మన భారతీయుల్ని అన్ని విధాలా దోచుకుంటూ, మనల్ని తమ బానిసలుగా మార్చిన బ్రిటీషర్లులోని మరోకోణం మానవత. పుట్టిన మరుక్షణంలో బాలికను చంపే చర్యను, ఆ తదుపరి ఎనిమిదేళ్ళ పిల్లను పెళ్ళిజరిపే ‘సాకు’తో ఇంటి నుంచి గెంటేయడం లాంటి అమానుష చర్యల్ని సదాచారాల పేరుతో అమలు చేస్తున్న ఆ దుష్ట సంప్రదాయాన్ని బ్రిటీషు పాలకులు, కఠిన చట్టాల అమలు ద్వారా నిషేధించి, ఆడపిల్లల్ని బ్రతికించగలిగారు.
కానీ మన సదాచార వ్యవస్థ శూద్ర జాతుల శ్రమ దోపిడీ చేస్తునే వచ్చింది, వ్యవసాయ పంటలను వారికి అందనివ్వకుండా శాశ్వత కౌలుదార్లుగానే తొక్కిపట్టి ఉంచింది. భూస్వాముల అగ్రకుల ఆక్రమణలను కాపుగాచే ‘‘పాలేళ్ళు’’గా శూద్రులను తొక్కిపెడుతూ బ్రతకనిచ్చింది. అంతేగాక శూద్రుల్ని విద్యకు, అక్షరం ముక్కకు అనర్హులని చేసింది. వీరి శరీర కదలికలను సైతం కంట్రోల్ చేస్తూ,
శూద్రుడు అన్నవాడు`ఆధిక్య కులాల వారి ముందు నేలపైన మాత్రమే గాని, పై ఎత్తు పీట మీద సైతం కూర్చోగూడదనీ, అది ధర్మవిరుద్ధమంటూ ప్రకటించి అమలు పరిచింది.
సనాతన ధర్మం ` భారత ప్రజలకు ఆధిపత్య వర్గాలు అందించిన అతి దారుణమైన సమాజ ధర్మం. ఆ ధర్మం వారిని చతుర్వర్ణాలుగా విభజించింది, మరికొందరు మానవుల్ని అంటరానివారు, చూడతగని వారు, నీచ కులస్తులుగా నిర్ణయించి ` నాలుగు కులాలుండే ఊరికి, వీలైనంత దూరంలో అంటరాని పల్లెల్ని ఏర్పరచి, వాటిలోనే బ్రతకమన్నది. పెద్ద కులాల ఊరిలోకి, వాళ్ళ పనులు చేయడం కోసం ఊళ్ళోకి అడుగుబెట్టే ముందు ‘‘అంటరాని వాడిని ` ఊళ్ళో అడుగుబెడుతున్నానండోయ్’’ అని గట్టిగా కేకలు బెట్టడంÑ అది వినగానే అక్కడి పై నాలుగు కులాల వారు తలుపులు దభ దభ మూసుకుని తాము ఆ అంటరాని వారిని చూసిన పాపం నుంచి బయట బడ్డం అన్న బృహత్క్రియ సనాతన ధర్మక్రియలో ఒకటిగా అమలులోకి వచ్చిన ధర్మమేనట.
ప్రపంచ దేశాల్లో మరెక్కడా సృష్టింపబడని, అనుసరించబడని వర్ణ వివక్షావిధిని కేవలం మన భరతగడ్డ మీదనే సృష్టించి, శాశ్వతరీతిన అమలుపర్చబడుతున్న ఒక ఉత్కృష్ట ధర్మాన్ని సనాతనం మనకందించింది.
దేశ ప్రజానీకాన్ని కులం, వర్ణ పేర్లమీద విడగొట్టి, చీల్చి అశక్తుల్ని చేసే ఈ ప్రక్రియ ` సనాతన ధర్మం అందించగా, వేల వత్సరాలుగా అమలవుతూ వస్తున్న అతి గొప్ప వర్ణ విభజన సత్క్రియ గదా! ఈ వర్ణవ్యవస్థా ప్రక్రియ!
ఆధిక్య, అధమ కులాలుగా ప్రజలను చీల్చి, ఒకరినొకరు ద్వేషించుకొంటూ కుల కక్షలకు, కుల సంబంధ హత్యలకు పుట్టిల్లు చేయగల్గింది గదా మన ఈ సనాతనం.
