స్త్రీవాద పురుషత్వం – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
సమకాలీన స్త్రీవాద ఉద్యమం ప్రారంభమయినప్పుడు భీకరమైన పురుష వ్యతిరేక ముఠా ఒకటుండేది. పరలింగ సంబంధాల్లో క్రూరమైన, దయలేని, విశ్వాసం లేని, హింసించే మగవాళ్ళతో జీవించిన స్త్రీలు ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు. ఈ మగవాళ్ళల్లో చాలామంది శ్రామికుల కోసం, పేదవాళ్ళ కోసం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా

సాంఘిక న్యాయం కోసం పోరాడే ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసే రాడికల్‌ ఆలోచనాపరులు. జెండర్‌ విషయానికి వచ్చేసరికి మాత్రం మిగిలిన సనాతన పురుషుల్లాగే సెక్సిస్టులుగా ఉండేవాళ్ళు. ఇటువంటి సంబంధాల్లోంచి క్రోధంతో బయటికొచ్చిన స్త్రీలు ఆ కోపాన్ని స్త్రీ విముక్తి ఉద్యమానికి ఇంధనంగా వాడారు.
ఆ ఉద్యమం ముందుకెళ్ళి, స్త్రీవాదం పురోగమించే కొద్దీ, వివేకవంతులయిన స్త్రీవాద కార్యకర్తలకి సమస్య మగవారితో కాదనీ, పితృస్వామ్యం, సెక్సిజం, పురుషాధిపత్యంతోననీ అర్థమయింది. పురుషులతో సమస్య కాదనే వాస్తవాన్ని ఎదుర్కోవటం కష్టతరంగా పరిణమించింది. దాన్ని ఎదుర్కొన్నప్పుడు మరింత సంక్లిష్టతతో సిద్ధాంతాలని నిర్మించాల్సిన అవసరం పడిరది. సెక్సిజంని కాపాడి, కొనసాగించడంలో స్త్రీలు పోషించే పాత్రని గుర్తించాల్సి వచ్చింది. పురుషులతో వినాశకర సంబంధాల్లోంచి ఆడవాళ్ళు బయటపడే కొద్దీ విషయాన్ని సమగ్రంగా చూసే అవకాశం కలిగింది. వ్యక్తిగతంగా కొంతమంది పురుషులు తమ పితృస్వామ్య అధికారాన్ని వదులుకున్నప్పటికీ, పితృస్వామ్యం, సెక్సిజం, పురుషాధిక్యత అలాగే కొనసాగుతాయని, స్త్రీలు ఎప్పటిలాగే దోపిడీకి, అణచివేతకు గురవుతారనే సత్యం స్పష్టమయింది.
సంప్రదాయ ధోరణులతో నడిచే ప్రసార మాధ్యమాలు స్త్రీవాద మహిళలను మగద్వేషులుగా చిత్రీకరించాయి. మగ వ్యతిరేక ముఠా, అటువంటి సెంటిమెంటుని మాత్రమే చూపించి స్త్రీవాదాన్ని మొత్తం తక్కువ చేసి చూపించాయి. స్త్రీవాదులందరూ పురుష ద్వేషులు అనే చిత్రీకరణలో వాళ్ళందరూ లెస్బియన్లనే భావన బలంగా పనిచేసింది. సమాజంలో ఉండే హోమోఫోబియాను ప్రేరేపిస్తూ మాస్‌ మీడియా మగవాళ్ళలో ఉండే స్త్రీవాద వ్యతిరేకతను తీవ్రతరం చేసింది. స్త్రీవాద ఉద్యమం మొదలై 10 సంవత్సరాలు కాకుండానే, స్త్రీవాద ఆలోచనాపరులు పితృస్వామ్యం మగవాళ్ళకి హానికరమని మాట్లాడటం మొదలుపెట్టారు. మగవారి పెత్తనాన్ని ఒక పక్క తీవ్ర విమర్శకి గురిచేస్తూనే, మగవాళ్ళని పితృస్వామ్యం ఒక సెక్సిస్టు మగ అస్తిత్వానికి కుదిస్తోందని గుర్తించి స్త్రీవాద రాజకీయ విమర్శని, విస్తృతిని పెంచారు.
స్త్రీవాద వ్యతిరేక పురుషులకి జన సమ్మతి సంస్కృతిలో ఎప్పుడూ ఒక బలమైన గొంతుక ఉంటూ వచ్చింది. స్త్రీవాదమంటే భయం, ఆ ఆలోచన, ఆలోచనాపరులు అంటేనే ద్వేషం ఉండే మగవాళ్ళందరూ సంఘటితమై స్త్రీవాద ఉద్యమంపై దాడిచేశారు. అయితే, మొదటినుండీ ఈ ఉద్యమం సామాజిక న్యాయ ఉద్యమమని, వాళ్ళు మద్దతిచ్చే ఇతర రాడికల్‌ ఉద్యమాల్లాంటిదేననీ కొంతమంది మగ వాళ్ళు నమ్మారు. ఆయా పురుషులు మా సంఘర్షణలో మా కామ్రేడ్లుగా మారి, మా మిత్రమండలిగా మారారు.
