ఉత్తరాంధ్ర నుంచి కవిత్వం-కథ నిలకడగా రాస్తూ వస్తున్న నేటి రచయిత్రులలో పద్మావతి రాంభక్త ఒకరు. రచనకు వచ్చే ఫలితకంటే అందుకు జరిగే కృషిలో ఆనందాన్ని వెతుక్కోవడంకూడా ఒక సృజనగానే భావిస్తున్న పద్మావతిగారితో జరిపిన సాహిత్య అంతరంగ సంభాషణలే ఈ ముఖాముఖి…
1. ఉత్తరాంధ్ర రచయిత్రిగా ఆ ప్రాంతం నుండి ప్రస్తుతం వెలువడుతున్న కవిత్వం-కథపై మీ అభిప్రాయం?
కథలో, కవిత్వంలో ఉత్తరాంధ్ర నుండి గంటేడ గౌరునాయుడుగారు, అట్టాడ అప్పల్నాయుడుగారు, మల్లిపురం జగదీష్ గారు లాంటి ఎన్నో బలమైన స్వరాలున్నాయి. అలాగే మరిన్ని యువస్వరాలు ప్రాంతాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఏదో గొప్పదనముంది. నాదీ ఉత్తరాంధ్ర కావడం నా అదృష్టం. దానికి నేను చాలా గర్వపడుతున్నాను.
2. కవిత్వంలోనే కాకుండా జీవితంలో కూడా ప్రకృతికి ప్రాధాన్యం కలిగించం వెనుక ఉన్న ఉద్దేశ్యం?
ప్రకృతి లేనిదే మనిషి మనుమడ లేదు. కానీ, మనిషే అభివృద్ధి పేరుతో ప్రకృతిని యదేచ్ఛగా ధ్వంసం చేస్తున్నాడు. ఎన్ని వత్తిళ్ళున్నా పచ్చని తోటలోకి నడిస్తే ఎవరి మనసుకైనా ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అందుకే నా కవిత్వంలో ప్రకృతి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. నా డాబాతోట జీవితంలో ముఖ్యభాగమైంది. దాదాపు చాలా కవితలలో పూలు, పూలరంగులు, పరిమళాలు, సీతాకోకలు, నదులు వంటి పదాలు చోటుచేసుకున్నాయి.
3. సాహిత్యం’ వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?
అది ఒక అనుకోని మలుపు. సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాక, ఉమ్మడి కుటుంబపు బాధ్యతల వలన, మరి కొన్ని కారణాల వల్ల ఉద్యోగం చెయ్యలేకపోయాను. అత్తమామలు స్వర్గస్తులయ్యాక, పిల్లలు కాస్త పెరిగాక ఉన్నట్టుండి ఖాళీ ఏర్పడిరది. అప్పుడు నాకిష్టమైన తెలుగు సాహిత్యం చదవడం మొదలైంది. ఇంగ్లీష్ మాధ్యమమైనా చిన్నప్పటి నుండి తెలుగు చదవకపోయినా మాతృభాషపట్ల నాకు మమకారం ఎక్కువ. అలా పత్రికలు చదువుతుండగా హఠాత్తుగా నేను వ్రాయడం మొదలుపెట్టాను. మొట్టమొదటగా ఆంధ్రభూమి వారపత్రికలో రెండు చిన్న కథలు ప్రచురింపబడ్డాయి. ఆ తరువాత కోయిలా కూ… యిలా శీర్షికలో కొన్ని కవితలు ప్రచురింపబడ్డాక, కవిత్వం వైపు మనసు మళ్ళింది. అప్పుడు విస్తృతంగా కవిత్వం చదవడం ఆరంభించాను. అలా చదువుతుంటే నాలో కవిత్వం పట్ల ప్రేమ ఉప్పొంగింది. ఇప్పటికీ కవిత్వం, కథ చదవడం నాకు ఎంతో ఇష్టమైన ప్రక్రియ. దాదాపు ప్రతి రోజూ చదువుతాను. అలాగే కైట్ రన్నర్’, ఇంటర్ ప్రెటర్ ఆఫ్ మెలడీస్’ వంటి ఆంగ్ల నవలలు, కథలు కూడా చదువుతున్నాను.
4. కుటుంబ నేపథ్యం?
సంప్రదాయ కుటుంబం నుండి వచ్చాను కనుక బడి పుస్తకాలు తప్ప మిగిలినవి చదవడం మా ఇంట్లో నిషిద్ధం. కానీ అప్పుడప్పుడు ఇంట్లో తెలియకుండా దొంగతనంగా చదివేదాన్ని. కానీ ఆ తరువాత పెళ్ళి, పిల్లల బాధ్యతల వలన చదివే సమయం చిక్కలేదు. చదువు పట్ల మమకారంతో పిల్లలను పెంచుతూ రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసాను. కానీ ఆ తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఇంట్లో వత్తిడి వల్ల నిరాశ ఎదురైంది. నా చదువు, పెళ్ళి అంతా విశాఖపట్నంతోనే ముడిపడి ఉంది. మా అమ్మగారి అత్తగారి కుటుంబాలలో స్త్రీకి చదువు చాలా అవసరమని భావిస్తారు.
