అనువాదం: ఎ.సునీత
కుటుంబంలో హింస గురించి సాంస్కృతిక చైతన్యాన్ని పెంచి, దాన్ని ఆపాలంటే మన ఆలోచనా రీతుల్లోనూ, మన కార్యాచరణలోనూ తేవాల్సిన సమూల మార్పుల గురించి జరిపిన ప్రయత్నం సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఇప్పటివరకూ తెచ్చిన సానుకూల మార్పుల్లో అతి విస్తృతమయిందని చెప్పకోవచ్చు.
ఇప్పుడు కుటుంబ హింస గురించి ప్రసార మాధ్యమాల నుంచి యూనివర్సిటీ కళాశాలల్లో మాట్లాడుతున్నారు గానీ సమకాలీన స్త్రీవాద ఉద్యమం దాని కఠోర వాస్తవాన్ని బయటకి తెచ్చి నాటకీయంగా అందరిముందూ పెట్టిందనే విషయం తరచుగా మర్చిపోతుంటారు. మొదట్లో మగవాళ్ళు చేసే హింసపైనే ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ, స్త్రీవాద ఉద్యమం ముందుకి వెళ్ళే క్రమంలో అది సమ లింగ సంబంధాలోనూ ఇది ఉంటుందని, ఇద్దరు స్త్రీల మధ్య ఉండే సంబంధాల్లో స్త్రీలు హింసకు గురవుతారని, అలాగే పిల్లలు కూడా పితృస్వామ్య సంబంధాల్లో స్త్రీ, పురుషులిద్దరూ జరిపే హింసకి బాధితులవుతారని సాక్ష్యాధారాలు ముందుకొచ్చాయి.
ఇంట్లో ఎక్కువ అధికారం ఉండే వ్యక్తి మిగిలిన అందరినీ వివిధ రకాల బలంతో నియంత్రించగలగటం మంచిదేననే నమ్మకం నుండే పితృస్వామిక హింస పుడుతుంది. ఈ రకంగా కుటుంబ హింస నిర్వచనాన్ని విస్తరించినపుడు మగవాళ్ళు స్త్రీలపై చేసే హింసతో పాటు, సమ లింగ సంబంధాల్లో జరిగే హింస, అలాగే పిల్లలపై పెద్దవాళ్ళు జరిపే హింస కూడా దానిలో చేరుతుంది. అందరూ ఆమోదించే కుటుంబ హింస అనే పద బంధం కన్నా పితృస్వామిక హింస అనే పదం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ పదం విన్నవాళ్ళందరికీ ఇంట్లో జరిగే హింస, సెక్సిజానికి, సెక్సిస్టు ఆలోచనా రీతి, పురుషాధిపత్యానికి సంబంధించినదని అర్థమవుతుంది.
