కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడానికి 2017 జూన్ నెలలో డా.కస్తూరి రంగన్ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2019 మే నెలలో ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా (డ్రాఫ్ట్)’ను రూపొందించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు అందచేసింది. దానిని కేంద్ర క్యాబినెట్ జులై 29, 2020 నాడు ఆమోదించింది.
ఈ కమిటీ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ‘హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్’లోని ఆర్టికల్`26ను ప్రాతిపదికగా చేసుకొని తయారు చేయబడిరది. ఆ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు కల్పించబడాలి. అందువల్ల, ప్రతి ఒక్క పౌరుని జీవితాన్ని స్పృశించేలా, వారి వారి సామర్ధ్ద్యాన్ని బట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చేసే విధంగా తద్వారా సమసమాజ స్థాపనకు ఎన్ఈపి 2020 రూపొందించబడిరది. ప్రస్తుత విద్యా వ్యవస్థ 21వ శతాబ్దానికి అనుగుణంగా లేనందువల్ల, పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల మార్పులు చేయాలని ఎన్ఈపి 2020 సిఫార్సు చేసింది. కొత్త విద్యా వ్యవస్థలో భారతీయ సంస్కృతి`సాంప్రదాయాలు, విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విద్యానిర్మాణం`పాలన, విద్యా సంస్థల నియంత్రణల్లో కూడా సంస్కరణలు సూచించింది.
ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ‘విద్య’ నిర్వచనం:
జాక్వస్ డెలోర్స్ వ్రాసిన ‘లెర్నింగ్: ది ట్రెజర్ వితిన్’ ప్రకారం 21వ శతాబ్దపు విద్య నాలుగు పునాదులు (పిల్లర్లు)పై ఆధారపడి ఉండాలి. మొదటిది ‘లెర్నింగ్ టు నో’ ` అంటే విద్య జ్ఞాన సముపార్జనకు, ఆ అవకాశాల వలన జీవితాంతం ప్రయోజనం పొందేలా ఉండాలి. రెండవది ‘లెర్నింగ్ టు డూ’ ` అంటే విద్య ఒక వృత్తిని ఎంచుకోవడానికి, నిత్య జీవితంలో, వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి ఉపయోగపడేలా ఉండాలి. ఇంక మూడవది ‘లెర్నింగ్ టు లివ్ టుగెదర్’ ` అంటే విద్య భిన్న సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, సమాజంలో ఒకరిపై మరొకరు ఆధారపడటం, బహుళత్వాన్ని గౌరవించడం, శాంతిని కాంక్షించడం వంటి ‘సంఘ విలువలు’ అభివృద్ధిపరిచేలా ఉండాలి. చివరకు ‘లెర్నింగ్ టు బి’ ` వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి (పర్సనాలిటీ), వారు సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా, నైతిక బాధ్యతలు పెంపొందేలా, వ్యక్తి యొక్క ఏ సామర్ధ్యాన్ని అయినా కూడా పెంపొందించేదిగా ఉండాలి. ఇలా విద్యను విశాల దృక్పథంతో చూసినప్పుడు, విద్యార్థుల్లో సంపూర్ణమైన అభివృద్ధికి పాటుపడేదే నిజమైన విద్య అని అనిపించక మానదు. అందువల్ల విద్యార్థులు కనీస సామర్ధ్యాలు (ఫౌండేషనల్ స్కిల్స్) అయినటువంటి అక్షరాస్యత, గణించడం (సంఖ్యా శాస్త్రం), ఉన్నత స్థాయి నైపుణ్యాలు (హయ్యర్ ఆర్డర్ స్కిల్స్) అయిన విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్), సమస్యా పరిష్కార నైపుణ్యాలు (ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్) మాత్రమే కాకుండా సామాజిక, భావోద్వేగ (ఎమోషనల్) నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వీటిని ‘సాఫ్ట్ స్కిల్స్’ అని వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు ఎంతో ప్రాధాన్యతనిచ్చే తాదాత్మిక అనుభూతి (ఎంపతి), సామాజిక అవగాహన, పట్టుదల, టీం వర్క్, నాయకత్వ లక్షణాలు (లీడర్షిప్) వంటివన్నీ ఈ సాఫ్ట్ స్కిల్స్‌లో భాగమే. అందువల్ల నేటి తరం విద్యార్థులు విద్యా, సామాజిక, భావోద్వేగ సామర్ధ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకం. వీటినన్నంటిని దృష్టిలో ఉంచుకొని ఎన్ఈపి 2020 రూపొందించబడిరది.
