పరదాల వెనుక…! – భండారు విజయ

ఫాతిమా! జరీనా ఆంటీ, నదియా దీదీ ‘దోనోం ఆయా, జల్దీ ఆజావ్‌ బేటీ’! బయట నుండి తల్లి పిలుపు రెండోసారి వినిపించింది. ‘దీదీ ఆప్‌ జల్దీ జావ్‌, మళ్ళీ అమ్మీ లోపలికొచ్చి నిన్ను బలవంతంగానైనా తీసుకొని వెళ్తుంది’ అక్కకు లిప్‌స్టిక్‌ సరిచేస్తూ అంది హసీనా.

వాళ్ళెందుకు వచ్చారు హసీనా, ఆఫీసు నుండి రాగానే ఈ హడావిడి ఏమిటి? అని కంగారుపడుతూ చెల్లెలు తనమీదకు వేసిన దుపట్టాను విసుగ్గా తీసి కింద పడేసింది.
నీకు పెళ్ళిచూపులు దీదీ, జరీనా ఆంటీ వాళ్ళ అబ్బాయి రసూల్‌ను షాదీ చేసుకోవడానికి నిన్ను అడగనీకి వచ్చారు అంది హసీనా. ‘యా అల్లా! నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలాంటి పనికి ఎలా ఒప్పుకుంటావు? నిన్నసలు నేను ఎలా అర్ధం చేసుకోవాలి హసీనా’ అంటూ కళ్ళల్లో నీళ్ళు జారుతుండగా కళ్ళను తుడుచుకుంటూ చెల్లెలివైపు దీనంగా చూసింది.
అమ్మీకి చెప్పే అవకాశం లేదు దీదీ! నేను కాలేజి నుండి రాగానే జరీనా ఆంటీ వాళ్ళు అక్కతో నిఖా పక్కా చేసుకోనీక వస్తున్నారు, దీదీకి ఆ సంగతి చెప్పకుండా ముస్తాబు చేసి తీసుకురా అని ఆర్డర్‌ వేసింది అని చెప్పింది హసీనా. అదే నాకు చెప్పవచ్చు కదా అని కిందకు విసిరేసిన దుపట్టాను తీసి తలమీద వేసుకుంది ఫాతిమా.
‘ఎక్కడ నువ్వు రావడం రావడమే ఫోనులో మాట్లాడుకుంటూ వచ్చావు. ఇప్పుడేగా ఫ్రెష్‌ అయి వచ్చింది. అసలందుకే ఖదీర్‌ విషయం అమ్మీకి చెప్పమని నీకెప్పుడో చెప్పాను. నువ్వే నా డిగ్రీ అయిపోయేదాకా చెప్పనని మొండికేశావు’ విసుగ్గా అంది హసీనా. ‘వాళ్ళు షాదీ చేసుకుంటామని అనగానే షాదీ అయిపోతుందా ఏంటీ? నువ్వేం బాధపడకు, అమ్మీకు తర్వాత చెప్పి ఒప్పిద్దాం. ముందిప్పుడు అమ్మీ పరువు పోకుండా కాపాడుదాం’ అక్కకు ధైర్యమిస్తున్నట్లుగా ఫాతిమా చేతులను గట్టిగా నొక్కి ఇక తప్పదు వెళ్ళు అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసింది.
ఫాతిమా తలవంచుకొని అడుగులో అడుగు వేస్తూ అతి భారంగా ఉన్న చెమ్కీల దుపట్టాను ముఖం మీదకు లాక్కుని హాల్లోకి వచ్చింది. సోఫాలపై కూర్చున్న ఇద్దరు స్త్రీలు ఫాతిమాను చూసి ఇదర్‌ ఆకే బైఠో ఫాతిమా అని తమ పక్కనున్న కుర్చీ చూపారు. ఫాతిమా నెమ్మదిగా వెళ్ళి వారిద్దరి మధ్యలో ఇరుక్కున్నట్లుగా కూర్చుంది. ఫాతిమా వేసుకొన్న దుపట్టాను సుతారంగా తొలగించి ‘ఫాతిమా నా కొడుకు రసూల్‌ను ఎప్పుడన్నా చూశావా’ అని అడిగింది జరీనా. ఫాతిమా ఒంచిన తలను ఎత్తి జరీనా వైపు చూస్తూ రసూల్‌ తెలుసు అన్నట్లు ఊ… అంది.
