ఆమె చూపిన వెలుగుదారుల్లో… – ఎ.కె. ప్రభాకర్‌

చాలామందికి లాగానే నంబూరి పరిపూర్ణ గారి గురించి నాకు ఆమె ఆత్మకథ ‘వెలుగు దారులలో…’ చదివే వరకు పెద్దగా ఏం తెలీదు. అంతకు ముందు అనిల్‌ అట్లూరి, దాసరి శిరీష నిర్వహించే వేదిక (సాహిత్యంతో మనలో మనం) కార్యక్రమాల్లో ఒకట్రెండు సార్లు ఆమెను చూశాను. ఎనభై అయిదేళ్ళ కంచు కంఠంతో ఆమె పాడగా విన్నాను. మాటల్లో ఆమె వాగ్ధాటికి ఆశ్చర్యపోయాను.

అప్పటికే ఆమె ఒక నవలిక, కొన్ని కథలు, మరెన్నో సామాజిక వ్యాసాలు రాసి ఉన్నారని సైతం నాకు తెలియదు. వేదిక మీటింగులకు అప్పుడప్పుడూ హాజరయ్యే క్రమంలో శిరీష గారి ఆత్మీయమైన స్నేహం లభించింది. ఆమె నడిపే ‘ఆలంబన’ పరిచయమైంది. ఆమె ఒక రోజున వేదిక మీటింగ్‌ తర్వాత ‘కథాపరిపూర్ణం’ అనే వారి కుటుంబ (ఒక తల్లీ, ముగ్గురు పిల్లలు) కథల పుస్తకం ఇచ్చారు. అందులో పరిపూర్ణ గారి ‘మాకు రావు సూర్యోదయం’ (నవలికగా ఈ పెద్ద కథ 1985లోనే వెలువడిరదనీ, దానిద్వారా పరిపూర్ణ గారు మంచి రచయితగా గుర్తింపు పొందారనీ తర్వాత తెలిసింది), ‘శీనుగాడి తత్వమీమాంస’, ‘ఎర్ర లచ్చుప్ప’ కథలు నన్ను ఆకట్టుకున్నాయి. కానీ ఆమె వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి గానీ, జీవితాన్ని అధ్యయనం చేయడానికి కానీ ఆత్మకథే సరైన ఆకరం.
పరిపూర్ణ వంటి వ్యక్తి జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే నాలుగు తరాల సాంఘిక చరిత్రను స్థూలంగా అధ్యయనం చేయడమే అని అర్థమైంది. కులం కారణంగా, జెండర్‌ కారణంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటూ, ఎదురైన కష్టాలకు తల వంచక గుండె నిబ్బరం కోల్పోక సామాజిక ఆచరణలో ఉన్న ఆమె జీవితానికి చెందిన భిన్న పార్శ్వాలని లోతుగా తరచి చూడడం ద్వారా దాదాపు నూరేళ్ళ సమాజ చలనాన్ని అంచనా కట్టొచ్చు, కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. సాంస్కృతికంగా వైష్ణవీకరణకు గురైన మాల దాసరి కుటుంబంలో పుట్టిన పరిపూర్ణ బయటి నుంచి సవర్ణుల వివక్షని ఎదుర్కొంటూనే కులం లోపలి బ్రాహ్మణీయ పితృస్వామ్య ఆధిపత్యంపై సైతం పోరాడిరది. ఆ విధంగా మరాఠీ దళిత మహిళా రచయితలు బేబీ కాంబ్లే (Jina Amucha – Our Life), శాంతాబాయి కాంబ్లే (Mazhya Jalmachi Chittarkatha – The Kaleidoscopic Story of My Life), ఊర్మిళా పవార్‌ (Aaidan – The Weave of My Life: A Dalit Woman’s Memoirs) ఆత్మకథలతో కొంతవరకు ఆమె ఆత్మకథని పోల్చవచ్చు.
వాస్తవానికి తెలంగాణకు చెందిన టి.ఎన్‌.సదాలక్ష్మి బతుకు కథ ‘నేనే బలాన్ని’ (గోగు శ్యామల), పరిపూర్ణ ఆత్మకథ ‘వెలుగు దారుల్లో’… ఈ రెండిరటినీ తులనాత్మకంగా పరిశీలించాలి. అప్పుడు బ్రిటిష్‌`నైజాం పాలనల్లోని రెండు ప్రాంతాల సామాజిక చరిత్రల్లో కనిపించే వైవిధ్యం, కొత్త కోణాలు వెలికి వస్తాయి. ఇద్దరూ సమకాలీకులే అయినప్పటికీ ఒకరు కాంగ్రెస్‌ రాజకీయాల్లోకి, మరొకరు కమ్యూనిస్టు ఉద్యమంలోకి పయనించడానికి కారణమైన స్థానిక రాజకీయ సామాజిక నేపథ్యాల్ని అర్థం చేసుకోవచ్చు.