అపురూపమైన భారతీయ వారసత్వ సంపదే దేశానికి విజ్ఞాన గని:
భారతదేశానికి సంపూర్ణమైన విద్యను అందించడంలో విశిష్టమైన, గొప్ప చరిత్ర ఉంది. పురాతన కాలంలో విద్య యొక్క పరమావధి కేవలం జ్ఞానార్జనతో లేక వృత్తి కోసమో కాదు. ఆ రోజుల్లో ఋషులు, విద్య అనేది ఆత్మ సాక్షాత్కారానికి, అన్ని బంధాల నుండి వ్యక్తికి విముక్తి కలిగించే ఒక సాధనంగానే పేర్కొన్నారు. చరకుడు, సుశ్రుతుడు, ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు, చాణుక్యుడు, పతంజలి, పాణిని మొదలైనవారు ప్రాచీన భారతదేశంలో పేరెన్నికగన్న పండితుల్లో కొందరు. వారు ప్రపంచ జ్ఞాన భాండాగారానికి ఎంతో విజ్ఞానాన్ని అందించారు. గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, లోహశాస్త్రం, వైద్యశాస్త్రం, శస్త్రచికిత్స, నిర్మాణశాస్త్రం, యోగ, లలితకళలు, చదరంగం, నౌకానిర్మాణం, నౌకాయానం, సివిల్ ఇంజనీరింగ్ మొదలైన రంగాల్లో భారతీయ ఋషులు / పండితుల కృషి ప్రపంచం మెచ్చేలా ఉంది. దేశంలో ఏ మూల చూసినా దేవాలయాలపై చెక్కబడిన శిల్పకళా సౌందర్యం, వాటి నిర్మాణంలోని ఇంజనీరింగ్ ` వాస్తు నైపుణ్యం, వాటిలో వాడబడిన మెటీరియల్ ఇప్పటికీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.
ఆధ్యాత్మికతకు నిలయాలుగా వెలసిన దేవాలయాలు:
ఏ గుడికెళ్ళినా మైమరపించే రాతిపై చెక్కబడిన సుందరమైన శిల్పాలు దేశంలో అడుగడుగునా దర్శనమిస్తాయి.
ఉదాహరణకు ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు సంపాదించుకున్న తెలంగాణలోని రామప్ప దేవాలయం క్రీ.శ.1213లో కాకతీయుల కాలంలో రేచర్ల రుద్రుడి చేత నిర్మించబడిరది. కేవలం ఇసుకను పునాదిగా చేసుకొని, మొత్తం గుడిని రంగురంగుల రాళ్ళతో కట్టి, ఆ తర్వాత ఆలయ గోపురాన్ని మాత్రం నీటిపై తేలియాడే తేలికైన ఇటుకలతో చేపట్టిన ఈ నిర్మాణాన్ని చూస్తే ఎవరికైనా సరే ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అనిపించక మానదు. అలాగే నేటికీ ఏ మాత్రం రంగు మారకుండా వివిధ రంగుల్లోనున్న చెక్కుచెదరని గుడి
రాళ్ళు, నల్లరాతిపై చెక్కబడిన ఆకర్షణీయమైన పెద్ద నంది విగ్రహం, రకరకాల పరిమాణాల్లో చెక్కిన వినాయక విగ్రహాలు, చిన్న చిన్న ఏనుగుల వరుసలతో గుడి చుట్టూరా చెక్కిన శిల్పాలు, గుడిలోపల పైకప్పుపై చెక్కిన ఇతిహాస ఘట్టాలు, చివరగా గుడిలో రుద్రేశ్వరుడిగా సాక్షాత్కారమిచ్చే సుందరమైన లింగ రూపాన్ని చూస్తే ఎంతటివారైనా మంత్ర ముగ్ధులవడం ఖాయం. ఈ గుడి సౌందర్యాన్ని వీక్షించినవారు, విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన శిల్పుల నైపుణ్యానికి, కాకతీయ రాజుల దైవభక్తి, కళాపోషణకు సలాం కొట్టకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. దేశంలో కోకొల్లలుగా దేవాలయాలు వెలసినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ప్రాచుర్యం పొంది ఆకట్టుకునే ప్రాచీన కాలపు గుళ్ళు మాత్రం వందల సంఖ్యల్లోనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా స్థల పురాణాలను బట్టి గానీ, హిందూ మత గ్రంథాల్లో పేర్కొన్న విషయాల ఆధారంగా గానీ మరికొన్ని గుళ్ళు ప్రసిద్ధి గాంచాయి. అలాంటి వాటిలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, మహాబలిపురంలోని రాతి రథాలు, మధుర మీనాక్షి దేవాలయం, కర్నాటకలోని చెన్నకేశవ గుడి, హంపిలోని విరూపాక్ష దేవాలయం, రాతి రథం, బాదామి వద్ద గుహలో నిర్మించిన ఆలయాలుÑ మహారాష్ట్రలోని కైలాస దేవాలయం, గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయం, రాజస్థాన్‌లోని బ్రహ్మ గుడి, దిల్వారా గుళ్ళుÑ ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఒడిశాలోని లింగరాజ గుడి, కోణార్క్ సూర్య దేవాలయం, బీహార్‌లోని ముండేశ్వరి దేవాలయాలు మచ్చుకు కొన్ని.
భారత ఉపఖండంలో మాత్రమే కానవచ్చే భిన్నత్వంలో ఏకత్వం:
కళ్ళార్పకుండా చూడాలనిపించే సాంప్రదాయ (క్లాసికల్) నృత్యాలు, జానపద కళలు, మనసును హత్తుకునే వైవిధ్యభరిత సంగీతం, మదిని దోచే అద్భుతమైన వస్త్రాలు, హస్తకళలు, మహిళామణులను కట్టిపడేసే నాణ్యమైన చేనేత చీరలు, భోజన ప్రియులు ఇష్టపడే ప్రాంతానికో తీరైన వంటకాలు, పోషకాలు అందించే సుందరమైన మృణ్మయ పాత్రలు`కుండలు, రోగ నిరోధక శక్తిని పెంచే కంచు గిన్నెలు మొదలైనవన్నీ భారతదేశం యొక్క ప్రాచీన వారసత్వ సంపదలో భాగమే. మరోవైపు దేశానికి ఉన్న అసాధారణ భౌగోళిక అంశాలు, దేశానికి నలుదిక్కులా కాశ్మీర్ నుండి కన్యాకుమారి, కచ్ నుండి కామరూప్ వరకు ప్రజలు పాటించే రకరకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వేషధారణ, వారు మాట్లాడే రకరకాల భాషలు, వాటిలోని యాసలు (మాండలికాలు), కుల మతాలకతీతంగా వారందరిలో ఉండే ‘భారతీయత’ అనే భావోద్వేగం, దేశం పట్ల ప్రదర్శించే భక్తి మన దేశాన్ని ఒక ఉపఖండం అనేలా చేశాయి. అందువల్ల దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ‘భిన్నత్వంలో ఏకత్వం’ ఇట్టే గోచరిస్తుంది. ఇటువంటి అత్యంత విలువైన జ్ఞానాన్ని ప్రజాశ్రేయస్సు కోసం కాపాడుతూ, ముందు తరాలకు అందించడమే కాకుండా, దానికి విద్యావ్యవస్థలో ఇనుమడిరపచేసి, భవిష్యత్తులో విద్యార్థులు పరిశోధనల ద్వారా ఆ వారసత్వ సంపదను నవీకరించి, మరింత మెరుగుపరిచి మళ్ళీ ప్రజలు విరివిగా ఉపయోగించేలా చేయాలి. దీనిద్వారా విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకత, సహజ సామర్ధ్యాలు బయటపడతాయి. అలాగే విద్యార్థులను వారి స్థానిక ప్రదేశంలో ఉండే వాస్తవికత ఆధారంగా ఆలోచించి, నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించవచ్చు.
