‘‘నా పేరు ఖలిల్. నాకు 27 ఏళ్ళు. నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎన్నో కలలూ, ఆశయాలూ, లక్ష్యాలూ ఉన్నాయి. ప్రేమించడం ఎలానో నాకు తెలుసు. ఎలా సంతోషంగా ఉండాలో తెలుసు. కష్టపడి పనిచేసి అనుకున్నది ఎలా సాధించాలో నాకు తెలుసు.
నేను అమరుడనయితే, కేవలం ఒక సంఖ్యగా మిగలాలని నాకు లేదు.
నా పేరు పలకండి. నా కథ వినండి. నా కోసం ప్రార్థించండి.
నేనొక సంఖ్యను కాదు. నేనొక సంపూర్ణ భూగోళాన్ని.’’ ` ఖలిల్ అబు యహ్య, గాజా
ఖలీల్ అబు యహ్య, నవంబర్ 17, 1996లో పుట్టాడు. అక్టోబర్ 30, 2023న, ఇజ్రాయిల్ గాజాపై చేసిన బాంబుల దాడుల్లో ఖలీల్, ఖలీల్ భార్య, వారి ఇద్దరు పిల్లలూ చనిపోయారు. ఖలీల్ అద్భుతమైన రచయిత, సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు. చదువుకోవడం, తన విద్యార్థులకు చదువు చెప్పడం ఎంతో ఇష్టంగా చేసేవాడు.
అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం అమెరికాలో మా అమ్మాయి చదువుతున్న స్కూల్ సూపరింటెండెంట్ నుంచి పేరెంట్స్‌కు ఒక ఈ`మెయిల్ వచ్చింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో, యుద్ధం గురించి తమ పిల్లలతో చర్చించడానికి సహాయపడే డాక్యుమెంటును పేరెంట్స్‌కు పంపుతూ, యూదులకూ, ఇజ్రాయిల్‌లో ఉన్న వారి కుటుంబాలకూ మా కమ్యూనిటీ తరపున సంఫీుభావం తెలిపింది.
అప్పటికి మూడు రోజుల క్రితమే హమాస్, గాజా నుంచి ఇజ్రాయిల్ మీద మెరుపు దాడులు చేసి 1400 మంది యూదులను చంపి, 235 మందిని బందీలుగా పట్టుకెళ్ళిపోయింది. ఇంతవరకూ కొన్ని లక్షలమంది పాలస్తీనియన్లను హత్య చేసిన ఇజ్రాయిల్‌కు, ఇంతమంది పౌరులను పోగొట్టుకోవడం దిగ్భ్రాంతి కలిగించింది. ఇజ్రాయిల్ వెంటనే కొన్ని వందల బాంబులతో గాజాపై దాడి చేసింది. ఆ మూడు రోజుల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లను చంపింది. ఆ దాడులు ఎంత విచక్షణారహితంగా, క్రూరంగా జరుగుతున్నాయంటే, పిల్లలు తమ శరీరాల మీద తమ పేర్లు రాసుకుంటున్నారు. బాంబు దాడుల్లో తమ శరీరాలు ఛిద్రమైతే ఏ ఒక్క భాగం వల్లనైనా తమ కుటుంబాలు, స్నేహితులూ తమను గుర్తుపడతారని వాళ్ళ ఆశ.
ఇజ్రాయిల్ దాడులను ఇప్పుడిప్పుడే ఉపసంహరించుకోదనీ, ఎన్నో వేలమంది పాలస్తీనియన్లు చనిపోతారని తెలిసి పోతున్నా, ఈ`మెయిల్‌లో ‘పాలస్తీనా’ అన్న పదం ఒక్కసారి కూడా దొర్లకుండా జాగ్రత్తపడిరది స్కూల్ సూపరింటెండెంట్. ఈ ఇరవై రోజుల్లో, హమాస్ స్వాధీనంలో ఉన్న బందీలను విడిపించుకోవాలనీ, హమాస్‌ను నిర్వీర్యం చేయాలన్న నెపంతోనూ యుద్ధానికి బయల్దేరిన ఇజ్రాయిల్ ఎనిమిది వేలకు పైగా గాజాలోని సామాన్య పాలస్తీనియన్లను హత్య చేసింది. అయినా, మా కమ్యూనిటీలోని పాలస్తీనియన్ల కోసం సంఫీుభావ ప్రకటనేదీ వెలువడలేదు.
అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఈ వైఖరి సర్వసాధారణం. కానీ మేమున్నది ప్రగతిశీల భావాలు గల ప్రాంతం. స్కూల్ సూపరింటెండెంట్ ట్రెయిల్ బ్లేజర్ అని మేమంతా గర్వంగా చెప్పుకునే ఆఫ్రికన్ అమెరికన్ మహిళ. టీచర్లు కార్ల్ మార్క్స్ గురించీ, కార్నెల్ వెస్ట్ గురించీ పిల్లలతో ఏ సంకోచాలూ, అభ్యంతరాలూ లేకుండా స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఉంది. అలాంటి స్కూల్ సూపరింటెండెంట్ నుంచి మొదలుకొని అగ్రదేశాల నాయకుల దాకా, గాజా అంటే హమాస్ అనే తీవ్రవాద సంస్థనే కనిపిస్తోంది కానీ సాధారణ పాలస్తీనా ప్రజలు కనిపించటం లేదు. కనిపించటం లేదా, లేక చూడదలచుకోలేదా?
స్కూలు స్థాయి అధికారులూ, సామాన్య ప్రజలూ పాలస్తీనా ప్రజలను గుర్తించకపోవడం వెనకాల శక్తివంతమైన జియోనిస్ట్ నియంత్రిత ప్రచార యంత్రం పనితనం ఉంది. ఇజ్రాయిల్ దాడులపై నిరసన వ్యక్తం చేసిన వారు ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వారిపై దాడులు కూడా జరిగాయి. ఇజ్రాయిల్ ఆక్రమణను వ్యతిరేకించడాన్ని యూదు వ్యతిరేకతగా ఎప్పట్నుంచో మలచబడిరది. అక్టోబర్ ఏడవ తేదీ నుంచి పాలస్తీనియన్లపై జరుగుతున్న దాడులను గత డెబ్భై ఏళ్ళుగా వారిపై జరుగుతున్న దురాక్రమణ, వివక్ష, జాతి ప్రక్షాళనలో భాగంగా చూసినవాళ్ళను ఆ యంత్రాంగం యూదు వ్యతిరేకులని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర సాధారణమైంది కాదు. అదొక శక్తివంతమైన ఆయుధం. ప్రశ్నించగలిగే జనాన్ని, వలసవాద`జియోనిస్ట్ వ్యతిరేకత అంటే యూదు వ్యతిరేకత కాదని చెప్పలేని నిశ్శబ్దంలోకి నెట్టేస్తుంది. తరతరాలుగా వివక్షనూ, అణచివేతనూ, చివరికి సామూహిక హత్యాకాండనూ ఎదుర్కొన్న యూదు జాతికి చెందిన ఒక సమూహం, ఒక్క శతాబ్దం లోపల మరో జాతి నిర్మూలనకు పూనుకోవడం ఎంత విచిత్రం?! విచిత్రమేనా??
అగ్రరాజ్యాలు పాలస్తీనా ప్రజల్ని పట్టించుకోకపోవడానికి వెనక భౌగోళిక రాజనీతి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికకు బీజం 1799లో నెపోలియన్ వేశాడు. అరబ్బు దేశాలను ముట్టడిస్తున్నప్పుడు పాలస్తీనియన్ల భూభాగాన్ని ఫ్రెంచ్ దేశ రక్షణ కింద యూదులకు మాతృభూమిగా ప్రతిపాదిస్తూ ఒక ప్రకటన జారీ చేశాడు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఫ్రెంచ్ ఉనికిని స్థాపించాలని అనుకున్నాడు. అప్పటికి నెరవేరని నెపోలియన్ కలను 19వ శతాబ్దంలో బ్రిటిషర్లు నిజం చేశారు.
1890ల్లో జియోనిజం అనే సరికొత్త వాదన రూపుదిద్దుకుంది. కొన్ని వందల ఏళ్ళుగా ప్రపంచ నలుమూలల్లో ఉన్న యూదుల సంస్కృతీ సాంప్రదాయాలను మిళితం చేసి పుట్టింది జియోనిజం. ఈ వాదనలోని మొట్టమొదటి ముఖ్య ప్రణాళిక, రెండువేల ఏళ్ళ క్రితం రోమన్లు, క్రిస్టియన్లు, అరబ్బులు కలిసి తమను తరిమేసిన పాలస్తీనా భూమిని ` ఇప్పుడు అక్కడ నివసిస్తున్న లక్షల మంది పాలస్తీనియన్లను వెళ్ళగొట్టయినా సరే ` ఆక్రమించుకోవడం. యూదు సమస్యకూ, మధ్యప్రాచ్యంలో బలపడుతున్న అరబ్బు సమస్యకూ ఒకే పరిష్కారంగా, ఇతర అగ్రరాజ్య నాయకులూ ఇజ్రాయిల్ స్థాపనకు సహాయ సహకారాలు అందించారు. ఆ సహాయ సహకారాలు ఇప్పుడు మిలియన్ల కొద్దీ డబ్బు, ఆయుధాల రూపేణా అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు అందుతున్నాయి.
