పెళ్ళికీ, కుటుంబ భాగస్వామ్యానికీ పితృస్వామ్యం నుండి విముక్తి కల్పిద్దాం!!! – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. తమ అంతరంగిక జీవితాల్లో పురుషాధిపత్యాన్ని అనుభవిస్తూ, జెండర్‌ అసమానతే ప్రధాన విలువగా ఉన్న దాంపత్య బంధాల్లోని పరలింగ స్త్రీలు ఈ ఉద్యమంలోకి పెద్ద ఎత్తున వచ్చారు.

మొదటినుండి ఉద్యమం ఆయా దాంపత్య బంధాల్లో లైంగికతకి సంబంధించిన ద్వంద్వ విలువలని ` ఆడవాళ్ళని కన్యలు కాదనీ, ప్రేమికులూ, భర్తల పట్ల విశ్వాసంతో లేరనీ అంటూ మరోపక్క మగవాళ్ళకి విచ్చలవిడిగా ప్రవర్తించే స్వేచ్ఛనివ్వటాన్ని ప్రశ్నించింది. అప్పుడే వచ్చిన లైంగిక విముక్తి ఉద్యమం కూడా ఈ స్త్రీవాద విమర్శని సమర్ధించి, చవకగా, భద్రతతో కూడిన గర్భ నిరోధక పద్ధతులు అందుబాటులో ఉండాలన్న డిమాండుని బలపరిచింది.
మొదట్లో స్త్రీవాద కార్యకర్తలు అంటే ఇంటి సంబంధాలపైనా, దగ్గరి బంధాలపైనా దృష్టి కేంద్రీకరించటానికి కారణం ` వర్గాలు, జాతులకు అతీతంగా స్త్రీలందరూ పురుషాధిక్యతని, తల్లిదండ్రుల రూపంలోనూ, భర్తల రూపంలలోనూ అనుభవించేది అక్కడే కాబట్టి. పని స్థలాల్లో సెక్సిస్టు బాస్‌లని, తెలియనివాళ్ళు చూపించే మగ అహంకారాన్ని గట్టిగా ఎదుర్కొనే ఆడవాళ్ళు కూడా ఇంటికెళ్ళి తమ మొగుళ్ళకి అణిగిమణిగి ఉంటారు. దీర్ఘకాలిక దాంపత్య బంధాల్లోని ఆడవాళ్ళు, లెస్బియన్‌ ఉద్యమ మిత్రులు, స్త్రీవాదులందరూ కూడా పెళ్ళిని ఒకరకమైన లైంగిక బానిసత్వంగా వర్ణించారు. సంప్రదాయ బద్ధంగా నడిచే లైంగిక బంధాలు దాంపత్యంలో ఉండాల్సిన దగ్గరితనం, సంరక్షణ, గౌరవాన్ని బలిచేసి మగవాళ్ళ అధికారాన్ని కాపాడటానికి, వారిని అందలం ఎక్కించటానికి పనికొస్తాయని ఎత్తి చూపారు.
మొదట్లో స్త్రీవాదులకి మగవాళ్ళలో మార్పు వస్తుందనే నమ్మకం అస్సలుండేది కాదు. సెక్సిస్టు మగవాళ్ళతో కలిసి అసమ సంబంధాల్లో బ్రతికిన ఆడవాళ్ళు చాలామంది బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని లేదా స్త్రీలని మాత్రమే ప్రేమించాలనే నిర్ణయం తీసుకున్నారు. మరికొంతమంది మగవాళ్ళతో ఏర్పరచుకునే ఏకపతీ సంబంధాలు స్త్రీల శరీరాలని ఆయా మగవాళ్ళ ఆస్తిగా పరిగణింపచేస్తాయని భావించారు. పతివ్రతలుగా ఉండకూడదని, అసలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని నిర్ణయించుకున్నారు. రాజ్యం బలపరచని సంబంధాల్లో మగవాళ్ళతో కలిసి జీవించడం వల్ల వాళ్ళ ఆధిపత్యం తగ్గి, ఆడవాళ్ళ స్వతంత్రాన్ని గౌరవిస్తారని నమ్మారు. సంప్రదాయ దాంపత్యంలో ఉండే లైంగిక బానిసత్వం ముగిసిపోవాలంటూ, భార్యలపై భర్తలు జరిపే లైంగిక దాడుల విస్తృతిని బయటికి తెచ్చారు. అలాగే, ఆడవాళ్ళకి తమ లైంగిక కోరికలు వ్యక్తీకరించే స్వేచ్ఛ, శృంగారానికి శ్రీకారం చుట్టే స్వతంత్రం, లైంగిక తృప్తి పొందే హక్కు ఉంటుందని నొక్కి చెప్పారు.
