నీలకురింజి సముద్రం – డాక్టర్‌ ప్రగతి కవితల పరిచయం – ఆర్‌. శశికళ

జీవితంలోని ప్రతి మలుపులోను జరిగిన సంఘటనలు, ఉద్విగ్న క్షణాలు, వెంటాడే అనుభూతులను జ్ఞాపకాల అంతరంగంలో మధించి అక్షరాలను సీతాకోక చిలుకల్లా ఎగురవేసే నైపుణ్యం ఆమె కవిత్వానికి ఉంది.

అనుభూతికి అందని భావాల్ని వ్యక్తం చేయటానికి చేసే ప్రయత్నం. రాప్తాడు గోపాలకృష్ణ చెప్పినట్లు అంతర్‌, బహిర్‌ జైళ్ళ మధ్య నీవు రెక్కలను కలగంటావు…
కవిత్వం అంటే కొన్ని అక్షరాలు, పదాల కూర్పు కాదు. ఆమెకు కవిత్వం అంటే ఆగ్రహం, ఆవేశం, చీకటితో చేసే పోరాటం.
సామాజిక చింతన, చెడును నిరసించి అభ్యుదయం వైపు చేసే ప్రయత్నం రంగుల పూలవనంలో విహరింపచేస్తుంది ఆమె కవిత్వం. తల్లి వెలిగించిన బొగ్గుల కుంపటి వెలుతురులో బాల్యంలో నేర్చుకున్న పాఠాలు నీడల్లా కదులుతూ ఉంటాయి. నీలకురింజి సముద్రం లాంటి తండ్రి మనసు లోతులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె కవిత్వం. జీవితాన్ని అడుగడుగునా శాసిస్తున్న వ్యాపార ధోరణులను నిరసిస్తుంది.
విద్యార్ధి దశలోను, అధ్యాపక వృత్తిలోను ఎదురైన అనుభవాలను సరళమైన భాషలో, వ్యంగ్యమైన పద చిత్రాలతో కవిత్వం రాస్తారు. గమ్మత్తైన వ్యంగ్యంతో కూడిన ప్రతీకలు ఆమె కవిత్వాన్ని వెలిగిస్తాయి. ఈ సంఘర్షణాత్మక జీవితంలో లొంగుబాటే జీవితమైపోయింది. బతకడం కోసం మాత్రమే కాదు ప్రతిరోజు నిద్రలేవడానికి కూడా స్వేచ్ఛా ప్రపంచంలో ఉన్నారనుకుంటాం. కనిపించని సంకెళ్ళలో బందీలం అంటుంది ఆమె కవిత్వం.
ఆమె కవిత్వానికి ముందు మాట రాసిన శిలాలోలిత గారు, డాక్టర్‌ రాజారాం గారు, కెంగార మోహన్‌ గారు ఆమె కవిత్వ అంతరంగాన్ని అందమైన భాషలో ఆవిష్కరించారు. ఆమె మనసు అంతే అందమైనది, సున్నితమైనది. తన చుట్టూ
ఉన్న ప్రకృతిని, మనుషులను ప్రేమించగలిగే ఆసక్తి లోంచి ఆమె సృజనాత్మక శక్తి వైవిధ్యమైన శిల్పం కల్గిన చైతన్యం కవితల్లో ప్రతిఫలిస్తుంది.
ఆమె కవితల్లో నాకిష్టమైన ‘సుద్దముక్క’ నుంచి కొన్ని మాటలు
‘‘చీకటి ఆకాశంపై
చిరు తారలు మొలిచినట్లు
నల్లటి పొలంలో
బీజాలు మొలిపిస్తూ
నాగేటి సాలుగా వయ్యారాలు పోతుందది’’
ఆమె కవిత్వం జీవరసాయనం. తాను ఎదుట జరిగే అన్యాయాలను, అక్రమాలను సహించలేక ఏదో ఒకటి చేయాలనుకుంటారు, అది కవిత్వమైనా సరే.
‘‘కాస్తా ఆగండి
దోసిళ్ళలో కాసిని
అక్షర నక్షత్రాలను
నింపుకొని నేనూ వస్తున్నా
చిన్ని మిణుగురులకు తోడుగా
నేను చిక్కటి చీకట్లతో పోరాడుతా
ప్రభాత వేళకు వెలుతురు వాకిలి తీసి
నిలబడతా…’’ (పేజీ 21)
ప్రతి నిమిషం మనలను ఎన్నో ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి. వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో వెనుకబడిపోతూ
ఉంటాము. ఆ ప్రశ్నలు మన చదువును, చేసే వృత్తిని, మంచితనాన్ని అన్నింటినీ ఓ కొత్త చూపుతో చులకన చేసి అజ్ఞానపు పొరలను ఒక్కొక్కటిగా విడదీస్తూ పోతుంటాయి. కాసింత వివేకం మనసు లోయలోకి ఎవరూ విననంతగా వెర్రి కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే భావానికి భాష కుదరదు. ప్రతిబింబం అదృశ్యమవుతుంది.
