విముక్త మానవి విసిరిన సవాళ్ళు – జయధీర్‌ తిరుమలరావు

పరిపూర్ణ గారిని చూస్తే మా అమ్మమ్మ గుర్తొస్తుంది. మనుషులను పోలిన మనుషులు ఉంటారా? కొద్దిమంది
ఉంటారు. కానీ, వీళ్ళిద్దరికి శారీరక పోలికలే కాదు, ఆ చూపు, ఆ హుందాతనం, మాటతీరు… అంతా ఒక్కటే. పరిపూర్ణ గారు ఇంకొన్ని రోజులు బ్రతికి ఉంటే ఎన్నడో ఒకరోజు వెళ్ళిపోయి అమ్మమ్మా అని తనివితీరా పిలిచేవాడిని.

నిజానికి ఆమె నాకు అమ్మ కావాలి. ఎందుకంటే, ఆమె బిడ్డ శిరీష కన్నా, కొడుకు అమరేంద్ర కన్నా కొద్దిగానే పెద్దోడిని. కానీ ఆమె నాకు అమ్మమ్మే. ఎందుకంటే ఆమె ముమ్మూర్తులా మా అమ్మమ్మే. పరిపూర్ణ గారికన్నా పరిపూర్ణ వ్యక్తిత్వం నన్ను బాగా ఆకట్టుకుంది. మీటింగుల్లో చూసినప్పుడు ఈ మాట అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఎందుకో పరిచయం పెంచుకోలేదు. కావాలనే పెంచుకోలేదు. నేను చాలా మిస్‌ అయిన మనుషుల్లో మా అమ్మమ్మ ఒకరు. మళ్ళీ అలాంటి ఒక బలమైన వ్యక్తిత్వం, పరిపూర్ణత కలిగిన నంబూరి పరిపూర్ణ గారి పరిచయం, మళ్ళీ అమ్మమ్మ వడిలో చేరడం… కొంత అలజడికి గురయ్యాను. ఆమె ‘వెలుగుదారుల్లో’ చదివాక మా అమ్మమ్మ కమలమ్మ జ్ఞాపకాల ఒరవడి నన్ను ముంచేసింది. ప్రతిపేజీ కమలమ్మతో తులనాత్మక పరిశీలనతో, పరిపూర్ణగారి జీవితంతో పోల్చుకోవడం వల్ల కొంత స్ట్రెయిన్‌కి గురయ్యాను. నాలుగైదు నెలల కింద చివరిసారి అపర్ణ తోట ఆమె తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం జరిపిన కార్యక్రమంలో ఆమెని చూసి నమస్కరించాను. ఆమెకున్న ఫాన్‌ ఫాలోయింగ్‌లో నన్నామె గుర్తించలేదు. కానీ ఆ నమస్కారం ఇద్దరికి పెట్టుకున్నట్లు అనిపించింది. ఏదో తృప్తి. అమ్మమ్మనే చూస్తున్నంత ఆర్తి. మెల్లిమెల్లిగా పరిపూర్ణ గారు ఉన్న చిరునామాలను తెలుసుకుంటున్న సందర్భంలో మా రెండో అమ్మమ్మ దొరికినంతలోనే దూరమైంది. ఆమె పోయాక ఆమె కుటుంబ సభ్యుల్ని నీలమ్మతో కలిసి ఆమె జ్ఞాపకాలను పంచుకోవాలనిపించింది. అలాగే కలుసుకున్నాం. అమ్మమ్మలు కూడా ఎక్కడో ఓ దగ్గర కలుసుకునే ఉంటారు.
