ఒక మహిళా యోద్ధ – ఉష (సీతరామలక్ష్మి పోల)

ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో ఐదవ పిల్లగా పుట్టి, భగవద్గీత పద్యాలు కంఠస్థం వచ్చిన తల్లి లక్ష్మమ్మ పెంపకంలో చక్కటి పాటలు, నడవడిక నేర్చారు పరిపూర్ణ. టీచర్‌ వృత్తితో పాటు, నాటక ప్రదర్శన ఇత్యాది తనకిష్టమైన, సాధ్యమైన అనేక మార్గాల ద్వారా సంపాదన పెంచుకుంటూ కుటుంబాన్ని పోషించే తండ్రి లక్ష్మయ్య గారి ప్రభావంతో చిన్నతనం నుండి ధైర్యసాహసాలు, చొరవ కలిగి చక్కటి గుర్తింపు పొందుతూ ఎదిగిన పరిపూర్ణ సార్థక నామధేయురాలు.

యుక్తవయసు వచ్చేనాటికే రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రసిద్ధులైన వ్యక్తుల సాంగత్యం, సాహచర్యం వల్ల ఆమెకు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలకు చెందిన ప్రాథమిక అవగాహన ఏర్పడిరది. బాల్యంలో ‘భక్తప్రహ్లాద’లో నటించినప్పుడు చూసిన విస్తృత ప్రపంచం, గదర్‌ మూలాల దర్శి చెంచయ్యగారి ఇంట మద్రాసులో ఉండి చదువుకోవడం, రేడియో కార్యక్రమాలు, ఆ తర్వాత రాజమండ్రిలో పార్టీ పూనికతో విద్యాభ్యాసం, మహీధర సోదరుల ఇంట సభ్యురాలిగా మెలగడం, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనడం, చదువు, ఆటపాటలలో రాణించడం… ఈ పునాది ఆమెకు జీవితపర్యంతం ఒక దీపస్తంభంగా దారి చూపింది. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. చదివే రోజుల్లోనే ఎస్‌ఎఫ్‌.ఐ. (స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పట్టణ విద్యార్థి నాయకురాలిగా చురుకైన పాత్ర, స్కూలు యాజమాన్యం, ఫైనల్‌ పరీక్షలకి పంపటానికి ఆరు నెలల పరీక్షల ప్రాతిపదికన జరిపే డిటెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా సమ్మె, దాని విజయం, కాకినాడ పి.ఆర్‌.కాలేజి విద్యార్థి సంఘాల్లో చురుకైన పాత్ర, సీనియర్‌ ఇంటర్‌కి వచ్చేసరికి జిల్లా ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నిక, అదే సమయంలో 1949 డిసెంబర్‌లో రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ మహాసభలు, వాటి నిర్వహణకు నిర్విరామ కృషి, అందులో చివరి రోజు అరెస్టు ` ఈ విధంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ, మంచి నాయకురాలిగా ఎదిగే ప్రతిభను కనబరుస్తూ వచ్చారు పరిపూర్ణ.
ఇంటర్‌ వేసవి సెలవుల్లో మురికివాడల్లో మహిళా సంఘాల నిర్మాణంలో చురుకైన పాత్రను పోషించారు పరిపూర్ణ. మూఢవిశ్వాసాల నుండి, భావదాస్యం నుండి బయటపడి బతకాలన్న దృఢ సంకల్పానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిరదని అంటారామె.
