కవిత్వం ఏం చేస్తుంది? అని కవి కె.శివారెడ్డి రాసిన కవిత్వం మనందరికీ తెలిసిందే. మరి స్త్రీ ఏం చేస్తుంది? అని ప్రశ్న వేస్తే ఒక్క జవాబుతో సరిపుచ్చలేం. కానీ, ఆమెను ఒక మాటకు పరిమితం చేసి గృహిణి, ఇల్లాలు, హోమ్ మేకర్ వంటి మాటలకు పరిమితం చెయ్యడం ఎంత అన్యాయం.
నాంపల్లి సుజాత వచన కవిత్వం ‘‘హోం మేకర్’’ చదివిన తర్వాత ఆమె లైఫ్ మేకర్ అని గుర్తించాలని అనిపిస్తుంది. 2006 నుండి నెమలికలు (2006), మట్టి నా ఆలాపన (2009), మట్టి నానీలు (2015), జొన్న కంకి (2020) వంటి కవితా సంపుటాలతో నాంపల్లి సుజాత కవిత్వం తెలుగు కవులకు చిరపరిచయమైనది. ప్రకృతి ప్రియత, సామాజిక వాస్తవికత, తెలంగాణ ప్రాంతీయత, మహిళా హక్కుల గొంతుక కలగలిసి నాంపల్లి సుజాత కవిత్వం మార్దవంగా, మనోహరంగా ఉంటుంది.
59 కవితలున్న ఈ సంపుటిలో పావలా వంతు కవితలు మహిళా జీవితాలను వర్ణించేవి ఉన్నాయి. మహిళ ఉత్పత్తి శక్తిగా అనేక పాత్రలను పోషిస్తున్నది. సంతానోత్పత్తి, వ్యవసాయోత్పత్తి, వస్తూత్పత్తితో పాటు వృత్తి పనుల్లో భాగస్వామ్యం వహిస్తున్నది. ఇంటి పని భారాన్ని మోస్తూనే ఎన్నో కళలకు ఆద్యురాలై పోషకురాలిగా ఉన్నది. ఇంటి పనులకు, పిల్లల పెంపకానికి ఆమే ఆధారం. ఆధునిక సమాజంలో ఉద్యోగినిగానూ, రాజకీయ నాయకురాలిగానూ, సైన్యంలోనూ, మహిళా పొదుపు సంఘాల నిర్వాహకురాలిగానూ వివిధ రంగాలలో పురుషులతో సమంగా బరువు బాధ్యతలను మోస్తున్నది.
ఇంత విస్తృతంగా విస్తరించినా మళ్ళీ తనను పాత విలువలతోనే తూచడం, చూడడం, మరింతగా హింసకు లోను కావడం ఆమెను కలవరపరుస్తోంది. వంటింటి మహారాణి అని, గృహిణి అని, హోమ్ మేకర్ అని కేవలం పడికట్టు పదాలలో తనను బందీ చేయడం ఆమెకు అగౌరవం కలిగిస్తున్నది. ముందుమాటలో చెప్పుకున్నట్లు స్త్రీని హౌస్‌వైఫ్, హోమ్‌మేకర్ అనడం తనకు నచ్చదు. అందుకే సుజాత ఇలా అంటున్నారు…
‘‘పేర్లు మారతాయి కానీ
తీర్లు మారలేదు…
ఒకప్పుడు హౌస్ వైఫ్
ఇప్పుడు
హోమ్ మేకర్ అంటున్నారు…!’’
ఉదయం నుండి రాత్రి దాకా తాను ఎన్ని పనులు చేసినా, ఎన్ని పాత్రలు పోషించినా, సమాజమూ, కుటుంబమూ తనను చూసే దృష్టి మారకపోవడాన్ని గమనించి, ఈ వెట్టి చాకిరీ నుండి విముక్తి కలిగేది ఎప్పుడని వాపోతుంది.
‘‘ఇన్ని చేసినా…
జీతభత్యాలు, వారాంతపు సెలవులూ
లేని వట్టి హోమ్ మేకర్నేనట…!!
