ఆత్రేయపురంలో పూతరేకులు చుట్టే సున్నితమైన కళ – అమృత కోసూరు

ఆత్రేయపురం పూతరేకులు గతేడాది జిఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌ ` భౌగోళిక సూచిక)ను పొందాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పలుచని బియ్యపు రేకుతో చుట్టిన ఈ మిఠాయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తీపి గురుతు.

పెళుసుగా, పారదర్శకంగా, కాగితంలా కనిపించే పలుచని బియ్యపు రేకును తయారుచేయడానికి ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ పనిని ఎక్కువగా మహిళలే చేస్తారు. కానీ వీటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం అంత తీపిగా ఏమీ ఉండదని ఈ మహిళలు అంటున్నారు.
చేతి మూడువేళ్ళు, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే తడి బట్ట, తేలికపాటి స్పర్శ. ‘‘నేను జాగ్రత్తగా ఉండాలి’’.
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలో స్థానికంగా తయారుచేసే తీపి వంటకమైన పూతరేకుల తయారీ గురించి ఇక్కడ విజయ వివరించారు. జారుగా కలిపిన బియ్యపు పిండితో చేసిన పలుచని రేకులలో బెల్లం పొడి, ముక్కలుగా చేసిన డ్రైఫ్రూట్స్‌, నెయ్యితో నింపి చక్కగా మడిచి వీటిని తయారుచేస్తారు. ఇవి ఎక్కువగా పండుగల సమయంలో అమ్ముడవుతాయి. ఈ తీపిని తయారు చేయటంలో నైపుణ్యం కలిగిన విజయ ప్రతిరోజూ దాదాపు 200 రేకులను తయారుచేస్తారు. వాటిని స్థానికంగా ఉండే మిఠాయి దుకాణాల వారు తీసుకుంటారు. ‘‘నేను పూతరేకులు చేసేటప్పుడు పూర్తిగా ఆ పనిమీదే ఏకాగ్రత పెట్టాలి. నిజంగా ఎవరితోనూ మాట్లాడటానికి ఉండదు’’ అని ఆమె PARI కి చెప్పారు.
‘‘పూతరేకులు లేకుండా నా ఇంట్లో జరిగే ఏ పండుగైనా, ఆచారమైనా, ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పూర్తికాదు’’, అంటారు జి.రామకృష్ణ. ఆత్రేయపురం నివాసి అయిన ఈయన ఆత్రేయపురంలోని కొన్ని దుకాణాలకు ప్యాకింగ్‌ సామగ్రిని, పెట్టెలను సరఫరా చేస్తుంటారు. ‘‘నాకు ఇదంటే చాలా ఇష్టం. ఇది చాలా ఆశ్చర్యకరమైన మిఠాయిలా తోస్తుంది! చూడగానే ఇదేదో కాగితంలాగా కనిపిస్తుంది. కాగితాన్ని తింటున్నామా అనుకుంటాం. కానీ ఒక్కసారి దాన్ని ఇలా కొరకగానే అది మీ నోటిలో కరిగిపోతుంది. ప్రపంచంలో ఇలాంటి మిఠాయి మరేదైనా ఉంటుందని నేననుకోను’’ అని సగర్వంగా ప్రకటించారాయన.
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పండే బియ్యం వలన సున్నితంగా తయారయ్యే ఈ మిఠాయికి ఈ రుచి వస్తుంది. ‘‘ఈ బియ్యం జిగటగా ఉంటాయి. కాబట్టి రేకుల తయారీకి తప్ప ఎవరూ దీనిని ఉపయోగించరు’’ అని రామచంద్రపురం డివిజన్‌లోని ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఈ మిఠాయిని తయారుచేసే కాయల విజయ, కోట సత్యవతి చెప్పారు. ఈ ఆత్రేయపురంకు చెందిన పూతరేకులే 2023లో జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌ (జిఐ`భౌగోళిక సూచిక)ను అందుకున్నది. విశాఖపట్నంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘానికి జూన్‌ 14, 2023న జిఐ లభించింది.