ఈ మహాసభల నిర్వహణ ఏర్పాట్లలో రెండు నెలల కాలం సభల ఏర్పాట్లు, నిర్వహణ సంబంధిత చర్చల్లో ఏర్పడిన పరిచయం, అభిప్రాయం, దాసరి నాగభూషణరావు గారు ` సహచరిగా చేసుకునే ఉద్దేశం తెలియజేస్తూ, పరిపూర్ణగారి అభిప్రాయం కోరుతూ మిత్రుడి ద్వారా లేఖ పంపించడం వారి భావి వైవాహిక జీవితానికి దారితీశాయి. ముందు నుండి కమ్యూనిస్టు నాయకుడిగా ఉన్న అన్న, ఆ భావజాలం పట్ల సానుభూతి కలిగిన కుటుంబం, ఈ వివాహానికి ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. పైగా వాళ్ళు దాసరి మంచి నాయకుడు అనే సదభిప్రాయమే కలిగి ఉన్నారు. విద్యార్థి లోకమంతా హీరోగా ఆరాధిస్తున్న వ్యక్తి నుండి అలాంటి సందేశం రావడం ఎంతో గొప్పగా, గర్వంగా, ఆ సందేశం ఎంతో నిజాయితీగా, ఆ ప్రతిపాదన తనకెంతో ఇష్టమైన కులాంతర వివాహానికి ఒక అవకాశంగా అనిపించింది ఆ 18 ఏళ్ళ యువతి పరిపూర్ణకి. పెళ్ళిని దాసరి అజ్ఞాత సమయంలో ఉన్న సమయంలో అతి రహస్యంగా, విద్యార్థుల సమావేశంలా జరగడం ఒక ప్రత్యేక అనుభవంగా, వినూత్న, వీరోచిత కార్యభావన కలిగించాయి ఆమెలో. అజ్ఞాతంలో సంసారం, గర్భిణిని వదిలి దాసరి గారు అంతు దొరకని ప్రదేశానికి అజ్ఞాత ప్రయాణం… అలా మొదలైంది వారి కొత్త కాపురం.
20 ఏళ్ళ వయసులో 1951లో తొలిచూలు పాప శిరీష జననం, ఇక్కడి పోలీసులు గుర్తుపట్టి ప్రశ్నించే అవకాశం లేకుండా ఉండడం కోసం మద్రాసు పయనంÑ పార్టీ అక్కడ జరుగుబాటు ఏర్పాట్లు నిర్వహించడం, అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు డిగ్రీ మూడవ సంవత్సరం విద్యార్థి చదువు వదిలి మద్రాసులో ఉద్యోగం సంపాదించి వీరి పోషణభారం వహించడంÑ అదే నిబద్ధతతో పరిపూర్ణ, ఆరు నెలల పాటు చంటిపాపను చంకన వేసుకుని 1952లో జనరల్‌ ఎలక్షన్లలో పార్టీ తరపున ప్రచారం`నాటకాలు, పాటలు వీటన్నింటిలో చురుగ్గా పాల్గొని పార్టీ విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించడంÑ ఇదే సమయంలో దాసరి గారు అజ్ఞాతం నుండి బయటపడి, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, కలకత్తాలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం…. అలా సాగింది మలి మజిలీ.
ఎన్నికలలో ప్రచారం తర్వాత ఒంటరిగా మద్రాసులో ఉండటం అనవసరం అనిపించి, దాసరి గారిని సంప్రదించి బండారుగూడెం చేరడంÑ అక్కడ పుట్టింటికి భారం కాకూడదని, తల్లి తోడుగా ఏలూరు చేరుకుని మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ టీచర్‌గా చేరికÑ అప్పుడప్పుడూ దాసరి గారి రాకపోకలు, స్వల్ప జీతం, సహాయం చేయమని దాసరి గారు వ్రాయటంÑ పల్లెటూళ్ళలో ఉండే తీవ్ర కులాల పట్టింపుల మధ్య వారి తల్లిగారు నెలనెలా బియ్యం, పప్పు, ఉప్పులు అందించటంÑ వారి చెల్లెళ్ళు పద్మినీదేవి, అన్నపూర్ణమ్మ వదినలు బట్టలు, పిండి వంటలు అందిస్తూ ఆదుకోవటం పరిపూర్ణ గారికి గొప్ప ఊరట, సంతోషం, కృతజ్ఞత ఇలా కొనసాగింది మూడవ మజిలీ.
ఏలూరు సెయింట్‌ థెరిస్సా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌లో (రెండు సంవత్సరాలు) చేరి, ఆ స్టైఫండ్‌తో ఇల్లు నెట్టుకొస్తూ సాగించిన అరకొర సంసారంÑ ట్రైనింగ్‌ పూర్తయ్యేసరికి ముగ్గురు పిల్లలుÑ వారి పోషణ, పెంపకం పెద్ద సవాలుగా పరిణమించిన ఆర్థిక స్థితులు, మూడవ మజిలీ చివరి నాటి పరిస్థితులు.
