జీవన్నాటకం – ములుగు లక్ష్మీ మైథిలి

నగరంలోనే ఎంతో పేరు పొందింది ‘మమతా వృద్ధుల ఆశ్రమం’. పేరుకు తగ్గట్టే అక్కడ ముదిమి వయసులో ఉన్న స్త్రీలను, పురుషులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ఆప్యాయతతో వేళకు భోజనం పెడుతూ, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సొంతవారిలా సేవలు చేయటం, దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించటం, డాక్టర్‌ ఇచ్చే మందులు

సమయానికి ఇవ్వటం, బలవర్థకమైన ఆహారం అందించటం లాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు.
ఆ ఆశ్రమానికి కొత్తగా వచ్చిన పార్వతమ్మకు ఆ ఆశ్రమంలో ఉండే వారంతా కొద్ది రోజులలోనే మంచి స్నేహితులయ్యారు. తాను ఆశ్రమంలోకి ఏ పరిస్థితుల్లో వచ్చిందో వివరంగా చెపుతున్న పార్వతమ్మ మాటలు విని అందరూ బాధపడ్డారు. వారు కూడా తమ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను చెపుతున్నప్పుడు, పార్వతమ్మ కూడా ఎంతో వ్యధ చెందింది.
ఒకరోజు అందరూ భోజనాలు చేస్తుండగా, ఒక పదిహేడేళ్ళ అబ్బాయి వచ్చాడు. అతను నేరుగా అన్నం తింటున్న పార్వతమ్మ దగ్గరకు వచ్చి ‘‘నానమ్మా! నాకు హాలిడేస్‌ ఇచ్చారు. హాలిడేస్‌ అయిపోయేదాకా నీ దగ్గరే గడుపుదామని వచ్చాను’’ అని చెప్పాడు.
‘‘అదేంట్రా! శలవులిస్తే అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావు. వస్తే వచ్చావు కానీ, అన్నం తిని ఇంటికి
వెళ్ళు’’ అంటూ అక్కడ వడ్డిస్తున్న వ్యక్తితో ‘‘బాబూ! వీడు నా మనవడు. వీడికి కూడా అన్నం పెట్టు’’ అని చెపుతూ, తన పక్కనే కూర్చోమని మనవడికి చెప్పింది.
‘‘నానమ్మా! నేను భోజనం చేసే వచ్చాను. నువ్వు తినేసెయ్‌’’ అంటూ తన కాలేజీలో జరిగే విషయాలను చెపుతుండగానే, పార్వతమ్మ భోజనం చేసి చేతులు కడుక్కొని వచ్చింది.
ఇద్దరూ హాల్లోకి వచ్చి కూర్చోగానే, మిగతా పెద్దవారు కూడా ఆ అబ్బాయి పక్కనే చేరారు.
‘‘చూడండి… వీడు నా మనవడు. పేరు ప్రదీప్‌. నన్ను చూసి వెళ్ళడానికి వచ్చాడు’’ అని చెప్పగానే ప్రదీప్‌ అక్కడున్న వారికి నమస్కారం చేశాడు. తర్వాత పార్వతమ్మ వైపు తిరిగి ‘‘నానమ్మా! నిన్ను ఈ ఆశ్రమంలో చేర్పించటం నాకు నచ్చలేదు. ఇంటికి పోదాం పద. నేను నాన్నతో మాట్లాడతాను’’ అని చెపుతున్న ప్రదీప్‌కి పార్వతమ్మ ఏదో చెప్పేలోగా, ‘‘ఒక్క క్షణం నానమ్మా! నేను ఇప్పుడే వస్తాను. చిన్న పని ఉంది’’ అంటూ, తన మొబైల్‌లో ఒక నెంబర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడాడు ప్రదీప్‌.
… … …
ఆశ్రమంలోని హాల్లో సుమారుగా వందమంది కూర్చొనేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. వేదికపై ‘‘మమతా వృద్ధుల ఆశ్రమం వార్షికోత్సవం’’ అని రాసి ఉన్న పెద్ద బ్యానర్‌ కట్టి ఉంది. వేదిక కింద ముందు ఉన్న రెండు వరుసలలో ఆశ్రమంలోని పెద్దవారిని కూర్చోబెట్టారు. తర్వాత వరసల్లో అక్కడ ఉన్న వృద్ధుల కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వారి పిల్లలు అందరూ వచ్చారు.