రాష్ట్రంలో జిఐ వచ్చిన ఆహార పదార్ధాలలో పూతరేకు మూడవది (మిగిలినవి తిరుపతి లడ్డూ, బందరు లడ్డూ). ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలు, ఆహార పదార్ధాలు, వ్యవసాయం వంటి వివిధ కేటగిరీలకు చెందిన 21 ఉత్పత్తుతలకు జిఐ ఉంది. గత సంవత్సరం పూతరేకుతో పాటు గోవాకు చెందిన బెబింకా మిఠాయి కూడా జిఐ ట్యాగ్‌ను అందుకుంది. గతంలో మురేనాకు చెందిన గజక్‌, ముజఫర్‌నగర్‌కు చెందిన గూర్‌లకు కూడా జిఐ లభించింది.
పూతరేకు తయారీలో పేరుపొందిన విజయ 2019 నుండి వీటిని తయారుచేస్తున్నారు. దీన్ని పూర్తి ఏకాగ్రతతో చేయాలని ఆమె చెప్పారు. ‘‘ఇతర మిఠాయిలను తయారు చేయడం సులభం. కాబట్టి వాటిని చేసేటపుడు నేను ఎవరితోనైనా స్వేచ్ఛగా మాట్లాడగలను’’ అని తన కుటుంబ సభ్యుల కోసం సున్నుండలు, కోవా వంటి మిఠాయిలను తయారుచేసే విజయ చెప్పారు. పొట్టుమినుములను వేయించి, మెత్తని పిండిగా విసిరి, అందులో పంచదార లేదా బెల్లం కలిపి, నేతిని పోసి లడ్డూలుగా చుట్టి సున్నుండలను చేస్తారు.
‘‘నేను నా కుటుంబానికీ, నాకూ సహాయంగా ఉండటానికి కొంత డబ్బు సంపాదించాలనుకున్నాను. నాకు ఇది తప్ప వేరే పనేదీ తెలియదు కాబట్టి ఇది చేస్తున్నాను’’ అని మిఠాయి దుకాణాలకు తాను రేకులను అమ్మడాన్ని ఎలా మొదలుపెట్టారో వివరించారు విజయ. ఆమె అమ్మకం కోసం వేరే ఏ ఏమిఠాయిలనూ తయారుచేయరు.
ప్రతి నెల మొదట్లో ఆమె స్థానిక మార్కెట్‌లో 50 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. పూతరేకులు తయారు చేసేందుకు మాత్రమే ఉపయోగించే జయా బియ్యం ధర కిలో రూ.35. ‘‘ఈ బియ్యాన్ని వండితే అన్నం చాలా జిగటగా ఉంటుంది, కాబట్టి రేకుల తయారీకి తప్ప దీన్ని ఎవరూ ఉపయోగించరు’’ అని విజయ వివరించారు.
మిఠాయి తయారీ కోసం రోజూ ఉదయం ఏడు గంటలకు ఆమె దినచర్య మొదలవుతుంది. అరకిలో జయా బియ్యం తీసుకొని వాటిని కడిగి శుభ్రం చేసి, కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి ఉంచటంతో రేకులు తయారుచేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తన కుమారులు బడికి వెళ్ళిన తర్వాత విజయ ఆ నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా, చిక్కటి పిండిగా రుబ్బుతారు. ఆ రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంటి బయట ఉన్న తన చిన్న వంటపాకలో చిన్న చెక్క ఎత్తుపీటపై ఉంచుతారు.
ఉదయం తొమ్మిది గంటలకల్లా తన వంటపాకలోని ఒక మూలన ఒక పక్కన రంధ్రం ఉండి, బోర్లించిన ప్రత్యేకమైన కుండను ఉపయోగించి సున్నితమైన, సన్నని ఉల్లిపొరలాంటి రేకులను తయారు చేయడం ప్రారంభిస్తారు విజయ. ‘‘కుండను ఇక్కడ దొరికే మట్టితో ఈ ప్రాంతంలో మాత్రమే తయారుచేస్తారు. మరే ఇతర కుండను కానీ, పాత్రను కానీ ఇందుకు ఉపయోగించలేం. రేకుకు ఆ బోర్లించినట్లుగా ఉండే ఆకారం ఈ కుండ వల్లనే ఏర్పడుతుంది’’ అని ఆమె వివరించారు.