1955 కల్లా ఇటు టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి, అటు దాసరి గారు పూర్తి కాల కమ్యూనిస్టుగా కార్యరంగంలోకి మార్పుÑ నూజివీడు తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు, వెరసి నూజివీడులో కాపురంÑ ప్రైవేట్‌ స్కూళ్ళలో అరకొర జీతాలు, భూస్థితి బాగున్న కుటుంబం కావడం వల్ల దాసరి గారికి హోల్‌ టైమర్‌ అలవెన్స్‌ లేకపోవటంÑ వారి స్వంత ఊరు దిగవల్లి నుంచి పాలు, కూరగాయలు తదితరాలు అందుతున్నా అస్తు బస్తు సంసారం.
ఆలుమగల అనుబంధంలో అపశృతులుÑ ఈ సమయానికి పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న దాసరిÑ సంసారంలో మునిగి తేలుతూ, పిల్లల పోషణ`పెంపకం ఎలా? ఇంటి ఆర్థిక అవసరాలు ఎలా తీరాలి? అనే చింతే తప్ప మరొక విషయం ఆలోచించే అవకాశం లేని పరిపూర్ణ. ఈ విధంగా ఇద్దరి మధ్య లక్ష్యాల్లో అంతరం ఏర్పడి అగాధానికి దారితీసిందని అనిపిస్తుంది నాకు.
చిన్నతనం నుండి చొరవ, చురుకుదనం, తెలివితేటలతో అందరిలో గుర్తింపు పొందుతూ, చదువు, పాటలు, నాటకాలు, సినిమాలు, సమాజ సేవ, రాజకీయాలు… అన్నింటా ముందుండి విజయాలు అందుకుని విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తూ పట్టణ విద్యార్థి నాయకిగా, నిబద్ధత కలిగిన పరిపూర్ణ గారు.
విద్యార్థి నాయకుడిగా, రాష్ట్ర స్థాయి సెక్రటరీగా, జీవితకాలపు కమ్యూనిస్టు నాయకుడిగా నిబద్ధత కలిగిన, అంకితభావంతో పనిచేసిన ఎన్‌.ఆర్‌.దాసరి గారు. ఒకే లక్ష్యం… ఒకటే గమ్యం… ఒకటే నిబద్ధత… ప్రధాన ఆకర్షణగా ఒకటైన వీరిద్దరి వైవాహిక బంధం, ఒకరికొకరు సరైన జోడీగా కలిసి సాగే క్రమంలో అందంగా రూపుదిద్దుకోవాల్సిన కుటుంబ జీవితం అర్ధాంతరంగా, అపశృతులతో ముగిసిపోవడం నన్ను చాలా ఆలోచింపజేసింది.
వైవాహిక జీవితంలో ఏర్పడే అగాధాలకు, భార్యాభర్తల బంధం గాఢమైన స్నేహబంధంగా పరిణతి చెందకపోవడం కారణమని అనిపిస్తుంది నాకు. ఇద్దరూ కలిసి పనిచేసే విషయాలు, గడిపే సమయం, పంచుకునే అనుభూతులు, అవగాహనలు, అవసరాలు ఈ అనుబంధాన్ని సహజంగా ఏర్పరుస్తాయి, పెంపొందిస్తాయి.
పిల్లలు, వారి పెంపకం, కుటుంబ నిర్వహణ, ఉద్యోగ ధర్మం… వీటన్నిటి మధ్య సహజంగా తగ్గిన పంచుకునే సమయం, పంచుకునే విషయాలని కుదించి వేస్తుంటే… ఎవరి బాధ్యతల నిర్వహణకి, లక్ష్యాల గమనానికి, అవరోధం ఏర్పడితే వారు రెండవ వారు ఆ నిర్వహణలో, గమనంలో భుజం కలపలేదని, సహకరించలేదని, సహానుభూతి పంచలేదని, అసంతృప్తిని పెంచుకుంటూ, పంచుకుంటూ, ఆ అసంతృప్తుల పునాదుల మీద కొనసాగించే బంధాలు డొల్లగా, పెళుసుగా తయారయ్యి… కొనసాగి… నిత్య జీవిత సంఘర్షణా అలల తాకిడికి భళ్ళున బద్దలవుతున్నాయి.