చాలా కాలంపాటు కుటుంబ హింస అనే పదాన్ని ఒక సుకుమార పదంగా వాడారు. అది దగ్గరి సంబంధాల్లో పుడుతుందని, కాబట్టి ఇంటి బయట జరిగే హింస కన్నా తక్కువ భయపెట్టేదని, తక్కువ క్రూరమైందని అంటూ వచ్చారు. కానీ జరిగేది వేరు. బయటకన్నా ఇళ్ళల్లోనే ఆడవాళ్ళు ఎక్కువ హింసకి, హత్యలకు గురవుతారు. చాలామంది పెద్దవాళ్ళ మధ్య జరిగే హింసని చిన్న పిల్లలపై హింస నుండి వేరే చేసి చూస్తుంటారు. అలా ఆలోచించటం కూడా సరైంది కాదు. తల్లులపైన జరిగే దాడులు చూసే పిల్లలు తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించినపుడు వాళ్ళు కూడా హింస మరియు వేధింపులకు గురవుతారు. అసలా బాధ, హింసని చూడడం తోటే పిల్లలు మానసికంగా నష్టపోతారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విశ్వసించినట్లే ఈ దేశంలో అత్యధిక ప్రజలు మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టకూడదని అనుకుంటారు. కానీ సెక్సిజం నుండే ఆ హింస పుడుతుందని, సెక్సిజం అంతం కాకుండా ఆ హింస కూడా అంతం కాదని చెప్పినప్పుడు, రోజువారీ హింసకి, సెక్సిజానికి ఉండే తార్కిక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడతారు. అలా ఆలోచించాలంటే జెండర్ గురించి మనకుండే మౌలికమైన ఆలోచనా రీతిని సవాలు చేయాలి, మార్చుకోవాలి. స్త్రీవాద ఉద్యమానికి అన్ని రకాల హింసని అంతమొందించే విస్తృత ఎజెండా ఉండాలని నమ్మే అతి తక్కువ మంది స్త్రీవాద సిద్ధాంతవేత్తల్లో నేను కూడా ఒకరిని. మౌలికంగా స్త్రీవాద దృష్టి పితృస్వామ్య హింసపైనే ఉండాలి. అయితే ఇతర పితృస్వామ్య హింసలకన్నా పురుషులు స్త్రీలపై చేసే హింస అన్నింటికన్నా భయంకరమైనదని భావించి దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టటం, స్త్రీవాద ఉద్యమానికి అంత మంచిది కాదు. పిల్లలపై సెక్సిస్టు స్త్రీలు, పురుషులు జరిపే పితృస్వామ్య హింస చాలా ఎక్కువనే వాస్తవాన్ని ఈ దృష్టి కప్పిపెడుతుంది.
సంస్కరణ వాద స్త్రీవాద ఆలోచనా పరులు మగవాళ్ళు ఆడవాళ్ళపై జరిపే హింస మీద దృష్టి నిలపడం కోసం స్త్రీలని మాత్రమే బాధితులుగా చూపుతుంటారు. స్త్రీలు పిల్లలపై జరిపే హింసాత్మక దాడుల్ని ఎత్తి చూపటం గానీ, వాటిని కూడా పితృస్వామిక హింసా రూపాలుగా చూడటం గానీ చెయ్యరు. ఆయా దాడులకు గురయినప్పుడే కాక వాటిని ప్రత్యక్షంగా చూసిన పిల్లలు కూడా బాధితులవుతారని ఇప్పుడు మనకి తెలుసు. ఈ రకమైన హింసాత్మక దాడుల్ని స్త్రీవాదులందరూ ఎత్తి చూపి పురుషులు జరిపే హింసతో దాన్ని కూడా సమానంగా చూసి ఉంటే సాధారణ ప్రజానీకానికి కూడా పురుషులు స్త్రీలపై జరిపే హింస గురించి మాట్లాడినప్పుడు దాన్ని మగ వ్యతిరేకతగా చూడటం కష్టమై ఉండేది.
స్త్రీలు హింసని ప్రయోగించటానికి పెద్దగా సిద్ధపడరని ఎన్ని సర్వేలు చెప్పినా సరే, స్త్రీలు చేసే పితృస్వామిక హింసను అనుభవించిన వారందరికీ వాళ్ళేమీ అహింసా మూర్తులు కాదని బాగానే తెలుసు. అసలు విషయమేమిటంటే పిల్లలకి తమపై ఆడవాళ్ళు జరిగే / చేసే హింస గురించిన వాస్తవాన్ని చెప్పగలిగే సంఘటితమయిన సామూహిక గొంతుక లేదు. స్త్రీలు, పురుషులు చేసే హింసకి గురయిన పిల్లలు ఆస్పత్రుల్లోకి పెద్ద ఎత్తున రాకుండా ఉన్నట్లయితే బహుశా స్త్రీలు చేస్తున్న హింసకి సంబంధించిన ఏ ఆధార పత్రాలు మన దగ్గర ఉండేవి కావు.