5.స్ఫూర్తి కలిగించిన సాహితీకారులు?
శివారెడ్డిగారితో మొదలై ఎందరో నాకు స్ఫూర్తి కలిగించిన వారే. పత్రికలో ఎవరి కథ, కవిత వచ్చినా చదివి స్ఫూర్తి, ఆనందం పొందుతాను. ఒకొక్కరికి ఒకొక్క వస్తువును అందంగా మలిచే సామర్ధ్యం ఉంటుందని నేను నమ్ముతాను. అలా ఎందరో కవులు రచయితలు నాలో వారికి తెలియకుండానే స్ఫూర్తి రగిలించి నాతో కవిత్వం కథ రాయించారు.
6. రచయిత్రిగా సాహిత్య రంగంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?
సమస్యలేమీ లేవు. కానీ, పత్రికలో ఫోన్ నంబర్ చూసి వేధించే వారు ఉంటారు. అది అప్పుడప్పుడు విసుగు కలిగిస్తుంది. దానిని ఎదుర్కోవడమూ నేర్చుకున్నాను. కానీ ఫోన్ నంబర్ లేకపోతే ఫోన్ చేసి కవిత్వం బావుందని ప్రశంసించే ఎందరో పెద్దలు దూరమవుతారు. ఒకసారి సినీ గీత రచయిత వెన్నెలకంటిగారు నా కవిత చదివి మెసేజ్ పంపారు. అది ఎంతో ఆనందం కలిగించింది.
7.పెళ్లి అయ్యాకా స్త్రీ చదువు’కోవడానికే అనుమతులు అవసరమవుతాయి. రాయడానికి’ మీ కుటుంబం నుంచి ఏవిధమైన సహాయసాకారాలు ఉన్నాయి?
అవును చాలా కుటుంబాలలో చదువుకోవడానికి స్త్రీకి అనుమతితో పాటు ధనం కూడా అవసరం. అందుకే స్త్రీకి ఆర్ధికస్వాతంత్య్రం తప్పక కావాలి. రాయడానికి నా కుటుంబం అన్ని విధాల సహాయసాకారాలు అందిస్తుంది.
8. మీ రచనల్లో యువతి జీవితంలో ఎదుర్కొనే సమస్యల చిత్రణే అధికంగా ఉంది. వాటికి ప్రేరణ సమాజంలోని సంఘటనలా? లేక మీకైన గాయాలా?
ఈనాటికీ మహిళలకు సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి. కొన్ని చూపులకు పట్టుబడతాయి, మరి కొన్ని కళ్ళకు కనబడనివి. సమాజాన్ని లోతుగా పరిశీలించి, అధ్యయనం చేసి మాత్రమే నేను రాస్తాను. అందుకే నా రచనలలో యువతులు జీవితంలో ఎదుర్కునే సమస్యలే ఎక్కువ ఉంటాయి. ఇక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నేను ఉద్యోగం చేయకుండా, ఇంట్లో ఉండిపోయానే అనే బాధ నాకు ఉంది. దానికి కారణం ఒక మహిళగా ఇంట్లో నేను ఎదుర్కొన్న పరిస్ధితులు.
9.కథ-కవిత’ రాయడంలో ఏది ఉత్సుకత-ఒత్తిడి’ కలిగించింది?
మనసులో మెదిలిన భావాలను తక్కువ వాక్యాల్లో చెప్పడం, అదీ కవిత్వంగా చెప్పడం కష్టమైన పని. అదే కథ అయితే విస్తారంగా ఉంటుంది. కానీ నాకు మాత్రం కథ రాయడమే ఒత్తిడిగా అనిపిస్తుంది.
10. సమకాలీక రచయితలతో ఏ విధమైన సాంగత్యం ఉంది?
సమకాలీన రచయితలందరూ ఏదో ఒక సందర్భంలో నాతో మాట్లాడినవారే కానీ ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ సాంగత్యం ఏర్పడుతుంది కానీ అందులో మునిగితే సమయం ఎక్కువ వృధా అవుతుంది. ఈ మధ్యనే నేను ఫేస్ బుక్ అకౌంట్ తెరచి సాహిత్యానికే పరిమితం చేసాను. అది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. వారి రచనలను చదివి నేర్చుకుంటూ
ఉంటాను.
12. మొదటి సంపుటిలోనే ప్రాస ఉత్సుకత’ లేకుండా కవిత్వం సాగింది. దీని వెనుక ఏవిధమైన మెళుకువలు పాటించారు?
అది నాకు సహజంగా పట్టుబడిరదని నేను అనుకుంటాను. కానీ తరచూ అందరి కవిత్వమూ అధ్యయనం చేస్తే, మనకు తెలియకుండానే కొన్ని మెళకువలు వస్తాయి. కవిత్వం కూడా కొత్త రంగులద్దుకుని తళతళలాడుతుంది. కవిత్వం నాకు ఒక మానసిక ఉల్లాసం.