సామాజిక అసమానతల పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు కూడా (ఆడా మగా ఇద్దరూ కూడా) వైవాహిక వ్యవస్థలో మహిళల విషయంలో అట్టడుగున ఉన్న వివక్ష గుర్తెరగకుండా, మనం చూస్తున్న, పెరిగిన, అలవాటైన, అసమాన వైవాహిక వ్యవస్థ పద్ధతుల క్రమంలోనే ఆలోచిస్తూ, ఆశిస్తూ, కొనసాగిస్తూÑ గృహ నిర్వహణ, పిల్లల పెంపకం, అతిథి అభ్యాగతుల రాకపోకలు, మర్యాద, మన్ననలు… మహిళలు నిర్వహించవలసిన భాగంగానే భావిస్తూ, అందులో లోటుపాట్లకు వారినే బాధ్యులను చేస్తూÑ ప్రస్ఫుటంగా అసమానతలుగా కనిపిస్తున్న, గుర్తింపబడిన కొన్ని విషయాలలో మార్పును అమలు చేస్తూ, తాము ప్రగతివాదులమనే భ్రమలలో బతికేస్తున్న మనం… కొంచెం కళ్ళు విప్పార్చి, మనం ‘పొరపాట్లని’, ‘తప్పులని’ గ్రహించకుండా, గుర్తించకుండా చేస్తున్న ఘోరాలు ఎలా మన కుటుంబ బంధాలను బలహీనపరుస్తున్నాయో తెలుసుకోవటానికి ఈ నిజ జీవిత గాథ సోపానమౌతుందని అనిపించింది నాకు.
‘వెలుగు దారులలో’… చదివిన వెంటనే యాదృచ్ఛికంగా జెన్నీ మార్క్స్‌ జీవిత సంగ్రహం చదవటం తటస్థపడిరది. అది కూడా ఉద్యమ జంట. వారు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు అపరిమితం. ఆర్థిక ఇబ్బందులలో కన్న పిల్లలను కూడా కోల్పోయిన సందర్భాలను ఎదుర్కొన్నారు. కానీ చివరివరకూ ఒకరికొకరు తోడు, నీడగా గొప్ప ప్రేమజంటగా మిగిలారు. ఎందుకో ఈ రెండు జంటల జీవితాలను పోల్చి చూడటం ద్వారా ఎక్కడ అపశృతి దొర్లింది, ఎందుకు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడిన, నిజాయితీ గల వ్యక్తుల అనుబంధం అర్థాంతరంగా ముగిసింది?? అనే సందేహాలకు సమాధానం దొరుకుతుందేమో వెతికే ప్రయత్నం చేద్దాం అనిపించింది. ఆ వెతుకులాటలో నాకు తోచిన కొన్ని విషయాలను ఇక్కడ పంచుకుంటున్నాను. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే తప్ప సైద్ధాంతిక చర్చ కాదు, సిద్ధాంత ప్రాతిపదిక అంతకన్నా కాదు. దీన్ని కేవలం సామాన్య పాఠక అభిప్రాయంగా పరిగణించవలసిందిగా ప్రార్థన. ఈ వ్యాసం రాసే క్రమంలో ‘ప్రేమ`పెట్టుబడి’ (మార్క్స్‌ కుటుంబ జీవిత గాథ) కూడా కొంత చదివాను.
‘రాత్రి పగలు పార్టీ పనుల్లో మునిగి ఉండటం వల్ల, అటు కన్నవాళ్ళను గానీ, ఇటు తన కుటుంబ వ్యవహారాలు కానీ పట్టించుకోకపోవడం స్వాభావికమైంది ఆయనకు. విద్యార్థి దశలో నిరాటంకంగా సాగిపోయిన తీరు… సంసార స్థితిలోనూ అలాగే కొనసాగుతున్నది,’ అంటారు దాసరి గారి గురించి పరిపూర్ణ గారు ఒకచోట.