పరలింగ సంబంధాల్లోని అనేకమంది పురుషులు శృంగారం పట్ల ఈ స్త్రీవాద ఆలోచనలని ఆహ్వానించారు. ఆయా పురుషులు, ‘పుణ్యవంతులయిన ఆడవాళ్ళకి శృంగారంలో ఆసక్తి ఉండకూడద’నే ఆలోచనతో ప్రభావితమయిన భార్యల ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నవాళ్ళు. తమ భాగస్వాములకు శృంగారం గురించి ఇటువంటి విముక్త దృష్టికోణం అందించి తమ లైంగిక సంబంధాలను బాగుపరిచే దారి కల్పించినందుకు స్త్రీవాద ఉద్యమానికి కృతజ్ఞత వ్యక్తపరిచారు. ఆడవాళ్ళ గుణం వారి లైంగిక ఆచరణపై ఆధారపడి ఉంటుందనే ఆలోచనని సవాలు చేసి కన్యాత్వం లేకపోవటం చుట్టూ నిండిన కళంకాన్ని స్త్రీవాద ఆలోచనాపరులు పక్కకి తొలగించారు. స్త్రీల లైంగిక సుఖానికి పురుషుల లైంగిక సుఖంతో సమాన పీట వేశారు. లైంగిక సుఖం లేనప్పుడు ఉన్నట్లు నటించొద్దని ఆడవాళ్ళకి చెప్పి స్త్రీవాద ఉద్యమం మగవాళ్ళ లైంగిక లోపాలను బయటపెడతామని బెదిరించింది.
ఈ భయంవల్లే సెక్సిస్టు మగవాళ్ళు స్త్రీవాదులంటేనే లెస్బియన్లనీ, ఆయా స్త్రీలని వాళ్ళ అసలు స్థానంలోకి నెట్టటానికి ‘ఒక్కసారి గట్టిగా దెంగితే చాలని’ పదే పదే నొక్కి వక్కాణించారు. పితృస్వామ్య దాంపత్య సంబంధాల్లో అనేకమంది స్త్రీలు నిజానికి మగవాళ్ళతో శృంగారంలో తృప్తి పొందటం లేదని స్త్రీవాద తిరుగుబాటు బయట పెట్టింది. దగ్గరి సంబంధాల్లో స్త్రీల లైంగికత గురించి స్త్రీవాదం తెచ్చిన మార్పులని మగవాళ్ళు త్వరగా అందిపుచ్చుకోవటంతో స్త్రీలకి శృంగారంలో కొంత క్రియాశీలక పాత్ర తీసుకోవటానికి అవకాశం లభించింది. అయితే అదే స్థాయిలో మగవాళ్ళు తమ లైంగిక ప్రవర్తనని మార్చుకోవటానికి మాత్రం సిద్ధపడలేదు. పరలైంగిక శృంగారం గురించిన చర్చలో స్త్రీవాదులు ఎజెండాలో ముందుకు తెచ్చిన ప్రధాన అంశం ` స్త్రీల శరీరాల్ని శృంగారానికి ప్రేరేపించే ఫోర్‌ ప్లే (శృంగారానికి సిద్ధపరచటం) చెయ్యటానికి పురుషుల విముఖత. శృంగారంలో పురుషుల బల ప్రయోగం, ఆడవాళ్ళ సుఖం పట్ల మగవాళ్ళకి ఆసక్తి లేకపోవటం స్త్రీలకి విరక్తి తెప్పించింది. లైంగిక సుఖంపైన స్త్రీవాదులు దృష్టి కేంద్రీకరించటంతో మగవాళ్ళ లైంగిక ప్రవర్తనని సవాలు చేసి విమర్శించే భాష స్త్రీలకి లభించింది.