నా పుస్తకం ‘ఫెమినిస్టు సిద్ధాంతం: మార్జిన్ నుండి సెంటర్ వరకు’ లోని ‘హింసని అంతం చెయ్యటానికి స్త్రీల ఉద్యమం’ అన్న అధ్యాయంలో నేను మొదట ఈ విషయాన్ని లేవనెత్తాను.
‘‘ఆడవాళ్ళపై జరిగే హింసని అంతమొందించటానికి జరిగే పోరాటాన్ని, అన్ని రకాల హింసని అంతమొందింటానికి జరుగుతున్న ఉద్యమంలో భాగంగా చూడటం చాలా అవసరం. ఇప్పటివరకూ స్త్రీవాద ఉద్యమం ప్రధానంగా ఆడవాళ్ళపై మగవాళ్ళు జరిపే హింసపైన దృష్టి కేంద్రీకరించడంతో పురుషులే హింసావాదులని, స్త్రీలు కాదనీ, అలాగే పురుషులే హింసకి పాల్పడతారు, స్త్రీలు దానికి బాధితులనే సెక్సిస్టు మూస భావనలు ఊపందుకున్నాయి. ఈ రకమైన ఆలోచనలో మన సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఆధిపత్య గుంపు లేదా వ్యక్తులు తమ ఆధీనంలో ఉన్నవారిపై బలప్రయోగం చెయ్యవచ్చనే భావనని నమ్మి, ఆచరించి, కొనసాగిస్తారన్న వాస్తవాన్ని ఉపేక్షించటం జరుగుతుంది. స్త్రీలు ఇతరులపై చెలాయించే బలవంతపు అధికారం, వారి హింసాత్మక చర్యలని సెక్సిస్టు ఆలోచన ఉపేక్షిస్తుంది. మగవాళ్ళంత తరచుగా ఆడ వాళ్ళు హింసాత్మక చర్యలకి పాల్పడనంత మాత్రాన స్త్రీలు చేసే హింసని తక్కువ చేసి చూడలేము. ఈ ప్రపంచంలో హింసని అంతమొందించాలంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే రెండు గుంపులు కూడా హింసా ప్రయోగాన్ని సమర్ధిస్తాయనే వాస్తవాన్ని గుర్తించటం అత్యంత అవసరం.
ఒక తల్లి తన పిల్లలపై హింసకి పాల్పడకపోవచ్చు గానీ పిల్లలకి, ముఖ్యంగా కొడుకులకి ఇతరులను సామాజికంగా నియంత్రించటానికి వారిపై హింసకి పాల్పడటం సరైందే అని నేర్పించిందంటే ఆమె పితృస్వామ్య హింసలో పాలుపంచుకున్నట్లే. అటువంటి వారి ఆలోచన మారాలి. మగవాళ్ళపై తమ ఆధిపత్యం చెలాయించటానికి హింసని ప్రయోగించే స్త్రీలు తక్కువ (అలాంటి వారు కూడా లేకపోలేదు) కానీ చాలామంది స్త్రీలు అధికార స్థాయిలో ఉన్నవాళ్ళకి బలప్రయోగం చేసే హక్కు ఉందని నమ్ముతారు. తల్లిదండ్రుల్లో అత్యధిక భాగం పిల్లలపై భౌతికంగా బలప్రయోగం గానీ, నోటి దురుసు గానీ ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తారు. ఆడవాళ్ళే ప్రధానంగా పిల్లల్ని చూసుకుంటారు కాబట్టి, ఉన్న ఆధిపత్య వ్యవస్థ ఇచ్చిన సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం తల్లులు కూడా బలప్రయోగం చేస్తారు. ఆధిపత్య సంస్కృతిలోని ప్రతి వ్యక్తిలో సమాజంలో ఇతరులని నియంత్రించడం కోసం హింసని వాడుకోవడం సరైందనే నమ్మకాన్ని సాంఘికీకరణ ద్వారా కలుగచేస్తారు. ఆధిపత్య సంబంధాలకి భంగం ఏర్పడినప్పుడు అవి ఏ సంబంధాలయినా కావచ్చు. ఆడ`మగ వ్యక్తుల మధ్య లేక తల్లిదండ్రులు`పిల్లల మధ్య వాటన్నింటినీ`దానికి పర్యవసానంగా వివిధ రకాల భౌతిక, మానసిక శిక్షలు తప్పకుండా పడతాయనే భయం (అది ఆచరణలో పెట్టినా, పెట్టకపోయినా) అధికారంలో ఉన్న వారికి తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ భయాన్ని వాళ్ళు వాడుకుంటారు.
