‘బలగం’ సినిమా నుండి ఏమి నేర్చుకుందాం – డా.శ్రీరాములు గోసికొండ

‘బలగం’ సినిమాపై ఒక సామాజిక విశ్లేషణ

దాదాపు నాలుగు నెలల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమాలో ప్రతి సన్నివేశం నిజానికి అతి దగ్గరగా, తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఘట్టం జరిగినట్లుగానే ఉంది. సినిమా మొత్తం ఒక కుటుంబం చుట్టే తిరిగినా, దానిలోని ఎన్నో సన్నివేశాలు

తెలంగాణలో ప్రతి కుటుంబంలో జరిగినట్టుగానే ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోకాలంగా దూరమయిన కొంతమంది రక్తసంబంధీకులు కలిసిపోయినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. కొన్ని పల్లెల్లో ఈ సినిమాను ప్రదర్శించడమనేది, 1990 దశకంలో గోడ సినిమాగా వేసిన ‘కన్యాశుల్కం’ను గుర్తుకుతెస్తుంది. అందుకే ఆ సినిమా అందరి హృదయాలను గెలుచుకొని, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలు సమాజానికి అద్దాల్లాంటివి. సమాజంలో జరిగే వాటినే చిత్రరూపంలో చూపించే ప్రయత్నం చేస్తారు. చాలామంది సినిమాను వినోదంగా చూస్తే, కొంతమంది సినిమాను సందేశం ఇచ్చి సమాజంలో మార్పుకు శ్రీకారం చుడుతుందని నమ్ముతారు. అయితే ఈ సినిమాను ఒక సామాజిక కోణంలో చూస్తే, దానిలో ఎన్నో సందేశాలు దాగున్నాయి.
తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు:
ఎన్ని బాధలున్నా సరే, తాత (గాజుల కొమురం)లాగా గుండెల్లోనే దిగమింగుకొని ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, మనిషి జోరు మీదుండాలి, మాటలు హుషారుగా రావాలి. ముసలితనం శరీరానికే కానీ మనసుకు కాదు అని గుర్తించాలి. ఒకరినొకరు మందలించుకుంటూ ఉంటే మనిషి తనకున్న బాధలను మరిచిపోతాడు. దేవుణ్ణి నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతం. మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ ఆచార వ్యవహారాలు పాటిస్తారు. అయితే చిన్న కొడుకు సూరత్‌ నుండి వచ్చినందున, సినిమాలో చూపెట్టిన కుటుంబం మార్కండేయ వంశానికి చెందిన పద్మశాలి కులస్తులుగా అంచనా వేయవచ్చు. వారు బ్రాహ్మణుల ఆచారాల్లో కొన్నింటిని అనుసరిస్తూనే, ఎన్నో తరాలుగా పాటిస్తున్న బహుజనుల సాంప్రదాయాలను కూడా విరివిగా పాటిస్తారు. పుట్టుక మొదలు, పురుడు చేయడం, పేరు పెట్టడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పెళ్ళి చేయడం, అమ్మాయిలకు అయితే చెవులు కుట్టించడం, చీర కట్టించడం, మగపిల్లలకు ఉపనయనం/పంచె కట్టించడం, తదితర ముఖ్య ఘట్టాలన్నీ మత, ప్రాంత, కుల ఆచారాలను బట్టే జరుగుతాయి. ఆ సంస్కృతులను పాటించడంలో ఏ తప్పు లేదు. అలాగే తెలంగాణలో దసరా, సంక్రాంతి, బోనాలు, తదితర పండుగలప్పుడు, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, పెద్దమ్మ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క`సారక్క, ఇతర స్థానిక జాతరలప్పుడు దేవుడి పేరుమీద యాటలు కోసుడు, మందు తాగుడు షరా మామూలే. ఇవే కాకుండా ఈ మధ్య యువత కొత్త సంవత్సరం, పుట్టినరోజు, పెళ్ళిరోజులకు కూడా మంచిగా దావత్‌లు చేసుకుంటోంది. తినడంలో తప్పు లేదు, కానీ వచ్చిందంతా తాగుడుతోనే. ఎవరైనా ప్రభోజనానికి పిలిచారంటే చాలు మగవాళ్ళు ఇంత మందు వేసుకొని మరీ వెళ్తారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా పెళ్ళికో, ఏదైనా ఫంక్షన్‌కో, చావుకో పోతే అక్కడ కూడా బారు/వైను/బెల్టు షాపు ఎక్కడుందో దేవులాడి మరీ తాగడానికి వెళ్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగలు, పబ్బాలప్పుడే కాకుండా సంతోషంగా ఉన్నా, మనసు బాగాలేకున్నా మందే దిక్కు. ఎలాగైనా తాగాలని అనుకున్న వ్యక్తికి రోజూ పండుగే, అసలే తాగద్దు అనుకున్న వ్యక్తికి ఏ పండుగైనా నిమ్మళంగా ఉంటాడు.
