశాల తెరిచారు. భారతదేశం అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. విద్యావకాశాలను విస్తృతం చేయడానికి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్న కృషినీ, అంబేద్కర్ ప్రయత్నాలనూ అందరూ ప్రశంసించారు.
1951 ఆగస్టులో అంబేద్కర్ ఆరోగ్యం బాగుండలేదు. ఆగస్టు 10న ఆయన ప్రధాని నెహ్రుకు ఒక లేఖ రాస్తూ తన ఆరోగ్యం తనకూ, తన డాక్టర్లకూ ఆందోళన కలిగిస్తోందనీ, సాధ్యమైనంత త్వరలో హిందూకోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే సెప్టెంబరు ఒకటవ తేదీన చర్చ ముగియవచ్చునని సూచించారు. నెహ్రు ఆ బిల్లుకు సుముఖుడు. అందుకని ‘‘ఆ బిల్లును గురించి అంతటా తీవ్రమైన ప్రతిఘటన ఉన్నందువల్ల 1951 సెప్టెంబరు వరకు దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదని నిర్ణయించారనీ, విషయాలను తేలికగా తీసుకోమనీ, అనవసరంగా ఆరోగ్యం పాడుచేసుకోవద్ద’’నీ అంబేద్కర్‌కు అదే రోజు జవాబు రాశారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నెహ్రు హిందూకోడ్ బిల్లు సంగతి ప్రస్తావించినప్పుడు అధిక సంఖ్యాకులు సుముఖత చూపలేదు. ఈ విషయంలో ఎవరి ఇష్టానుసారం వారు ఓటు వేయవచ్చునని కాంగ్రెస్ తీర్మానించింది. సెప్టెంబరు మొదటి వారంలో ఈ బిల్లు చర్చకు రాలేదు. సెప్టెంబర్ 17న ఇందులోని వివాహం, విడాకులకు సంబంధించిన భాగాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలనీ, సమయాన్ని బట్టి మిగతా భాగాన్ని పరిశీలించవచ్చుననీ నిర్ణయించారు. అంబేద్కర్ అలాగే ఆ బిల్లును రెండు భాగాలుగా తయారుచేశారు.
ఎట్టకేలకు సెప్టెంబరు 17 వచ్చింది. పార్లమెంటు హిందూకోడ్ బిల్లును పరిశీలించడానికి సమావేశమైంది. పార్లమెంటు భవనం చుట్టూ గట్టి బందోబస్తు చేశారు. అసంఖ్యాకంగా మహిళలు పార్లమెంటు భవనం వెలుపల గుమిగూడారు. పార్లమెంటు లోపల ఒక యుద్ధమే జరుగుతోంది. శతాబ్దాలుగా, నిరంతరాయంగా, దిగ్విజయంగా నడుస్తున్న హిందూ సాంప్రదాయాన్ని ఈ బిల్లు మూలమట్టంగా పెకిలించి, విచ్ఛిన్నం చేస్తుందని ముఖర్జీ వాదించాడు. పండిట్ కుంజ్రూ, గాడ్గిల్‌లు బిల్లును సమర్ధించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, మాలవీయ, సర్దార్ భూపేందర్ సింగ్, శ్రీ రaుంరaుంవాలా, పండిట్ మైత్రా, ప్రొ.యశ్వంత్రావ్ హుకుంసింగ్, పండిట్ భార్గవ, ఎ.సి.శుక్లా, పన్నాలాల్, బన్సీలాల్ ప్రభృతులు బిల్లును వ్యతిరేకిస్తూ అడుగడుగునా అడ్డం పడ్డారు.
అందరూ సుదీర్ఘంగా చర్చిస్తూ కాలయాపన చేయాలని చూశారు. మానవతా ప్రాతిపదికపై న్యాయం అందరికీ సమానంగా వర్తించాలని అందరూ ఒప్పుకుంటున్నారు. అయినా బిల్లుపై మాత్రం అంగీకారం కుదరడం లేదు.
“You kindly withdraw this code and relieve the Hindu Community of it” (ఈ బిల్లును ఉపసంహరించుకుని హిందూ సమాజానికి ఊరట కలిగించు) అన్నారు.
సెప్టెంబర్ 23 నాటికి బిల్లులోని నాల్గవ క్లాజు చర్చకు వచ్చింది. 24`9`1951న అంబేద్కర్ క్లాజులోని అంశాలను చెబుతూ ‘‘అయిదు నిమిషాల్లో ముగిస్తాను’’ అంటుండగానే సభ్యులు ‘‘వద్దు వద్దు ఈ సవరణలు చాలా ఉన్నాయి. నాలుగు గంటలు పడుతుంది’’ అంటూ ఈ బిల్లు పక్కకు పెట్టి మరో అంశం చర్చకు తీసుకున్నారు. ఈ వ్యవహారంతో అంబేద్కర్ విసిగిపోయారు. ఎలాగయితేనేం ఆ క్లాజు 25న ఆమోదించారు.
ఆ పైన బిల్లులోని వివాహం, విడాకులకు సంబంధించిన అంశాలపై చర్చ సాగడం కష్టమైపోయింది. పటేల్ బహిరంగంగా తన వ్యతిరేకతను వెల్లడిరచారు. డా.రాజేంద్రప్రసాద్ రాజీనామా చేస్తానని బెదిరించారు. దేశమంతటా బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు తీవ్రతరమయ్యాయి. ఈ స్థితిలో కాంగ్రెస్ మంత్రివర్గం, పార్టీ సభ్యులు చూపుతున్న విముఖతకు విసుగెత్తి సెప్టెంబర్ 27న అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంబేద్కర్ మాటలలో ‘‘హిందూకోడ్ బిల్లు నాలుగు క్లాజుల అనంతరం హత్య చేయబడిరది. ఇందుకు ఎవ్వరూ కనీసం రెండు కన్నీటి బొట్లయినా రాల్చలేదు.’’