… … …
జరీనా రసూల్‌ కన్నతల్లి. ఆమెకు రసూల్‌తో పాటు నదియా, వహీదా, రుబీనా అనే ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళు తల్లికి దగ్గర్లోనే వేర్వేరు ఇళ్ళు తీసుకొని తమ పిల్లాపాపలతో ఉంటున్నారు. అంతేకాదు, తల్లి పెట్టిన బొటిక్‌లోనే పనిచేస్తూ ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక జరీనా భర్త వాహిద్‌ తనకొచ్చే అతి కొద్ది సంపాదనతో హైదరాబాద్‌లో సంసారాన్ని పోషించడం కష్టమని భావించాడు. తెలిసిన మిత్రుల ద్వారా బతుకు తెరువు వెతుక్కుంటూ దుబాయ్‌ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక షేక్‌ దగ్గర కారు డ్రైవర్‌గా పనిలో చేరి పాతికేళ్ళయింది. వెళ్ళిన ఆరేడేళ్ళలో భార్యాపిల్లల్ని చూడడానికి రెండుసార్లు హైదరాబాద్‌ వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రెండుసార్లు కూడా వాహిద్‌ అక్కడ సంపాదించి తెచ్చుకున్న సంపాదనతో మైనరులైన నదియా, వహీదాలకు ఉన్నంతలో బంధువుల అబ్బాయిలను చూసి నిఖా జరిపించి వెళ్ళాడు.
వాహిద్‌ వచ్చిన ప్రతిసారీ భార్య కడుపులో ఓ పిండాన్ని మాత్రం వేసి తిరిగి వెళ్ళిపోయేవాడు. అలా వెళ్ళినవాడు రుబీనా, రసూల్‌లకు పదిహేనేళ్ళ వయసు వచ్చేదాకా తిరిగి రాలేకపోయాడు. భర్తకోసం జరీనా, తండ్రిని కలవరిస్తూ పిల్లలు చాలాసార్లు అల్లాకు ప్రార్థనలు చేస్తూ గడిపేవారు. ఓ రోజు పిల్లలు గాఢనిద్రలో ఉండగా, నిద్రపట్టక ఆరుబయటకు వచ్చింది. పక్క ఇంట్లో ఉన్న మరిది, తోడికోడలి మాటల్లో తన భ్తం పేరు వస్తుండడంతో, తన చెవులను అటువైపు వేసింది. వినబడీ, వినబడనట్లుగా ఉన్న మాటల అర్థం గ్రహించిన జరీనా, భర్త తనకు చేస్తున్న అన్యాయం తలచుకుని కుమిలి, కుమిలి ఏడుస్తూ ఇంట్లోకి వచ్చింది. వారం రోజులు ఏడ్చినా, ఆమెకు పూర్తి ఆశ చావక వాహిద్‌కు ప్రతిరోజూ కాల్‌ చేస్తూనే ఉంది. వాహిద్‌ ఎప్పటిలానే ఫోన్‌ను రిసీవ్‌ చేసుకోవడం మానేశాడు. అతని స్వార్థం వెనుక ఉన్న కారణాలను ఊహించుకుంటున్న జరీనా తన బాధకు పిల్లలకు కనబడకుండా జాగ్రత్తపడేది. ఏ మగాడైనా, భార్య పక్కన లేకపోతే, కొత్త రుచులు మరుగుతాడని తన తండ్రికి ఇతర స్త్రీలతో ఉన్న సంబంధాల గురించి తల్లి చెప్పినప్పుడు, తను నిఖా చేసుకుంటే మాత్రం తను జీవితంలో ఎప్పుడూ అతనికి దూరంగా ఉండవద్దని నిర్ణయించుకుంది. కానీ, ఇప్పుడు తన జీవితంలో కూడా అదే రిపీట్‌ అవడానికి గల కారణాన్ని నెమరు వేసుకుంది. తన తండ్రి కూడా తన అమ్మీను ఇలాగే నిర్దాక్షిణ్యంగా వదిలేసి, మరో స్త్రీని నిఖా చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమెను కూడా వదిలేసి మరో స్త్రీని ఇంకో నిఖా, అలా మరొకటి కూడా చేసుకున్నాడని తెలిసింది. ఇస్లాం మతంలో పుట్టిన చాలామంది స్త్రీల దుస్థితి ఇది. ఈ తలాక్‌ల వలన స్త్రీల మనోవేదనలు అనేకం. అవి ఎవరికీ పట్టవు. ఆడవాళ్ళ దుస్థితి అన్ని మతాలలోనూ ఇంతేనేమో?
