ఉదయం 5.30 గంటలకు మమత కాఫీ కలుపుతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. ఇంత ఉదయాన్నే ఎవరబ్బా అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరూ అని పిలిచింది. మమ్మూ… నేను జ్యోతిని, డోర్ ఓపెన్ చెయ్యి అంది జ్యోతి. అప్పుడు కానీ జ్యోతికి తట్టలేదు,
వచ్చేముందు కాల్ చేసి ఉంటే బాగుండేది. ఒకింత షాక్‌కు, ఆశ్చర్యానికి గురయింది మమత. మాట మాత్రం చెప్పకుండా, బెంగుళూరు నుండి ఇంత ఉదయాన్నే హైదరాబాద్‌కు వచ్చిందంటే ఏదో జరిగి ఉంటుందని అనుకుంటూ ఆలోచనలో పడిరది. ఇంతలో తలుపు కొడుతున్న శబ్దం మళ్ళీ రావడంతో తేరుకొని తలుపు తెరిచి హాయ్ జో, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటూ తన చేతిలో ఉన్న లగేజి బ్యాగ్ తీసుకుంటూ లోపలికి రా అంది. జ్యోతి సమాధానం సరిగ్గా చెప్పకుండా భయం భయంగా, గాభరాగా లోపలికి వచ్చింది. మమత ఏదో అడుగుతుండగా, జ్యోతి చెప్పడానికి ఇష్టపడలేదు. మమత తనను ఇబ్బంది పెట్టకూడదు అనుకుని, జో, నువ్వు ప్రెష్ అయ్యి రా, నేను కాఫీ తెస్తాను అంది. జ్యోతి ఫ్రెష్ అయి వచ్చింది. అంతలో మమత వేడి వేడిగా కాఫీ తెచ్చింది. నీ కోసం చిక్కటి కమ్మని కాఫీ, మీ పీజీలో కంటే వంద రెట్లు బెటర్‌గా ఉంటుంది, ఆలస్యం చేయకుండా త్రాగేసెయ్ అంది. ఆ మాటకు జ్యోతి చాలా కోపంగా చూసింది. సర్లే… కాఫీ తాగు అంటూ కప్పు అందించింది మమత.
జ్యోతి మౌనంగా కాఫీ తాగింది. మమత కూడా మౌనంగా ఉండిపోయింది. మమ్మూ, నాకు అలసటగా ఉంది అంది జ్యోతి. సరే జో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అంది మమత. జ్యోతి వెళ్ళి పడుకుంది.
ఉదయం 11 గంటలకు తన మొబైల్ మ్రోగడంతో మెలకువ వచ్చింది జ్యోతికి. టైం చూసుకుని అయ్యో చాలా లేటయ్యింది అనుకుంటూ హాల్లోకి వచ్చింది. మమత టీవీ చూస్తూ, జ్యోతికి ఏమైంది, ఎందుకు ముభావంగా ఉంది అని ఆలోచిస్తూ కూర్చుంది. జ్యోతి మాటలు వినపడటంతో రా జో, కూర్చో, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అంది. అయ్యో! సారీ మమ్మూ, రాత్రి బస్సులో నిద్ర పట్టలేదు, అందుకే చాలాసేపు పడుకున్నాను అంది జ్యోతి. ఫర్లేదులే జో, టిఫిన్ చేద్దాం రా అంది మమత. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. జ్యోతి మాత్రం మౌనంగా ఉండిపోయింది. ప్లేట్ వైపు చూస్తూ, పరాధీనంగా ఉండిపోయింది. చెప్పు జో, ఏమైంది? ఎందుకలా ముభావంగా ఉన్నావు? ఏం జరిగింది అంటూ మెల్లగా తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది మమత. ఎప్పటినుండో దాచిపెట్టుకున్న కన్నీళ్ళు కట్టలు తెంచుకుని వచ్చాయి. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీలేదు. మమత నిశ్చేష్టురాలై ఉండిపోయింది. ‘సారీ మమ్మూ, ఏదో తెలియని బాధ. జీవితమంతా చాలా ఖాళీగా ఉన్నట్లు ఉంది. భవిష్యత్తు కూడా చీకటిగా ఉన్నట్లు ఉంది. ఒంటరిగా ఉండాలంటే భయం. ఇంట్లో లైటు లేకపోతే భయం. ఎవరూ లేరని నిరాశగా ఉంది’ అంది జ్యోతి. ‘అదేంటి జో, ఎప్పుడూ నవ్వుతూ, బంధువులతో కలివిడిగా ఉండే నువ్వేనా ఇవన్నీ మాట్లాడుతున్నది. రాజు నీతోనే కదా ఉండేది, వాడితో అన్నీ షేర్ చేసుకుంటావు కదా. వాడిని నువ్వు తమ్ముడిగా చూసుకుంటావు. ఎవరూ కూడా మనతోపాటు జీవితాంతం కలిసి ఉండరు. వారి వారి అవసరాలు తీరాక వెళ్ళిపోతూ ఉంటారు’ అంది మమత. ‘అవును మమ్మూ, మా మామ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ భారమంతా నాపైనే పడిరది. నాకంటే వాడు చాలా చిన్నోడు. వాడిపైన భారం పెట్టలేక, చదువు మధ్యలో ఆపేసి, మామ చేసిన అప్పులు, వాడి చదువు బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. ఇప్పుడు వాడికి