ఆర్థిక అసమానతల సమాజంలో కులాధిపత్యం, మతాధిపత్యం, లింగాధిపత్యం, చదువు, పార్టీ, నిర్మాణం, పదవి వంటి ఆధిపత్యాల్ని ఎన్నింటినో ఎదిరించి వ్యక్తిగా గౌరవాన్ని పొందడానికి ఎన్నో జీవితాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి గౌరవం దెబ్బతీయడానికి పైన పేర్కొన్న ఎన్నో కారణాలు… ఒక్కోసారి అన్నీ కలిపి, కలగలిసి దాడి చేస్తుంటాయి. అవి పురుషుల మీద ఒక రకంగా, మహిళల మీద మరో రకంగా దాడి చేస్తాయి, గాయపరుస్తాయి. మనసుని రసి కార్చే పుండుని చేస్తాయి. దీనికి మలామాలు లేదు, ధైర్యంగా నిలబడడమే తప్ప గత్యంతరం లేదు. ఆ పని పరిపూర్ణ గారు చేశారు. కమలమ్మ కూడా చేసింది. ఈ గాయానికి ముందు, తదుపరి వాళ్ళ జీవితం ఒక్కటే.
అనేక యుద్ధాలు చేసి విజేతగా నిలిచిన వారిని సామాజిక యోద్ధలుగా ప్రకటించాలి. దేశం లోపల యుద్ధాలు ఎదుర్కోవడం వేరు, విదేశీ శక్తులతో యుద్ధం చేయడం, కొత్త వాతావరణం, పరిసరాలతో యుద్ధం చేయడం వేరు. తల్లిగారింటిలో జీవించడం వేరు, భర్త చేతికింద కొత్త ఇంటివాళ్ళ అజమాయిషీలో జీవించడం వేరు. ఒక సైనికుడు ఎదుర్కొనే పరిస్థితే ఈ దేశంలో ప్రతి మహిళా ఎదుర్కొంటుంది. స్త్రీని చెప్పుచేతల్లో ఉంచుకోవడానికే ఆమెని అత్తగారింటికి పంపించే యోచన చేశారేమో. పురుషుడు అత్తగారింటికి వస్తే అది నామోషీ.
ఏది ఏమైనా, ఈ రెండిళ్ళనే కాదు, సమాజం అనే ముళ్ళకంచెలో పడేస్తారు కాబోలు. వీటిని ఎదుర్కోవడం మహా కష్టం. ఈ ఘర్షణ వాతావరణంలో నిలదొక్కుకుని నిటారుగా నిలబడడం, సహజమైన సమభావన, వివక్షా రహిత జీవనం కోల్పోయి కూడా తలెత్తుకుని నిలబడ్డ ముందు తరాల స్త్రీలలో ఈ ఇద్దరు నా ‘షీరోలు’. ఎన్ని అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొని నిలబడినా, తమలోని మాతృత్వం, ప్రేమ, ఆప్యాయతలను కోల్పోకుండా ఉండడం కేవలం స్త్రీలకే చెల్లు. ఇది అదనపు భారం. స్త్రీ పోరాటమంతా ఈ భావనల్ని నిలుపుకోవడం కోసమేనేమో అనిపిస్తుంది.
వీరు తమని తమ కుటుంబసభ్యులు ప్రేమించలేదని అనలేదు. తమ ప్రేమని ఏకకాలంలో నలుగురికి పంచిపెడతారు. తమ గౌరవం కోసం వెంపర్లాడరు. అందరి గౌరవాన్ని పెంచుతారు. హుందాగా జీవించడానికి ఏమీ కోల్పోనవసరం లేదని, మనిషిగా మసలుకోవడానికి, సహృదయతని పెంచుకోవడానికి స్థిరచిత్తత అవసరం అని నిరూపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడి చూపారు. విచిత్రం ఏమంటే, తరాల అంతరాలు అనే మాటకు తావు లేకుండా మనుషులతో కలిసిపోయి మానవతని చాటడం వారి ప్రత్యేకత. వీరిద్దరూ నాలుగు తరాలకి సాక్షీభూతులు. ఇంత చేసినా వారి పాత్రని, ఇంత చదువుకున్నా, ఇన్ని సిద్ధాంతాలు వల్లెవేసినా వారికి దక్కవలసిన కీర్తి చాలా మందికి దక్కలేదు.