ఈ ధర్మం వల్ల ఆధిపత్య వర్గాల వారు అన్ని రీతుల ఆధిక్యత చేకూర్చుకొని, అథమ కులాలన్న వారిచేత అడ్డమైన చాకిరీలు చేయించుకుని, వారిందరి శ్రమను, సేవల్ని అనునిత్యం దోచుకుంటూ, అందలమెక్కి హాయిగా, సర్వసుఖాలతో జీవిస్తున్న పాలకవర్గాలకు, వారి తొత్తులకు బంగారు బాటలను చూపిన దారుణ చర్యల కూటమి గదా మన సనాతన ధర్మం!!
సనాతన ధర్మం! అనగా, అది ప్రాచీన కాలం నుండి, మానవ సమాజ మంతటి చేతను తిరుగులేని నమ్మిక కలిగించి, అత్యంత ప్రాచీన శతాబ్దాల కాల సాంఘిక కట్టడిగా, ప్రతి ఒక్కరు, ప్రతి గృహస్థు అనుసరించి, అవలంబించి జరపాల్సిన ఆచరించి తీరవలసిన చర్యగా కొనసాగిన సాంఘిక ధర్మక్రమమని తెలుస్తూనే ఉన్నది.
నిజానికి ఇది ఒక ప్రాచీన ధర్మం. యుగాల నుంచీ తరాల నుంచి ప్రజానీకమంతా అతి శ్రద్ధగా, ఈ సనాతన ధర్మం నిర్వచించిన గృహపరమైన, సంఘ పరమైన వివిధ ఆచార నిష్టలను అవశ్యంగా, అతి శ్రద్ధగా పాటిస్తూ వచ్చింది.
సనాతన ధర్మం ప్రప్రథమంగా ప్రవచించిన ధార్మిక చర్య. ఆడ శిశువుల జన్మకు సంబంధించిన ఓ ధర్మాచరణ! అతి ప్రాచీనము, పౌరాణిక గ్రంథ విహితమగు ఈ సనాతన సాంఘిక ధర్మం అత్యంత ధార్మిక దృష్టితో బోధించిన ప్రక్రియ. ఆడశిశువులు జన్మించిన మరు నిమిషంలోనే వాళ్ళను లోతైన చెరువులు, కాల్వలు, నదుల నీళ్ళలోకి విసరి ముంచి వెయ్యటమన్నది ఉత్తమ కార్యాచరణమట! ప్రాణ, జీవ హత్య కానేరదట!! కొద్దికాలం తరువాత తాము కనిన ఆడ సంతతిని పుట్టిన మరుక్షణంలోనే వారి ప్రాణాలు తీయడానికి మనసొప్పక వాళ్ళ పసితనానికి ముచ్చటపడుతూ ఆ బిడ్డలను ప్రాణంతో బ్రతకనిచ్చారు. కానీ ఆ బిడ్డకు ఎనిమిదేళ్ళ వయసు రాగానే తమకిష్టమైన వాళ్ళతో పెండ్లి తంతు జరిపి వారికి ఇచ్చివేసి చేతులు దులుపుకోడం మొదలయ్యింది. ఈ తంతుకు ‘అష్ట వర్షాత్‌్ భవేత్ కన్య’ అన్న సంస్కృత వచనం తోడ్పడిరది. ఇంత క్రూరమైన వేదప్రవచనం ఈ నేలపైన గాక మరి ఏ చోటా అగుపించింది గాదు. ఇది ఈ దేశ పౌరాణిక సందేశపు ప్రత్యేకత.
ఈ పౌరాణిక ధర్మాలన్నవన్నీ వేదవాక్కులుగా నమ్మించారు అగ్రజాతి బ్రాహ్మణ పండితులు, సిద్ధులు.