జరీనా మదిలో తన స్నేహితురాలు వందన మెదిలింది. తన తల్లి తనకు పధ్నాలుగేళ్ళకే నిఖా చేయడంతో ఇరవై ఏళ్ళు నిండకుండానే ముగ్గురు పిల్లల తల్లయింది. వందన మాత్రం తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే పెళ్ళి చేసుకుంది. అయినా ఆమె బతుకు కూడా తనలాగే అయిపోయింది కదా! ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతను వేరే స్త్రీలతో రిలేషన్‌ పెట్టుకొని, విడాకులు కూడా ఇవ్వకుండా పారిపోయాడు. ఇప్పుడు తను పిల్లలతో నానా అవస్థలు పడుతోంది. పోయిన ఆదివారమే తన దగ్గరికి వచ్చి అతని మోసం గురించి చెప్పింది. అప్పుడప్పుడు తనే ఆమెకు ఆర్థిక సాయం చేస్తోంది. కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పోషించుకుంటోంది.
అంతెందుకు? తన బొటీక్‌లో కట్‌పీస్‌ వర్క్‌ చేసే సుజాత, నిర్మల, సుందరమ్మల జీవితాలు కూడా వాళ్ళ భర్తల స్వార్ధ సంకుచితాలకు బలైపోయి, తమ పిల్లల్ని పెంచుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నారు.
ఈ సమాజంలో ఆడవాళ్ళు ఎప్పుడూ మోసగించబడాల్సిందేనా? ఏ మతంలోనైనా పురుషుడు భార్యను వదిలేసి మరో స్త్రీని అంత స్వేచ్ఛగా ఎలా పెళ్ళి చేసుకోగలుగుతున్నాడు? ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా జరీనా మనసు కకావికలమైపోతుంది. వాహిద్‌ చేస్తున్న పనిలో ఎంత న్యాయం ఉందో? ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాదు. తన బాధను దిగమింగుకుని, తనకు రాబోయే కష్టాన్ని తలచుకుని తనలో తానే కుమిలిపోతూ జీవించింది. ఆ తర్వాత సంవత్సరం గడిచేసరికి, జరీనాకు వాహిద్‌ నుండి నెల నెలా వచ్చే డబ్బులు కాస్తా ఆగిపోయాయి. అయినా చలించకుండా, ధైర్యం కూడగట్టుకుని పిల్లల్ని పోషించుకుంది. భర్త ఉండి కూడా ఒంటరిగా నానా కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. అలాంటి సమయంలోనే వాహిద్‌ దుబాయ్‌ నుండి చివరిసారిగా ఇండియా వచ్చాడు. రాగానే కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గర చేర్చి తాను అనుకోని పరిస్థితిలో దుబాయ్‌ సేటు కూతుర్ని నిఖా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి, తన నిఖా ఎంత గొప్పగా జరిగిందో చెబుతున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ మిన్నకుండిపోయారు.