లైంగిక స్వేచ్ఛకి సంబంధించినంత వరకూ స్త్రీలు ముందుకి చాలా అంగలేశారు. అయితే, లైంగిక వ్యాధులు అనేకమంది లైంగిక భాగస్వాములుండటాన్ని కష్టతరం చెయ్యటంతో ఏకపత్నీ వ్రతం గురించిన స్త్రీవాద విమర్శ తెర వెనక్కెళ్ళిపోయింది. మగవాళ్ళకి తమ లైంగిక ప్రవర్తన గురించి అబద్ధాలు ఆడటం నేర్పే పితృస్వామ్య సంస్కృతిలో, ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక రోగాలు ఆడవాళ్ళకి వ్యాప్తి చెయ్యటం చాలా తేలిక గనుక, పరలింగ సంబంధాల్లోని స్త్రీలకి అనేకమంది లైంగిక భాగస్వాములని వెతుక్కోవటం కష్టంగా పరిణమించింది. ఆయా సంబంధాల్లో ఏకపతీ/పత్నీ తత్వమే ప్రధాన విలువగా ఉన్నప్పుడు, దాన్ని బద్దలు కొట్టడం కూడా కష్టమయింది.
పితృస్వామ్య సంస్కృతిలో ఒకరికన్నా ఎక్కువ లైంగిక భాగస్వాములుండటం మగవాళ్ళ అధికారాన్ని ఎక్కువ చేసి స్త్రీలని బలహీనపరుస్తుంది. ఇంకొక స్త్రీతో సంబంధమున్న పురుషునితో లైంగిక భాగస్వామ్యం ఏర్పరచుకోవటానికి స్వచ్ఛందంగా స్త్రీలు ఆసక్తి చూపిస్తారు కానీ, అప్పటికే ఒక పురుషుడు భాగస్వామిగా ఉన్న స్త్రీల పట్ల మగవాళ్ళు సాధారణంగా అంత లైంగిక ఆసక్తి కనపరచరు. చూపించినా, ఆమెపై ఆమె మగ భాగస్వామికి అధికారముంటుందని భావిస్తారు. ఇంకా చెప్పాలంటే, లైంగిక సంబంధం ఏర్పర్చుకోవటానికి అతడి అనుమతి కూడా అవసరమని భావిస్తారు. ఇటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా, అటువంటి స్వేచ్ఛ పొందిన స్త్రీలు తాము ఆ స్వేచ్ఛని ఉపయోగించుకున్నా, లేకపోయినా స్త్రీల శరీరాలు పురుషులకే చెందుతాయన్న సెక్సిస్టు భావనని సవాలు చేసి, దానికి గండి కొట్టారు. లైంగిక సుఖం / ఆనందం గురించిన సెక్సిస్టు భావజాలాన్ని స్త్రీవాద విమర్శకి గురి చెయ్యటం వల్ల వచ్చిన అనుకూల మార్పులు స్త్రీలు, పురుషులు తమ లైంగిక సంబంధాలను మెరుగు పరచుకోవటానికి దోహదం చేశాయి.