దాసరిగారు అజ్ఞాతంలో ఉండగా పెళ్ళి జరగటం, రహస్యంగా అప్పుడప్పుడూ కలుసుకునే పరిస్థితి, సంవత్సరం లోపు భార్యకు కూడా తెలియని, తెలియకూడదని అజ్ఞాతం, గర్భవతిగా ఉన్న భార్య పోషణ భారం పార్టీ వహించటమే తప్ప దాసరి గారికి అవకాశం లేకపోవటం, తర్వాత కూడా మరో మూడు, నాలుగు సంవత్సరాలు తలొకచోట ఉండవలసి రావటం, ఈ మధ్యలో కలిగిన ముగ్గురు పిల్లలు, వారి ఆలనాపాలనా సంబంధిత బాధ్యతలకు దాసరి గారు తన తల్లిదండ్రుల సహాయ సహకారాలు అర్థించారు తప్ప స్వయంగా ఆ పరిస్థితులలో సహచరి పక్కన ఉండటం కానీ, ఇబ్బందిని కలిసి అధిగమించటం కానీ జరగలేదు. తీరా 1955లో నూజివీడులో ఒక దగ్గర ఉండే పరిస్థితుల సమయానికి తాలూకా కార్యదర్శి బాధ్యతలతో మునిగితేలుతూ సంసార విషయపు మాటలు చర్చలకే కాదు,
ఉద్యమ, రాజకీయ విషయాలు కూడా సహచరితో కలిసి ఆలోచించడం, చర్చించటం లేదా పంచుకోవటం వంటి వాటి అవసరం, అవకాశం కూడా లేనంతగా వారి ప్రపంచం, సమయం నిండిపోయినట్టు కనిపిస్తుంది.
కార్యకర్తలు, రైతు నాయకులు, స్నేహితులు వస్తే భోజనం ఏర్పాటు చేయమని, ఇంట్లో ఏముందో లేదో చూసుకోకుండా, తెలుసుకోకుండా పురమాయించే అనేకమంది మగవారిలాగే ‘దాసరి’గారు కూడా ప్రవర్తించారు. ఇది వీరి అవగాహనా లోపం. ఎప్పుడూ గృహ నిర్వహణ వహించలేదు, అటువంటి పరిస్థితులు ఎదుర్కొని లేరు, దానిపట్ల ఎరుకే లేదు. వచ్చిన వారికి భోజన వసతి ఏర్పాటు చేయాలనే సద్భావనే తప్ప, దానికి కావలసిన వనరులు, సమయం, శ్రమ, అవకాశం గురించిన ఆలోచనే లేని ‘సగటు’ మగవారిలాగే, అసమానతలు లేని, సమసమాజ స్థాపనకు నిరంతరం అలుపెరగక శ్రమించిన ‘దాసరి’గారు కూడా ప్రవర్తించడం, అసామాన్యమైన అవగాహనతో, తెలివితో, నిబద్ధతతో ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడకుండా అసమానతలకు, సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండి కూడా… కుటుంబ వ్యవస్థలో ఉన్న నిత్య జీవితపు అతి సామాన్య విషయాలలో ఇబ్బందులు, సమస్యలు, అసమానతల పట్ల ఏ మాత్రం ఎరుక లేకుండా, గుర్తించకుండా, అనుకూలంగా ఉన్న అలవాటైన విధానాన్ని కొనసాగించే నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది.
కుటుంబ విషయాలు అనవసరమైనవి, విలువలేనివి, పనికిరానివి… ఉద్యోగ విషయాలు, ప్రపంచ విషయాలు ప్రధానమైనవి, గొప్పవి, విలువైనవి, విలువ పెంచేవి, అభివృద్ధిని అందించేవి అనుకునే అనేకమంది ఆలోచనా ధోరణికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
నూజివీడులో ఉన్న సమయంలో ఆర్థిక విషయాలలో అప్పుడప్పుడూ జరిగే వాదులాటలలో ఒక సందర్భంలో నిన్ను పెళ్ళి చేసుకొని 50 వేల కట్నం వదులుకున్నాను, గొప్ప త్యాగం చేశాను అన్నట్లు ‘దాసరి’గారు మాట్లాడిన సందర్భం లాంటివి కేవలం క్షణికావేశంలో మాట జారటంగా కొట్టిపారేయలేము. తనని ప్రశ్నిస్తే సహించలేక నిద్రలేచే మనిషి ‘అహం’ ఎదుటి మనిషి కోసం తానేం కోల్పోయానో, ఏం త్యాగం చేశానో వెతికి చెప్పి, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నానికి పురిగొల్పి, మనిషిని విచక్షణారహితుల్ని చేస్తుంది. నిజంగా పెళ్ళి చేసుకునేటప్పుడు లేని ఆలోచనలు ‘అహం’ తన ఆధిపత్యం కోసం సృష్టించి, స్థిరపరుస్తుంది. అలా స్థిరపడుతూ వచ్చిన ఆలోచనలే అగాధాలనేర్పరుస్తాయి.