1917 నుంచి ప్రపంచం నలుమూలల్లో ఉన్న జియోనిస్టులు పాలస్తీనాకు తరలి రావడం మొదలైంది. హిట్లర్ కాలంలో యూరప్ దేశాల నుంచి పారిపోయి వచ్చిన యూదులతో తమ భూమిని పంచుకోవడానికి పాలస్తీనియన్లు ఒప్పుకున్నారు కానీ, తమ ఇళ్ళనూ, పొలాలనూ, ప్రార్ధనా మందిరాలనూ ఆక్రమిస్తున్న జియోనిస్ట్ వలసవాద సెటిల్‌మెంట్లను అంగీకరించలేదు. జియోనిస్ట్ సెటిల్‌మెంట్ల కోసం యూదులు బ్రిటిష్ ఆధ్వర్యంలో పాలస్తీనాలో భూములు కొన్నారు. ఈ వ్యవహారంలో ఎంతోమంది పాలస్తీనియన్లు తమ భూముల నుంచీ, ఇళ్ళనుంచీ నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టబడ్డారు.
బ్రిటిషర్లు, పాలస్తీనా భూమి పంపకం బాధ్యతను 1947లో కొత్తగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి 55% పాలస్తీనా భూభాగాన్ని అప్పటికి ఆ ప్రాంతంలో ఉన్న 5.5% యూదులకు ఇచ్చింది. జెరూసలెంను తన ఆధ్వర్యంలో ఉంచుకొని, మిగతా భూమిని పాలస్తీనియన్లకు పంచింది. ఆ అన్యాయపు పంపకాన్ని పాలస్తీనియన్లు ఒప్పుకోలేదు. జియోనిస్టులు భూమి పంపకాన్ని ఒప్పుకున్నా, బార్డర్లను ఒప్పుకోలేదు. పాలస్తీనాకు ఇచ్చిన భూమిపై దాడులు చేస్తూ క్రమంగా ఒక్కొక్క పట్టణాన్నీ ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. 1948లో బ్రిటిష్ మ్యాండేట్ గడువు తీరిపోయిన రోజున, జియోనిస్ట్ ఏజెన్సీ అధిపతి అయిన బెన్`గూరియన్ ఇజ్రాయిల్ స్టేట్ ఆవిర్భావాన్ని ప్రకటించాడు. అలా ఒక్క రాత్రిలో పాలస్తీనా పౌరసత్వం లేని ప్రాంతమైపోయింది. 1948లో జరిగిన యుద్ధంలో ఏడు లక్షల మంది పాలస్తీనియన్లు తమ మాతృభూమి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. 13 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంవత్సరాన్ని అల్`నక్బా (ఘోర విపత్తు) అని పాలస్తీనియన్లు పరిగణిస్తారు.
ఆ యుద్ధం తర్వాత పాలస్తీనియన్లకు వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతాలు వెళ్ళగా, మిగతా 78% భూభాగం ఇజ్రాయిల్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దిగజారింది. వెస్ట్ బ్యాంక్, గాజాలు ఇజ్రాయిల్ దురాక్రమణకు గురయ్యాయి. గాజా, ప్రపంచంలోని అతి పెద్ద ఓపెన్ ఎయిర్ చెరసాల అని అంటారు. ఇజ్రాయిల్ పాలస్తీనియన్ల ప్రతి కదలికలను ఉక్కు పిడికిలితో నియంత్రిస్తుంది. కొన్ని వేలమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ జైళ్ళలో మగ్గుతున్నారు. పాలస్తీనా పిల్లలు ఎప్పుడు చదువుకోవచ్చో, ఎప్పుడు పరీక్షలకు కూర్చోవచ్చో, వీథిలో ఆడుకుంటున్న పిల్లలు ఇళ్ళకు వెళ్ళగలుగుతారో లేదో, పనిలోకి వెళ్ళిన తల్లిదండ్రులు రాత్రికి ఇంటికి చేరుతారో లేదో అంతా ఇజ్రాయిల్ సైనికుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. పాలస్తీనియన్ల భూమిని ఆక్రమించడమే కాకుండా వారి సంస్కృతిని కూడా తుడిచెయ్యడానికి ప్రయత్నించింది ఇజ్రాయిల్. 1890ల్లో జియోనిస్ట్ ప్రణాళిక రూపొందుతున్నప్పటి నుంచి ఇప్పటిదాకా జియోనిస్టులు పాలస్తీనియన్లను జంతువులుగా, టెర్రరిస్టులుగా పరిగణిస్తారు.