పరిపూర్ణ గారి జీవితం, కమలమ్మ గారి జీవితంలో పోలిక వారి మతం, వారి కుటుంబ వ్యక్తులు, వారి నేపథ్యాలు ఒకే తీరుగా ఉన్నాయి. పరిపూర్ణ గారిని పదకొండేళ్ళ ప్రాయంలో మద్రాసులోని బాలికల సేవా సదనంలో చేర్చితే రెండు రోజుల్లో వెనక్కు వచ్చేసింది. అక్కడ జరిగే తంతుని సుస్పష్టంగా దర్శి చెంచయ్య గారికి చెప్పింది. అక్కడ మూడు రకాలుగా తరగతులు ఉండేవి. ఒక దానిలో ఖర్చు భరించే ధనిక కుటుంబాలకు చెందిన బాలికలు, రెండో రకంలో ఉచితంగా చదువుకునే బాలికలు (అంటే మధ్యతరగతి కాబోలు), మూడో రకంలో వంటలు చేసి, గదులు ఊడ్చే బాలికలు. ఇది చూసి ఆత్మగౌరవం దెబ్బతిన్న ఆ పిల్ల సివంగిలా దాన్ని ఎదిరించి వచ్చి అక్కడికి తిరిగి పోనని నిష్కర్షగా చెప్పింది. అదిగో ఈ స్వభావమే ఆమెని స్వతంత్ర భావాలు గల వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఒక తిరుగుబాటుగా దాన్ని మనం గ్రహించాలి. ఒక వ్యవస్థపై, మదరాసు నగరంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన నిర్వాహకులపై ఒక బాలిక చేసిన తిరుగుబాటు అది. అదీ 48 గంటల్లో వెనక్కి వచ్చేయడం అంటే పరిస్థితులను అర్థం చేసుకోవడంలోని స్పాంటేనిటీ ఎంతటిదో గమనించాలి.
అస్తిత్వ చైతన్యం అవసరమే. అది సమాజం నుండి పూర్తి గౌరవాన్ని డిమాండ్‌ చేస్తుంది. సమాజంతో తలపడేలా చేస్తుంది. సంఘర్షణ వాతావరణం లోంచి గెలుపు వైపు దారి తీస్తుంది. వ్యక్తి గౌరవానికి మించిన అస్తిత్వం లేదు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారిగా పూర్తి న్యాయం చేయడానికి తన స్ఫూర్తి తనకే అక్కరకొచ్చింది. అలాంటి ఘటనలు జరగకుండా చూసింది. తన ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వహించే శపథం చేసుకుంది. ఉద్యోగినిగా, తల్లిగా, ఆడపిల్లల సంరక్షణ కర్తగా ఆప్యాయతానురాగాలతో మెసిలేలా చేశాయి. ఆమె ఇంటిలోనూ, ఉద్యోగంలోనూ ఒకేలా ప్రవర్తించారు.
నిజానికి రవాణా సౌకర్యం అంతగా లేని రోజుల్లో క్యాంపులకెళ్ళడం ఎంతటి ప్రయాసో. ఈ కష్టనష్టాల గురించి ఎక్కడా వాపోలేదు. మనుషుల పట్ల ఎంత ప్రేమాస్పదంగా ఉండేదో, అంత రాజీలేని ధోరణి ఆమెది.
బతుకు పోరాటంలో ఆమెది విప్లవ పంథా. తాను ఒంటరే, కానీ తానే ఒక సమూహం. జెండా కర్ర పాతుకుపోయినట్లు ఆమె బతుకుతూ పదిమందికి ప్రేరణశక్తిగా నిలిచి నీడనిచ్చింది. ఆ జెండా కొయ్యలా, ఆమెది స్థిర విశ్వాసం.
ఒక ఆలంబన దూరమయ్యాక భర్త అయితేనేం, బిడ్డ, అల్లుడు అయితేనేం, స్నేహితుడైతేనేం, సన్నిహితుడైతేనేం ఆమె జీవన ప్రవాహం ఎలాంటి బురదనీ, మురికినీ దరి చేరనివ్వలేదు.