అందరి మనసుల్లో ఉన్న అనుమానాన్ని నిజం చేస్తూ అతను పేల్చిన పెద్ద బాంబు శబ్దానికి జరీనా గుండె పగిలి ఏడ్చి గొడవ చేసినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోకపోగా, వాహిద్‌ రెండవ నిఖా చేసుకోవడంలో న్యాయం ఉందని సమర్ధించారు. తల్లికి పట్టిన దుస్థితిని చూస్తూ ఆమెను అతుక్కొనిపోయి రసూల్‌ ఏడుపు లంకించుకున్నాడు. అంతేకాదు, తను మరోసారి ఇండియా తిరిగి రావడం కుదరదన్న విషయాన్ని వాహిద్‌ చెప్పడంతో తట్టుకోలేని జరీనా స్పృహతప్పి పడిపోతుంది.
తప్పని పరిస్థితుల్లో, ఇద్దరి తరపు కుటుంబ సభ్యుల కోరిక మేరకు మూడో కూతురు రుబీనాకు కూడా పెండ్లి చేస్తానని వాహిద్‌ చెప్పడంతో అందరూ కొంత చల్లబడ్డారు. జరీనా పేరుమీద ఒక ఇల్లు కొని, వారిని అక్కడ ఉండమని చెప్పడంతో జరీనా కూడా ఇక చేసేదేమీ లేదని గ్రహించి మౌనంగా ఉండిపోయింది. జరీనాకు తలాక్‌ ఇస్తున్నందుకు గాను వాహిద్‌ ఆమెకు భరణంగా కొంత డబ్బును ముట్టచెప్పడంతో ఆడపిల్లలు తండ్రికి ఎదురు చెప్పలేకపోయారు.
రసూల్‌ స్థిరపడేంతవరకు అతని చదువు విషయంలో సాయం చేస్తానని మాట ఇవ్వడంతో వాహిద్‌ను ఎవ్వరూ వ్యతిరేకించలేకపోయారు. ఇండియాను వదిలి దుబాయ్‌కు వెళ్తూ, వాహిద్‌ తన దగ్గర మిగిలి ఉన్న డబ్బులన్నీ జరీనా చేతిలో పెట్టి వెనక్కు తిరక్కుండా దేశంతోను, కుటుంబంతోనూ బంధాలను శాశ్వతంగా తెంపుకొని వెళ్ళిపోయాడు. రసూల్‌ అప్పుడు పదేళ్ళ బాలుడు. అతనికి ఊహ తెలిశాక తండ్రిని చూడడం అదే మొదటిసారి, చివరిసారి కూడా కావడం దురదృష్టకరం.
అంత చిన్న వయసులోనే తండ్రి తమపట్ల చేసిన అన్యాయానికి రసూల్‌ కోపంతో రగిలిపోయాడు. తండ్రి దగ్గరకు తీసుకోబోతే అతనికి చిక్కకుండా తప్పించుకొని అక్కడినుండి వెళ్ళిపోయాడు. పాతికేళ్ళు వచ్చినా, తండ్రిపై పెంచుకున్న కోపం ఇప్పటికీ అతనిలో తగ్గలేదు. తండ్రిపై రోజురోజుకూ పెరుగుతోన్న కోపంతోనే డిగ్రీ చదివాడు. స్నేహితులు అతన్ని దుబాయ్‌కి రమ్మని ఎంత బతిమలాడినా, తండ్రి మీద ఉన్న కోపంతో దుబాయ్‌ వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అమ్మ, అక్కలతో కలిసి గంజినీళ్ళు తాగి అయినా ఇండియాలోనే బతుకుతాను కానీ, చచ్చినా అక్కడికి రానని వాళ్ళకు చెప్పి దులిపేసుకున్నాడు.
వాహిద్‌ ఇచ్చిన డబ్బులతో జరీనా తనకు వచ్చిన విద్యను నమ్ముకొని ఒక మడిగను కిరాయికి తీసుకొని టైలర్‌ షాపును పెట్టుకుంది. ముగ్గురు కూతుళ్ళు తల్లికి చేదోడుగా ఉంటూ టైలరింగ్‌ పనుల్లోనే కాక, ఇంట బయట ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచారు. ఇప్పుడా టైలర్‌ షాప్‌ పెరిగి పెద్దదై ఆ ఊరి సెంటర్‌లోనే ఒక పెద్ద బొటీక్‌గా మారిపోయింది. పీజీ చేసిన రసూల్‌ ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తూ ప్రైవేటు కాలేజీలో పార్ట్‌టైం జాబ్‌ చేసుకుంటున్నాడు. తీరిక సమయాలలో షాప్‌కు సంబంధించిన పనుల్లో తల్లికి, అక్కలకు తోడుగా ఉంటూ బయటి పనులకు సహాయంగా ఉంటున్నాడు.