స్త్రీవాద ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండే పరలింగ ధోరణితో ఉండే స్త్రీలు స్త్రీవాదంతో ఘర్షణ పడుతున్న మగవారితో దగ్గరి సంబంధాల్లో ఉండేవారు. ఆయా సంబంధాల్లో ఎదురవుతున్న సవాళ్ళని ఎదుర్కోవటానికి స్త్రీవాదులుగా మారటం వారికున్న ప్రధాన మార్గం. లేదా ఆ సంబంధాలని వదులుకోవటానికి వారు సిద్ధపడాల్సి వచ్చింది.
ఉద్యమంలో ఉండే స్త్రీవాద పురుషులని ఉద్యమంలో ఉండే మగ వ్యతిరేక ముఠాలు ఇష్టపడేవి కావు. వాళ్ళుంటే మగవాళ్ళందరూ అణచివేసే వాళ్ళే అని లేదా మగవాళ్ళందరూ స్త్రీలని ద్వేషించే వారేనని వాదించటం కష్టమయ్యేది. మగవాళ్ళు, ఆడవాళ్ళు అని ఇద్దరినీ పీడిరచేవాళ్ళు / పీడనకు గురయ్యే వాళ్ళు అనే రెండు పెట్టెల్లో పెట్టి ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని నిలబెట్టడంతో వర్గపరంగా పైకెళ్ళాలనే స్త్రీవాద మహిళకి బాగా పనికొచ్చింది. పురుషులందరూ శత్రువులని చెప్పటం స్త్రీలందరూ బాధితులని చూపించటానికి ఉపయోగపడిరది. మగవాళ్ళ గురించిన ఈ చిత్రీకరణ వ్యక్తిగతంగా ఆయా స్త్రీవాద కార్యకర్తలకున్న వర్గపరమైన ఆధిపత్యం నుండి, వర్గపరమైన ఆధిపత్యాన్ని పెంచుకోవాలనే వారి కోరిక నుండి దృష్టి మళ్ళించింది. ఇలా మగవాళ్ళందరినీ తిరస్కరించిన స్త్రీవాదులెవ్వరూ ఆడవాళ్ళకి మగవాళ్ళతో ఉండే దగ్గరి సంబంధాల గురించి, అవి ఒకరినొకరు సంరక్షించుకునే సంబంధాలు కావచ్చు, ఆర్థిక సంబంధాలు కావచ్చు, ఇమోషనల్‌ బంధాలు కావచ్చు (అవి అనుకూలమైవి, ప్రతికూలమైనవి), ఆడవాళ్ళని సెక్సిస్టు మగవాళ్ళకి కట్టిపడేసే బంధాలు వేటినీ పట్టించుకోలేదు.
మగవాళ్ళని సంఘర్షణలో కామ్రేడ్లుగా పరిగణించాలన్న స్త్రీవాదులని మీడియా అస్సలు పట్టించుకోలేదు. మగవాళ్ళని శత్రువులుగా పరిగణించటాన్ని విమర్శిస్తూ చేసిన సిద్ధాంతీకరణలేవీ కూడా ఈ మగ వ్యతిరేక స్త్రీవాదుల దృష్టిని, దృక్పధాన్ని మార్చలేకపోయాయి. ఈ రకంగా మగవారిని, మగతనాన్ని ప్రతికూలంగా చూపించే చిత్రీకరణలకి ప్రతిస్పందనగానే ఆడవాళ్ళకి వ్యతిరేకమైన ఒక పురుష ఉద్యమం బయలుదేరింది.
ఈ పురుష విముక్తి ఉద్యమం గురించి రాస్తూ, దాని వెనకున్న అవకాశవాదం గురించి నేనిలా రాశాను, ‘‘ఈ మగవాళ్ళు తమని తాము సెక్సిజం యొక్క బాధితులుగా పరిగణించుకుంటూ, తమని తాము మగవాళ్ళ విముక్తి కోసం పనిచేసే వాళ్ళుగా గుర్తించుకున్నారు. మగవాళ్ళకిచ్చే కఠినమైన సాంఘిక పాత్రలు తమని బాధిస్తున్నాయని చెప్పుకున్నారు. ఈ రకమైన పురుషత్వ భావనని మారుస్తామని ప్రకటించుకున్నారు. కానీ తాము స్త్రీలపై జరిపే పీడన, అణచివేత గురించి వాళ్ళెప్పుడూ మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఈ మగవాళ్ళ ఉద్యమం స్త్రీల ఉద్యమంలో అన్నింటికన్నా ప్రతికూలమైన పార్శ్వాలని ప్రతిబింబించింది. స్త్రీవాద ఉద్యమంలో మగవ్యతిరేక ముఠాలు చిన్నవైనప్పటికీ జన సముదాయంలో స్త్రీవాదులంటే మగద్వేషులనే అభిప్రాయం ప్రబలి పోయి దాన్ని మార్చటం చాలా కష్టతరంగా పరిణమించింది. ఈ రకమైన చిత్రీకరణలని చూపించి తాము చేసే పెత్తనం నుండి దృష్టిని మళ్ళించటంలో మగవాళ్ళు సఫలీకృతులయ్యారు.