జాతీయాదాయంలోనన్నా కలుపరు
ఈ చాకిరి పాడుగాను
దీన్నుంచి విముక్తి ఎప్పుడో…!!!’’ (హోమ్ మేకర్)
స్త్రీల కట్టూ బొట్టూ, ఆహార విహారాలపై అమలవుతున్న ఆంక్షలను, సంస్కృతి పేరుతో మతాల కట్టడులను, స్త్రీల మీద జరుగుతున్న అత్యాచార సంఘటనలను, రిమోట్‌లా పనిచేసే పురుషాధిపత్యాన్నీ, వివక్షను అనేక కవితల్లో ఎత్తి చూపుతుంది. స్త్రీ జీవన పక్షపాతిగా ఉంటూ ఆమె విశ్వాసంతో ఎదిగే వాతావరణాన్ని కల్పించాలని కోరుకుంటుంది. స్త్రీలపై అమలవుతున్న నిర్బంధాలను, నిఘాలను తానే ఛేదించుకొని విశ్వమంతా వెన్నెలలా విస్తరించాలని, నీలి ఆకాశంలా నిలబడాలని ఆకాంక్షిస్తుంది. ఆయా సందర్భాల్లో అపర కాళి, ఆది పరాశక్తి వంటి దైవిక రూపాల నుండి, మొల్ల, రాణి రుద్రమదేవి, రaాన్సీ లక్ష్మీబాయి, సావిత్రీబాయి ఫూలే వంటి చారిత్రక వ్యక్తుల నుండి స్ఫూర్తిని పొందాలని సూచిస్తుంది. మరు జన్మంటూ ఉంటే మహిళగానే పుట్టాలని కోరుకుంటుంది. వ్యవసాయ రంగంలో పురుషునితో పాటు తానూ భూగోళంలా తిరిగి సూర్యోదయానికి కారణమవుతుంటే రైతు సూరీడు వచ్చాడని చంకలు గుద్దుకుని తనను రైతక్కగా గుర్తించకపోవడాన్ని తప్పు పడుతుంది.
దిశ సంఘటన సందర్భంగా అపరిమిత ధైర్యాన్నిస్తూ కవిత్వ దిశానిర్దేశం చేస్తూ ఇలా సూచిస్తుంది.
‘‘నిన్నాక్రమించిన
ఆ మదపుటంగాలను ఒక్క పెట్టున
రాలిపడేట్లు జాడిచ్చి తన్ను…’’ (దిశా నిర్దేశం)
అట్లాగే, స్త్రీలు పరాధీనలు కాకూడదని, ఉపగ్రహాలు కాకూడదని, స్వయం ప్రకాశకులు కావాలని, తమ బానిసత్వాన్ని తామే పోగొట్టుకోవాలని గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ…
‘‘చీకటైనా… వెన్నెలైనా
పువ్వులైనా… పున్నమైనా
నీ వెలుగేదో నువ్వే వెలగాలి
నీ నొప్పేదో నువ్వే భరించాలి
నీ ఊపిరి నువ్వే తీయాలి
ఔను… నిన్ను కాల్చేసే నిప్పునీ నువ్వే విసిరేసుకోవాలి’’ (పరాధీన)
పొగ చూరిన వసంతం వంటి పాత పుటలను చెరిపేసి కొత్త తొవ్వని తమదైన సిరాతో లిఖించుకోవాలని కోరుకుంటుంది. మహిళల గురించి రాసిన కవితలు మహిళల్లో ఉండాల్సిన నిర్భీతినీ, స్పష్టమైన మార్గాన్నీ సూచిస్తాయి.
ఈ సంపుటిలో సుజాత కవిత్వంలో మరో పార్శ్వం తాను దర్శించిన ప్రదేశాలు, వస్తువుల అంతరంగ ఆవిష్కరణ, స్త్రీ సహజాతమైన సౌందర్య భావనలు అనేకం కనిపిస్తాయి.
ప్రజ్ఞాపూర్, భాగ్యనగరం, రామప్ప, భూదాన్ పోచంపల్లి, బైరాన్ పల్లి, మున్నార్, సొంతూరు, నగరానికి వలస వంటి కవితల్లో విజ్ఞాన విహార యాత్రల్లో, బస్సు ప్రయాణాల్లో, జీవితంలో వివిధ ఊర్లతో పొందిన అనుభూతులను అద్భుతంగా ఆవిష్కరించడం చూడవచ్చు. ప్రజ్ఞాపూర్ రోడ్డుమీద కంకులమ్మే హస్తాలను మసిబారిన సీతాకోకల చేతులుగా, గొంతులను ఎడారి కోయిల రొదలుగా వర్ణించడం, డబ్బుల కోసం పరిగెత్తే నిట్టూర్పుల రొదలను ఎండ తోవలో రాలే చెమట బిందువులను గుర్తించి వారిని నిత్యం నిప్పుల కొలిమిలో మాడి మసిబారిన ఎనగర్రగా సంభవించడం కవయిత్రి హృదయ మార్దవాన్ని, పేద ప్రజల పట్ల తన చూపును ప్రకటిస్తుంది.