… … …
అలా చాలా రోజులు గడిచాక, రసూల్‌కు పెళ్ళి చేయాలనుకున్న జరీనా సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడూ తమ బొటీక్‌కు వచ్చిపోయే ఫాతిమా అయితే రసూల్‌కి ఈడూజోడూ బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఫాతిమా కుటుంబాన్ని ఇన్ని రోజులుగా గమనిస్తూ వస్తోంది. ఫాతిమా తల్లి ముంతాజ్‌ కూడా జరీనా కస్టమర్‌ కావడంతో ఆమెతో మాటలు కదిపింది. ఫాతిమా మాట తీరు, ఆమె నడత బాగా నచ్చడంతో ఆమెను తన కొడుక్కిచ్చి పెండ్లి చేయమని ముంతాజ్‌ను కోరింది జరీనా. దాని ఫలితమే ఇప్పుడీ పెళ్ళిచూపులు.
ముంతాజ్‌కు ఇద్దరు ఆడపిల్లల తర్వాత మూడవ కాన్పు కోసం ఆమెను తల్లిదండ్రుల దగ్గరకు పంపించాడు అక్బర్‌. పదిరోజుల తర్వాత తనకు కొడుకు పుట్టాడని తెలిసి సంతోషంగా అత్తగారింటికి వెళ్తూ మార్గమధ్యలో కారు ప్రమాదం జరిగి చనిపోయాడని వాళ్ళు, వీళ్ళు చెప్పగా జరినా విని ఉంది. తనలాగే ముంతాజ్‌ది కూడా ఒంటరి జీవితం. తన భర్త తనను అతని స్వార్ధం కోసం వదిలించుకుని ఒంటరిని చేస్తే, ముంతాజ్‌ను అల్లానే భర్తనుండి వేరుచేసి, ఆమె నసీబ్‌ను ఒంటరిగా మార్చివేశాడు. ముంతాజ్‌ జీవితం గురించి, ఆమె కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్న తర్వాతే, ఆమె మీద సహానుభూతితో ముంతాజ్‌తో వియ్యానికి సిద్ధపడిరది. తనలానే అనేక కష్టాలు పడి పిల్లల్ని పెంచిన ముంతాజ్‌ ఇంట్లోని పిల్లను చేసుకుంటే, కొడుకు కాపురం చల్లగా ఉంటుందన్న ఆశతో ముంతాజ్‌ ఇంటికి వచ్చింది. అదే విషయాన్ని కొడుక్కి చెబితే, ‘అమ్మీ! నీకు ఎవరు నచ్చితే వాళ్ళతోనే నా షాదీ’ అనడంతో ఫాతిమాను చూసుకుని నిఖా పక్కా చేసుకుని పోదామని ముంతాజ్‌కు కబురు పంపి పెద్ద కూతుర్ని సాయంగా తెచ్చుకుంది.
… … …
రాత్రి పడుకోబోయే ముందు ఇద్దరు బిడ్డల్ని పిలిచి ఏం చేద్దాం బిడ్డా! రసూల్‌ మంచిగా చదువుకున్నడు. మన ఇళ్ళల్లో ఇలాంటి బుద్ధిమంతులు, చదువుకున్న పిల్లలు దొరకరు. రేపోమాపో మంచి నౌకరీ కూడా సంపాదిస్తడు. ఇంక ఆలోచించడానికి ఏం ఉంటుంది? నాకైతే మస్తు నచ్చిండు. ఆడబిడ్డల నిఖాలు కూడా అయిపోయే. ఇంక రసూల్‌కు ఏ బాదరబందీ లేవు. నీ తర్వాత నేను నీ బెహన్‌కు కూడా షాదీ చెయ్యాల. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి బిడ్డా. నా దగ్గర దౌలత్‌ ఇవ్వడానికి పైసలు లేవు. పైసలు లేకుండా మన ఇళ్ళల్లో ఇప్పుడు ఎవ్వరూ నిఖాలు చేసుకోవడం లేదు. వాళ్ళు నిన్ను కోరి వచ్చిండ్రు బిడ్డా! పెండ్లి పక్కా చేసుకుందాం’ అంది.
