ఈసారి నేనొక పాత చింతకాయ పచ్చడి జాడిని కిందకి దించుతున్న.అందులో తరతరాలుగా దిగుమతి అవుతున్న కొన్ని ఏబ్రాసి విలువల కంపు కూడా కిందకి దించుతున్న. అందులో ఒకటి ఈ నెలసరి మైల వాసన.
బాలికలలో బహిష్టు మొదలవకపోతే ఒక హింస. ఆమె పరిపూర్ణ మహిళ కాదని నిర్ణయిస్తుంది సమాజం. ఇక వివక్ష! ఆమెకు పెళ్లి కాదు. ఆమె వలన అరిష్టాలు కూడా జరుగుతాయి. సరే ఋతుచక్రం మొదలైందనుకుందాం. ప్రతి నెల వివక్ష, వేర్పాటు, వెలివేత. మళ్ళీ ఆ నెలక్రమం ఆగిందంటే అనుమానం. పెళ్ళికి ముందేకడుపైందేమో అని. హింస, వివక్ష, కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. సరే. పెళ్లి అయిపొయింది. ఇప్పుడు ప్రతి నెల బహిష్టయితే సమస్య, ఈమెకు పిల్లలను పుట్టించే రాత లేదేమో అని. సరే పిల్లలు పుట్టారను కుందాం, మళ్ళీ వివక్ష, పురిటి మనిషి, మైల అనుకుంటూ.. ఏందీ టార్జాన్ నియమావళి? వివక్ష కూడా ఒక్క మాట మీద నిలబడలేకపోతే ఎలా?
పిల్లలను కనే ప్రక్రియకు ఆది ఈ నెలసరి ప్రక్రియ. మైగ్రైన్, పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి, యోనిలో నొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం, వాంతులు, మలబద్ధకం లేదా విరోచ నాలు, తలతిరగడం, చికాకు, దుఖః, అధిక రక్త స్రావం- నెలసరి చుట్టూ గూడు కట్టుకున్న శారీరక బాధలు. ‘ఇవన్నీ భరించలేరనే ఆడవారి మీద దయతో ఆ మూడు రోజులు దూరంగా ఉంచేవారు’- ఈ వికారపు ఉవాచలవలన ఆడవారి శారీర ప్రక్రియ లపై వివక్ష, వెలివేత సాధారణీకృతమవుతుంది.
వందలయేళ్ళుగా నెలసరిలో ఉన్న మహిళను దేవుడి గదిలోకి, గుడులలోకి రానీయక పోవడానికి, మనుషులను, పచ్చడి జాడీలు ముట్టుకోనీయక పోవడానికి, చెట్టుచేమలకు నీళ్లు పోయనీయకపోవడానికి, హాjైున తిండిని, సుఖమైన నిద్రను దూరం చేయడానికి, మనిషిగా గౌరవించక అవమానించడానికి పూనుకున్న సమాజం, పైన చెప్పిన శారీరక కష్టానికి పరిష్కారంగా అందే ఒకరోజు విశ్రాంతికి మాత్రం రాగాలు తీస్తోంది.
పీరియడ్ పెయిన్, మెటర్నిటీ లీవ్, పెటర్నిటీ లీవ్ ఇవన్నీ ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారు. చాలాసార్లు సామాజిక సంక్షేమం ఉత్పాదకతను ఏ విధంగా పెంచుతుందో వివరిస్తూ యాజమాన్యాన్ని సమాధానపరిచే వాదనను లేవదీస్తారు. కాని యాజమాన్యానికి అర్థం కావలసిందేంటంటే పరిశ్రమకు ఉత్పాదకత కన్నా ఉద్యోగుల శ్రేయస్సు ఎక్కువ ముఖ్యం అని. వస్తు లేదా సేవ ఉత్పత్తినే కాక పని చేస్తున్న వారి జీవన నాణ్యతా ప్రమాణాలను పెంచడం కూడా పరిశ్రమ పెంపుకు ముఖ్యమైన కొలత అనే విషయాన్ని తెలివిగా మరుస్తున్నారు.
మనిషిని ఒక ఓటు సంఖ్యగా మాత్రమే కాదు ఒక శ్రామిక వనరుగా కూడా చూస్తారు. ఈ శ్రామిక వనరు ఆ ఒక్క రోజు రాకపోతే జరిగే ఆదాయ నష్టంగానే చూస్తారు. ఇది ఎంత హేయమో అర్థం కాదు. ఆడవారికి మూడు నెలలనుండి నుండి ఏడాది దాకా మెటర్నిటీ సెలవలు మాత్రం ఒప్పుకుంటారు. అంటే పిల్లలు పుట్టడాన్ని కూడా ఉత్పాదనగా చూస్తోందా మన సమాజం? పితృస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం కలిస్తే వారెవ్వా కాంబినేషన్ అన్నమాట.