ఎండిన కొబ్బరి ఆకులను అంటించి కుండను వేడి చేస్తారు. ‘‘కొబ్బరి ఆకులు (ఇతర ఆకుల మాదిరిగా కాకుండా) త్వరగా అంటుకొని స్థిరంగా అధిక వేడిమిని ఉత్పత్తి చేస్తాయి. సరైన పాత్ర, వేడిమి లేకపోతే రేకులు ఏర్పడవు’’ అంటారామె.
‘‘ఈ కుండ ధర రూ.300`400 ఉంటుంది. నేను ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కుండను మార్చేస్తాను. అది అంతకంటే ఎక్కువ కాలం పనిచేయదు’’ అని విజయ చెప్పారు. విజయ ప్రతి రెండు వారాలకు ఒకసారి స్థానిక మార్కెట్లలో కొబ్బరి మట్టలను కొనుగోలు చేస్తారు. ఒక్కో కట్ట ధర రూ.20`30 వరకూ ఉండే 5`6 కట్టలను ఆమె కొంటారు.
బోర్లించిన కుండ వేడెక్కుతుండగా ఆమె పొడిగా ఉన్న ఒక శుభ్రమైన దీర్ఘచతురస్రాకారపు గుడ్డ ముక్కను తీసుకొని దాన్ని నీటిలో తడిపారు. ఇందుకోసం ఆమె ఒక నూలు గుడ్డ ముక్కను (ఆమె చీర లేదా ఏదైనా ఇతర దుస్తుల నుంచి తీసుకున్నది) ఉతికి ఉపయోగిస్తారు. కొంత పిండిని ఒక పెద్ద పళ్ళెంలో పోసి, కొంచెం పలుచగా చేసి, గుడ్డను ఆ పిండిలో ముంచుతారు.
తర్వాత గుడ్డను మెల్లగా బయటకు తీసి, పలుచని పొరలాగా పిండి అంటుకున్న గుడ్డను బోర్లించిన కుండపైన పరిచి లాగేశారు. వెంటనే పొగలు విడుస్తూ ఒక సన్నని బూడిద`తెలుపు రంగు పొర కుండపై ఏర్పడిరది. ఆ పొర పూర్తిగా ఉడికేంత వరకు కొన్ని సెకన్లపాటు కుండను అంటుకునే ఉంది.
ఆ తర్వాతి దశ కోమలమైన స్పర్శ కోసం పిలుపు. చేతి మూడు వేళ్ళను మాత్రమే ఉపయోగించి, ఆమె కుండ పైనుండి రేకును వేరు చేస్తారు. ‘‘దాన్ని కుండమీద నుంచి తీయడం కష్టమైన భాగం. అది విరిగిపోతే ఇక పనికిరాదు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విజయ నేర్పుగా రేకును తీసి తన పక్కనే ఉన్న రేకుల కుప్పపై ఉంచారు. ఒక గంటలో తాను 90`100 రేకులు చేయగలదని ఆమె అంచనా. దాదాపు రెండు మూడు గంటల్లో ఆమె 150`200 వరకూ చేస్తారు. పండుగలు రాబోయే ముందు రోజుల్లో ఆర్డర్లు 500కి చేరుకుంటాయి, దాని ప్రకారం ఆమె పిండిని సిద్ధం చేసుకుంటారు.
