శ్రీపాద వారి కథలు వస్తురీత్యా ప్రణయం, సంఘ సంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చారిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ విభజించుకోవచ్చు. ఎన్నో పద్య రచనలు, నాటకాలు, రూపికలు, నవలలు, అనువాదాలు, వైద్య గ్రంథాల్ని రచించారు.
‘ప్రబుద్ధాంధ్ర పత్రిక’ను చాలా కాలం నిర్వహించారు. వ్యావహారిక భాషా వాదిగా గిడుగు వారికి అండదండగా ఉన్నారు. ఆయన జీవితకాలం (1891`1961).
కథలోకి వెళ్తే… జకరయ్య, ఎలిజబెత్ దంపతులు. క్రైస్తవులు. వాళ్ళు తమ కొడుకును చూడడానికి రాజమండ్రి వెళ్ళాలని రైల్వేస్టేషన్‌కి బయలుదేరి వెళ్తుంటారు. దారిలో ఒక స్నేహితుడు కనపడి మీ అబ్బాయి మంచివాడు అని పొగడడంతో వాళ్ళు ఆనందంగా వెళ్తుంటారు. అంతలోనే రోడ్డు పక్కన తుప్పల్లో ఒక స్త్రీ మూలుగులు వినపడతాయి. వీళ్ళు వెళ్ళి చూడగానే ఆమె ఒళ్ళంతా దెబ్బలతో రక్తసిక్తంగా పడి ఉంటుంది. ఆ దంపతులు ఆమెను మెల్లగా బయటికి తెస్తారు. తర్వాత ఎలిజబెత్ ఆ స్త్రీని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని నీళ్ళు తాగించి, సపర్యలు చేస్తుంది. దారిన పోయే రైతుల్ని, బండి వాళ్ళని సహాయం అడగ్గా వారు నిరాకరిస్తారు. కోర్టులు, సాక్ష్యం మాకెందుకని అనుకుంటూ తప్పుకుంటారు. దాంతో ఆ దంపతులు ఆ అమ్మాయిని నడిపించుకుంటూ వెళ్ళి ఆస్పత్రిలో చికిత్స చేయించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఆమె పేరు సుభద్ర. బ్రాహ్మణ స్త్రీ. వితంతువు. తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండేది. ఆమె చెల్లి, మరిది కాకినాడలో ఉంటారు. వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళి వచ్చేది. మరిది వాళ్ళు బ్రహ్మ సమాజంలో సభ్యులు. సుభద్రకు కూడా వాళ్ళ తత్వం అలవడి ఉంటుంది. స్త్రీ ద్వితీయ వివాహం చేసుకోవడంలో తప్పులేదని చెల్లి వాళ్ళ దగ్గర తెలుసుకుంటుంది.
సుభద్ర వాళ్ళ ఊరికి తిరిగి వచ్చి తన చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. మొదట అతను నిరాకరిస్తాడు. వివాహేతర సంబంధానికి ఒప్పుకుంటాడు. తర్వాత చాలా రోజులకు వివాహానికి ఒప్పుకోవడంతో, అర్థరాత్రి ఊరంతా సద్దుమణిగాక, వాళ్ళిద్దరూ రహస్యంగా ఊరు దాటుతుంటారు. అది తెలుసుకున్న ఆమె తండ్రి, అన్న వాళ్ళను వెంబడిరచి సుభద్రను పట్టుకొని బాగా కొట్టి తుప్పల్లో పడేసి పోతారు. ఆమె స్నేహితుడు, వివాహం చేసుకోబోయే వరుడు ఏ మాత్రం ఎదురు తిరగడు, ఆమెను రక్షించడానికి ముందుకు రాడు సరికదా, ఆమెను ఒంటరిగా వదిలేసి పరుగున వెళ్ళిపోతాడు. ఇదీ ఈ కథ నేపథ్యం.
క్రైస్తవ దంపతులు చేసిన సహాయాన్ని తెలుసుకొన్న సుభద్ర తండ్రి, అన్న వాళ్ళమీద కోర్టులో చార్జి వేయడానికి నిర్ణయించుకొంటారు. అయితే దొరలకు భయపడి తర్వాత విరమించుకుంటారు. కాకినాడ నుంచీ ఆమె చెల్లి, మరిది వచ్చి ఆమెను తీసుకొని వెళ్తారు. అనాథలకు, నిర్భాగ్యులకు సేవచేస్తూ బతుకుతాను తప్ప, మళ్ళీ పెళ్ళి చేసుకోనని జకరయ్య దంపతులకు చెప్పి వెళ్తుంది సుభద్ర. ఆమె పునర్వివాహానికి విముఖతకు కారణం… వివాహం చేసుకోబోయేవాడు తనను తాను రక్షించుకున్నాడే కానీ, ఆమెను రక్షించలేకపోయాడని, అటువంటి మగవాళ్ళు తనకు అక్కర్లేదని, ఉన్నతమైన గుణాలు కలిగి, ఆత్మీయుడు, ప్రాణానికి ప్రాణం ఒడ్డే మగాడ్ని తాను కోరుకుంది కానీ, పిరికిపందను కాదనీ ఆమె అంతర్గతంగా వాపోవడం మనకు అర్థమవుతుంది. కథలో పాత్రలు… జకరయ్య, ఎలిజబెత్ దంపతులు మానవత్వం పరిమళించే మనుషులు. సేవ, సహకారం, ప్రేమ కలిగిన వాళ్ళు. నిస్వార్థ జీవులు.