నగరంలో వానను కుందుర్తి కిటీకీలోంచి తొంగి చూస్తోందని మహతీ వాచకంలో రాస్తే, సుజాత ‘‘వాడు అనుకున్నదే తడవు జల జలా రాలి పడుతున్నాడు, తెగ రెచ్చిపోతూ’’ అని మహద్వాచకం చేసి కొత్తదనాన్ని తీసుకువస్తుంది. మున్నార్ గురించి రాస్తూ అది ఆదిలాబాద్‌కు అక్కలాగే ఉంటుందని ఉపమిస్తుంది. భాగ్యనగరాన్ని ‘‘అబ్బో అప్పుడు పట్నం, మా ఊరి వెలమ దొరసానే’’ అని దాని డాబునూ, దర్పాన్నీ ఒక్క మాటలో కళ్ళముందుంచుతుంది. భూదాన్తా పోచంపల్లిని సందర్శించి తాను పోచంపల్లి సింగిడిని వెంట తెచ్చుకుంటుంది. రామప్పలో శిల్పి ఉలి చమత్కృతిని తలచి ‘‘ఎలా తీర్చిదిద్దావయ్యా ఈ సర్వాలంకృత నల్లరాతి నందిని’’ అని విభ్రమను ప్రకటిస్తుంది. మనిషి తోలు కప్పుకున్న గద్దలను ఎదిరించిన వీరబైరాన్‌పల్లి తెగువను కీర్తిస్తుంది.
ఇంటిలోని పాత వస్తువులను నోస్టాల్జిక్‌గా రాసిన వాళ్ళల్లో డా.ఎన్.గోపి సార్ ప్రథములుగా కనిపిస్తారు. గోపీ సార్ పరిచయంతో, కవిత్వ ప్రభావంతో సుజాత గారు రాసిన కవితలు ఈ సంపుటిలో కనిపిస్తాయి. ఇప్పటివరకు ఎవరూ దృష్టి సారించని కొత్త వస్తువులను ఎన్నింటినో నాంపల్లి సుజాత కవిత్వంలో దర్శించవచ్చు. రవి చూడని వాటిని కవులు చూస్తారనడానికి నిదర్శనం ‘‘మషిగంత పేగు, కష్కే, పోపుల పెట్టె, కత్తెర, బిరడా, సంతకం, నెమలిక’’ వంటి కవితలు.
వంటింటిలో ఇప్పుడు పట్టుకార్లు వచ్చినా పూర్వం ప్రతి పొయ్యి దగ్గరా వేడి పాత్రలను దింపడానికి ఒక మషిగంత పేగు ఉండేది. తన జీవితాన్ని దాంతో పోల్చుకుని తన చెలియగా, తనలాగా నిరంతర సేవలతో మాడిమసై తనువు చాలిస్తుందని అన్నప్పుడు హృదయాలను పిండేస్తుంది. కశ్కెను రూపుకట్టిస్తూ హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి తీక్షణంగా తెరిచిన కన్నుగుడ్డే కశ్కంటే, నాకు కవిష్క కనిపిస్తే చాలు ఊరవిష్కనై పోతానని సంబురపడిపోతుంది. పోపుల పెట్టెను వర్ణిస్తూ
‘‘బుజ్జి బుజ్జి గదులున్న
రంగుల సింగిడిని తుంచి
చిన్ని చిన్ని అరల్లో
నింపుకున్న వన్నెచిన్నెల పేటిక ఇది’’ అని పొంగిపోతుంది. కత్తెరను దృశ్యీకరిస్తూ
‘‘దాని కళ్ళల్లోంచి
నా వేళ్ళు ఒడుపుగా దూరి
రంగురంగుల కాగితప్పూలను
వికసింప చేస్తున్నప్పుడు
నా ఆనందం అపురూపం’’ అని పరమానంద భరితురాలవుతుంది.
కవిత్వానికున్న ప్రయోజనాలతో ఆనందం మొదటిదైతే, రెండవది ఉపదేశం కదా! మన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలోని ఆనందాన్ని తవ్వి తీసి మన ముందుంచి ఉభయానంద కారకమైన ఈ వస్తు కవిత్వం ఎంతో అపురూపం అనక తప్పదు.
నాంపల్లి సుజాత ఒక మహిళగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఉపాధ్యాయురాలిగా నిత్య ప్రయాణం కొనసాగిస్తూ, తన అభిరుచిjైున కవితా రచనను సమాజ పురోగతి కోసం వాహికగా చేసుకుంటూ నిరంతర చలనశీలంగా ఉండడం అభినందనీయం.