మునుపటి పాలసీల లక్ష్యాలూ ముఖ్యమే:
స్వాతంత్య్రానంతరం తీసుకువచ్చిన విద్యా పాలసీలు, ముఖ్యంగా కొఠారి కమీషన్ (1964`66), నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (ఎన్‌పిఈ`1986/1992)ల్లో ఎక్కువగా విద్యను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఊరిలో జనాభాను బట్టి బడి/కాలేజ్‌ని స్థాపించడం, ఆ విద్యాసంస్థల్లో అన్ని సామాజిక వర్గాల వారు నమోదయ్యే విధంగా చర్యలు ఉండేవి. ఇలా జనావాసాలకు అతి దగ్గరగా బడిని నెలకొల్పి (యాక్సెస్), వాటిలో అన్ని వర్గాలకు చెందిన బాలబాలికలను చేర్చుకుని సమన్యాయ సూత్రానికి (ఈక్విటీ) ప్రాధాన్యతనివ్వడం వల్ల నాణ్యతా ప్రమాణాల గురించి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. అంటే విద్యా ప్రమాణాలు అ ప్రాధాన్య అంశాలుగా మిగిలిపోయేవి. కానీ, ఎన్పీఈ`1986/92 సిఫార్సుల ఆధారంగానే దేశంలో ‘సార్వత్రిక ప్రాథమిక విద్య’ను సాధించడంలో అతి ముఖ్యమైన ఆర్టికల్ 21`ఎ ను 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనే చారిత్రక విజయాన్ని మరిచిపోవద్దు. దాని ప్రకారం దేశంలోని 6`14 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను పొందడం వారి ప్రాథమిక హక్కు. ఆ తర్వాత తీసుకువచ్చిన ‘విద్యా హక్కు చట్టం (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్)`2009’ దేశంలోని 6`14 సంవత్సరాల వయసులోపు పిల్లలు, వారికి దగ్గరలోని ఏ పాఠశాలలో (ప్రభుత్వ/ప్రైవేట్) అయినా ఉచిత నిర్బంధ విద్యను పొందవచ్చు. అయితే, దేశంలో నూతన ఆర్థిక సంస్కరణల అనంతరం సైన్స్, టెక్నాలజీ, గ్లోబలైజేషన్, నాలెడ్జ్ సొసైటీ, నాలెడ్జ్ ఎకానమీ వంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ, ఇంతకుముందు వచ్చిన విద్యారంగ పాలసీల్లో ఈ కొత్త అంశాల ప్రస్తావన ఉండదు. నిజానికి, ఉన్నత విద్యలో సిలబస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. అప్పుడే యువతలో జ్ఞానం, నైపుణ్యం, సకారాత్మక వైఖరులను జొప్పిస్తూ, ఉద్యోగానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించడం ద్వారా దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన సాధ్యపడుతుంది.