సుభద్ర తల్లికి కూతురంటే ఇష్టం. ఆమె పరిస్థితికి దుఃఖించి భర్తకు, కొడుక్కి శాపనార్ధాలు పెడుతుంది. వాళ్ళకు తెలియకుండా సుభద్ర నగలను రహస్యంగా ఎలిజబెత్ ఇంటికి పంపి, కూతుర్ని కాకినాడకు వెళ్ళిపొమ్మని సలహా ఇస్తుంది. సుభద్ర అక్క తన తండ్రి, అన్నల పక్షం చేరి, కుయుక్తులు పన్ని సుభద్రకు ద్రోహం తలపెడుతుంది. సుభద్ర తండ్రి, అన్న బ్రాహ్మణ భూస్వామ్య వ్యవస్థకు ప్రతినిధులు. కన్నతండ్రే కూతుర్ని నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేస్తాడు. కొడుక్కి, తండ్రికి తమ కుల గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు ముఖ్యం. అందుకోసం సుభద్ర శరీరాన్ని రక్తసిక్తం చేసేంత క్రౌర్యం వారిది. ఆమెను రక్షించిన వారిమీద తప్పుడు కేసులు బనాయించే నీచులు వాళ్ళు.
అయితే, సుభద్ర చెల్లి, మరిది బ్రహ్మ సమాజంలో సభ్యులు. ఆధునిక భావాలు కలిగిన హేతువాదులు. సుభద్రకు తోడూ, నీడా వాళ్ళే. మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని సలహా ఇచ్చిన జకరయ్యతో సుభద్ర ఇలా అంటుంది, ‘‘తననే నమ్మి వచ్చిన నన్ను యముడిలాంటి వాళ్ళకు అప్పగించిన పిరికిపంద. అతను పారిపోయినప్పుడే నాకు పెళ్ళంటే అసహ్యం పుట్టింది. స్త్రీల మానం కాపాడలేని జాతి ఇది. స్త్రీల జీవిత లక్ష్యాల్ని అర్థం చేసుకోలేని మతం ఇది. స్త్రీకి యుక్త వయసు రాకుండానే పెళ్ళి చేసెయ్యాలనే నిర్బంధాన్ని సృష్టించడానికి ముఖ్య కారణం ఏమిటో నాకిప్పుడు స్పష్టంగా బోధపడిరది. జాతికి అనుగుణమైన విద్య నేర్చిన బాలిక నిజంగా స్త్రీ రత్నం అవుతుంది. అలాంటి రత్నాన్ని సంపాదించాలంటే పురుషుడు అహంకారాన్ని మానాలి. లేనినాడు వాడు శాశ్వత బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే కానీ మరో దారి లేదు’’.
స్త్రీకి యుక్త వయసు రాకముందే, ఆలోచనా జ్ఞానం పెరగకనే, లోకం తీరు తెలియకనే పెళ్ళి చేయడం వల్ల, స్త్రీ
పశువులాగా మిగిలిపోతుందనీ, అటువంటి వాళ్ళ చేతుల్లో పెరిగిన మగ శిశువు పశువులాగే తయారవటం, దానివల్ల తిరిగి నష్టం కలుగుతుందని రచయిత ఆందోళన వ్యక్తం చేశారు.
1934లో రాసిన కథ ఇది. రచయిత ఇందులో ఎంతో అభ్యుదయ భావాల్ని వ్యక్తపరిచారు. స్త్రీకి విద్య అవసరమని, వితంతు పునర్వివాహం తప్పుకాదని తెలియజేస్తూ రాశారు. జకరయ్య దంపతులు చేసిన సేవను ఎంతో కొనియాడి, కులం మతం అనే అడ్డగీతల్ని చెరిపేస్తూ మానవత్వానికి పెద్దపీట వేశారు శాస్త్రిగారు. ఇంటి ఆడబిడ్డల్ని రక్షించుకోవాలే గాని పరువు మర్యాదల కోసం హింసించి చంపటం దారుణమని నిర్ద్వందంగా ఖండిరచారు. అప్పటి సమాజానికి నిలువెత్తు నిదర్శనం ఈ కథ.