బర్రె చేనులో మేస్తే, దుడ్డె గట్టున మేస్తదా?
ఇంట్లోనే అందరూ కలిసి తినడం, తాగడం సమానత్వానికి, దాపరికంలేనితనానికి ఓ సూచికే. కానీ అసలు ఆడైనా`మగైనా, ఇల్లైనా`బారైనా, పైసల్లేనోళ్ళైనా`పైసలున్నోళ్ళైనా, పెగ్గైనా`జగ్గైనా ‘ఆల్కహాల్‌’ మంచిది కాదని ఎన్నో పరిశోధనలు రూఢ చేస్తున్నాయి, ఎందరో డాక్టర్లు మొత్తుకుంటున్నారు. అగ్గు వుండే చీపు లిక్కరైనా, ధర గల ఫారిన్‌ విస్కీ అయినా కార్జాన్ని (లివర్‌) తూట్లు పొడిచి, రోగాల పాల్జేసేవే. కాకపోతే కొంచెం ముందూ వెనకా… అంతే. పేదోళ్ళు మందుకు బానిసైతే, పనికి పోలేక పైసలు పాయే, పానం ఖరాబాయే, దావఖానా ఖర్చులాయే, ఇల్లంతా ఆగమాగమాయే, ఊళ్ళె విలువ కూడా ఉండదాయే… అందుకే మందు వ్యవహారం బీదోళ్ళనే ఎన్నో రకాలుగా దెబ్బతీస్తుంది. ఏదో పున్నానికో, అమాసకో అంటే అర్థం చేసుకోవచ్చు. కుటుంబ పెద్ద నిత్తె తాగుకుంటనే ఉంటే ఇల్లు గడిచేదెట్లా? ఇలా వాళ్ళ కుటుంబాల్లో తాగడం చూసిన మగపిల్లలు యుక్తవయస్సుకి రాకముందే తాగుడు అలవాటు చేసుకోరని నమ్మకమేముంది? వారు తమ తండ్రి బాటలో నడవరని ఎలా అశించగలం? బర్రె చేనులో మేస్తే దుడ్డె (దూడ) గట్టున మేస్తదా? ‘ఇంటికి కావాల్సిన అవసరాలు ఏమున్నయి, పిల్లలకు మంచి నడవడిక, కుటుంబ విలువలు, నైతిక విలువలు ఎలా నేర్పాలి, వారిని ఎలా ప్రయోజకులను చేయాలి, ఇంట్లో ఏయే సౌలతులు కావాలి, వాటన్నింటికి నెల/యాడాది లెక్కన ఎంత ఖర్చౌతుంది, దానికోసం ఏం చేయాలి, ఎటువంటి దురలవాట్లు వదులుకోవాలి, ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, దుబారా ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, అసలు ఉన్న అప్పెంత, కుప్పెంత’ అని ఇలా రకరకాలుగా ఇంటి పెద్ద ఆలోచన చేస్తేనే కదా వారి కుటుంబం పురోగతి చెందేది. లేకపోతే ఇంట్లో వారందరికీ మానసిక అశాంతితో పాటుగా మరెన్నో ఊహించని సమస్యలు చుట్టుముట్టి, కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఇప్పటికీ దహన సంస్కారాల నుండి దినాలయ్యే దాకా చాలా కొద్దిమంది వాళ్ళ శక్తికి మించి తాగి సొలగడం, మందు ఎక్కువైపోయి సోయి లేకుండా పడిపోవడం, ఆ మత్తులో వాళ్ళకు నచ్చనివారితో జౌడాలు పెట్టుకోవడం, కక్కడం, అరవడం, కింద పడి బొర్రడం చూస్తూనే ఉన్నాం. అసలు ఇంట్లో ఒక మనిషి చనిపోతే బాధలో ఉండాల్నా, ఈ తాగుడేందని కొంచెం జ్ఞానానికచ్చిన పిల్లలు, యుక్త వయస్సులో
ఉన్నోళ్ళు, పెద్ద మనుషులు బీరిపోవడం చూస్తాం. దీన్ని సినిమాలో మనవడి (సాయిలు) బిత్తరచూపుల ద్వారా చూపించారు.