ఎన్ఈపి 2020ని అమలు చేయడమే అసలు సవాలు:
ఐక్యరాజ్య సమితి యొక్క నాలుగవ సుస్థిర అభివృద్ధి లక్ష్యం (యునైటెడ్ నేషన్స్ ఎస్డిజి) ప్రకారం 2030 వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా సమ్మిళిత విధానాలు అనుసరిస్తూ, ఎటువంటి జాతి, మత, కుల, ఆర్థిక, లింగ, సాంస్కృతిక, భాషా తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల వారికి సమానంగా నాణ్యమైన విద్యను అందించడం, వారికి జీవితాంతం విద్యను నేర్చుకొనే అవకాశం కల్పించడం జరగాలి. అలాగే ప్రతి దేశం పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తూ, ప్రతి పౌరుడికి నాణ్యమైన జీవితాన్ని అందించాలి. పర్యావరణ కాలుష్యం, సుస్థిర అభివృద్ధి పట్ల విద్యార్థుల్లో మొదటినుండే అవగాహన కల్పించాలి. ఎన్ఈపి 2020 యొక్క అంచనాల ప్రకారం, 2030`32 వరకు ఇండియా, 10 ట్రిలియన్ డాలర్ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుంది. ఎన్నో ఆలోచనల సమాహారమే ఈ పాలసీ యొక్క సిఫార్సులు. అందువల్ల ఈ ఎన్ఈపీ 2020 పాలసీని తు.చ. తప్పకుండా అకుంఠిత దీక్షతో అమలు చేసినప్పుడే ప్రతిభాధారిత జ్ఞాన సమాజం (మెరిటోరియస్ నాలెడ్జ్ సొసైటీ) ఏర్పాటు చేయాలనే స్వప్నం సాకారమవుతుంది. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ దిశగా ముందడుగు పడితేనే, దేశంలోని విద్యారంగంపై ఈ పాలసీ యొక్క ప్రభావం మొదలైనట్లు లెక్క. స్థానిక వాస్తవిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఆచరణాత్మక ఆలోచనలతో వ్యూహాత్మక ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేసినప్పుడే ఎన్ఈపీ 2020 లక్ష్యాలు నెరవేరతాయి. దీనికోసం మొదటగా రాష్ట్రాలు, వాటి స్థానిక అవసరాలను బట్టి పాలసీలోని ప్రాధాన్య లక్ష్యాలను గుర్తించాలి. తర్వాత రాష్ట్రం యొక్క ప్రత్యేక లక్ష్యాలను, విద్యారంగ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకోవాలి. చివరగా అందుబాటులో ఉన్న వనరులను బట్టి, సంస్ధాగత సామర్థ్యాన్ని బట్టి, విద్యారంగంలో గతంలో సాధించిన అనుభవాన్ని బట్టి మధ్యంతర గమ్యాలు నిర్దేశించుకోవాలి. అలాగే బలహీన వర్గాలు, భిన్న సంస్కృతులకు చెందిన పిల్లలు, యువతను కూడా విద్యారంగంలో చేర్చుకునే విధంగా ప్రణాళికలు, అమలు చేసే విధానాలు, వ్యూహాలు వాస్తవికతకు దగ్గరగా, అనువుగా ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. అందువల్ల ఈ పాలసీని ఎంత సమర్ధవంతంగా రూపొందించారో అంతే సమర్ధంగా అమలు పర్చడమే అసలైన సవాలు.
ముగింపు: ఎన్ఈపీ 2020 యొక్క విజయం పూర్తిగా దాన్ని అమలు చేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు
ఉన్నత విద్యా స్థాయిలో వచ్చిన మార్పులు పాఠశాల విద్యా స్థాయిలో ఇంకా రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే, విద్య ఉమ్మడి జాబితాలో ఉండడం చేత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేయలేక పోతున్నది. పాఠశాల విద్య రాష్ట్ర స్థాయిలో ఉండడం వల్ల చాలా రాష్ట్రాల్లో పాఠశాల విద్య నిర్మాణం, దాని పరిధి ఏమీ మారలేదు. అయితే ఉన్నత విద్య విషయంలో కేంద్ర సంస్థలైన ఎన్సిఈఆర్టి, ఎన్సిటిఈ, యుజిసి, ఏఐసిటీఈలు వేగంగా తీసుకుంటున్న చర్యల వల్ల దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు ఊపందుకొన్నాయి. ఏది ఏమైనా, అన్ని రాష్ట్రాలు ఈ పాలసీని చిత్తశుద్ధితో అమలు చేస్తేనే రాబోయే తరాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి, ఈ గ్లోబల్ నాలెడ్జ్ సొసైటీలో ప్రయోజనాన్ని పొందుతాయి.
(సామాజిక శాస్త్ర సహాయ ఆచార్యులు, నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్.)