ప్రపంచమంతా సుందర ప్రకృతి అందాలు విరజిమ్ముతుంటే,
ఆమె మాత్రం కీకారణ్యంలాంటి గది కిటికీలోంచే బేలగా నిష్కాంతిని చూస్తుంది.
జగత్తు మొత్తం హంగుల రంగులు పులుముకొని నవీనంగా నడిస్తే,
ఆమె మాత్రం పసుపుతాడుతో బంధించిన మూగజీవమవుతుంది.
ఆధునిక అద్భుతాలు అల్లంత దూరంలో ఉన్న చంద్రుణ్ణి ముద్దాడి మురిసిపోతుంటే,
ఆమె మాత్రం బానిసలా కర్కశమైన మాటల శాసనాల్లో జీవితాన్ని కాలరాసుకుంటోంది.
అనాది కాలంలో నిర్మించిన గది నాలుగు గోడల్లో
తాను ఓ ఇటుకయ్యింది అదే గదిలో బందీ అయ్యింది…
మరబొమ్మలు విహారం చేస్తూ ఔచిత్యం చేసే భూమిపై
మాట్లాడే స్వేచ్ఛకు అడ్డుకట్ట అనివార్యమైంది ఆమె ఒక్కదానికే…
తరాల నుండి సాగుతున్న ఆమె ముభావం
తలుపులు నెట్టి ఉప్పొంగే స్వభావమవ్వాలని
మది నిండా కాంక్షిస్తున్నా…
మరో స్వతంత్రంతో ఆమె ఈ లోకాన్ని జయించాలని ఆశిస్తున్నా…