సృజనాత్మక రచనా రంగంలోకి పరిపూర్ణ చాలా ఆలస్యంగా ప్రవేశించారు. ‘వెలుగు దారుల్లో…’ వెలువడకుంటే నంబూరి పరిపూర్ణ జీవితం కూడా ఆమె ఇతర కుటుంబ సభ్యుల అస్తిత్వంలా చరిత్రలో అనామకంగానో, అజ్ఞాతంగానో మిగిలిపోయేదేమో! పరిపూర్ణ తోడబుట్టిన సహోదరులు ముగ్గురూ సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రముఖులే. ఒక అన్న నంబూరి శ్రీనివాసరావు చిన్న వయసులోనే స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకొని జైలు జీవితం అనుభవించినవాడు. పూర్తి కాలం కమ్యూనిస్టు కార్యకర్త. ఆయనకి గదర్‌ విప్లవ వీరుడు దర్శి చెంచయ్య దగ్గర్నుంచీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ వరకూ ప్రముఖ నేతలెందరితోనో ప్రత్యక్ష అనుభవం ఉంది. (చిన్నతనంలో మద్రాసులో చెంచయ్య గారి ఇంట్లో ఉండి పరిపూర్ణ కొన్నాళ్ళు చదువుకున్నారు). శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. మరో అన్న దూర్వాస మహర్షి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కథా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్‌ పొంది అక్కినేని నాగేశ్వరరావుతో కాలికి గండపెండేరం తొడిగించుకున్న మహాకవి (ఇదే ఒక సవర్ణుడైతే అతని చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించేవారు). తమ్ముడు జనార్ధన్‌ కూడా వామపక్ష రాజకీయాల్లో తలమునకలైనవాడే. (చూ.నంబూరి సోదరుల గురించి కాత్యాయనీ విద్మహే ‘కొలిమి’ (జనవరి 2022)లో రాసిన వ్యాసం). ఎందుకో మన పరిశోధకులు భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న, గుఱ్ఱం జాషువా, బోయి భీమన్నల దగ్గరే ఆగిపోయారు. దళిత సాహిత్య చరిత్రలో పూరించాల్సిన ఇటువంటి ఖాళీలని పూరించడానికి పరిపూర్ణ జీవితం గురించిన అధ్యయనం ద్వారాలు తెరుస్తుందని నా నమ్మకం.
… … …
సినిమా, నాటకం, సంగీతం, సాహిత్యం, (కాల్పనిక, కాల్పనికేతర) రేడియో ప్రసంగాలు, టెలీ ఫిల్మ్స్‌, కమ్యూనిస్టు
ఉద్యమ ప్రచారం, ప్రభుత్వ ఉద్యోగం, సామాజిక సేవ… ఇంత విస్తృతి వైవిధ్యం ఉన్న వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం. ఎనిమిది దశాబ్దాల పాటు క్రియాశీలంగా ఉండటం మరింత అబ్బురం. తొంభై ఏళ్ళ తర్వాతి వయసులో పరిపూర్ణ రాసిన నవల ‘ఆలంబన’ ఇటీవలే వెలువడిరది. ఆ పుస్తకం హైదరాబాద్‌ ఆవిష్కరణ సభలో దాన్ని నేను రివ్యూ చేస్తూ చూపిన విమర్శనాత్మకమైన సూచనలు అమరేంద్ర ద్వారా పరిపూర్ణ తెలుసుకొని గొప్ప సహృదయంతో మలి ముద్రణలో సవరించుకుంటానని చెప్పారు. ఆమె నా ముందు అలా ప్రకటించినప్పుడు నేను చాలా సిగ్గుపడ్డాను. ఆ వయస్సులో ఆమె ప్రదర్శించిన స్పోర్టివ్‌నెస్‌ని, సంస్కారాన్ని ఇవాళ్టి రచయితలు ఆదర్శంగా గ్రహించాలి. కమ్యూనిస్టు నేపథ్యమే ఆమెకు ఆ పరిణతిని అందించి ఉండొచ్చు. ఎదుటి వాళ్ళతో సైద్ధాంతికంగా విభేదించే సందర్భాల్లో ఆమె చాలా ఖరాకండిగా వ్యవహరించేవారు. మనుషుల వ్యక్తిగత విలువల గురించి, సామాజిక నీతి గురించి ఆమెకు ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి. వాటిని తన బలమైన గొంతుతో అంతే నిక్కచ్చిగా ఆమె ప్రకటించేవారు. అభిప్రాయ ప్రకటనలో ఆమె ఆర్టిక్యులేషన్‌ కూడా ఎంతో గంభీరంగా, స్పష్టంగా ఉండేది. వ్యాసాల్లో ఆమె రాసిన వచనంలోని తీక్షణత అనుభూతమౌతుంది. జీవితానుభవమ్మీద సానబెట్టిన వాక్యాలు ఆమెవి. ఆమె పాట ఎంత మధురమో, మాట అంత పదును. కమ్యూనిస్టుల ఆదర్శాల గురించి, త్యాగాల గురించి ఎవరైనా పొరపాటున ఒక్క పొల్లు మాట అన్నారంటే ఊరుకునేవారు కాదు, ధాటిగా సమాధానం ఇచ్చేవారు. చివరి వరకూ ఆమె తన చిన్నప్పుడు విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన నాటి ఆచరణను, సైద్ధాంతిక అవగాహనను నిలుపుకునే ఉన్నారు.