సరే, ఆ ఉత్పాదకభాష లోనే విషయాన్ని అర్థం చేసుకుందాం. మన శారీరక సమస్యల వెనుక అన్నిటి కన్నా ముందు నిలబడేది మన స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఇది మానసికం, శారీరకం. ఈ రెండు ఒత్తుడులు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అనారోగ్యం ఉత్పాదనను తగ్గిస్తుంది. కాబట్టి ఖర్చు భారం పెరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీల ఆదాయంలో గండి పడుతుంది. ఇంట్లో ఆడవారు నాలుగు రోజులు మంచం పడితే కుటుంబం అల్లకల్లోల మవుతుంది. వారు పడే బాధను గుర్తించి తగిన ఆలంబన అందకపోతే వారి నొప్పి కుటుంబ నొప్పిగా మారుతుంది. ఈ సంరక్షణ బాధ్యతను తెలివిగా కుటుంబం మీదకు తోసేసినా, కొంతకాలానికి నేరుగా కాకున్నా ప్రభుత్య ఆదాయంపై భారం పడి తీరుతుంది. మన జీడీపీ తగ్గుతుంది. ఇంతలా వివరించవలసిన అవసరం ఉందంటేనే సిగ్గు వేస్తుంది.
ఉత్పాదన – ఆరోగ్యం కథకు మరో కోణాన్ని చూద్దాం. ఎవరైనా పొలాల్లోను, ఇటుక బట్టిలలోనూ, భవన నిర్మాణ పనులలోనూ పని చేసుకునే ఆడకూలీలని చూశారా? వారికి ఈ సెలవు వర్తిస్తుందా? ఈ సెలవు వెసులుబాటు లేకనే, పని చేస్తేనే పైసలు వస్తాయనే పద్ధతి కింద ఆ నెలసరి సమస్యలు వదుల్చుకోవడానికి గర్భసంచి తీయించుకుంటారని తెలుసా? తీయించుకుని ‘హమ్మయ్య’ అనుకున్న తర్వాత కథ ముగిసిపోదు. వారు హార్మోనుల అసమ తుల్యత బారిన పడి వారి శరీరాన్ని ఛిద్రం చేసుకుంటారని, శరీర సహజ ప్రక్రియలో సాగే ఈ హార్మోన్లను గందరగోళం చేసి మళ్ళీ సమతు ల్యత కోసం గోళీలు మింగుతారని, బొమికలు పెళుసుబారిపోతాయని, చర్మం గిడసబారి పోతుందని, ముసలితనం త్వరగా వస్తుందని తెలుసా? ఈ సెలవు మరొక అడుగు ముందుకు సాచివీరికి కూడా అందాలని గుర్తించడానికి ఇంకా ఎన్నిఆమడలదూరం ఉంది?
భూటాన్లో హ్యాపినెస్ ఇండెక్స్ గురించి, అమెరికాలో ఆధిపత్యం సాగిస్తున్న మన ఆడవారి చైతన్యం గురించి కాదు- మన దేశంలో ఆడవారికి దొరికే ఆ చిన్న నిశ్చింత గురించి మాట్లాడుకుందాం.పెద్ద పెద్ద త్యాగాలు కాదు, కాస్త తీరికకూ, వెసులుబాటుకూ సహానుభూతికీ అడ్డుపడకుండా ఉందాం. కంపు కొట్టే బానిసత్వపు పదప్రయోగాలు చేసిన మహిళా రాజకీయవేత్తను నోరుమూసు కోమందాం. వైకల్యం అంటే ఉత్పాదన చేయలేక పోవడం కాదని, ఉత్పాదనకు అనుకూలమైన వనరులు లేకపోవడమని, పని చేయలేని శరీర బాధను శారీరక వైకల్యంతో పోల్చి మహిళలను, శారీరక వైకల్యం ఉన్నవారిని ఒకేసారి అవమానించవద్దని చెబుదాం.
చివరగా. మన గొడ్లచావిట్లో దొరికే గతకాలపు వివక్షా వైభోగమూ వద్దు, పిల్లలను సంతోషపెట్టడానికి మోడరన్ అమ్మలు అల్ట్రా పాడ్స్ వాడి క్రికెట్ ఆడనూవద్దు. కావలసిం దంతా – ఇంటా బయటా చాకిరీతో నలిగే ఆ దేహానికి నెలలో ఒకరోజు అందుకోగలిగే ఆ కాస్త విశ్రాంతి.