ఆడవాళ్ళపై మగవాళ్ళు జరిపే హింసకి ప్రసార మాధ్యమాల్లో ప్రచారమయితే లభించింది (ఓ జె సిమ్సన్ వంటి నిజ జీవితంలోని కేసుల్లో). కానీ దానివల్ల కలిగిన చైతన్యం అమెరికన్ ప్రజలని ఈ హింస వెనుక ఉండే ప్రధాన కారణాలని, అంటే పితృస్వామ్యాన్ని సవాలు చెయ్యాలనే ఆలోచనకి దారి తీయలేదు. సెక్సిస్టు ఆలోచన పురుష ఆధిపత్యాన్ని, దానివల్ల జరిగే హింసని ఇప్పటికీ సమర్థిస్తూనే
ఉంది. ఉద్యోగాల్లేని మగవాళ్ళు, ఉద్యోగాలు చేసే మగవాళ్ళు ఈ తెల్ల జాత్యహంకార పితృస్వామ్య వ్యవస్థలో తాము పనిచేసే చోట అణిగిమణిగి ఉండాలి కాబట్టి, వారికి పూర్తి గౌరవం, అధికారం లభించే చోటు ఇల్లే అనే భావాన్ని బాగా ప్రోత్సహించటం జరుగుతుంది. పాలకవర్గాలలోని మగవాళ్ళు మిగిలిన మగవాళ్ళకి పబ్లిక్ పని స్థలాల్లో ఇతరుల ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలని, ప్రైవేట్ ప్రపంచమైన ఇంట్లో, దగ్గరి సంబంధాల్లో వారు ఆధిపత్యం బయటి ప్రపంచంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి తెస్తుందని, వారిని మళ్ళీ మగవాళ్ళుగా నిలబెడుతుందని ఆలోచించేలా చేస్తారు. స్త్రీలు ఉద్యోగాల్లోకి వచ్చి, మగ వాళ్ళు నిరుద్యోగులుగానో, తక్కువ జీతాలిచ్చే పనుల్లోనో ఉండిపోతున్నప్పుడు కొంతమంది మగవాళ్ళకి తమ జీవితంలో ఉండే ఆడవాళ్ళని కొడితేనే ఇద్దరి మధ్యా సరైన అధికార సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఏ రకంగానైనా ఆడవాళ్ళపై అధికారం చెలాయించే హక్కు తమకుందనే సెక్సిస్టు ఆలోచన నుండి బయటపడనంత కాలం ఆడవాళ్ళపై మగవాళ్ళు చేసే హింస సమాజంలో సరైన విలువగానే పరిగణించబడుతుంది.
మొదట్లో స్త్రీవాద ఆలోచనాపరులు, కార్యకర్తలు మగవాళ్ళు చేసే హింసని సామ్రాజ్యవాద యుద్ధ ప్రియత్వంతో పోల్చి, కలిపి చూడలేదు. ఎందుకంటే ఆడవాళ్ళపై జరిగే హింసని వ్యతిరేకించే వాళ్ళు కూడా సామ్రాజ్యవాద యుద్ధప్రియత్వాన్ని సమర్థిస్తారు. అబ్బాయిలంటేనే బలప్రయోగం చెయ్యగలిగే వాళ్ళని, కావాలంటే చంపగలిగే వాళ్ళనే సెక్సిస్టు ఆలోచన. అది చెడ్డవారిపై మంచి వాళ్ళు జరిపే హింస కావచ్చు, ఒక జాతిపై మరో జాతి బలవంతంగా సైన్యం ద్వారా పొందే ఆధిపత్యం విషయంలో కావచ్చు, కొనసాగినంత వరకూ స్త్రీలపై, పిల్లలపై పితృస్వామిక హింస ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వివిధ వర్గాల నుండి వచ్చిన యువకులు జరిపిన భయంకరమైన హింసని దేశవ్యాప్తంగా అందరూ ఖండిరచారు గానీ దీన్ని సెక్సిస్టు ఆలోచనకి ముడిపెట్టి చూసిన వాళ్ళు తక్కువ.