పరిపూర్ణ జీవితం దాసరి నాగభూషణరావుతోనే కొనసాగి ఉంటే… ఆమెకు ఇంటికి వచ్చిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి వండి వార్చడంతోనే సరిపోయేదేమో అని మనవరాలు అపర్ణ చేసిన వ్యాఖ్యతో నేను ఏకీభవించను. అటువంటి జీవితంతో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడి ఉండేవారు కాదని నా విశ్వాసం. జీవితాన్ని ఆమె ఎదుర్కొన్న విధానమే అందుకు రుజువు. తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో, సాంస్కృతిక చైతన్యంతో, చొరవతో కుటుంబం వరకే పరిమితం కాకుండా, ఒకవైపు సాహిత్య సాంస్కృతిక రంగాల్లోనూ, మరోవైపు రాజకీయాల్లోనూ మరో కె.ఆర్‌.గౌరీ అమ్మలాగానో, బృందా కారత్‌ లాగానో ఎదిగేవారేమో!
పరిపూర్ణ గారిది స్వతంత్ర వ్యక్తిత్వం. ఎవరి అదుపునకూ లొంగనిది. ఆధిపత్యాలను సహించనిది. ఆత్మ గౌరవమే ఆమె ఆస్తి. దానికి భంగం కలిగించే దేన్నీ ఆమె జీవితంలో ఆమోదించలేదు.
ఈ మధ్యే దాసరి శిరీష జ్ఞాపికగా ‘జక్కీకు’ నవలని ప్రచురించి ఎండపల్లి భారతికి అందించడానికి హైదరాబాద్‌ వచ్చినపుడు అపర్ణ దగ్గర పరిపూర్ణ రెండు మూడు వారాలు గడిపారు (అదే చివరి కలయిక అవుతుందని ఊహించలేదు). అప్పుడు ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో తమ చిన్నప్పుడు మాలదాసరులు, తక్కిన మాల కులస్తుల కంటే తమను పవిత్రంగా అధికులుగా భావించే వారనీ, తమ ఇంట్లోకి కూడా వారిని రానిచ్చేవారం కామని చెప్పి బాధపడ్డారు. దేశంలో ఊడలు తన్ని పాతుకుపోయిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోని ఆధిక్య న్యూనతల గురించి స్పష్టమైన విమర్శనాత్మకమైన యెరుక ఆమెకు ఉంది అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఆమె రచనల్లో సైతం సందర్భానుగుణంగా పాత్రల ముఖతా కుల మత వర్గ జెండర్‌ ఆధిపత్యాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
శిరీష గారికి నివాళిగా ‘శిరీష కోమలం’ సంస్మరణ సంచిక తెచ్చిన తర్వాత ‘అమ్మ బతికి ఉన్నప్పుడే ఆమె సాహిత్య సాంస్కృతిక జీవితం గురించి మూల్యాంకనం చేస్తూ సావనీర్‌ చేస్తే బాగుంటుంది’ అని అమరేంద్రకి వేమూరి సత్యం గారు సూచించారు. శిరీష సంస్మరణ సంచిక తయారు చేసే క్రమంలో నన్ను వాళ్ళ కుటుంబంలో కలిపేసుకున్నారు. బెజవాడ, ఏలూరు, కాకినాడ, చిత్తూరు, హైదరాబాద్‌… శిరీష బంధుమిత్రులు అందరూ, ముఖ్యంగా పరిపూర్ణ గారి చిన్న కొడుకు శైలేంద్ర, మేనకోడళ్ళు శైలజ, మనోజ, మాధవి (ఆశ్చర్యంగా అందరూ సాహిత్య జీవులే) ఎన్నడూ ముక్కూ మొహం చూడని నన్ను తమవాడిగా ఆమోదించారు. అపర్ణ ప్రాణానికి మరో మామయ్య దాపురించాడు. అయితే పరిపూర్ణ పుస్తకం దగ్గరికి వచ్చేసరికి ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో అంశాలను అది నా ముందు కుప్పవోసింది. పరిపూర్ణ సాహిత్యపు లోతుల్ని తవ్విపోసింది. అందులో తలమునకలయ్యాను. సాహిత్య విద్యార్థిగా మరిచిపోలేని అనుభవాన్ని ఆ గ్రంథ సంపాదకత్వం నాకు అందించింది. ఊరూ పేరూ తెలియని నన్ను వ్యక్తిగతంగా ఆమెకు సన్నిహితం చేసింది.