ఏం చెప్పాలో అర్థంకాక అక్కాచెల్లెళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు.
‘ఎందుకట్ల ఖామోష్‌ అయిపోయిండ్రు? నేనైతే ఇంతకన్నా మంచి సంబంధం తేలేను బిడ్డా. తెలియనోళ్ళను చేసుకొని బాధలు పడి, తలాక్‌లు తీసుకునేకన్నా, మన ముంగిట పెరిగిన పిల్లడు నిన్ను మంచిగా చూసుకుంటాడు’ అంది.
పిల్లల నుండి మళ్ళీ సమాధానం రాకపోవడంతో ‘నాకైతే నచ్చింది బిడ్డా. ఇక మీరు ఏ నకరాలు చెయ్యకుండా ఒప్పుకోండి. రేపు ఆళ్ళింటికి బోయి నిఖా పక్కా చేసుకొని వస్తా. ఆనక మీరు కాదని అననీక లేదు. నా పరువు పోతది. అది మీరు యాదికి పెట్టుకోండి’ తన మాటే చివరి నిర్ణయం అన్నట్లుగా పిల్లలకి గట్టిగా చెప్పి వడివడిగా అడుగులు వేసుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది ముంతాజ్‌.
ఆ రాత్రి హసీనాని పట్టుకొని బాగా ఏడ్చేసింది ఫాతిమా. అక్కాచెల్లెళ్ళు రాత్రంతా మల్లగుల్లాలు పడ్డాక పొద్దున లేవగానే తల్లికి ప్రేమ వ్యవహారం చెప్పాలనుకొని నిద్రపోయారు. తమ్ముడు జహంగీర్‌ వచ్చి లేపేవరకు అక్కాచెల్లెళ్ళిద్దరికీ మెలకువే రాలేదు. తీరా నిద్రలేచి తమ గదినుండి బయటికి వచ్చేసరికి తల్లి డ్యూటీకి వెళ్ళపోయింది. తమ్ముడిచ్చిన చాయ్‌ తాగి ఇద్దరూ మళ్ళీ ముచ్చట్లలో పడ్డారు.
ఫాతిమా తన ఆఫీసులో పనిచేసే ఒక అబ్బాయితో బయట నడుస్తూ వెళ్ళడం రెండు, మూడుసార్లు జహంగీర్‌ కంటబడిరది. ఓ రోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన అక్కను, ఎవరక్కా అతను అని అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా, అతను తన ఆఫీసులో పనిచేసే సహోద్యోగి అని చెప్పిందే కానీ, ఏ రోజూ జహంగీర్‌కి నిజాన్ని చెప్పకుండా తప్పించుకుంది. నీ విషయం అమ్మీకి చెబుతానని ఒకరోజు జహంగీర్‌ బెదిరించడంతో ఖదీర్‌కు, తనకు మధ్య నడుస్తున్న ప్రేమ విషయం చెప్పి తల్లికి ఇప్పుడప్పుడే చెప్పవద్దని తమ్ముడుని బతిమలాడుకుంది. తల్లికి ఈ విషయం ఎప్పుడైనా చెప్పవచ్చులే అన్న ధీమాతో ఇన్నాళ్ళూ చెప్పలేదు. ఊహించని విధంగా, నిన్నటి పెళ్ళిచూపుల సంఘటన అక్కాచెల్లెళ్ళను బాగా కలవరపెడుతోంది. ఆ రోజంతా హసీనా కాలేజీకి వెళ్ళకుండా అక్కను ఓదార్చుతూనే ఉండిపోయింది. సాయంత్రం తల్లి ఫ్యాక్టరీ నుంచి వచ్చాక ముగ్గురూ కలిసి విషయం చెప్పాలని అక్కాతమ్ముళ్ళు నిర్ణయించుకున్నారు.