పార్వతమ్మ కొడుకు గిరి ఆమె దగ్గరకు వచ్చి, ‘‘అమ్మా! ఎలా ఉన్నావు? ప్రదీప్‌ ఈ రోజు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేస్తే వచ్చాము. నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవిగో ఈ పండ్లు తీసుకో’’ అంటూ తాను తెచ్చిన పండ్ల సంచిని తల్లి చేతిలో పెట్టాడు. ‘‘బాగున్నా నాయనా. నువ్వు, కోడలు ఎలా ఉన్నారు? కోడలికి నా మీద కోపం పోలేదా? నాతో మాట్లాడకుండా దూరంగా ఉంది’’ అని కొడుకు తలపై చేయి వేసి నిమురుతూ ఉండగానే, ప్రదీప్‌ వేదిక మీద ఉన్న మైక్‌ అందుకొని, ‘‘ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. మీరందరూ మీ సీట్లో నిశ్శబ్దంగా కూర్చుంటే కార్యక్రమంలో భాగంగా ఒక ‘ప్రాణదానం’ నాటకం ప్రారంభం అవుతుంది’’ అని చెప్పగానే పార్వతమ్మ కొడుకు ‘మళ్ళీ మాట్లాడతా అమ్మా, నాటకం అయ్యాక’ అంటూ వెనక్కి వెళ్ళి తన భార్య పక్కన కూర్చున్నాడు.
నాటకం మొదలైంది. వేదిక మీద ఒక పెద్దావిడ మంచం మీద కూర్చుని ఉంటుంది.
‘‘అమ్మా! ఆఫీస్‌కి వెళ్ళి వస్తాను’’ అంటూ తల్లి పాదాలకు నమస్కరిస్తున్న భర్త పాత్ర పోషించే అబ్బాయితో ‘‘ఏమండీ… ఆవిడ కాళ్ళకు మొక్కకపోతే మీరు ఆఫీసుకి కదలరా ఏంటి…!’’ అని కోడలు పాత్రలో ఉన్న అమ్మాయి భర్తను కసురుకుంటుంది.
‘‘అమ్మే అందరికీ మొదటి దేవత. అమ్మ పాదాలకు నమస్కరిస్తే సకల దేవతలకు నమస్కరించినట్లే తెలుసా!’’ అంటూ కొడుకు పాత్రలో నటించే అబ్బాయి చెపుతాడు.
‘‘చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎంతసేపూ అమ్మ… అమ్మ… ఈ ముసలిదానికి సేవలు చేయలేక ఛస్తున్నా. ఓల్డేజ్‌ హోమ్‌లో చేర్చమంటే చేర్చరు. ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఆమెను ఎలాగూ మీరు పంపరు. అందుకే నేనే మా పుట్టింటికి పోతాను’’ అంటూ లోపలికి వెళ్ళి సూట్‌కేస్‌తో వస్తుంది కోడలు పాత్ర వేసిన అమ్మాయి.
‘‘నాకు అమ్మా కావాలి, నువ్వూ కావాలి. అమ్మ మీద ప్రేమ చూపించటం తప్పెలా అవుతుంది. ఇంత చిన్న విషయానికి గొడవపడి వెళ్ళిపోవద్దు. ప్లీజ్‌ నా మాట విను…’’ అని కొడుకు చెపుతున్నా వినకుండా వెళ్తున్న కోడలిని చూస్తూ… ‘‘నాయనా! నా మూలంగా మీకు తగవులొద్దు. భవిష్యత్తులో కలిసి బతకాల్సిన వారు మీరు. ఈ రోజో, రేపో పోయే నా కోసం మీరు విడిపోవటం నాకు ఇష్టంలేదు. నీకు నామీద ఏ మాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా నన్ను ఆశ్రమంలో చేర్చు’’ అని కొడుకును ప్రాధేయపడుతుంది తల్లి పాత్రలో ఉన్న అమ్మాయి.
