‘‘అమ్మా… ఆడోల్లు ఓటేయనీకే గనీ ఓట్లు ఏయించుకోనికి పనికిరారా…?’’ అంటూ వేగంగా వచ్చిన యాదమ్మ అంతే వేగంగా లోపలకు వెళ్ళి చాట చీపురుతో వాకిలి శుభ్రం చేయడానికి పోయింది. ఆ సందేహం ఆమెకు ఎందుకు వచ్చిందో కానీ అది నిజమే కదా!
జనాభాలో సగం, ఓటర్లలో సగం ఉన్న మహిళలకు సగం ప్రాతినిధ్యం ఉన్నదా? లేదు. ప్రస్తుతం జరగబోతున్న శాసనసభ ఎన్నికల బరిలో ఎంతమంది మహిళలు ఉన్నారు అని లెక్కలు వేశా. ప్రధాన పార్టీలు మూడిరటిలో కలిపి ఎన్నికల బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు 33 మంది మాత్రమే. 119 స్థానాలకు సగం ప్రాతినిధ్యం అంటే మూడు పార్టీలు కలిపి దాదాపు 180 మంది మహిళలు ఎన్నికల బరిలో దిగాలి. కానీ ఏరీ?
గత ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టిన మహిళలు కేవలం ఆరుగురు. అంటే 50 శాతంగా ఉన్న మహిళకు దక్కిన వాటా 5 శాతం మాత్రమే. రాష్ట్రంలో మహిళలపై హింస 2015 నుంచి 35 శాతం పెరిగిందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇక లెక్కల్లోకి రానివి ఎన్నో! ఎందుకు ఇలా? చట్టసభల్లో మహిళల సమస్యలపై గళం ఎత్తి పరిష్కారం దిశగా పనిచేసే మహిళా ప్రాతినిధ్య కొరత. మహిళలకు శక్తి సామర్ధ్యాలు లేవా?
రాజకీయాల్లో మహిళా శక్తి సామర్ధ్యాలకు ఇందిరా గాంధీ ఒక ఉదాహరణ. ‘క్యాబినెట్లో ఉన్న ఏకైక మగవాడు’ అని ఆనాడు ఇందిరా గాంధీని అన్నారంటే అందుక్కారణం ఆమె శక్తియుక్తులే. పురుషులకే కాదు మహిళలకూ శక్తి ఉంది అని నిరూపించింది ఇందిరా గాంధీ. మన దేశంలో నిర్వహించిన ఒక సర్వేలో మహిళా రాజకీయ వేత్తలు అభివృద్ధికి ఎక్కువ దోహదపడతారని, పురుషులకంటే మహిళల నేర శాతం తక్కువ అని వెల్లడైంది.
అన్ని విషయాల్లో, సందర్భాల్లో మహిళల సహకారం కావాలి, ఓట్లు కావాలి కానీ మహిళకు అధికారం ఇవ్వడం, అందలం ఎక్కించడం అంటే కంటగింపు. ఆడవాళ్ళకి రాజకీయాలెందుకు, చట్టసభల్లోకి వచ్చి మగవాళ్ళ మతి పోగొట్టడానికి అని ఏనాడో తమ బుద్ధి బయటపెట్టుకున్నాడు ఓ పార్లమెంటేరియన్.
గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయిలో ఉన్న మహిళా ఓట్ల కోసం ఎర వేయడం, ఏ ఉద్యమం వచ్చినా ఆడవాళ్ళను ముందు పెట్టి పబ్బం గడుపుకొని కరివేపాకులా అవతలకి విసిరేయడం, చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీల పవర్ పాలిటిక్స్‌లో మహిళలు పావులుగా మిగలడం… అదేగా జరుగుతున్నది.
పంచాయతీరాజ్ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ వచ్చాక మహిళ అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిరది. పురుషులకు మహిళల అభ్యర్థిత్వాన్ని కాదనలేని పరిస్థితి వచ్చింది. దాంతో రాజకీయ ప్రాబల్య కుటుంబ మహిళను బరిలోకి దించి ఆమె భర్త, మామ, తండ్రి లేదా తోబుట్టువులు లేదా సమీప బంధువులు అధికారం చెలాయించడం మొద లైంది. అయితే ఈ క్రమంలో కొందరు మహిళ లు రాజకీయాలకు, రాజకీయ వాతావరణానికి కొంత దగ్గరయ్యారు. రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు.
