వాకిలి శుభ్రం చేసి లోపలికి వస్తూ ‘‘అమ్మా రేపు పనికి రాను’’ అన్నది యాదమ్మ.
ఏంటి వంట్లో బాగోలేదా .. అంటే
మంచిగనే ఉన్న. కానీ…, ఎప్పటి సందో జూ పార్కుకు పోయి చూసి రావాలని ఉండే. ఇన్నేండ్ల సంది ఈ పట్నంలనే ఉన్న. ఎన్నడు అటుదిక్కు తొంగి సూడకపోతి. పైసపైస ఇంటి కోసం, పిల్లల కోసం నడపకుంటే నడవ దాయె. ఇగ అటుదిక్కు పోవుడయితదా..
ఈ సర్కారు ఎక్కంగానే ఆడోళ్లకు పైసలు లేకుంటనే బస్సు సౌలత్ జేసిందిగద.
మా అక్క బిడ్డ ఆమె దోస్తులు జూ పార్క్, చార్మినార్, లాడ్ బజార్ కి పోతున్నరు. వాళ్లతో పోయి అన్ని తిరిగి చూసొస్త అనుకుంటాన్న.
‘పని ఎగ్గొట్టి తిరిగొస్తావా .. ఎందుకు తిరిగి రావూ .. అలుసిచ్చి నెత్తికెక్కించు కుంటుంటే’ వెనక నుండి అత్తయ్య సణుగుతున్నది.
అదేమీ పట్టించుకోని యాదమ్మ రేపటిని ఊహించుకుంటూ ఉన్నది. మరోసారి వేములవాడ రాజన్న దగ్గరకు పోయి రావాలని ఆశ పడుతున్నది.
ఇకనుంచి బస్సులు, వీధులు, దర్శనీయస్థలాలు, దుకాణాలు, పార్కులు ఆడవాళ్ళతో నిండిపోతాయేమో.. ఒక్కసారి ఊహించుకుంటే ముచ్చటగా ఉంది. సగం ప్రపంచం ముచ్చట్లు పెడుతూ, నవ్వుతూ తుళ్ళుతూ, బిడ్డకు పాలిస్తూ , అక్కడే మీటింగ్ పెడుతూ, చర్చలు చేస్తూ, చిన్న పెద్ద ముసలి ముతక అంతా వాళ్లే. ఆ ఊహే భలే ఉంది.
మనదేశంలో ఎక్కడికి పోయినా పబ్లిక్ ప్రదేశాల్లో మగవాళ్లే కనిపిస్తారు. ఆడవాళ్లకు అక్కడ చోటు చాలా తక్కువ.
మహిళలకు వంటిల్లు దాటి బయట ప్రపంచంలోకి తొంగి చూడాలని కుతూ హలం ఉన్నప్పటికీ వంటిల్లు, పిల్లలు, ఇంటి బాధ్యతలు, ఉద్యోగం/పని, సమయం, డబ్బు వంటి అనేక విషయాలు వారిని వెనక్కి లాగేస్తాయి.
ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి బయటి ప్రపంచాన్ని చూసేందుకు అవకాశం వచ్చింది మహిళలకు. అందుకే బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చిన వెసులుబాటుతో ప్రయాణం చేయడానికి ఉత్సాహపడుతున్నారు మహిళలు.
యాదమ్మ లాంటి వారెందరో గుళ్లు గోపురాలకు, పార్కులకు, బంధు మిత్రు లను చూడడానికి ఉబికి ఉబికి ఊటలా బయలుదేరుతున్నారు. ఇప్పుడున్నంత
ఉత్సాహం ఎప్పుడు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అంత తీరిక సమయం యాదమ్మలాంటి మహిళకు ఎక్కడిది?
ఒకసారి మహిళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టడం అంటే ఆమె ప్రపంచం విశాలం అవుతున్నట్లేగా. అంతేనా ఆమె ఆలోచన విస్తృతం అవుతుంది. విద్య ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి.
నిజానికి లింగ వివక్ష తగ్గడానికి లేదా తగ్గించడానికి కొంతవరకు దోహదం చేస్తుంది.
సంపాదన లేని మహిళలు, ఇళ్లలో ఉండే మహిళలకు ఇతరులపై ఆధారపడే మహిళలకు ఉచిత ప్రయాణం పెద్ద వెసులుబాటు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది ఎక్కువగా కూలి నాలి చేసే పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి
వాళ్ళు. ఈ మహిళల ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ము తక్కువే కావచ్చు కానీ దాని ప్రభావం చాలా ఎక్కువే.
ఈ సందర్భంలో అవసరానికి వాడే వారి కన్నా అనవసరంగా తిరిగొచ్చే
వాళ్ళు ఎక్కువ అంటూ లెక్కలేసి ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నారని పేదల ఆనందాన్ని దూరం చేసే కామెంట్స్ చేస్తూ ఆయాస పడిపోతున్నారు కొందరు. కడుపు నిండిన వారికి ఏమి తెలుస్తుంది ఆకలి విలువ.
కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగానో కారు చౌకగానో కట్టబెట్టే లెక్కలేనన్ని భాగోతాలను లెక్కలేసి ప్రశ్నించడానికి వాళ్ళ నోరు పెగలదెందుకో…
సమాన హక్కులు కావాలని రోడ్డెక్కు తారు కదా. బస్సులో డబ్బు పోయడానికి ఆడ, మగ చూడడం ఏంటీ, ఆడవాళ్లకు ఆఫీస్‌లో వేతనంతో కూడిన సెలవు (నెల సరి సమయంలో) ఎందుకు అనీ సోయి లేని మాటలు మాట్లాడుతున్నారు కొందరు.
ప్రభుత్వం కొంత దుబారా తగ్గిస్తే, ప్రజాధనం కాకులు, గద్దల్లా తన్నుకుపోయే బడాబాబుల చేతుల్లోకి పోకుండా కాపాడు కుంటే మహిళలకు కొన్ని ప్రత్యేక సౌకర్యా లు కల్పించడం పెద్ద కష్టం ఏమీ కాదు.
ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పరిస్తేనే సరిపోదు. పెరుగుతున్న మహిళా ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అవసరమైన బస్సులు కూడా అన్ని రూట్లలో పెంచాల్సిన అవసరం ఉంది.