అత్యంత వింతైన, అమానవీయ మరొక సాంఘిక ధర్మం… చాతుర్వర్ణ విభజన. దేశ ప్రజలందరినీ అధికులు, అధములు అన్న భేద, వివక్ష దృష్టితో విభజించిన ఇలాంటి మహత్తర విభజన ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోనూ ప్రభవించలేదు. ఈ వర్ణ వ్యవస్థ భరతదేశంలో పుట్టి పెరిగిన ఓ ప్రత్యేక వినూత్న వ్యవస్థ. ఈ చాతుర్వర్ణములన్న నాల్గింటిలో అత్యధికమైనది బ్రాహ్మణ కులం. బ్రాహ్మణులు హత్యలు చేయవచ్చు. తమ కులంలోను, మిగిలిన మూడు కులాల్లోని స్త్రీలను పెళ్ళాడవచ్చు. ఉంపుడుగత్తెలుగా ఉంచుకొనవచ్చు. బాపనజనాలు ఎంత క్రూర, నీచ, నికృష్ట చేష్టలకు పాల్పడినా, వారికి ఏ శిక్షలూ వర్తించవు.
నాలుగు వర్ణాలలో అతి నీచమైంది శూద్ర కులం. వీరికి పొలము, వ్యవసాయము అన్నవి ఉండకూడదు. భూకామందుల పొలాలని దున్ని, దోకి, పంటలు పండిరచి వారి పరం జెయ్యడం, వారిచ్చే కౌలు గింజలతో బ్రతకడం… అంతవరకే వీళ్ళ అవసరం.
సాటి మానవ ప్రాణులను కుల వర్గాల పేర్లతో, వేరు చేసి, వారికి కనీస భూవసతి లేకుండా చేసి, చదువు సంధ్యలకు, నలుగురితో సమానత్వానికి శాశ్వత దూరం కల్పించి వారి శ్రమల్నీ, మానవత్వాన్నీ, చివరకు ప్రాణాలను దోచుకుందుకు తాత్విక బలాన్ని, పుణ్యరీతుల పేర్లతో తగిలించి, అదంతా అత్యంత విశిష్ట ధర్మమని విశ్వసింపజేసిన ఈ దుర్మార్గ ధర్మానికి విశిష్ట మానవ సామాజిక ధర్మమన్న పొగడ్తలు ఈనాడు సైతం విశేషంగా అందుతున్నాయి.
ఈ సనాతన ధర్మాన్ని ఆమోదించి, ఆ ధర్మాచరణ ఈ ప్రస్తుత కాలంలోనూ, భావిలోనూ ఎంతైనా అనుసరణీయమని వాక్రుచ్చుతున్న విద్యావంతులు, రిటైర్డ్ లాయర్లు, జడ్జీలు, తాత్విక గురువులకు అభివందనలు, అభినందనలు తెలియపర్చడం… దేశప్రజల తక్షణావసరం.
కేవలం వ్యాపార వృత్తి పేరున, భారత గడ్డ మీద కాలూని, క్రమంగా ఈ దేశ ప్రజల వివిధ వ్యవసాయ ఉత్పత్తుల్నీ, చేతివృత్తుల్నీ కొల్లగొట్టి, అనేక ఉపాయ మార్గాల్లో మనల్ని బానిసలుగా మార్చి తాము పాలనాధికారులుగా రూపొందించుకున్న బ్రిటీషు పాలకులలో ` మన సామాజిక ధర్మాల పట్ల, తాత్విక సంప్రదాయ ధర్మ చర్యల పట్ల అంతులేని మానవత్వ గుణం పెల్లుబికి, మనం అనుసరించుతున్న కొన్ని అమానుష ధర్మ చర్యల్ని ` దృఢమైన చట్టాలనమలు పరచడం ద్వారా నిషేధించడం జరిగింది.
నేను నా ఏడవ ఏట చదివిన 1938లో మూడో తరగతి పాఠ్య పుస్తకంలోని ఒక పాఠంలో ఇలా వ్రాయబడి, చదువుకోబడుతుండేది.