రాజకీయ వారసత్వం లేని మహిళలు కూడా ప్రజాక్షేత్రంలో తమదైనా బాణీలో పనిచేసుకు పోతున్నారు. మంచి కార్యకర్తలుగా, ప్రజాసేవ కులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, వారికి వారసత్వంగా వచ్చిన స్త్రీలకు, పురుషులకు ఉన్న ఆర్థిక బలం, కండ బలం లేక ఎన్నికల బరిలో వెనకబడిపోయారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడ్డారు.
పితృస్వామ్య వ్యవస్థలో ఆస్తి, అధికారం అన్నీ మగవాళ్ళవే కావడం వల్ల వ్యక్తిగత ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలో అన్ని స్థాయిల్లో నిర్ణయాధికారం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న మహిళ ఒక అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి లాగుతున్నారు. ఇంటా బయటా అడుగడుగునా అవమానాలు, అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ, కుటుంబం, సమాజం ఆమెను వెనక్కి నెడుతున్నప్పటికీ సమాన అవకాశాల కోసం, సమర్ధవంతమైన భాగస్వామ్యం కోసం మహిళలు ముందుకు వస్తున్నారు. కానీ, పురుష ప్రపంచం ఆడపిల్ల చెబితే మేం వినాలా అని అహం ప్రదర్శిస్తోంది. మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సమాజం, కుటుంబం విసిరే సవాళ్ళను స్వీకరించి ధైర్యంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రధాన పార్టీలు వారిని అభ్యర్థిగా గుర్తించడం లేదు. వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడం లేదు.
మహిళల్ని స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తులుగా చూడడం లేదు. మహిళ తమను తాము నిరూపించుకోవడం కోసం పురుషులకంటే రెండిరతలు కష్టపడవలసి వస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రతినిధుల శాతం 19 ఉంటే, మన దేశంలో 9 శాతం మాత్రమే ఉన్నారు. ఇక మన రాష్ట్రంలో 5 శాతం మాత్రమే. రాజకీయాల్లో మహిళల శాతంలవ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ 98వ స్థానంలో ఉంది. మన పొరుగున ఉన్న నేపాల్ 34 శాతం, పాకిస్తాన్ 20, బంగ్లాదేశ్ 21 శాతంలతో పోలిస్తే మనం ఎంతో వెనుకబడి ఉన్నాం.
నాణేనికి మరోవైపు చూస్తే, రాజకీయం ఒక డర్టీ గేమ్‌గా భావించే మహిళలు కనిపిస్తారు. పురుషుల కంటే నైతికంగా ఎక్కువగా ఉండే మహిళలు రాజకీయాల్ని నిరాకరిస్తున్నారు. రాజకీయాల్లో ఆకర్షణీయమైన మహిళ సాఫ్ట్ టార్గెట్ అవడం కూడా కారణమే. పితృస్వామ్యం చేసే కండిషనింగ్, కుటుంబ కట్టుబాట్లు వంటి సామాజికాంశాలు మహిళలను రాజకీయాల నుంచి దూరం చేస్తున్నాయి.
నా ఆలోచనల్లో నేనుండగా ‘‘మా అమ్మోళ్ళ ఊరి బిడ్డ శిరీషకు పోటీ చేయొద్దని, ఎన్కకు వాపసు తీసుకొమ్మని పెద్ద పెద్దోళ్ళు మస్తు బెదిరిత్తున్నరట. చంపుతం అంటున్నరట. ఈ ఆడిపిల్ల ఇంటలేదు. ఏమైతదో, ఏమో…’’ తన పని చేసుకుంటూ అంది యాదమ్మ.
అప్పుడు అర్థమైంది, ఇందాకటి యాదమ్మ మాటలకు అర్థం. పట్టుమని లక్ష రూపాయలు లేని శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల బరిలోకి దిగిన తీరు ఆశ్చర్యమే. విజిల్ వేస్తూ ధైర్యంగా ముందుకొచ్చిన ఆమె ఇప్పుడు ఎందరికో ఇన్స్పిరేషన్. శిరీష నామినేషన్ ఉపసంహ రించుకోకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నది అంటేనే ఆమె సగం గెలిచినట్లు. రోజురోజుకూ ఆమె ప్రచారం దుమ్ము లేపుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. యువత, గ్రామీణ రైతు కుటుంబాలు ఆమెకు బాసటగా నిలుస్తున్నాయి. టాక్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్‌గా మారిన బర్రెలక్క గెలుపును కాంక్షిస్తూ ప్రచార ఖర్చుకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు.
ఏమో… ఓటరు తలచుకుంటే గుర్రం ఎగరా వచ్చు… రాజకీయ రంగులు మారనూ వచ్చు…