… … …
ముంతాజ్‌ ఫ్యాక్టరీ నుండి ఇంటికి వచ్చాక, జహంగీర్‌ తల్లిని కూర్చోబెట్టి అన్ని విషయాలను పూసగుచ్చినట్లు వివరించి చెబుతూ, ఖదీర్‌ ఎంత మంచివాడో కూడా చెప్పాడు. అన్నీ విన్న ముంతాజ్‌కు ముందు నోటమాట రాలేదు. పిల్లలవైపు చూస్తూ చాలాసేపు అలాగే మౌనంగా ఉండిపోయింది. కళ్ళముందు ఒక్కసారిగా హసన్‌ మెదలడంతో కళ్ళు తుడుచుకుంది ముంతాజ్‌. తను నిఖాను బలవంతంగా ఎలా చేసుకుందో గుర్తుకువచ్చి వడివడిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. తాగుబోతైన భర్త అక్బర్‌తో తను పడిన కష్టాలు, ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత భర్త యాక్సిడెంట్‌లో చనిపోవడం తలుచుకుని కుమిలిపోయింది. ఒంటరి తల్లిగా తనపై పడిన భారాన్ని బయటకు కనబడకుండా పిల్లల్ని ఎలా పెంచి, పెద్దచేసిందో గుర్తుకొచ్చి కళ్ళను తుడుచుకుంది. తరగని దుఃఖభారాన్ని దించుకోవడానికి ఎప్పటిలా ఆమె వంటింటిని ఆశ్రయించి అటువైపుగా నడిచింది. అక్బర్‌ చనిపోయిన తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్‌ డబ్బును బ్యాంకులో ఫిక్స్‌డ్‌ చేసుకుంది. ప్రతినెలా వచ్చే వడ్డీకి చేదోడుగా తను ఫ్యాన్‌ల కార్ఖానాలో పనిచేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించింది. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చదివిన ఫాతిమా క్యాంపస్‌ సెలక్షన్‌లో ఉద్యోగం తెచ్చుకుని రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తోంది. కూతురి సంపాదనతో ఇప్పుడిప్పుడే జీవితంలో సెటిలవుతున్న సమయంలో అనుకోకుండా రసూల్‌ సంబంధం వచ్చి, ఆమెకు పెద్ద భారాన్ని దించినట్లయింది.
పెద్ద కూతురి మీద ఉన్న నమ్మకంతో పిల్లల అనుమతి తీసుకోకుండానే జరీనా వాళ్ళను రమ్మని కబురు పంపింది ముంతాజ్‌. ఇప్పుడు కూతుళ్ళు చెబుతున్న విషయం ఆమెకు మింగుడు పడడం లేదు. ఇప్పుడేం చేయాలో అర్థంకాక దిగులుగా కూర్చుండిపోయింది. ఫాతిమాను ఒప్పించి రసూల్‌తో ఎలాగైనా నిఖా చేస్తానని జరీనాకు మాట కూడా ఇచ్చింది. ఇప్పుడు తన ముఖాన్ని జరీనాకు ఎలా చూపించాలో, ఏమని సమాధానం చెప్పుకోవాలో ఆమెకు అర్థం కావడంలేదు.
తన నిర్ణయం పట్ల పిల్లల విముఖత కన్నా, ఫాతిమా కోరుకుంటోన్న ఖదీర్‌ కూడా మంచివాడే. కానీ, ఆ అబ్బాయికి ఫాతిమానిచ్చి షాదీ ఎలా చెయ్యాలో ముంతాజ్‌కు తెలియడంలేదు. బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం చేస్తోన్న ఖదీర్‌ను ఫాతిమా నిఖా చేసుకోవడంలో తనకున్న అభ్యంతరమేమిటో కూడా ఆమె బుర్రకు అర్థంకాక ఆలోచనల్లో పడిరది. ఆ రోజంతా ఇంట్లో భయంకర నిశ్శబ్దం ఆవహించి, అందరికీ నిద్రను కరువు చేసింది.