నా అవసరం లేదు. వాడు కొన్ని నెలల నుండి విడిగా వేరే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. వాడికి పెళ్ళి కూడా ఫిక్సయింది. ప్రైవసీ కావాలంట, అందుకే ఇప్పటినుండి విడిగా ఉంటున్నాడు. అందుకే ప్రస్తుతం నేను పీజీలో ఉంటున్నాను’ అంది జ్యోతి. అంతా విన్న మమత నిట్టూర్చింది. ‘వాడి పట్ల నువ్వు పొసెసివ్‌గా ఉన్నావా? ఎప్పటికైనా రాజు లైఫ్‌లో సెటిల్ అవ్వాలి కదా! నువ్వు కూడా చాలాసార్లు అన్నావు కదా! మరి వాడు ఎప్పటికైనా విడిగా వెళ్ళే అవకాశం ఉంది కదా. అన్నీ తెలిసి కూడా నువ్వు ఈ విషయానికి ఇంతలా బాధపడుతున్నావా?’ అంది. ‘అవును, కానీ ఈ ఒక్క విషయమే కాకపోవచ్చు మమ్మూ. నలభై ఏళ్ళలో 20 ఏళ్ళు చదువుతో గడిచిపోయింది. మరో పదేళ్ళు మంచి కంపెనీలో ఉద్యోగం, జీతం, ఉద్యోగంలో ఇమడడం ఇవే సరిపోయాయి. అంతేకానీ, నాకు ఉన్న వైకల్యం గురించి ఆలోచించే తీరిక లేకపోయే! మా అమ్మానాన్నలు నా పొట్టితనం ఒక అదృష్టంగా చూశారే కానీ, ఏ రోజూ కూడా నన్ను డాక్టర్‌కు చూపించాలనే ధ్యాస లేదు. నువ్వు చాలాసార్లు పెళ్ళి గురించి ఆలోచించమన్నా భయంతో నేను పట్టించుకోలేదు. కానీ, ప్రతి మనిషికీ మన కష్టనష్టాలు చెప్పుకోవడానికి ఏదో ఒక రూపంలో ఒక తోడు ఉంటే బావుండుననిపిస్తోంది. అంతెందుకు! నువ్వు గతంలో నాతో గడిపిన సమయం ఇప్పుడు గడపలేవు. నీకు కుటుంబ బాధ్యతలు ఉంటాయి కదా! నేనే ఖాళీగా ఉన్నాను అనిపిస్తోంది’ అంది జ్యోతి.
అంతా విన్న తర్వాత, ‘‘జో, ప్రతి మనిషి జీవితంలో అన్నీ సంపూర్ణంగా ఉండవు. కొన్ని వాక్యూమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. పెళ్ళి అనే సముద్రానికి అవతల గట్టున ఉండే వారికి గట్టుకు త్వరగా చేరాలని అనిపించవచ్చు. గట్టుమీద ఉండే వారికి ఎప్పుడెప్పుడు సముద్రంలోకి వెళ్ళి ఈదుదామా అనిపించవచ్చు. ఎందులో ఉండే కష్టాలు అందులో ఉంటాయి. కానీ, ప్రతి మనిషికి తమ అభిరుచులను, కష్టనష్టాలను చెప్పుకోవడానికి ఒక మనిషి తోడు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, మనిషి ఎప్పుడైతే తన భావోద్వేగాలను లోలోపలే అణచుకుంటూ జీవిస్తాడో, అప్పుడే మానసిక సమస్యలు తనను అతలాకుతలం చేసే భయం ఉంటుంది. కాబట్టి, మనం ఈ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకానీ, అదే బాధలో ఈదకూడదు. దాని ప్రభావమే నీకు చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం. ఇదే పరిస్థితి కొనసాగితే క్రానిక్ పానిక్ స్ట్రోక్స్ వస్తాయి. భవిష్యత్తులో పెద్ద మానసిక రుగ్మతగా మారే అవకాశం ఉంటుంది. నువ్వు నీకోసం సమయాన్ని గడుపుకో జో. బుక్స్ చదవడం నీకు చాలా ఇష్టం కదా! నీకిష్టమైన వ్యాపకాల్లో నిన్ను నువ్వు అన్వేషించుకో. అంతేకానీ, రాజు పట్ల పొసెసివ్‌గా ఉండొద్దు. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నీ ఎత్తును నువ్వు ఎప్పుడూ సమస్యగా భావించలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు సమస్యగా చూస్తున్నావు. రోజులు మారాయి జో. పెళ్ళికి వయస్సు అడ్డంకి కాదు. నువ్వు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే మంచి భాగస్వామి కోసం ఇప్పుడు కూడా ప్రయత్నం చేయవచ్చు. మనల్ని అర్థం చేసుకునేవారు కూడా సమాజంలో ఉంటారు. మనమే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి’’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది మమత. జ్యోతి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. థాంక్స్ మమ్మూ! నాకు చాలా రిలీఫ్‌గా ఉంది అంది. కానీ మమతకు మాత్రం తను జ్యోతికి ఇచ్చిన కౌన్సిలింగ్ సరిపోదని, మంచి సైకాలజిస్ట్‌ను వెతకాలనే ఆలోచనలో పడిరది.