కాళ్ళ పసుపు పారాణి ఆరని నా అతివను వదిలి,
కుంకుమపూలు పూసే మంచు పొలాలకి,
పయనమయ్యాను దేశ రక్షణకై!
బుజ్జి కుక్క పిల్లని నా వీపు సంచిలో ఉంచుకొని!
సుఖాల సుధల కడలిని,
ముద్దు మురిపాల ముత్యపుమూటల్ని వదిలి,
నా విరహపు హృదయాన్ని ఆమె గది గోడకు అతికించి,
నిస్పృహల్ని మా ముంగిట తోరణాలుగా తగిలించి,
గడపకి ఆవలే నా సర్వస్వాన్నీ వదిలి పయనమయ్యా!
మంచు లోయల్లో చంద్రుని జాడ లేని నిశి రాత్రుల్లో
చెలి లేని చోట చలే నాకు తోడుగా,
క్షణమొక యుగంగా గడపలేను నిలువలేను!
నెచ్చెలి వెచ్చని కౌగిళ్ళ తన్మయత్వం లేదిక్కడ,
మధురపు మాటా మంతీ లేదు,
ఇంకేముందిక్కడ!
విరహపు మంటల్లో కాలడం తప్ప!
విరామమెరుగని పహారా తప్ప!
అమృతమయమైన అమ్మ చేతి బువ్వకు కరువిక్కడ!
కానీ…
నా దేశవాసుల సంరక్షణ ముఖ్యం నాకు!
శత్రువు ఎదురైతే రాకెట్ స్పీడ్‌తో ఆలోచించాలి,
రివటలా ఎగిరి దూకాలి,
బాణంలా దూసుకుపోవాలి,
శివంగిలా శివమెత్తి ప్రాణాల్ని తీయాలి,
ఏది ఏమైనా మా ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చెయ్యాలి,
నా దేశం కోసం! మన దేశం కోసం!
మీ అభివాదాలే మాకు ఊపిరి, ఊరట!
జై భారత్!