అధ్యాపకురాలిగా ఆమె కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాలేదు. వృత్తిని ప్రేమించినట్లు, విద్యార్థుల బాగోగుల పట్ల, వారి స్థితిగతుల పట్ల పరిశీలన, కథల్లోనూ, కవిత్వంలోనూ కనబడుతుంది. విద్యారంగం కూడా ఆమె కవితల్లో ప్రతిఫలిస్తుంది. ‘‘మనోళ్ళేనా, అతనో ఖాళీ రంగు రంగుల డబ్బా, తాళం తీయవా ప్లీజ్‌, జూమ్‌ కరోనా, సుద్దముక్క’’ కవితలు చదివితే మనుషులను విడదీసే దుర్మార్గం, పాతుకుపోయిన కులం, వేధించే అనేక సమస్యలను ఎలా కవిత్వంలోకి తీసుకొని వచ్చారో అర్థమవుతుంది. జీవితమే టీచర్‌, జీవించాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవటమంటే మంచివైపు నిలబడి చెడును నిరసించటం. శాస్త్రీయ ఆలోచనా దృక్పథంతో రాసిన ఆమె వ్యాసాలు ఆలోచింపచేస్తాయి, అవగాహనను పెంచుతాయి.
‘అతనో ఖాళీ రంగు రంగుల డబ్బా’ కవితలో కలాన్ని, కలల్ని కాలానికొదిలేసి తాను పెయింట్‌ బ్రష్‌గా మారిపోయానన్నాడు (పేజీ 64లో). అతని బాల్యం ఆడుకున్న దారిద్య్రపు బంతి, అతని యవ్వనం పాడుకున్న ఆకలి గీతం… పనిచేసి చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా పరీక్ష హాల్లోకి వచ్చిన ఆ విద్యార్థి పరిస్థితిని ఈ కవితలో చాలా చక్కగా ఆవిష్కరించారు ప్రగతి గారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, సంఘటనలు జరిగినప్పుడు సమాజం స్పందించే తీరును ఆవేదనతో దయచేసి క్షమించమని ఆ చిన్నారి బాలికలకు తన కవిత ద్వారా విజ్ఞప్తి చేస్తారు.
‘‘మీ బతుకు ఛిత్రమైపోయాక
కాసిన్ని కొవ్వొత్తులు వెలిగిస్తాం
మీ గొంతులు నొక్కబడ్డాక
మా గొంతులు సవరించుకొని…’’ (పేజీ 93లో)
ఆమె మాటల్లోనే కవిత్వమంటే భావ వారధి, కడుపులో వికారం కాదు. మెదడులో సంఘర్షణ పుట్టించాలి. ఇటువంటి కవిత్వం న్యాయం పక్షాన, సత్యం వైపున నిలబడే స్పృహను, సామాజిక చింతనను, భావం, చైతన్యం కలిగిస్తుంది.
‘మనోళ్ళేనా’ కవితలో బాల్యం నుండి స్నేహాలకు అడ్డురాని కులతత్వం యూనివర్సిటీ స్థాయిలో ఎలా వికృతంగా మారిందో ఈ కవితలో చెప్పారు.
‘‘ఈ తోకలూ, కొమ్మలు ఇంకా అవసరమా
మన పిల్లలకైనా లేకుండా చేద్దాం
అంతా మనవాళ్ళేనని నేర్పిద్దాం…’’ అంటారు.
రాప్తాడు కవిత గుర్తుకోస్తోంది…
‘‘ఎంత సుబ్బరంగా ఉంటేనేమి
ఎంత నాజూకుగా ఉంటేనేమి
కులం ఉరితాడుకు
వేలాడుతుంటాను
ఇల్లు ఊరి మధ్యే అయినా
ఉనికి వేయి ఆమడల దూరం…’’
ప్రగతి కవిత్వం ప్రశ్నిస్తుంది, ఆలోచింపచేస్తుంది. పుడమి లోపలికి విస్తరిస్తున్న వేర్లలా మన ఆలోచనల్లోకి విస్తరిస్తుంది. నీలకురింజి పువ్వుల కాంతిలా నెమ్మదిగా మన అనుభూతుల్లో భాగమవుతుంది ఆమె కవిత్వం. మీరూ తప్పక చదవాలని కోరుతూ…
డాక్టర్‌ ప్రగతి నుంచి మరిన్ని రచనలను ఆశిస్తూ… అభినందనలతో…

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.