పాలస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పిఎల్‌ఓ) అనే సంస్థ 1960ల చివర అరబ్`యూదు సహజీవనం అనే ఆలోచనతో ఆవిర్భవించింది. ఆ భూభాగంలో ఉమ్మడి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పవచ్చని ప్రతిపాదించింది. తమ పోరాటం, పాలస్తీనా ప్రజలపై జియోనిస్ట్ ఇజ్రాయిల్ చేస్తోన్న అణచివేతను ఎదుర్కోవడానికే గానీ యూదుల మీద కాదని ప్రకటించింది. నది నుంచి సముద్రం దాకా పాలస్తీనియన్లను స్వతంత్రులని నినదించింది. కానీ 1970ల చివర్లకు ఆ ప్రతిపాదనలు నిర్వీర్యమైపోయాయి. ఉమ్మడి ప్రజాస్వామ్యం బదులు టూ స్టేట్ పరిష్కారాన్ని ఒప్పుకోవలసి వచ్చింది.
పిఎల్‌ఓ తగ్గుముఖం పట్టాక హమాస్ వెలుగులోకి వచ్చింది. ఇదొక ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ. దీని స్థాపన వెనుక ఇజ్రాయిల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు హస్తం ఉందని కూడా అంటారు. ప్రస్తుతం గాజాలో హమాస్ అధికారంలో ఉంటే, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్టీనియన్ అథారిటీ అధికారంలో ఉంది. ఆ అధికారాలన్నీ నామమాత్రపు అధికారాలే. ఇజ్రాయిల్ సైనికులు, మెర్సనరీలూ ఎప్పుడు పడితే అప్పుడు నిర్దాక్షిణ్యంగా పాలస్తీనియన్లను పీడిస్తుంటారు.
పకడ్బందీ నిఘా యంత్రాంగం కన్నుగప్పి అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ చేసిన దాడిని సాకుగా తీసుకుని గాజా మీద బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయిల్. ఇది రెండవ నక్బా అనీ, పాలస్తీనియన్లను పూర్తిగా మట్టుపెట్టేదాకా ఆగేది లేదని ఇజ్రాయిల్ ప్రభుత్వాధికారులు ఏ దాపరికం లేకుండా ప్రకటిస్తున్నారు. హమాస్ చేసిన దాడిలో పాలుపంచుకోని వెస్ట్ బ్యాంక్ మీద కూడా దాడి చేస్తోంది. ఇప్పటికి వెస్ట్ బ్యాంక్‌లోని రెండు పల్లెటూళ్ళను ఆక్రమించి, ఊరి ప్రజలను దోచుకుని వాళ్ళ ఇళ్ళను తగులబెట్టేశారు ఇజ్రాయిల్ సైనికులూ, ప్రైవేట్ మెర్సనరీలు.
ఇజ్రాయిల్ చేస్తున్నది పాలస్తీనియన్ల సామూహిక హత్యాకాండ. ఇది రెండవ హోలోకాస్ట్. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. అయినా ఐక్యరాజ్య సమితిలో జోర్డన్ ప్రవేశపెట్టిన యుద్ధవిరమణ తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయిల్‌తో సహా 14 దేశాలు అంగీకరించలేదు. దేశ అధికారుల వైఖరి ఇలా ఉంటే, ప్రపంచం నలుమూలల్లో లక్షలమంది ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు జరుపుతున్నారు. తమ పేరుమీద పాలస్తీనియన్లను అణచివేయడాన్ని ఎంతోమంది యూదులు కూడా వ్యతిరేకిస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా పాలస్తీనా పరిస్థితిని చర్చించుకుంటున్నారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతోన్న సామూహిక హత్యాకాండనూ, అందుకు చేయూతనిస్తున్న ఇతర దేశ నాయకులనూ పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. పాలస్తీనా ప్రజల దిక్కారాన్నీ, వారికి ప్రపంచ ప్రజలు తెలుపుతోన్న సంఫీుభావాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈ పరిస్థితిలో మనమేం చేస్తున్నామన్నదీ గుర్తు పెట్టుకుంటారు. (కొలిమి వెబ్ మ్యాగజైన్ నుండి…)