స్త్రీవాద ఉద్యమం పాత మగతన నమూనాల నుండి మగవారిని విముక్తి చేసే కొత్త రకాల నమూనాలని రూపొందించి ఉండి ఉంటే ఉద్యమాన్ని మగ వ్యతిరేకి అని కొట్టిపడేయటానికి అవకాశం దొరికేది కాదు. మగవాళ్ళు సెక్సిస్టు వ్యతిరేకిగా ఉండటానికి ఏం చెయ్యాలో, సంప్రదాయ పురుషత్వానికి బదులు ప్రత్యామ్నాయ మగతనం ఎట్లా ఉండాలో నన్న విషయాల గురించి మనం ప్రభావవంతంగా ఏమీ చెయ్యలేకపోయాం కాబట్టే ఎక్కువ శాతం స్త్రీలు, పురుషులు మన ఉద్యమం బయటే ఉండిపోయారు. పితృస్వామ్య పురుషత్వ నమూనాలకు మనం చూపించే ప్రత్యామ్నాయం, అది స్త్రీవాద ఉద్యమం కావచ్చు, పురుష హక్కుల ఉద్యమం కావచ్చు ` అది మగవాళ్ళు కూడా స్త్రీత్వాన్ని అలవర్చుకోవాలని. అయితే ఆ స్త్రీత్వం గురించిన నమూనా సెక్సిస్టు సంస్కృతి, ఆలోచనల నుండి రావటం వల్ల అది ఏ రకమైన ప్రత్యామ్నాయాన్ని అందించలేకపోయింది.
అప్డుడూ, ఇప్పుడూ కూడా మగతనం గురించి మనకి కావాల్సిన నమూనా ఏంటంటే, తామంటే తమకి ఉండే ప్రేమ, గౌరవాన్ని వారి అస్తిత్వానికి పునాది చేసుకోవటం. ఆధిపత్య సంస్కృతులు మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, మనకి ఇతరులపై ఉండే పెత్తనమే మన అస్తిత్వానికి పునాదిగా మారుస్తాయి. పితృస్వామ్య సంస్కృతి మగవారికి వారి అస్తిత్వం, వారి జీవితానికి అర్థం, వారి గుర్తింపు మొత్తం ఇతరులపై పెత్తనం చెలాయించటంలోనే ఉందని నూరిపోస్తుంది. ఇది మారాలంటే ఈ గ్రహం మీద, పిల్లల మీద, స్త్రీల మీద, అధికారం లేని పురుషుల మీదా మగవాళ్ళు చెలాయించే పెత్తనాన్ని విమర్శించాలి. దీనికంటే ముఖ్యంగా మగతనం గురించి ఒక స్త్రీవాద నమూనా కూడా వాళ్ళు ఊహించుకోగలగాలి. ఊహే లేకపోతే మారటం కుదరదు కదా. ఆ ఊహ ఎలా ఉండాలనేది స్త్రీవాద ఆలోచనాపరులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఇప్పటికీ స్పష్టం చేయలేకపోయారు.
సామాజిక న్యాయం కోసం జరిగే విప్లవ ఉద్యమాల్లో ఒక సమస్యని గుర్తించి దానికో పేరు పెట్టటం జరిగినంత బాగా వాటికి పరిష్కారాలు ఊహించటం జరగదు. తాము మగవాళ్ళుగా పుట్టటంతో లభించే విశేషాధికారాల మీద ఆధారపడటం, వల్లమాలిన స్వయం ప్రేమ, ఎప్పుడూ వీడని పసితనం లాంటి రోగాలన్నీ పితృస్వామిక సంస్కృతిలో మగవాళ్ళకి సంక్రమిస్తాయి. చాలామంది మగవాళ్ళు తమకంటూ అర్ధవంతమైన స్వంత అస్తిత్వం నిర్మించుకోరు కాబట్టి ఆయా అధికారాలు పోతే తమ జీవితాలే నాశనం అయిపోయాయి అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే పురుష విముక్త ఉద్యమాలు మగవారికి తమలో కలిగే భావాలతో ఏ రకంగా సంబంధం ఏర్పర్చుకోవాలో నేర్పాయి. కోల్పోయిన తమలోని బాలుడిని వెతికి పట్టుకుని, వాడి ఆత్మని, ఆధ్యాత్మిక ఎదుగుదలని పెంచి పోషించాలని చెప్పాయి.
