మన చరిత్ర అసమగ్రం – కె.వెంకటేష్‌

జాతీయోద్యమ స్ఫూర్తి, సాయుధ పోరాట దీప్తుల ఉమ్మడి జ్ఞాపకం నంబూరి పరిపూర్ణ. ఆనాడు దేశభక్తి గీతాలను ఆలపిస్తూ సామాన్యుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు కృషి చేశారు. విద్యార్థి సంఘం నాయకురాలిగా సాయుధ పోరాటంలో పాల్గొని ధీరవనితగా నిలిచారు. సామ్యవాద సిద్ధాంతపు వెలుగుదారుల్లో మొదలైన ఆమె జీవన ప్రస్థానం ఆనాటి చరిత్రకు సాక్ష్యం. 91 ఏళ్ళ పరిపూర్ణ తన ఉద్యమ జీవితం నాటి కొన్ని స్మృతులను, మరికొన్ని సంగతులను నవ్యతో పంచుకున్నారు.

‘‘భారతదేశ స్వాతంత్య్రోద్యమం అనగానే ఇదంతా కాంగ్రెస్‌ నాయకుల త్యాగఫలం అనుకుంటాం. గాంధీ టోపీ, ఖద్దరు దుస్తులు ధరించిన వారందరినీ జాతీయోద్యమ నాయకులు అనలేం. మహాత్మాగాంధీ సత్యాగ్రహానికి సమాంతరంగా ఖుదీరాంబోస్‌, భగత్‌సింగ్‌, నేతాజీ వంటి అసమాన యోధుల సాయుధ మార్గం సాగింది. భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం నడిచింది. అయితే, జాతీయోద్యమ చరిత్రలో కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు వ్యక్తులను మినహా మిగతా ఉద్యమ శక్తులకు అంతగా ప్రాధాన్యత లభించలేదు. కనుక మన జాతీయోద్యమ చరిత్ర అసమగ్రం అంటాను. కమ్యూనిస్టులకు చోటులేని స్వాతంత్య్రోద్యమ చరిత్ర అసంపూర్ణం. వారి త్యాగాలకు తగిన గుర్తింపు లభించలేదనేదే నా ఆవేదన.
చరిత్రకెక్కని నిజాలు…
సోషలిస్టు రష్యాను అభిమానించే నెహ్రు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. మనది కూడా సామ్యవాద దేశంగా మారుతుందేమోననే భయమే దీనికి కారణం. అంతేకాదు, గాంధేయవాదులమని చెప్పే కాంగ్రెస్‌ నాయకులు కొందరు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో కాన్సన్ట్రేషన్‌ క్యాంపులు పెట్టి మరీ కమ్యూనిస్టులను వేధించారు. ఆంధ్రాలో అయితే ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదేశాలతో మలబారు పోలీసులు, సీఆర్‌ఒఎఫ్‌ దళాలు కృష్ణాజిల్లాలోని కాటూరు, ఎలమర్రు గ్రామాలలోని కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుల ఇళ్ళమీద దాడులు చేశారు. ఆడవాళ్ళమీద అకృత్యాలకు పాల్పడ్డారు. ఇలా కొన్ని వంద మంది అశువులు బాసారు. మరి వారంతా ఉద్యమించిందీ, ప్రాణాలు పోగొట్టుకున్నదీ దేశం కోసమే కదా! స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఆ ప్రాణాలకు విలువ లేదా?
ఆకలియాత్రలు…
మా సొంత ఊరు కృష్ణాజిల్లాలోని బొమ్మలూరు. పెరిగింది మాత్రం గన్నవరం తాలూకాలోని బండారిగూడెంలో. మేము ఆరుగురు సంతానం. మా పెద్దన్న శ్రీనివాసరావు, చిన్నన్నయ్య దూర్వాస మహర్షి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. వారిని చూచి నేనూ చిన్నతనం నుంచి సభలు, సమావేశాల్లో పాల్గొని, దేశభక్తి గీతాలు పాడేదాన్ని. ఒకసారి మా పెద్దన్న నేతృత్వంలో గన్నవరం పరిసర గ్రామాల్లో ‘ఆకలియాత్రలు’ పేరిట బ్రిటిష్‌ వారి దోపిడీకి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం జరిగింది. అప్పుడు ఏడేళ్ళ వయసున్న నేనూ అందులో పాల్గొన్నాను.
బాల ప్రహ్లాదుడిగా నటించా…
రెండవ ప్రపంచ యుద్ధ సహాయనిధి సేకరణ కోసం మా స్కూల్‌ టీచర్లు విజయవాడలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అప్పుడు పదేళ్ళ వయసున్న నేను ‘పాదుకా పట్టాభిషేకం’ నాటకంలో భరతుడి పాత్రను పోషించాను. అందులో నా నటన చూసిన మీర్జాపురం జమీందారు ‘భక్తప్రహ్లాద’ సినిమాలో బాల ప్రహ్లాదుడి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. అలా 1941 వచ్చిన శోభనాచల స్టూడియోస్‌ ‘భక్తప్రహ్లాద’ చిత్రంలో వేమూరి గగ్గయ్య, చదలవాడ రాజేశ్వరి, లీలావతి, మల్లాది రామకృష్ణమూర్తి వంటి హేమాహేమీలతో నటించాను. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చినా, చదువుకు దూరం కావడం ఇష్టంలేక వద్దన్నాను.
75 ఏళ్ళ కిందట…