పిల్లల్ని దగ్గరకి తీయకపోవటానికి కారణం ‘అతనితో సమానమైన కులం లేకపోవటం’ అని పరిపూర్ణ గారికి అనిపించడాన్ని నిరాధారమైన అనుమానమని పక్కన పెట్టొచ్చేమో… స్వతహాగా అంతర్ముఖుడు కావటం కారణం కావచ్చునని సమర్ధించుకోగలమేమో… కానీ ఇల్లు ఎలా గడుస్తుంది? పిల్లలు తిండికి ఎలా అవస్థపడగలరు అని ఆలోచించకపోవడం, ఉద్యోగానికి అడ్డుపడటం బాధ్యతా రాహిత్యాన్ని, వాస్తవ దృక్పథలేమిని సూచిస్తాయి. పైగా ఉద్యోగంలో చేరమని వచ్చిన ఉత్తర్వును చింపి పోగులు పెట్టడం, ఆ గవర్నమెంటు ఉద్యోగం చేయడం పార్టీ పంథాకి వ్యతిరేకం అనడం, ఈ ఆగడానికి అడ్డుపడబోయిన అత్తగారిని కొట్టబోవడం ఇవన్నీ ఇందాకే వివరించిన ‘అహం’ సృష్టించి, స్థిరపరచిన ఆలోచనల కొనసాగింపు, పరాకాష్ట.
అలాగే ఇన్నింటి తర్వాత, భార్య బంటుమిల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కేవలం నెల చివరి వారంలో రెండు రోజులే రావటం, భార్య ఉద్యమానికి ఈ విధంగానైనా సహకరిస్తున్నాను అనే సద్భావనతో అందించే ఆర్థిక సహాయం అందుకోవటం తప్ప, తాను
ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసినప్పటికీ, ఇద్దరూ కలిసి ఏర్పరచుకున్న కుటుంబంతో కనీసం ఉద్వేగాలు పంచుకోవాలని కోరిక, తీరికా లేకపోవడం… ఆశ్చర్యకరం, శోచనీయం. కనీసం పిల్లలతో సరదాగా సమయం గడపటం, ప్రేమను పంచటం, స్నేహం పెంచుకోవడం జరగకపోవడం భావోద్వేగాల బంధాన్ని లుప్తం చేసింది. ఇవన్నీ వారిమధ్య బంధాన్ని బలహీనపరిచేవే తప్ప బలపరిచేవి కాదు, పెంపొందించేవి అసలే కాదు. చివరిసారిగా దాసరి గారు ఆ నెల కొంత ఎక్కువ మొత్తాన్ని కావాలని కోరటం, ఆ సమయంలో ఇంటి అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు పరిపూర్ణ గారి మీద కలిగించిన ఒత్తిడి కలిసి, సహచరులిద్దరి మధ్య ఃసంభాషణ దారితప్పి డబ్బు కోసమే వస్తున్నావా అంటే, అవమానపడి ఆవేశంతో, డబ్బు కోసం ఇక్కడికే రావలసిన అవసరం లేదని, మళ్ళీ ముఖం చూడనని దాసరి గారు వెళ్ళిపోవడంతో ముగిసిపోయింది ఆ బంధం.
ఇక్కడ కూడా, అప్పటికే ఆలోచనల దారితప్పించిన ‘అహం’ మరొక్కమారు సమర్ధవంతంగా తనని తాను స్థిరపరచుకుంది. ‘డబ్బులే కావలసి వస్తే, నాకు దారి లేదా? నేనెన్నడో వద్దనుకున్నా. నా ప్రేమ, పెళ్ళి, పిల్లలతో సహా నన్ను ఆమోదించడానికి సిద్ధపడ్డ నా మొదటి వివాహం, ఆ భార్య, కుటుంబం లేవా? అవేవీ వద్దనుకున్న నా నిబద్ధతని గుర్తించకుండా నిందిస్తావా?’ అని మనసులో చిందులు వేయించి, తన అయిష్టతని మరచి, ఏ ఇష్టం లేని వివాహాన్ని విడాకులిచ్చి రద్దు చేసుకున్నారని పెళ్ళికి ముందు పరిపూర్ణ గారికి చెప్పారో, అదే వివాహబంధం పునరుద్ధరించుకుని, పరిపూర్ణ తనని తప్పుగా నిందించిందనే కోపాన్ని కొనసాగించి, చివరికి కూతురి పెళ్ళి శుభలేఖ తీసుకుని ఆహ్వానించడానికి వెళ్ళిన కొడుకు అమరేంద్ర, బావమరిది జనార్ధన్‌ల (పరిపూర్ణ గారి తమ్ముడు) ఆహ్వానాన్ని నిష్కర్షగా తిరస్కరించడమే కాక, పెళ్ళితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, శుభలేఖలో తన పేరు ఎవరి అనుమతితో వేశారని అర్థరహితంగా ప్రశ్నించేందుకు పురిగొల్పింది. అందుకే ఆనందంలో వాగ్దానాలు, ఆవేశంలో నిర్ణయాలు చేయకూడదు అంటారు. అవి అహాన్ని బలోపేతం చేస్తాయి తప్ప వ్యక్తిత్వాన్ని కాదు. శిరీష పెళ్ళికి తండ్రి గైర్హాజరు అయినప్పటికీ, మేనత్త పద్మిని పెళ్ళికి సహాయ సహకారాలు అందించి, భర్త పూర్ణచంద్ర రావు గారితో కలిసి హాజరై, ఆశీర్వదించడం ఒక ఆనందకర పరిణామం.