‘‘పూర్వకాలంలో, మన దేశాచారాలు ఎంతో నీతి ధర్మాలతో ఆచరింపబడుతుండేవి. ఆనాటి పాటకజనులు వేదాలు చదువరాదు. చదివిన వారి నాల్కలు కత్తిరింపబడేవి. అలానే వేదాంత శ్రవణం, అనగా వినడం జరిగినట్లయినచో, సీసం కాచి, వారి చెవుల్లో పోసి శిక్షించేవారు’’. ఇది ‘చరిత్ర’ పాఠంలో మొట్టమొదటి పాఠ్యవాక్యమై ఉండేది. నాటి నా పసివయసు చదువులో, ఆ రెండు వాక్యాలు, కంఠస్థం చెయ్యాల్సిన వాక్యాలుగానే ఉండేవి. అంతకు మించి, మా పంతులు గారు వివరించడం గాని, నాకు మా తరగతి పిల్లలకు అంతటి శిక్షలు పూర్వం ఎందుకుండేవో తెల్సుకుందామన్న ఆలోచన గాని ఉండేది గాదు…
ఇప్పుడు, నా తొమ్మిది దశాబ్దాల బ్రతుకు కాలాన ఆ పురాతన కాలపు ఆచారాల, ధర్మాల గురించిన సంపూర్ణ అవగాహన శ్రీయుత పి.యన్.ఆర్.ప్రసాద్ గారు ఇటీవల వ్రాసి ప్రచురించిన ‘సనాతన ధర్మం మీద బ్రిటీషు వాడి దాడి’ అన్న వ్యాసం ద్వారా కలగడం ఎంత సంతోషదాయకమో!!
మన అనాది పూర్వీకులు జీవించిన కాలాన్ని, పూర్వపు వేదకాలమనీ, ‘సనాతన ధర్మకాలమనీ’ వ్యవహరిస్తుంటారు. ఈ కాలంలోని హైందవ మతాచార్యులు, వేద పండితులు ఈ సనాతన ధర్మమన్నది భారతీయుల విశిష్ట సంస్కృతికి ఆచరణ రూపమనీ, మరే చోట ఆచరించబడని అపురూపమైన ధర్మమన ఈనాటికీ వాక్రుచ్చుతుంటారు! ఇందుకు నిదర్శనంగా ఒక సనాతన ధర్మాన్ని నిరసించే ప్రసంగం గురించి చదివిన ఒక హైందవ మతాచార్యుడు ఆ మర్నాడే ప్రకటించిన ఛాలెంజి మనముందుకు వచ్చి నిలబడిరది.
ఈ సనాతన ధర్మ ఆచరణను ఇప్పటికైనా మనం రద్దు పరచడం అవసరమని, తమిళ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి ఒక స్ధానిక సభలో అన్నారు. సదరు దయానిధిని తక్షణం చంపిన వారికి పదికోట్ల పరిహారమివ్వగలనని మిక్కిలి సాహసంతో ఆ మతాచార్యుడు ప్రకటించిన తీరును పాఠకులు చదివి ఉంటారుÑ అత్యంత ఆశ్చర్యానికి లోనయి ఉంటారు.
ఇంతటి ప్రశస్త పుణ్య ధర్మాచరణను అమలుపరిచిన సనాతన ధర్మం ప్రవచించిన మొదటి ధర్మాన్ని గమనిద్దాం: ఆడ సంతానాన్ని వాళ్ళు పుట్టిన మరునిమిషంలోనే ఏ చెరువు, ఏరు, కాల్వ నీళ్ళలోకో విసిరి చంపేయడం వారు చేసిన మొదటి నిర్దేశం. కొద్దికాలం తరువాత, ఆడపిల్లలకు ఎనిమిదేళ్ళు రావడంతోనే వయసుతో నిమిత్తం లేకుండా ఏ ముసలివాడికో, ఎంతో కొంత ద్రవ్యం తీసుకొని, పెండ్లి పేరుతో అమ్మివేయడం. మిక్కిలి పసివయస్సులో కన్నవాళ్ళను, కన్న ఊరిని వదిలిపోలేక దుఃఖించే కన్నబిడ్డను నిర్దయగా, నిర్బంధంగా మరో ఊరికి, మరో మగవానికి అప్పగించేయడం అన్నది ఎంతటి క్రూర సదాచారమో… గురజాడ వారు తమ కన్యాశుల్కం నాటక కథలో ఎంతగా వాస్తవపరిచారో!
(నంబూరి పరిపూర్ణ అసంపూర్ణ రచన. ఎత్తిన తల దించకుండా రాసిన సామాజిక చింతనాశీలి. వెళ్ళిపోవడానికి కొన్ని వారాల ముందు వారు హైదరాబాదు వచ్చినప్పుడు ఈ వ్యాసం రాసారు…. ఇదే ఆమె చిట్ట చివరి రచన.)