జీవితానికి కావలసిన దానికన్నా మించిన పోరాటం ఆమెది. గెలిచిన బతుకులో శ్రమనీ, బడలికనీ కనబడనివ్వని ధీశక్తి. అదీ ఆమె జీవనయానం ఇచ్చిన సందేశం.
పరిపూర్ణ గారితో ఎన్నో ముచ్చట్లాడాలని అనుకున్నా. అందులో ఒకటి, ఓటమి బాధని ఎన్నిసార్లు చవిచూశారని అడగాలనుకున్నా. నా ప్రశ్న నాకే పేలవంగా అనిపించింది. జీవితంలో సబలగానే నిలబడిన తీరు ఎక్కువ. ఐతే అవి ఉండవని అనలేం. కానీ వాటిని జయించిన మెథడాలజీ ఏమిటోనని తెలుసుకోవాలి. నేనూ రేపు దానిని ఆచరించి మంచి తాతయ్య కావాలని లోలోని ఆశ.
జెండర్‌ తేడా లేకుండా భావితరాల వారు తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన పాఠ్యంగా తీర్చిదిద్దాలని కోరిక.
పరిపూర్ణ గారిది తల్లి పాత్రలో, బాధ్యతలో తండ్రితనం కూడా ఆచరించి చూపింది. పరిపూర్ణ గారు తండ్రి బాధ్యతనీ పోషించింది. మరి ‘అతను’ తల్లిగా మారగలిగేవాడేనా. తండ్రిలేని లోటును ఒంటరి తల్లిగా అధిగమించింది. అయితే తండ్రి తల్లి పాత్రని నిర్వహించగలిగేవాడా! తన బిడ్డలకి తండ్రి దూరంగా ఉన్న లోటుని కనబడనివ్వకుండా చేసింది. ఆమె ఎంతో విశ్వాసంతో, ధీమాతో ఆ లోటుని పూడ్చిన తీరు గొప్పది. ఆమె బ్రతుకు కుటుంబానికే కాదు, సమాజానికి కూడా ఆదర్శప్రాయం.
ఆధునిక కాలంలో, అభ్యుదయ విప్లవాల సమయంలో కూడా స్త్రీ ఆత్మగౌరవంగా మనలేని స్థితి. సుమారు వందేళ్ళ క్రితం ‘‘విముక్త మహిళ’’గా రూపుదిద్దుకోవడంలో చూపిన తెగువ మరింత కాంతివంతం కావాలి.
జీవన లాలస, సామాజిక జీవితంతో ముడివేసిన తీరు ఆమె సొంతం. కళాత్మక అనుభూతి కోల్పోకుండా, ఎక్కడా తనకు తాను దూరం కాకుండా బతకడం ఇలాంటి అమ్మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఉద్యమాలు ఎంత ముఖ్యమో, పోరాటాలు, విప్లవాలు ఎంత అవసరమో వాటి గుణపాఠాలు అంతకన్నా ఎక్కువ అవసరం. చాలామంది నాకు తెలిసి చదువుకున్నవారు పరిపూర్ణ గారిలా ఎందుకు ధైర్యంగా నిలబడలేక పోతున్నారో తెలియదు. వారికి ‘వెలుగుదారుల్లో’ ఒక అత్యవసర పఠనీయ గ్రంథం అందించాల్సిందే.
నిజానికి ‘భర్త’గారు వీరికి ఎందుకు దూరమయ్యారో లోతుగా తెలియాలి. వాస్తవాలు నిగ్గుదీసి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇలాంటి పోకడలు రిపీట్‌ కాకుండా ఉపయోగపడతాయి. నిర్మాణాల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తుల బలహీనతలకి, వారి పిచ్చి ఆలోచనలకి జీవితాలు బలికావలసిందేనా! ఇలాంటి విషయాలు జరిగితే వాటి గురించి దాచడం, మాట్లాడకపోవడం వంటి ఊగిసలాటల్లో కుటుంబాలు నలిగిపోవాల్సిందేనా! ఇప్పుడు ఇలాంటి ధోరణుల పట్ల మాట్లాడడమే ఆమెకి ఇచ్చే నివాళి.