‘‘అమ్మా! ఒక్క క్షణం ఆగు’’ అంటూ… భార్యతో ‘‘ఇదిగో ఒక ముఖ్యమైన విషయం చెపుతాను. అది విన్న తర్వాత కూడా అమ్మను ఆశ్రమంలో చేర్చమంటే చేర్చుతాను’’ అని చెప్పబోతుండగా ‘‘వద్దు నాయనా’’ అని తల్లి వారిస్తున్నా వినకుండా భార్యతో ‘‘నాన్న చిన్నప్పుడే చనిపోతే నన్ను ఎంతో కష్టపడి పెంచి ఇంతవాడ్ని చేసింది. అలాంటి దేవత అమ్మ. నీకు అనారోగ్యం కలిగినప్పుడు హాస్పిటల్‌లో పగలు, రాత్రి నీకు సేవలు చేసింది మా అమ్మ. నీకు కిడ్నీలు ఫెయిలయితే, నీకు తన కిడ్నీని ఇచ్చి ప్రాణదానం చేసిన దేవతను ఇంట్లోంచి పొమ్మంటున్నావు. ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. ఎలా వదిలిపెట్టమంటావు’’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు కొడుకు పాత్రలో ఉన్న అబ్బాయి.
భర్త చెప్పేది విని నిర్ఘాంతపోయిన కోడలు అత్తమ్మ కాళ్ళమీద పడి ‘‘నన్ను క్షమించండి అత్తయ్యా! మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. అయినా నాకు ప్రాణం పోసిన దేవత మీరు. ఎక్కడికీ వెళ్ళొద్దు ఇక్కడే మాతో పాటే ఉండండి’’ అంటూ ఏడవడంతో నాటకం ముగుస్తుంది.
నాటకం చూస్తున్న అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. పార్వతమ్మ కొడుకు ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని బాధ పడుతుంటాడు.
నాటకం ముగియటంతో ప్రదీప్‌ పోడియం వద్దకు చేరుకుని మైక్‌ అందుకుని ‘‘మీరు ఇప్పటిదాకా చూసిన నాటకంలో పాత్రలు వేసిన వారు నా స్నేహితులు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది యదార్థ గాథ. కోడలికి కిడ్నీ ఇచ్చింది ఎవరో కాదు… మా నానమ్మ పార్వతమ్మ’’ అని చెప్పాడు.
హాల్లో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పార్వతమ్మను అందరూ ఆశ్చర్యంగానూ, బాధగానూ చూశారు.
ప్రదీప్‌ మాటలు వింటున్న పార్వతమ్మకు తన పాదాల మీద చల్లగా తగలటంతో ఏమైందోనని చూడగా, తన పాదాలు పట్టుకుని ఏడుస్తున్న కోడలిని గమనించింది.
‘‘అత్తయ్యా! నన్ను క్షమించండి. మీరు నాకు ప్రాణమిచ్చిన దేవత. మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా, నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు. మీ మంచితనం అర్థం చేసుకోలేకపోయాను. మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ కొడుకు అన్నం, నిద్ర మానేసి మీ కోసం దిగులు పడుతున్నారు. ఇంటికి వెళ్దాం రండి అత్తయ్యా’’ అని చెపుతున్న కోడల్ని చూసి సంతోషపడిరది పార్వతమ్మ.
అక్కడ ఉన్నవారంతా ‘‘ఇంటికి వెళ్ళు పార్వతమ్మా. ఇలాగే మా పిల్లల్లోనూ మార్పు వస్తే… ఇక వృద్ధాశ్రమాలే ఉండవు. ఈ జీవితమే ఒక నాటక రంగం. ఇందులో మనమంతా పాత్రధారులమే. మేము అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తుంటాము. మొత్తానికి మిమ్మల్ని కలిపిన నీ మనవడు ప్రదీప్‌కి మా ఆశీస్సులు’’ అంటూ ఆనందంగా చెప్తుంటే వారికి వీడ్కోలు చెప్పి, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా బయలుదేరింది పార్వతమ్మ.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.