పల్లె పల్లెలో రైతన్న
పారిపోయే వెందుకన్న
పల్లెలేమో వద్దంటున్నాయ ఓ రైతన్నా
పట్టణాలే ముద్దౌతున్నాయ.
1. పైకి చూస్తే చినుకు లేదు
కింద చూస్తే గింజ లేదు
పంటలెట్ల పండెనోయన్న ఓ రైతన్నా
పొట్టకోసం పట్నమెల్తివా ఓ రైతన్నా
2. అన్నదాతని నీకు పేరు
దాతకేమో తిండి లేదు
దానమెట్ల చేస్తావోయన్న ఓ రైతన్నా
దేహి అంటూ దేవుణ్ణి చూశావా ఓ రైతన్నా
3. కాయకష్టమంతా నీకు
కాసులేమో దొరగారికి
మధ్యవర్తితో మోసపోతివా ఓ రైతన్నా
మంచితనమే మాయమాయెనా ఓ రైతన్నా
4. పంట చేతికి వస్తుందని
పరుగుపరుగున కోయబోతే
రాళ్ళవర్షం నిన్ను కొట్టిందా ఓ రైతన్న
రాయోలె మూగబోతివా ఓ రైతన్నా
5. చేతికొచ్చిన గింజకేమో
దాచుకోను చోటు లేదు
కళ్ళనిండ కన్నీళ్ళొచ్చెనా ఓ రైతన్నా
కలలన్నీ కల్లలాయెనా ఓ రైతన్నా
6. పేరుకేమో పథకాలు
కాగితాలే సాక్ష్యాలు
నిధులన్నీ నింగిమింగెనా ఓ రైతన్నా
వట్టి చేతులు వెక్కిరించెనా ఓ రైతన్నా
7. పై వాడు నీకు దేవుడు
నువ్వేమో మాకు దేవుడు
పిరికివాడిగ పైకి పోకన్నా ఓ రైతన్నా
తండ్రి లేక పిల్లలెట్లన్నా ఓ రైతన్నా