ఎంతగా అంటే… ‘నేను నీ పుత్రికను’ అన్నారామె. ‘ఒక దీపం వేయి వెలుగులు’ పేరుతో ఆమె జీవిత సాహిత్య వ్యక్తిత్వాల్ని అంచనా వేస్తూ నూరు మందికి పైగా రచయితల రచనలతో సావనీర్‌ తెచ్చి ఆమెకు పునర్జన్మ ఇచ్చానట. అందుకు ఆమె స్పందన ఇది.
ఆమెను నేను తల్లిగా సంభోదిస్తే ఆమె నన్ను నాయనగా సంబోధించడం గమ్మత్తుగా లేదూ! అచ్చం అమ్మ తన బిడ్డ కడుపున / ఒడిలో మళ్ళీ పుట్టినట్లు. నాకు కొత్త బట్టలు కొనివ్వమని అపర్ణని శతపోరింది. అమ్మలందరూ అంతే అంటాడు అమరేంద్ర.
మరో ముచ్చట ఏమంటే ` పరిపూర్ణ గారి తల్లిగారిది బండారు గూడెం. మా ఊరు వీరవల్లికి (ఒకప్పటి గన్నవరం తాలూకా) ఒక దిక్కున శివారు గ్రామమే. ఆమె పుట్టిన బొమ్ములూరు మరో దిక్కున కూతవేటు దూరాన ఉంటుంది. ‘ఎర్ర లచ్చుప్ప’ కథలోని సిరివాడ (వేలూరు శివరామశాస్త్రి గారి సొంతూరు) కరణం గారి పొలం, మా పొలం పక్కపక్కనే. ఈ విషయాలు పంచుకున్నప్పుడు ఆమె ముఖం ఎంత వెలిగిపోయిందో! ‘మనం ఎంత దగ్గర వారం’ అని మురిసిపోయింది. ఇద్దరం ఒకే గడ్డపై ఊపిరి పోసుకున్నందుకు, బాల్యపు ఒంటికి ఒకే మట్టిని పూసుకున్నందుకు, ఒకే నీరు తాగినందుకు, ఒకే నేలపై ఒకే కాలంలో, ఒకే విధమైన ఆలోచనలతో జీవించినందుకు నాకు గర్వంగా అనిపించింది.
జీవితంలో వచ్చిన కష్టాలన్నింటినీ పరిపూర్ణ ఛాలెంజ్‌గా తీసుకొని ఎదుర్కొన్నారు. తనలోని సృజనశీలతను కాపాడుకున్నారు. అదే ఆమె బతుకుని నవ నవోన్మేషంగా ఉంచుకోవడానికి తోడ్పడి ఉంటుంది. జీవన పరిమళాన్ని పదుగురికీ పంచడానికి దోహదం చేసి ఉంటుంది. ఆమె పరిపూర్ణమైన జీవితంలో ఎప్పుడూ ఎక్కడా రాజీపడలేదు. తుది శ్వాస వరకూ సమాజం పట్ల సడలని నిబద్ధత, సాహిత్యం పట్ల చెదరని మోహం, మంచి పట్ల విడవని విశ్వాసం, మనిషి పట్ల చెరగని ప్రేమ ఆమె కోల్పోలేదు. ఆమె జీవితమే ఒక నేర్చుకోవాల్సిన పాఠ్యం. తాను తిరుగాడిన కంటకావృత సీమల్ని ఆమె పూల తోటలుగా తీర్చిదిద్దుకుంది. రాళ్ళూ రప్పలతో నిండిన ఇరుకు దారుల్ని రాచబాటగా పరచుకుని జయించింది. వడగాడ్పుల్ని మలయ మారుతాలుగా మలచుకుని ముందుకే నడిచింది. తన జీవితాన్ని వెలిగించుకొని మరెందరికో మార్గదర్శనం చేసింది. ఆమె చూపిన వెలుగుదారుల్లో నడవడమే ఆమెకు మనం ఇవ్వగల నిజమైన నివాళి.
(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ సౌజన్యంతో….)

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.