ఇక్కడ ఎక్కడో తన ‘నిబద్ధత’ ఎవరికోసం? ‘ఎవరినో ఉద్ధరించటానికా? ఎవరో గుర్తించటం కోసమా?’ అని ‘అహాన్ని’ ఎదిరించి ప్రశ్నించి ఉంటే, ‘నిబద్ధత’ అనేది, తాను అది సరైన ప్రవర్తన లేదా ధర్మం అనుకోవటం వల్ల ప్రదర్శించినది అని గుర్తెరిగి, ఆ నిబద్ధత కొనసాగి ఉండేది. ఎదుటి మనిషి తన ప్రవర్తనకి తప్పుడు భాష్యం చెప్పి ఉండొచ్చు, అవమానపరిచే ఉండొచ్చు, అది ఏ పరిస్థితిలో? ఆ పరిస్థితిలో తన భాగమెంత? తానెన్నిసార్లు అవమానించలేదు? మాట తూలలేదు? అనే తర్కం వెలుగు చూసేది.
కూతురు పెళ్ళి సమయానికి అంత నిష్కర్షగా వ్యవహరించిన దాసరి గారు, కొడుకు అమరేంద్ర పెళ్ళికి, వియ్యంకుడి పిలుపుని మన్నించి హాజరవడం ఆయనలో మొదలైన పునరాలోచనకి ప్రారంభం అనుకోవాలేమో!!! మరి అదే మనిషి, చిన్న కొడుకు శైలేంద్ర పెళ్ళికి, అందునా వామపక్ష కుటుంబంతో వామపక్ష పద్ధతిలో జరుగుతున్న వివాహానికి, తనకి రాష్ట్ర పర్యటన పనులున్నాయి అంటూ రాకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు… ఊహకందలేదు.
ఇక ఇప్పుడు జెన్నీ, మార్క్స్‌ల జీవితం దగ్గరకొస్తే, 19వ శతాబ్దం ప్రథమార్ధంలో జీవితం ప్రారంభించిన జెన్నీ, తన కర్తవ్యం,
ఉన్నతాశయాల కోసమే జీవితమన్న యువకుడికి అన్ని విధాలుగా అండగా ఉండటం, అతడు తన కలల్ని సాకారం చేసుకోవటానికి సాయం చేయడమే అని నిశ్చయించుకుంది. అలాగే రాచరిక కులీన వంశానికి చెందిన జెన్నీ పెరిగిన నేపథ్యం, సంస్కృతుల ప్రభావం, ఎలాంటివాడైనా భర్తకి సహకరించే భార్యగానే మహిళలు ఉండే ఆనాటి సామాజిక నేపథ్యం కూడా వారి బంధంలో కొంత పాత్ర వహిస్తాయి. ప్రధానంగా వారి ప్రేమ, ఎంగేజ్‌మెంట్‌ నుండి ఆరేళ్ళ తర్వాత పెళ్ళి వరకు వారి మధ్య కొనసాగిన లేఖలు, విరహాలు… ఇవన్నీ వారి మధ్య అనుబంధాన్ని దృఢతరం చేశాయి. అలాగే కుటుంబంతో మార్క్స్‌ భావోద్వేగపూరిత సంబంధం కలిగి ఉన్నాడు. మార్క్స్‌ పుంