1903 డిసెంబర్ నుండి ‘హిందూ సుందరి’ పత్రికకు మొసలికంటి రామాబాయమ్మతో కలిసి సంపాదకత్వం వహించిన వెంపల శాంతాబాయి నాటి దొరతనము వారిచే విశేష గౌరవ మర్యాదలు పొందిన తండ్రికి కూతురు.
వీరిది ఘోషా పాటించే కుటుంబం. శాంతాబాయి విద్యా వివేకములు కలిగిన రామాబాయమ్మకు సహచారిణి కాబట్టి వీరిది రాజము ప్రాంతము అని భావించవచ్చు.
‘హిందూ సుందరి’ పత్రిక పెట్టిన సత్తిరాజు సీతారామయ్య ‘స్వ విషయము’ అనే శీర్షికలో వీరిని సంపాదకులుగా చేసిన పరిచయం వల్ల శాంతాబాయి ‘బాల వితంతువు’ అనే నవలను ప్రచురించిందని తెలుస్తోంది. ఈ నవల కనుక దొరికితే అదే మొదటి తెలుగు నవల కావచ్చు. శాంతాబాయి బాల్యంలోనే భర్తను కోల్పోయింది. అందువల్లనే ఆమె ‘బాల వితంతువు’ నవలను రాయగలిగింది.
రామాబాయమ్మ, శాంతాబాయిలు ‘హిందూ సుందరి’ పత్రికకు సంపాదకులుగా ఎన్నో మార్పులు ప్రవేశపెట్టాలని అనుకున్నారు. పత్రికను ప్రతి స్త్రీకి ఒక తల్లి, బిడ్డ, తోబుట్టువు, అత్త, కోడలి వంటి ఆత్మీయ సంబంధంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని వారు చెప్పారు. అప్పటికి ఎనిమిది వందల మంది చందాదారులున్న పత్రికను విద్యావంతులైన సోదరీమణులు విశేష ప్రచారం కల్పించాలనీ, చందాలు కట్టి పత్రికను నిలబెట్టాలనీ కోరారు. వెంపల శాంతాబాయి ‘హిందూ సుందరి’ పత్రికకు సంపాదకురాలు కాకముందు నుండే ఆమె రచనలు కనిపిస్తున్నాయి. జులై 1903 సంచికలో ఆమె రాజాము జనానా సభలో చేసిన ఉపన్యాసపాఠం ప్రచురించబడిరది. అదే ఇప్పుడు లభిస్తున్న మొదటి రచన. స్త్రీలకు విద్య లేకుండా అణగదొక్కి మూఢరాండ్రు అంటూ తక్కువగా మాట్లాడే హిందూ సమాజాన్ని గుర్తించింది. ఆ మూఢత్వం నుండి బయటపడే ప్రయత్నాలు మొదలు కావడాన్ని హర్షించింది.
స్త్రీలు ఆచరించవలసిన మూడు ధర్మాలలో విద్యాకృషిని ఆమె ప్రస్తావించడం విద్యా వివేకం గల స్త్రీల అవసరమూ, స్త్రీలకు తిరస్కరించబడిన విద్య ఎంత అవసరమో ఈ సమాజంలో ఆమె స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉంది. స్త్రీలు కూపస్థ మండూకాలుగా పడి ఉండటం ఆమె సహించలేకపోయింది. నిజమైన విద్యావంతుల లక్షణం ఏమిటో ‘‘విద్య యొసగును వినయంబు వినయమున బడయు బాత్రత బాత్రత వలన ధనము / ధనము వలన ధర్మంబు దాని వలన / నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు’’ అనే పద్యంలో సూచించింది. విద్య జ్ఞానార్జనకే కానీ ధనార్జనకు కాదని, జ్ఞానం కేవలం పురుషులకే ఉండాలని స్త్రీలకు జ్ఞానము వలదనుట నీచమైనది అని అభిప్రాయపడిరది. చదువుకున్న స్త్రీలు చెడు మార్గం పడతారన్న వాదనను మరి పురుషులు చదువుకుంటే చెడు మార్గం పట్టరా ఏమి అన్న వాదనతో తిప్పికొట్టింది. స్త్రీ, విద్యాద్వేషుల కుట్రలలో ఇరుక్కొనకుండా విద్యా సముపార్జనకు పూనుకోవాలనుంటుంది.
