And Finally…
ఆమె చనిపోతే గాని ఆమె నా మరో పేరెంట్ అన్న విషయం ఉనికికి రాలేదు నాకు.
నాకు ఐదున్నరేళ్ళప్పటి నుంచి అమ్మమ్మ, మేము ఒకే కాంపౌండ్‌లో పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. అమ్మమ్మ నాకు రెండు జడలేసి, తన ఇంటి ముందున్న గుండు మల్లె చెట్టు నుండి రెండు పూవులు దగ్గరగా చేర్చి స్లైడ్ పిన్నుతో జుట్టులో చేర్చి పంపేది. జడ వేసేప్పుడు, ‘‘మెదులుడు బొమ్మ’’ అని తిట్టేది.
తను కూడా చాలా శ్రద్ధగా తయారయ్యేది. అప్పట్లో స్టిక్కర్ల వాడకం తక్కువ. కనుబొమల మధ్య గుండ్రంగా స్నో రాసి కుంకుమ పెట్టుకునేది. ‘‘మీ తాతయ్య లేడా’’ అని ఫ్రెండ్ అడిగేవరకూ నాకా క్యారెక్టర్ ఉంటుందని కూడా తట్టలేదు. ఆమె ఒకతిగానే పరిచయం. ‘‘చనిపోయారా’’ అని మళ్ళీ అడిగిందా దోస్తు. అవునని చెప్పాను. ‘‘మరి బొట్టు పెట్టుకుంటుందెందుకు?’’ బొట్టుకు, తాతయ్యకు సంబంధం ఏంటో కూడా తెలీదు నాకు. తర్వాత అమ్మమ్మని అడిగాను. ఆరేళ్ళ పిల్లకు అర్థమయ్యే సమాధానమే చెప్పింది కానీ అబద్ధం చెప్పలేదు నాకు.
మా అమ్మమ్మ నాకు తలంటు స్నానాలు చేయించలేదు, గారెలు వండలేదు, జడకుప్పెలు వేయలేదు, ఖాళీ సమయాల్లో వంట నేర్చుకోమని ఒత్తిడి పెట్టలేదు. ఆమె నాకు బోల్డన్ని పుస్తకాలు, పాటలు, సంభాషణలూ ఇచ్చింది. డిక్షనరీలో నుండి రోజుకు పది పదాలు నేర్చుకోమని చెప్పేది. చివరిదాకా నాకు వంట వచ్చని చెప్పినా నమ్మలేదు, నా చేతి వంటతిన్నా సరే. నా కారు డ్రైవింగ్ స్కిల్స్‌కి మాత్రం ముచ్చట పడిపోయింది. చదువుతూ ఉన్న తనని ఆపి ఏ ప్రశ్న వేసినా తిట్టకుండా, విసుక్కోకుండా, తడుముకోకుండా సమాధానమిచ్చేది. అది హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, సివిక్స్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ లేదా ఈనాడు సండే పదవినోదం కానీ. (ఈ లక్షణం ఆఖరుదాకా పోలేదు).
అలా యుకెజి నుండి 8వ తరగతి వరకూ తన పక్కనే. ఆ ఇంట్లో చేరిన రెండేళ్ళకు రిటైరయ్యింది అమ్మమ్మ. కాబట్టి నాతో ఇంకా సమయం గడిపింది. తర్వాత ఇంటర్‌లో ఒకటో, నెండో నెలలు తన దగ్గర ఉండి సెయింట్ ఆన్స్‌లో చదివాను. మళ్ళీ బెంగేసి అప్పటికే ట్రాన్స్‌ఫర్ అయి పుత్తూరు వెళ్ళిన అమ్మ దగ్గరికి వెళ్ళిపోయా. విజయవాడలో కొన్ని నెలలు ఉంది నాతో, అమ్మతో… మళ్ళీ గ్రాడ్యుయేషన్‌లో మలేరియా వచ్చి తగ్గాక తన దగ్గర తెచ్చిపెట్టుకుంది ఒక వారం. ఇక ఆ తర్వాత మేమిద్దరం మాత్రమే తీరిగ్గా కలిసి ఉన్నది మూడు నెలల క్రితం ఉన్న ఆ రెండు వారాలే.
వస్తుందంటే భయపడ్డాను. తను రావాలి అని గట్టిగా కోరుకున్నా. మా అత్తయ్యలూ, మావయ్యలకు తనను చూసుకోవడం ఒక ఫుల్ టైం జాబ్. నా వల్లవుతుందా అని భయం. చంటిపిల్లని చూసుకున్నట్లే… కానీ ఎంత ఎంజాయ్ చేశాను తనతో!
గ్రాడ్యువల్‌గా అర్థమైందేంటంటే మా అమ్మ నిష్క్రమణలో జరిగిన గుండెకోతకు చల్లని మందు లేపనం రాసి వెళ్ళింది అమ్మమ్మ. తనని మళ్ళీ వెనక్కు తీసుకెళ్తుంటే అన్నది, ‘‘నా బెంగ తీరిందిరా. నువ్వు నీ జీవితాన్ని సమర్ధవంతంగా, చక్కగా మలచుకున్నావు. నాకు సంతోషంగా ఉంది. నువ్వు మరో పరిపూర్ణవి.’’
అమ్మమ్మ అంటుంది కానీ, నిజంగా నేను మరో పరిపూర్ణ ఏంటి? నిమిష నిమిషం ఏదోటి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న ఆమెక్కడా, ఫోనులో గేమ్స్ ఆడే నేనెక్కడ? అసలైనా మరో పరిపూర్ణ ఉంటుందా ఎక్కడైనా? నేను ఆమె తాలూకా జ్ఞాపకపు శకలాన్ని మాత్రమే. నేనున్నంత కాలం ఆమె నాతోనే ఉంటుంది! కానీ అర్థంకాని ప్రశ్నలకు ఇకపై ఆమె నుండి సమాధానాలు రావు. నేనే వెతుక్కోవాలిక.