… … …
జహంగీర్‌ ఇంట్లోకి వస్తూనే, అమ్మీ నీకో గుడ్‌న్యూస్‌ అనుకుంటూ హడావిడిగా వచ్చాడు. అదేంటో చెప్పమని అక్కలిద్దరూ గొడవ చేసినా, కొంచెంసేపు ఆగండి అంటూ వాళ్ళను ఊరిస్తూ ఉన్నాడే కానీ, తల్లికి గానీ, అక్కలిద్దరికీ గానీ ఏ విషయమూ చెప్పలేదు.
సాయంత్రం ఆరుగంటలవుతుండగా, గేటు తీసిన చప్పుడు వినిపించి అందరూ వరండాలోకి వచ్చి నిలబడ్డారు. గేటు తెరుచుకొని వస్తోన్న జరీనా కుటుంబ సభ్యులందరినీ చూస్తూ ముంతాజ్‌ భయపడుతూ కొడుకు చేతిని పట్టుకొని వెనక్కు లాగింది.
తల్లిని భయపడొద్దు అన్నట్లుగా భరోసా ఇస్తూ, ఇంట్లోకి వస్తున్న వారందరినీ లోపలికి ఆహ్వానించి హాల్లో ఉన్న సోఫాల్లో కూర్చోమని చెప్పి, అక్కలకు ఛాయ్‌, బిస్కెట్లు తయారు చేయమని చెప్పి వారిని లోపలికి పంపించాడు జహంగీర్‌. తల్లికి కుర్చీని చూపిస్తూ అమ్మీ, ఆంటీవాళ్ళతో మాట్లాడు అంటూ హడావిడి చేశాడు. ఏం జరుగుతోందో అర్థంకాక బిత్తరపోయి చూస్తోన్న ముంతాజ్‌కు దగ్గరగా వచ్చి ఆమె చేతులు ఊపుతూ ‘ముబారక్‌ హో ముంతాజ్‌’ అంటూ ఆమెను ఆలింగనం చేసుకుంది జరీనా. ముంతాజ్‌ సిగ్గుతో తలదించుకొని, ‘మాఫ్‌కరో జరీనా! మేరా ఫాతిమా బేటీ…’ అంటూ ఏదో చెప్పబోయేంతలో ‘క్యోం మాఫ్‌ కర్నా ముంతాజ్‌? హమ్‌ బహుత్‌ ఖుష్‌ హై. రసూల్‌కి నీ చిన్నకూతురు హసీనాను చేసుకుంటున్నాను కదా’ అంది నవ్వుతూ.
జరీనా ఏం మాట్లాడుతోందో అర్థంకాని ముంతాజ్‌ ఆశ్చర్యంగా ఆమెవైపే చూస్తుండడంతో, ముంతాజ్‌ చేతుల్లో ఒక పేపర్‌ పెట్టి ‘ఇస్‌మే సబ్‌కుఛ్‌ హై. అభీ పఢో’ అంది జరీనా. తన చేతిలో ఉన్న పేపర్‌ విప్పి చూసింది ముంతాజ్‌. ముత్యాల్లాంటి అక్షరాలు. అవి హసీనా దస్తూరి. ఏం రాసిందో అన్న మీమాంసలో మొత్తం చదివి జహంగీర్‌వైపు చూసింది. జహంగీర్‌ తల్లివైపు మందహాసంతో చూసి, అప్పుడే అక్కడికి వచ్చిన అక్కలిద్దరి చేతుల్లో ఉన్న టీ, బిస్కెట్ల ట్రేను అందుకుని సంతోషంగా అందరికీ అందించాడు. అక్కడున్న వారి మనసు పొరలు ఒక్కొక్కటే విడిపోవడం గమనించిన హసీనా మనసులోనే నవ్వుకుంది.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.