మొదట్లో లైంగిక సంబంధాల్లో వచ్చే ఇటువంటి మార్పుల వల్ల కాపురాల్లో ఇతర మార్పులు కూడా వస్తాయని, ఇంటిపనుల్లో, పిల్లల పెంపకంలో సమాన భాగస్వామ్యం రావొచ్చనీ అనిపించింది. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు చేసినా, చెయ్యకపోయినా, ఇంటిపనులు అందరూ పంచుకోవాలని అంటున్నారు. ఎంతగా ఇది ఒక ఒప్పుకోవాల్సిన విలువగా మారిందంటే ఈ తరం యువతులు అసలు ఈ విషయాన్ని ఎత్తి చూపాల్సిన సమస్యగా కూడా పరిగణించట్లేదు. వాస్తవానికి, ఇప్పటికీ ఈ పనుల్లో అధికశాతం స్త్రీలే చేస్తారు, ఇంకా ఇది ఒక సాధారణ విలువగా మారలేదు. మగవాళ్ళు పడకగదిలో సమానత్వాన్ని ఆహ్వానిస్తున్నారు తప్ప ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో అంతగా ఒప్పుకోవట్లేదు. వర్గపరంగా పైకెళ్ళిన ఆడవాళ్ళు ఈ సమస్యని ఇంట్లో పనికి, పిల్లల్ని చూసుకోవటానికి పనివాళ్ళని పెట్టుకోవటం ద్వారా తీర్చుకుంటున్నారు. అయితే అందరూ ఆడపనిగా పరిగణించే ఈ పనులని చేయటానికి శ్రామికులని పెట్టుకున్నప్పుడు వాళ్ళని పనిలో పెట్టుకోవటం, వారి పనిని మేనేజ్‌ చెయ్యటం అంతా ఆ ఇంట్లో ఆడవాళ్ళే చేయాల్సి ఉంటుంది.
తల్లితనం గురించిన స్త్రీవాద విమర్శ అన్నింటికన్నా ఎక్కువగా కుటుంబ స్వభావాన్ని మార్చింది. ఎప్పుడయితే ఆడవాళ్ళ విలువ, పిల్లల్ని కనటం, వారిని పెంచటంపైన ఆధారపడటం మానేసిందో, ఇద్దరికీ కెరీర్‌ ఉండాలని కోరుకున్న దంపతులకి పిల్లలని వద్దనుకుని సమానత్వంతో కూడుకున్న సంబంధం ఏర్పర్చుకునే అవకాశం ఏర్పడిరది. పితృస్వామ్య సమాజంలో కొన్ని పనులు కేవలం అమ్మలే చెయ్యాలనే భావన పిల్లల పెంపకంలో సమానత్వానికి ఎప్పుడూ అడ్డుపడుతూ వస్తుంది. ఉదాహరణకి, స్త్రీవాద ఉద్యమం వచ్చిన తర్వాతే, అప్పటివరకూ తల్లి పాల గురించి పట్టించుకోని పితృస్వామ్య వైద్య వ్యవస్థ అకస్మాత్తుగా తల్లి పాల గురించి అనుకూలంగా మాట్లాడటమే కాక, అదే అత్యంత ఆవశ్యకరమని చెప్పటం మొదలుపెట్టింది. లెస్బియన్‌ అయినా, పరలింగ సంబంధంలో ఉన్న స్త్రీ అయినా, తల్లి అయిన ప్రతి స్త్రీ మీద పిల్లల పెంపకంలో బాధ్యతని చెప్పకుండా ఎక్కువ చేసే పార్శ్వం ఇది. పురుషులతో జీవించే స్త్రీలందరికీ అప్పటిదాకా ఎంతో కొంత సమతుల్యత ఉన్న సంబంధం కూడా పిల్లలు పుట్టంగానే సెక్సిజం చేత నిర్ణయించబడిన పాత్రల్లోకి నెట్టబడటం అనుభవంలోకి వచ్చిన విషయమే. అయితే ఇటువంటి జంటలు అన్నిట్లో సమతుల్యత ఉండటానికి గట్టిగా ప్రయత్నిస్తే అది వాస్తవంలోకి వస్తుంది. దానికి చాలా కష్టపడాలి. పురుషుల్లో అనేకమంది ఆ శ్రమ చెయ్యటానికి సిద్ధపడలేదు.