ఏ అర్థవంతమైన స్త్రీవాద సాహిత్యం కూడా మగపిల్లలను ఉద్దేశించి, సెక్సిజం బయట తమ అస్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవచ్చో చెప్పలేదు. సెక్సిజంని వ్యతిరేకించే మగవాళ్ళు కూడా మగపిల్లలపై, ముఖ్యంగా టీనేజీ అబ్బాయిలపై దృష్టి పెట్టి వారిలో విమర్శనాత్మక కోణాన్ని పెంచే చదువు నేర్పలేదు. ఈ రకమైన లోపాల వల్ల జాతీయ స్థాయిలో మగపిల్లల పెంపకంపైన చర్చలు జరుగుతున్నప్పటికీ, స్త్రీవాద దృక్పధాలకి వాటిలో చోటు లేకుండా పోయింది. బాధాకరమైన విషయమేమిటంటే ఈ చర్చల్లో హానికరమైన స్త్రీద్వేషంతో కూడుకున్న కల్పనలకి మళ్ళీ చోటు లభిస్తోంది. తల్లులు మగపిల్లలని ఆరోగ్యపరంగా పెంచలేరని, క్రమశిక్షణ, అధికారానికి లొంగి ఉండటం వంటివి మగపిల్లలకు లాభిస్తాయనే పితృస్వామ్య యుద్ధప్రేమతో కూడిన పురుషత్వ భావనలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. బాలురకు ఆత్మవిశ్వాసం అవసరం. వారికి ప్రేమ అవసరం. వివేకవంతమైన స్త్రీవాద రాజకీయాలు మాత్రమే మగపిల్లల జీవితాలను కాపాడగలిగే పునాదులు వెయ్యగలవు. పితృస్వామ్యం వారికి స్వాస్థ్యత చేకూర్చలేదు. అదే సాధ్యమై ఉంటే అందరూ ఇప్పటికే బాగుపడి ఉండేవాళ్ళు.
ఈ దేశంలో చాలామంది మగవాళ్ళు తమ అస్తిత్వం గురించిన బాధలో బ్రతుకుతున్నారు. పితృస్వామ్యాన్ని పట్టుకు వేలాడినప్పటికీ, లోపల్లోపల వాళ్ళకి అది కూడా సమస్యలో భాగమని తెలుసు. ఉద్యోగాలు లేకపోవటం, పనికి తగ్గ వేతనం రాకపోవటం, స్త్రీలకి పెరుగుతున్న వర్గపరమైన అధికారం`సంపద, అధికారం పెద్దగా లేని పురుషులకు తమ స్థానం ఏమిటన్న సందిగ్ధాన్ని కలుగచేస్తున్నాయి. తెల్ల జాత్యహంకార పెట్టుబడిదారీ పితృస్వామ్యం వాగ్దానం చేసినవన్నీ అందించలేకపోతోంది. అన్యాయం, ఆధిపత్యంలో బలంగా వేళ్ళూనుకుని ఉన్న ఆయా వాగ్దానాలను విమర్శించలేక అనేకమంది మగవాళ్ళు ఆందోళనకి గురవుతున్నారు. వాటిని పూర్తి చేసినప్పటికీ ఆయా పురుషులకి కీర్తి లభించట్లేదు. విముక్తి భావనను తిడుతూ, ఇంకో పక్క తమ ఆత్మని చంపేసిన జాత్యహంకార పెట్టుబడిదారీ పితృస్వామ్య ఆలోచనలని దగ్గరకి తీసుకోవాల్సి రావటంతో చిన్నపిల్లల్లాగా తాము కూడా ఎవరికీ, ఎటూ చెందమనే భావనలో బ్రతుకుతున్నారు.
అమెరికన్‌ మగవాళ్ళని పునరుద్ధరించాలంటే బాలురని, పురుషులని ప్రేమించి, వారికి లభించాల్సిన ప్రతి హక్కు కోసం అడుగుతూ, స్త్రీవాద పురుషత్వ భావనని తన దృష్టి కోణంలో ఇముడ్చుకునే స్త్రీవాద కల్పనలు మనకి కావాలి. స్త్రీవాద ఆలోచన మనందరి జీవితంలో స్వేచ్ఛ, న్యాయాలని ప్రేమించి, పోషించటం నేర్పుతుంది. ఇటువంటి స్త్రీవాద పురుషత్వాన్ని పెంపొందించే కొత్త వ్యూహాలు, సిద్ధాంతాలు అత్యంత అవసరం.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.