‘స్త్రీ సమాజాలు’ పెట్టుకొనుట స్త్రీల కెంత అవసరమో ‘సమాజ లాభము’ అనే ప్రసంగ పాఠంలో వివరిస్తుంది. స్త్రీలు కలిసి పనిచేయాలనీ (గా), వారి సంఖ్యాబలం కొత్త ఊహలకు కారణమవుతుందని చెప్తూ, స్త్రీలు మగవారు ఇంటలేని సమయంలో ఒక ఇంట్లో చేరి చేసుకునే సమావేశాలు తప్పెలా అవుతాయి? నోములనీ, పెళ్ళిళ్ళనీ, పేరంటాలనీ తోటి స్త్రీలను పిలవడానికి బజారులో మేళతాళాలతో ఊరేగడంలో లేని తప్పు ఒక్క గదిలో కూడా మాట్లాడుకోవడం అనర్థమా? అని ప్రశిస్తుంది. చీమలకున్న ఐక్య భావనాశక్తితో స్త్రీలందరూ కలిసి సమాజ వృద్ధికి విస్తరణకు పనిచేయాలంటుంది. ఆమె దృష్టిలో ఏకేశ్వరోపాసన వలన జన్మ ధన్యమవుతుంది. సకల ప్రకృతిని సృష్టించిన దైవశక్తి ఒక్కటే.
ఉపవాసాలు, నోములు ఆచరించదగినవి కాదు, అవి మనిషిని బలహీనపరుస్తాయి. సత్యధర్మ జ్ఞానాభివృద్ధులే వ్రతంగా జీవించాలని, అవే నిత్య సత్యవ్రతాలని ప్రబోధించింది. బ్రహ్మ సమాజ సంస్కరణ భావజాల ఉద్యమ ప్రభావం స్త్రీలలోకి ప్రవహించి అంతర్భాగం కావడాన్ని శాంతాబాయి భావాల ప్రకటన వల్ల గ్రహించవచ్చు.
జనవరి 1904లో ‘హిందూ సుందరి’ పత్రికలో రాసిన ‘నీతి’ అనే వ్యాసంలో ఆమె ‘నీతి’ అనేది ‘‘ఒక సార్వకాలిక సార్వజనీన విలువ’’ అని ప్రతిపాదించి కుటుంబ పోషణ వ్యవహారాల కోసం మగవాళ్ళు ఎప్పుడైనా తమ నీతిని వదులుకుంటారేమో గానీ, స్త్రీలు తమ నీతిని ఎప్పటికీ వదులుకోరంటుంది. స్త్రీల పట్ల లోకంలో చెలామణి అయ్యే అపవాదులైన… స్త్రీలు మూఢులు, అబద్ధాల కోరులు, కపటులు, అవిశ్వాసపాత్రులు, నీతి లేనివాళ్ళు అని నానా రకాల దూషణలు వట్టి అపవాదులు అని నిరూపించడానికి ‘నీతి’ని నిరంతరం అభ్యాసం చేయాల్సి ఉందని, ఆచరణాత్మకం కావాలని సూచిస్తుంది. ‘నీతి’ అన్న ఈ రచన శాంతాబాయి చివరి రచన. ఆమె మే నెల 1904 నాటికి మరణించింది అని ‘మే’ సంచికలో ప్రచురితమయిన కొటికలపూడి సీతమ్మ ఉత్తరాన్ని బట్టి తెలుస్తోంది.
బ్రహ్మ సమాజ మతావలంబకురాలైన శాంతాబాయి సమాజం వారు ఆస్తిక మత వ్యాప్తికి ప్రతివారం సభలు జరుపుతున్నారు. అయితే, ఆ పరిశుద్ధమైన భావాలు స్త్రీల హృదయాలలో నాటుకొని, దురాచారాలు తొలగించడానికి వారెప్పుడు పూనుకుంటారో అని సీతమ్మకు రాసిన ఉత్తరంలో పేర్కొంటుంది. ఆమె అజ్ఞానమనే చీకటిని దాటి విద్యావివేకములు, నీతి మార్గం పట్టిన సంస్కరణవాది, అభ్యుదయ భావాలను ఆకళింపు చేసుకున్న స్త్రీ శక్తి. బాల్య వితంతువైన శాంతాబాయి ఇంట్లో ఒక మూలన పడి ఉండి తన నుదుటి రాతకు విచారిస్తూ ఉండకుండా నాడు స్త్రీకి మరణంతో సమానమైన వైధవ్యాన్ని పటాపంచలు చేస్తూ, విద్యావివేకాలను ఆర్జించి, రచనలు చేస్తూ, స్త్రీ సమాజాలనూ, బ్రహ్మసమాజ మత ప్రచార నిర్వహణలు చేస్తూ, పత్రికా సంపాదకురాలిగా ఉంటూ పత్రిక అభివృద్ధిని గుణాత్మకంగా చేయాలని ఆలోచిస్తూ, స్త్రీల విద్యాభివృద్ధికి పూనుకున్నది. ఆమె ఉన్నతాశయాలు నెరవేరకుండానే ఆ మహిళా శక్తి అర్థాంతరంగా మరణించటం నాటి సమాజానికి పెద్ద లోటుగా పరిణమించింది. కానీ, ఆమె జీవించిన కాలమంతా సామాజిక సంస్కరణ వాదిగానే సేవలందించింది. మంచి సమాజం ఏర్పడాలనే పరితపించింది.
(కాత్యాయనీ విద్మహే ‘తొలి అడుగులు ` ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్యం’ 1875`1903 ఆధారంగా)