పిల్లల బాగు, జెండర్‌ సమానత్వం రెండూ సాధించాలంటే పిల్లల పెంపకంలో మగవాళ్ళు బాధ్యత తీసుకోవటం అవసరం, ముఖ్యమని స్త్రీవాద ఆలోచన నొక్కి చెప్పింది. ఆయా తల్లిదండ్రులు పెళ్ళి చేసుకుని కలిసున్న వాళ్ళయినా, కేవలం కలిసి జీవించే వాళ్ళయినా, లేక విడిపోయిన వాళ్ళయినా మగవాళ్ళు పిల్లల పెంపకంలో సమాన బాధ్యత తీసుకుంటే ఆడవాళ్ళు, మగవాళ్ళ మధ్య సంబంధాలు బాగుపడతాయి. స్త్రీవాద ఉద్యమం కారణంగా ఇదివరటికంటే మరింత మంది మగవాళ్ళు పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకుంటున్నారు. అయితే. అది ఇప్పటివరకూ సమాన స్థాయి అంచులకు కూడా చేరలేదు. ఇలా సమాన బాధ్యతలు తీసుకోవటం వల్ల పిల్లల పెంపకం అందరికీ సానుకూలమైన, తృప్తికరంగా అనుభవంగా మారుతుందని మనకి తెలుసు. బయట పనిచేసే తల్లిదండ్రులకి పని స్థలాలలో ఉండే వత్తిడి పిల్లల పెంపకంలో అడ్డంకులు కలుగచేస్తుంది. పని స్థలాల సమయాలని మార్చి మగవాళ్ళకి పిల్లలని చూసుకునే సమయం, వెసులుబాటు కల్పించేవరకూ వాళ్ళు కూడా పిల్లల పెంపకంలో అందరూ సమానంగా పాలు పంచుకునే ప్రపంచాన్ని మనం చూడలేము. అటువంటి ప్రపంచంలో మగవాళ్ళు పిల్లల్ని పెంచటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
అప్పటివరకూ శ్రామికులయిన మగవాళ్ళు పనికి తగ్గ వేతనాలు లేక, అక్కడే విపరీతంగా అలసిపోయి తమలాగే తక్కువ వేతనాలు పొంది, తమకంటే అలసిపోయిన ఆడవాళ్ళు ఇంటిపని, పిల్లల పని మొత్తం చేస్తున్నా ఒప్పుకుంటారు. తెల్ల జాత్యహంకార పెట్టుబడిదారీ పితృస్వామ్యంలో పిల్లలని చూసుకోవటం స్త్రీలకి చాలా కష్టంగా మారింది. దీనివల్లే చాలామంది కెరీర్‌ కావాలనుకున్న స్త్రీలు కూడా పిల్లల్ని చూసుకోవటానికి ఇంట్లో ఉండిపోతున్నారు. అసలు ‘తల్లిదండ్రులు లేని పిల్లల’ సమాజంగా మారిపోతున్నామనే భయం, మగవాళ్ళ సెక్సిస్టు ఆలోచన కన్నా ఎక్కువగా ఆడవాళ్ళని శ్రమ శక్తి నుండి వేరు చేసి ఇళ్ళల్లోకి తిరిగి పంపిస్తోంది. పనిస్థలాల్లో ఉండే పోటీ ప్రేమతో కూడిన సంబంధాలను నిర్మించుకునే సమయాన్ని ఆడవాళ్ళకి ఇవ్వటం లేదు. మగవాళ్ళు శ్రామిక శక్తిని వీడి ఇలాంటి సంబంధాలని పెంపొందించుకోవాలని ఎవరూ అనకపోవటం జెండర్‌ గురించిన సెక్సిస్టు ఆలోచన ఇప్పటికీ ఎంత బలంగా ఉందో మనకి అర్థం చేయిస్తుంది. ఇప్పటికీ మన సమాజంలో చాలామంది పిల్లల్ని పెంచటంలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే మెరుగని భావిస్తారు.