ఇంటిపెద్ద కడుపొక్కటే నింపుకోవడం ఏ ధర్మం కిందకు వస్తుంది?
దేవుడు, సాంప్రదాయం పేరు చెప్పి, పరువు, ప్రతిష్టలకు పోకుండా ఉన్నంతలో వెళ్ళదీసుకోవాలి. దేవుడికి మనం మొక్కేది కష్కెడు మందు, చిన్న గిలాశెడు కల్లు, గంటెడు (యాట/కోడి) కూర…కానీ, మనం తాగేది`తినేది మాత్రం షేర్లకు షేర్లు మందు, కుండలకు కుండలు కల్లు, బకీట్లకు బకీట్ల కూర. ఇదంతా చూస్తే, మనిషి బ్రతకడానికి తినకుండా, తినడానికే బ్రతుకుతున్నట్లుగా అనిపించక మానదు. అలాగే, ఉపశమనమనే (రిలీఫ్‌) పేరుతో తాత్కాలిక మైకం కోసం మందు తాగుతున్నాడు. తర్వాత్తర్వాత ఆ మైకానికే లొంగిపోయి, మందుకే దాసుడౌతున్నాడు. ఇంకా, మనిషి మాంసాహారం తిని, మందు తాగితేనే బాగా సంతోషంగా ఉన్నట్లుగా, మాంసాహారం తినకుండా గానీ లేదా మందు ముట్టకుండా గానీ ఉండే వాళ్ళని పీసునారోల్లని వెక్కిరించటం తెలంగాణ సమాజంలో ఎప్పటినుండో పాతుకుపోయింది. అయితే పిసినారితనం, తినితాగడం రెండూ ఏ సంబంధం లేని అంశాలు. ఇవి రెండూ వ్యతిరేకమూ కాదు, తినితాగే వారందరూ దానధర్మాలు చేసేవారూ కాదు, అలాగే పిసినార్లందరూ తినితాగని వాళ్ళు కాదు. అంటే తినితాగే వాళ్ళల్లో కూడా పిసినార్లుంటరు, పిసినార్లలో కూడా తినితాగే వాల్లుంటరు. వారి వారి సామాజిక లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఒక వ్యక్తికి ఇలా తినడం`తాగడం చిన్నప్పటి నుండే అలవాటు లేకపోవచ్చు లేదా మధ్యలో ఎప్పుడైనా మానేయవచ్చు. అయినా కుటుంబ సంక్షేమం వదలి, తన కడుపొక్కటే నింపుకోవడం ఏ ధర్మం కిందికి వస్తుంది? ఈ చిన్న లాజిక్కును అర్థం చేసుకుంటే చాలు. దీనికి ఏ మత గ్రంథంలోని పేజీనీ తిప్పనవసరంలేదు, ఏ మత గురువునూ అడగనక్కరలేదు, పెద్ద పెద్ద సదువులు చదవాల్సిన అక్కెర అంతకంటే లేదు, కేవలం బుద్ధికుశలత ఉంటే సరిపోతుంది. సమాజంలో మన కళ్ళతో మనం రోజూ చూసే సొంత అనుభవాల నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అనుభవమే అసలు గురువు. దాన్ని మించిన జ్ఞానమేముంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా, ఆడంబరాలకు పోయి, పదిమంది ఏమనుకుంటారోనని, ఎచ్చిడికి/ఏతులకు అప్పు చేసి బాగానే ఫంక్షన్‌లు చేయచ్చు కానీ ఆ అప్పు తీర్చేది రాబోయే తరం వాళ్ళు అని మరువరాదు. ‘బెల్లం
ఉన్నప్పుడే ఈగలు ముసురుతాయి’ అన్న పెద్దల మాటలు దిమాక్‌ల పెట్టుకోవాలి. పిలిచినప్పుడు అందరూ వచ్చి తిని, తాగి పోతారు. కానీ పైసలు లేనప్పుడు ఎవ్వరూ ఆదుకోరు, అప్పులైతే ఇంటి దిక్కు కూడా కనీసం చూడరు.