ఫెమినిస్టు సిద్ధాంతం: ‘అంచుల నుండి కేంద్రంలోకి’ అన్న నా పుస్తకంలో హింసపై రాసిన అధ్యాయాన్ని ముగిస్తూ ‘‘హింసని ఒప్పుకుని, కొనసాగించే సంస్కృతిని ప్రోత్సహించేది మగవాళ్ళు మాత్రమే కాదని’ అంటూ ముగిస్తాను. స్త్రీలు కూడా ఈ సంస్కృతిలో తాము పోషించే పాత్రని ఒప్పుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాను.
‘పురుషులు స్త్రీలపై జరిపే హింసపైన దృష్టి పెట్టినప్పుడూ, సైనిక బలప్రయోగం మగవాళ్ళు చేసే హింసకి మరో రూపం అని వాదించినప్పుడూ మనం హింస అనే సమస్య గురించి ఆలోచించటంలోనూ, దానిని ప్రతిఘటించే వ్యూహాలని, దానికి సరైన పరిష్కారాలని వెతకటంలోనూ విఫలమవుతున్నాం. ఆయా సమస్యలని చిన్నది చేసి చూపించటం మన ఉద్దేశ్యంకాదు. కానీ మగవాళ్ళూ, ఆడవాళ్ళూ కలిసి అమెరికాలోని హింసాత్మక సంస్కృతిని నిర్మించారనీ, దాన్ని పూర్తిగా మార్చి, ఆ సంస్కృతిని తిరిగి నిర్మించే బాధ్యత కూడా ఇద్దరిదీ అని మనం ఇప్పటికయినా గుర్తించాలి. సామాజిక నియంత్రణలో హింస పోషించే పాత్రని, దాని వివిధ రూపాలనీ స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా వ్యతిరేకించాలి… యుద్ధం, ఆడవాళ్ళపై మగవాళ్ళు చేసే హింస, పిల్లలపై పెద్దవాళ్ళు జరిపే హింస, టీనేజీ వయసు
వాళ్ళు చేసే బలప్రయోగం, జాత్యహంకార హింస మొదలైనవి. స్త్రీలపై మగవాళ్ళు చేసే హింసకి వ్యతిరేకంగా చేస్తున్న స్త్రీవాద ఉద్యమాన్ని అన్ని రూపాల్లోని హింసను నిర్మూలించే దిశగా విస్తృతపరచాలి.
ముఖ్యంగా తల్లిదండ్రులు హింస లేకుండా పిల్లల్ని పెంచటం నేర్చుకోవాలి. క్లిష్టమైన పరిస్థితులని హింస ద్వారానే పరిష్కరించడం అని మన నుండి నేర్చుకున్నప్పుడు, వాళ్ళు ఆ దారి నుండి వేరేవైపు మళ్ళారు. మన దేశంలో చాలామంది హింస గురించి ఆలోచిస్తారు గానీ, దాన్ని పితృస్వామిక ఆలోచనకి ముడిపెట్టి చూడటానికి ఒప్పుకోరు. స్త్రీవాద ఆలోచన దానికి పరిష్కారాన్ని చూపుతుంది. కానీ, ఆ పరిష్కారాన్ని అందరికీ అందేలా చూడటం మన బాధ్యత.