ఆడవాళ్ళు ఒక పక్క మాతృత్వాన్ని తీవ్ర విమర్శకు గురిచేసిప్పటికీ, మాతృత్వం ఇచ్చే ప్రత్యేక స్థాయి, ముఖ్యంగా తల్లి`పిల్లల మధ్య ఉండే బంధాలు ఇచ్చే విశేషాధికారాలని వదులుకోవటానికి, పిల్లని పెంచటంలో లభించే గౌరవ ప్రదమైన స్థాయిని స్త్రీవాద ఆలోచనాపరులు అనుకున్నంతగా వదులుకోలేదు. జీవశాస్త్ర నిర్ధారణ వాదాన్ని (బయోలాజికల్‌ డిటర్మినిజం) విమర్శించిన స్త్రీవాదులు కూడా మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి తమ విమర్శని మర్చిపోయారు. తండ్రులు కూడా తల్లులంత ముఖ్యమని, అంతే మంచిగా పిల్లలని పెంచగలరని ఒప్పుకోలేకపోయారు. సెక్సిస్టు ఆలోచనలతో పాటు, ఈ వైరుధ్యాలు కూడా స్త్రీవాదులు పిల్లల పెంపకంలో సమానత్వం చేసిన డిమాండుని బలహీనపరిచాయి.
ఈ మధ్య మాస్‌ మీడియా మనలని ‘పెళ్ళి మళ్ళా ఫ్యాషన్‌ అయింది’ అనే మెసేజిలతో ఊదరగొడుతోంది. పెళ్ళి అన్నది ఎప్పుడూ అవుట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ కాలేదు. మళ్ళా ఫ్యాషన్‌లోకి వచ్చింది అనేవాళ్ళ అర్థం ఏమిటంటే సెక్సిస్టు భావజాలంతో నిండిన పెళ్ళి అనే భావన తిరిగొచ్చింది అని. అలాంటి సెక్సిస్టు పునాదులపై జరిగే పెళ్ళిళ్ళు తీవ్రమైన సమస్యలతో కూడుకుని ఉంటాయనీ, నిలిచేవి కాదన్న విషయం అప్పుడూ, ఇప్పుడూ తెలిసిందే కనుక స్త్రీవాద ఉద్యమం దాని గురించి మాట్లాడకుండా ఉండలేదు. మన ఆచారాల ప్రకారం ఎక్కువగా జరిగే సెక్సిస్టు వివాహాలు అనేకమంది జీవితాల్లో అసంతృప్తి, దుఃఖానికి బీజాలు వేసి ఇంట్లో స్త్రీవాద తిరుగుబాట్లకు ఉత్ప్రేరకంగా పని చేశాయి. అయితే, ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే ఆ బంధాలు చాలా త్వరగా తెగిపోతున్నాయి. జనాలు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని, త్వరగా విడాకులు తీసుకుంటున్నారు.
పెళ్ళిళ్ళు, కుటుంబాల్లో పితృస్వామ్య ఆధిపత్యం ప్రధానంగా విడిపోవటాలు, విడాకులకు దారితీస్తోంది. మంచిగా సాగుతోన్న వివాహాల గురించి ఈ మధ్య జరిగిన అధ్యయనాలన్నీ కూడా వాటిలో జెండర్‌ సమానత్వం దంపతుల్లో ఇద్దరికీ స్థిరత్వాన్ని కల్పిస్తుందని చెప్పాయి. ఈ స్థిరత్వం ఆనందాన్ని పెంచుతుందని, దాంపత్యం ముక్కలైనప్పటికీ, ఆ దంపతుల మధ్య ఏర్పడిన స్నేహం జీవితాంతం కొనసాగే బంధానికి పునాది వేస్తుందని చెప్పాయి. భవిష్యత్తులో మనం పితృస్వామ్య కుటుంబ బంధాల విమర్శపైన కన్నా మన సమయాన్ని, ప్రయత్నాన్ని దాని ప్రత్యామ్నాయాల గిరి నుంచి, సమానుల మధ్య గౌరవం, నమ్మకం, పరస్పర పురోగతి పునాదిగా ఉండే స్నేహ బంధాలని నిర్మించటం గురించి, అందరికీ స్థిరత్వాన్ని ఇవ్వగలిగే, జీవితాంతం నిలపగలిగే బంధాల గురించి ఎక్కువ వెచ్చిస్తాము.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.