డబ్బు, హోదాల గత్తరలో కులాంతర వివాహాలలో పైకి కనబడని వత్తిడి తీవ్రంగా ఉంటుంది. దానికి డబ్బు, దర్పం, అహంకారం చేదోడు వాదోడవుతుంది. ‘పెద్ద’ నాయకులే ఇలా ప్రవర్తిస్తారు. మనం ప్రవర్తిస్తే ఏమవుతుందనే తప్పుడు సంకేతాలు పోతాయి. కులం వల్ల, కులాంతర వివాహాల వల్ల స్త్రీకి వెసులుబాటు, గౌరవం లభించాలి. కానీ ‘కులం’ వల్ల, కులాంతర వివాహాల పేరుతో కులాహంకారం వ్యక్తమయ్యే పరిస్థితులు మరింతగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తాయి. ఇలాంటి ధీరలు ఉండడం వల్ల అవి సమసిపోయాయి. కానీ సమాజం ఈ పెడధోరణులను గుర్తుపెట్టుకుంటుంది. ఆధిపత్యం ఏనాటికైనా పశ్చాత్తాపం ప్రకటించవలసిందే.
పెద్ద ఉమ్మడి కుటుంబంలో పరిపూర్ణ గారు వేళ్ళూనుకున్న వృక్షం కాండంలా బలంగా నిలిచి ఉండడం వల్ల ఓ విఫల వివాహ వ్యవస్థకి వన్నె తెచ్చింది. ఆనాడు ఎంతోమంది యువతీ యువకులకి ఆదర్శమైంది. ఆమె స్వీయ చరిత్ర, ఒక దీపం వేయి వెలుగులు పుస్తకం ద్వారా లోకానికి కులాంతర వివాహం మంచిచెడులపై చర్చ జరిగింది. ఆమె ధైర్యాన్ని పలువురు హర్షించారు. పరిపూర్ణ గారికి జరిగిన అన్యాయాన్ని మౌనంగా వ్యతిరేకించారు. రాన్రాను దండల పెళ్ళిళ్ళల్లో దండల్లో మంగళసూత్రాలు పెట్టి వేసుకున్నప్పుడు వాటిపట్ల అగౌరవ భావన కూడా కలిగింది. ఐతే, అందరూ పరిపూర్ణల్లా ఉండలేరు. మౌనంగా, అలాంటి పెళ్ళిళ్ళని శిక్షలా భావించారు. పరిపూర్ణ గారిలా నిలబడగలగాలని ఆకాంక్షించారు. ఇది కనబడని, వినబడని ఆమె జీవన సందేశం.
నిజంగా ఆమె ధైర్యశాలి. కానీ, తనని కారణరహితంగా దూరం పెట్టిన ‘దాసరి’ గారి పట్ల ఆమె అంత ఉదాసీనత చూపడం ఆశ్చర్యమే. తన జీవిత కాలంలో ఆ చర్యని ఖండిరచి, వ్యతిరేకిస్తే, తూర్పారబడితే బాగుండేదని అనిపిస్తుంది. అలా ఎందుకు చేయలేదా అనిపిస్తుంది. ఈ లక్ష రూకల ప్రశ్న వందలసార్లయినా కలుగుతుంది.
చాలామంది భర్తలు అల్ప ఆలోచనాపరులు. సిద్ధాంతాలు పైకి తప్ప జీవితం లోంచి ఆచరించలేరు. చాలామంది జీవితాన్ని జయించలేని బలహీన మానవులు. వారు అన్ని అన్ని రకాల చిన్న చిన్న విషయాల మధ్య జీవించిన అల్ప మానవులే.
ఐనా, అతడిని క్షమించేసిందా, లేదా పదిమంది కలసి ఆమెని ప్రభావితం చేశారా? అదీ సిద్ధాంతం పేరుతో, పార్టీ పేరుతో. లేదా వారి సంతానాన్ని అతడికి దూరం చేయడం ఎందుకనుకుందా?
పరిపూర్ణ గారి దశాబ్దాల క్షమాగుణాన్ని అతనెలా చూశాడు, ఒక బలహీనురాలిగానేనా. అతనిలో పరివర్తన కలిగిందా? అతని చుట్టూ ఉన్న అభ్యుదయ శక్తులు, వ్యక్తులు, నిర్మాణాలు సవరించే ప్రయత్నాలు చేశాయా? ఇవన్నీ సమాజం తనని తాను వేసుకున్న ప్రశ్నలు. జవాబులు ఏ రూపంలోనైనా దొరుకుతాయా!
ఆమె తన ధీరోచిత ఘట్టాల్ని వీర గాథలుగా చేసి చూపింది. చర్చనీయమైన పాఠ్యాంశాలుగా నిలబెట్టింది. వాటిని మనకు ఆలోచనీయ కానుకలుగా అందించింది. మనం అలాంటి ఆమెకు ఏమివ్వగలం. నివాళిగా ఏమి రాసినా ఆ అక్షరాలు ముడుచుకుపోతాయి. కాలం చిన్నబుచ్చుకుంటుంది. అందుకే నేను ఆమె గురించి రాయడం ఆపేసే సమయం వచ్చింది.
డెబ్భై ఏళ్ళు నిండితే అమ్మమ్మ, నానమ్మ అవుతారు. తెలుగులో ఈ రెండు పదాలకు ఆంగ్లంలో ఉన్నట్లు స్త్రతీaఅఅవ అనే ఒక పేరు లేదు. పరిపూర్ణ గారు తొమ్మిది పదులకు పైగా దాటారు. అందుకే ‘మూలపుటమ్మ’ అనవచ్చు. వారు తెలుగువారి అభ్యుదయ మూలపుటమ్మ.
‘‘కుటుంబంలో అంతా సవ్యంగా జరగనప్పుడు అమ్మమ్మని పిలవండి’’ అనేది ఇటాలియన్‌ నానుడి. ఈ మూలపుటమ్మల హృదయాలు సుగంధాలు పండిరచే పూదోటలు. సుగంధ భరిత భరోసాలు. వాళ్ళు గత అనుభవ పాఠాలు, స్వర సహితలు, వర్తమాన సంక్షుభిత కాలంలో దారిచూపే ఉదాహరణలు. మూసుకుపోయిన భవిష్యత్తుకు దారితీసే ద్వారాలు. ధీరత, తెలివిడి, శక్తికి ప్రతిబింబాలు.
అమ్మల గురించి, నాన్నల గురించి చాలా రాశాం. వాళ్ళను కన్న మూలపుటమ్మలపై రాయవలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ జీవితం పరచిన పుస్తకం. మనకి ఎంత కావాలన్నా, ఏమి కావలసినా ఉచితంగా లభించే అనుభవసారం సిద్ధంగా ఉంది. వాళ్ళ బతుకులు మరింత ప్రకాశమానం కావాలి.
ప్రత్యేక సభలు పెట్టి అప్పుడప్పుడైనా వాళ్ళ జీవిత ఘట్టాలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా కథలు కథలుగా చెప్పుకోవాలి. జీవితాన్ని అనేకసార్లు విజయపథంలో నడిపి, మనకి తెలియకుండానే మనల్ని నడిపే ధృవతారల వెలుగుల్ని చూద్దాం. ఆ ధీరోదాత్తతలో దాగిన శక్తిని ఇంధనం చేసి రాబోయే తరానికి అందిద్దాం. ఈ ఏడాది మూలపుటమ్మల ఏడాదిగా ప్రకటించి కార్యక్రమాలు నిర్వహిద్దాం.

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.