1947, ఆగస్టు 15వ తేది. పరాయి పాలన పీడ వదిలిందనే ఉత్సాహంతో ఊరూరా సంబరాలు అంబరాన్నంటాయి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందనే సంతోషంతో చాలామంది డప్పుల వాద్యాలతో, దేశభక్తి నినాదాలతో ఊరేగింపులు జరిపారు. మిఠాయిలు పంచుకున్నారు. అప్పుడు నేను కాకినాడ పీఆర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతూ, స్టూడెంట్‌ ఫెడరేషన్‌ విద్యార్థి సంఘంలో చురుగ్గా పనిచేస్తున్నాను. సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. దేశ విభజనను జీర్ణించుకోలేక నేను ఆ వేడుకల్లో పాల్గొనలేదు.
గోదావరి పుష్కరాల్లో దేశభక్తి గీతాలు…
ఇది 1944 నాటి మాట. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఖైదీగా ఉన్న మా అన్నయ్యను చూసేందుకు వెళ్ళాం. అదే సమయంలో గోదావరి పుష్కరాలు కావడంతో రాజమండ్రి వీథుల నిండా జనసందోహమే! ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు ఇదే సరైన సందర్భమని భావించిన తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులు, పుష్కరాల్లో జనం కూడిన ప్రతిచోటా సమావేశాలు నిర్వహించారు. ఆ వేదికలపై నేను దేశభక్తి గీతాలు పాడేదాన్ని. నెలరోజులు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మహధర జగన్మోహనరావు చొరవతో నా పాఠశాల విద్య రాజమండ్రిలోనే కొనసాగింది. జాతీయోద్యమ సభలు, సమావేశాల్లో ‘దేశమును ప్రేమించుమన్నా’, ‘నేనూ ఒక సైనికుడిని… శాంతి సమర యోధుడిని’, ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి’, ‘అరుణపతాకపు చ్ఛాయల్లో, ఎగిసే రక్తపు పొంగుల్లో’ తదితర గీతాలు ఆలపించేదాన్ని.
24 రోజులు ఒకే బ్యారక్‌లో…
భారతదేశ స్వాతంత్య్రానంతరం కమ్యూనిస్టు పార్టీపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్న రోజులవి. తెలంగాణలో నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాయుధ దళాలు పోరాడుతున్నాయి. సమాంతరంగా ఆంధ్రాలోనూ జమీందారీల ఆగడాలను నిరసిస్తూ, ఉద్యమం ముమ్మరంగా నడుస్తోంది. పైగా రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ పెట్టారు. అలాంటి సమయంలో విద్యార్థి మహాసభల సందర్భంగా గుంటూరు వీథుల్లో ర్యాలీ తీస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి సబ్‌ జైలుకు తరలించారు. 24 మంది ఆడవాళ్ళను 24 రోజులు ఒకే బ్యారక్‌లో నిర్బంధించారు. మేము విడుదలయ్యే వరకూ ఆ జైలు పరిసరాలు విప్లవ గీతాలతో మార్మోగాయి.
పోలీసు కాలర్‌ పట్టుకొని…
ఒకసారి విప్లవ సాహిత్యం ఉందని పోలీసులు నన్ను అరెస్ట్‌ చేసి, గుంటూరు స్టేషన్‌ సెల్‌లో బంధించారు. అంతకుముందే అక్కడున్న ఒక ఖైదీ మూత్ర విసర్జన చేయడంతో సెల్‌ అంతా దుర్వాసన వస్తోందని రైటర్‌కు చెప్పాను. అప్పుడు అతడు ‘‘అంతకు ముందెవ్వరూ పోయలేదు. నువ్వే చేసుంటావ్‌’’ అన్నాడు వికారంగా నవ్వుతూ. పట్టరాని కోపంతో నేను ‘షటప్‌’ అని అరిచాను. దాంతో అతను నన్ను జుత్తు పట్టుకొని సెల్‌లో నుంచి బయటకు లాగి నా చెంప మీద కొట్టాడు. నేనూ ఆ పోలీస్‌ కాలర్‌ పట్టి, అతని ఎదురు రొమ్ముమీద పిడికిలితో గట్టిగా కొట్టాను. ఆ తెగువ నాకు విద్యార్థి ఉద్యమ జీవితం వల్లే వచ్చిందనుకుంటా.
స్వాతంత్య్రం కొందరికే…
ఎందరో మహనీయులు, త్యాగధనులు పోరాడి సాధించిన స్వాతంత్య్ర ఫలాలు ఈనాడు కొందరికే దక్కుతున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు సమాజంలో కుల, మత సరిహద్దులు మరింత పెరిగిపోయాయి. ఈ వ్యవస్థ అసలు స్వరూపాన్ని కరోనా కాలం కళ్ళకు కట్టింది. ఆనాడు తమ జీవితాలను ధారపోసి మరీ త్యాగధనులు పోరాడిరది ఇలాంటి స్వాతంత్య్రం కోసం కాదని స్పష్టంగా చెప్పగలను.’’
నవల రాస్తున్నా…
ఇప్పుడు నా వయసు 91 ఏళ్ళు. ప్రస్తుతం నేను ఢల్లీిలో మా పెద్దబ్బాయి దాసరి అమరేంద్ర వద్ద ఉంటున్నాను. రోజులో ఒక అరగంట పాటలతో, ఆరు నుంచి ఏడు గంటలు పుస్తక పఠనంతో, రెండు నుంచి మూడు గంటలు రచనా వ్యాసంగంతో గడుపుతున్నా. ఇంతకుముందే ‘వెలుగుదారులు’ పేరుతో నా ఆత్మకథ రాశాను. గత ఏడాది ‘పొలిమేర’ నవల విడుదలయింది. 1970ల నాటి మహిళా అభ్యున్నతికి అద్దంపట్టే ఒక జీవిత గాథ ఇతివృత్తంగా ఇప్పుడు మరొక నవల రాస్తున్నాను. ఇవిగాక మ్యాగజైన్లకు వ్యాసాలు రాస్తుంటాను.
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో…)

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.