ఆత్రేయపురంలో చాలామంది మహిళలు ఈ రేకులు తయారుచేస్తారు. కొంతమంది ఇళ్ళలోనూ మరికొంతమంది దుకాణాల్లో కూడా. వి.శ్యామల (54) ఆత్రేయపురం బస్టాప్‌ సమీపంలోని కెకె నేతి పూతరేకుల దుకాణంలో పని చేస్తున్నారు. ఆ దుకాణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నివసిస్తుండే ఆమె, గత 25`30 సంవత్సరాలుగా ఈ మిఠాయి తయారీ పనిలో ఉన్నారు. మొదట్లో శ్యామల కూడా విజయ లాగా ఇంట్లోనే రేకులు తయారు చేసేవారు. ‘‘నేను రోజుకు 100 రేకులు తయారు చేస్తే అందుకు రూ.25`30 వరకూ వచ్చేవి’’, అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె ప్రధానంగా పూతరేకు తయారీ చివరి దశలో పాల్గొంటారు. చక్కెర, బెల్లం, ఎండు ఫలాలు, ధారాళంగా నెయ్యి వేసి రేకును మడతపెడతారు. ‘‘నాకు మోకాళ్ళ నొప్పులు’’, అని చెప్పిన శ్యామల ఇంటి నుండి తన పని ప్రదేశానికి నడవడం కష్టంగా ఉంటుందన్నారు. దాంతో ఆమె కొడుకు ప్రతిరోజూ ఆమెను దుకాణం దగ్గర దింపుతాడు.
కెకె నేతి పూతరేకులు దుకాణం వెనుక ఉన్న ఒక చిన్న సందులోకి రాగానే ఆమె, ఒక ఎత్తైన రేకు ఎత్తుపీటను దగ్గరకు లాక్కొని, తన చీరను సరిచేసుకుని, ఎండ తనను పెద్దగా ఇబ్బంది పెట్టని చోట చూసుకుని కూర్చుంటారు. రోడ్డుకు అభిముఖంగా కూర్చొని ఉండే ఆమె, ఆ వైపుగా వెళ్ళే కొనుగోలుదారులకు పూతరేకును చుడుతూ కనిపిస్తుంటారు.
శ్యామల తన పక్కన ఉన్న రేకుల కుప్పలో నుండి ఒక రేకును మెల్లగా తీసుకొని, దానికి ధారాళంగా నెయ్యి పూశారు. ఆపైన దాని మీద బెల్లం పొడిని చల్లారు. ‘‘సాదా పూతరేకు కోసం వాడే పదార్ధాలు ఇంతే’’, అంటూ ఆమె దానిమీద మరో సగం రేకును ఉంచారు. అందులోని పదార్ధాలేవీ బయటకు రాకుండా చూసుకుంటూ దాన్ని సున్నితంగా మడతపెట్టారు. ఒక పూతరేకును చుట్టడానికి ఆమెకు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం పడుతోంది. వాటిని సాంప్రదాయకంగా పొడవైన దీర్ఘచతురస్రాకారంలో చుడతారు, అయితే సమోసాలాగా త్రిభుజాకారంలో కూడా వాటిని మడవవచ్చు. సమోసా ఆకారంలో చుట్టిన ప్రతి పూతరేకుకు శ్యామలకు రూ.3 అదనంగా లభిస్తాయి. ‘‘సమోసా ఆకారంలో చుట్టడం నాక్కూడా కష్టమే. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రేకు విరిగిపోతుంది’’ అంటారామె. ‘‘నా ఉద్దేశంలో సాదా పంచదార లేదా బెల్లంతో చేసినదే అసలైన పూతరేకు. ఇదే మా గ్రామంలో తరం తర్వాత తరానికి అందిన తయారీ విధానం. డ్రైఫ్రూట్స్‌ ముక్కలను చేర్చడం ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పు’’ అంటూ వివరించారు శ్యామల. శ్యామల దుకాణం యజమాని కాసాని నాగసత్యవతి (36)తో కలిసి, ఆదివారాలు తప్ప, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేస్తారు. ఆమె చేసే పనికి రోజుకు రూ.400 చెల్లిస్తారు. గత మూడేళ్ళుగా, చివరకు పూతరేకు జిఐ ట్యాగ్‌ వచ్చిన తర్వాత కూడా, ఈ చెల్లించే మొత్తంలో మార్పు లేదు. ఆత్రేయపురం పూతరేకుకు జిఐ ట్యాగ్‌ వచ్చిన తర్వాత కూడా విజయ, శ్యామల వంటి కార్మికులపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. జిఐ ట్యాగ్‌ ఇచ్చినప్పటి నుండి వారి రోజువారీ వేతనం పెరగలేదు, కానీ దుకాణాల యజమానులు, ఇతర పెద్ద వ్యాపారులు మాత్రం మంచి లాభాలను ఆర్జిస్తున్నట్లు వాళ్ళు చెప్పారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పూతరేకు ఎప్పటినుంచో ప్రసిద్ధి చెందిందని సత్య చెప్పారు. ‘‘కానీ ఇప్పుడే ఎక్కువమందికి దాని గురించి తెలిసింది. ఇంతకు ముందు ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారికి పూతరేకు అంటే ఏమిటో వివరించాల్సి వచ్చేది. ఇప్పుడు దీనికి పరిచయం అవసరం లేదు’’ అని అన్నారామె.
సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘం సభ్యులలో సత్య కూడా ఒకరు. ఈ సంఘం గత 10 సంవత్సరాలుగా పూతరేకుకు జిఐ ట్యాగ్‌ రావాలని కోరుతోంది. జూన్‌ 2023లో వారికి ఆ ట్యాగ్‌ను ప్రధానం చేసినప్పుడు ‘‘ఇది మొత్తం గ్రామం గర్వించదగిన క్షణం’’ అయింది.
తన దుకాణంతో సహా అన్ని దుకాణాలకు ఆర్డర్ల సంఖ్య పెరిగిందని సత్య చెప్పారు. ‘‘మాకు చాలావరకు పెద్దమొత్తంలో, 10 పెట్టెల నుండి 100 పెట్టెల వరకు ఆర్డర్లు వస్తాయి’’ అన్నారామె. ఒక్కో పెట్టెలో 10 పూతరేకులు ఉంటాయి.
‘‘ఢల్లీి, ముంబై, ఇంకా అనేక ఇతర ప్రాంతాల నుండి ప్రజలు మాకు ఆర్డర్‌ చేస్తారు. మా గ్రామంలో ఒక్కో పూతరేకు ధరను రూ.10`12గా నిర్ణయిస్తాం. బయటి ప్రాంతాలకు చెందిన పెద్ద దుకాణాల వాళ్ళు ఒక్కోదానికి రూ.30 కంటే ఎక్కువే వసూలు చేస్తారు’’ అని ఆమె వివరించారు. ‘‘జిఐ ట్యాగ్‌ వచ్చినప్పటికీ ధరలో పెద్దగా మార్పులేదు’’ అని సత్య చెప్పారు. ‘‘పదేళ్ళ క్రితం ఒక పూతరేకు రూ.7 అట్లా ఉండేది’’. ‘‘గత వారం దుబాయ్‌ నుండి ఒక అమ్మాయి నా దుకాణానికి వచ్చింది. పూతరేకులు ఎలా తయారుచేస్తారో నేనామెకు చూపెట్టాను. అది చూసి ఆమె అబ్బురపడిపోయింది. తన నోటిలో ఆ మిఠాయి అలా ఎలా కరిగిపోయిందో ఆమె నమ్మలేక పోయింది. పూతరేకు తయారీ ఒక కళ అన్నారామె. నిజాయితీగా చెప్పాలంటే, నేను దాని గురించి అలా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇది నిజం. ఏడాది పొడవునా రేకులు తయారుచేసి, వాటిని అమిత చక్కగా, ఖచ్చితంగా మడత పెట్టడంలో మమ్మల్ని మించినవారు లేరు’’ అన్నారామె.
ఈ కథనానికి రంగ్‌ దే నుంచి గ్రాంట్‌ మద్దతు ఉంది.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/atreyapurams-delicate-rice-paper-sweet-te/)
జనవరి 27, 2024 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.