మూఢ విశ్వాసాల్లోనే మగ్గుదామా, విజ్ఞాన నేత్రం తెరుద్దామా?
ఎవరైనా చనిపోతే వారిని చూడటానికి భయంతో వెళ్ళవద్దు. ఎందుకంటే ‘యద్భావం తద్భవతి’ అన్నట్టుగా మనం దయ్యం అనే ఆలోచనతో ఉంటే, అదే మనల్ని పట్టి పీడిస్తుంది. సినిమాలో టైలర్‌/దర్జీ (వేణు)ని వట్టిగనే భయపడేవాడిగా చూపించారు. అయితే నిజానికి దయ్యం పట్టిందని మనాది/రంది పెట్టుకొని అదే ఆలాపనతో ఉండటం మూలంగా ఒక రకమైన దయ్యమనే ఫోబియాతో, మానసిక ఆందోళనకు గురవుతాడు. అలాగే, మరో వ్యక్తి బాగా గరం మసాలాలు వేసి వండిన మటన్‌ ముక్కలు బాగా తిని జైలు బాట పట్టడం, సుమారు 50 సం॥ల వయస్సుండే అమ్మ (నయనతార అని జోక్‌గా పిలవబడే పాత్ర) పిట్టకు పెట్టడానికి అంత దూరం నడవడం, పిట్ట కోసం చాలాసేపు ఎదురు చూడటం, పొద్దున్న అన్నం తినే అలవాటున్న ఆమె ఏమీ తినకపోవటం వల్ల ఆమెకు నడుంనొప్పో లేక కాస్త అలసటగా అనిపించటం సహజం. పిట్ట ముట్టకపోవడం ఒకవైపు, ఆడికి వెళ్ళిన వాళ్ళల్లో కొందరు ఇలా సుస్తు కావడం మరోవైపు కలిసి దయ్యమనే మూఢ నమ్మకానికి రెక్కలు వచ్చి ఊళ్ళో ఉండే ప్రతి గడపను జెప్పన పాకుతుంది. ఈ విషయాలన్నీ పల్లెల్లో వారిని అధికంగా టెన్షన్‌ పడేలా చేస్తాయి తప్ప అక్కడ దయ్యం లేదు, భూతం లేదు. కానీ మనిషి జీవితంలో పైకి (ఉన్నత స్థితి) రావాలంటే కొన్ని మూఢ నమ్మకాలను అంతగా పట్టించుకోకుండా, మారిన కాలాన్ని బట్టి విజ్ఞాన శాస్త్రంపై విశ్వాసాన్ని ఉంచుకుంటూ, ప్రతిరోజూ పాటించాలి. చివరగా, తెలంగాణ పల్లె జనాల్లో ప్రేమానురాగాలు, మమతానుబంధాలు, ఆప్యాయతలు చాలా ఎక్కువనేది జగమెరిగిన సత్యం. కానీ ‘సుక్క’, ‘ముక్క’ చేయబట్టి ఆత్మాభిమానం కూడా ఎక్కువున్న ఆ పల్లె జనాలే విడిపోతారని, సంవత్సరాల తరబడి ఎడమొహం పెడమొహంగా ఉంటారనీ ప్రతీ తెలంగాణ పౌరుడు అర్థం చేసుకుని, తాహతును, సందర్భాన్ని బట్టి మసులుకుంటే, ఏ సమస్యా లేకుండా ప్రతి పల్లె ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా సుఖశాంతుల తెలంగాణకు బాటలు పడి, మానవ వనరుల అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శమౌతుంది.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.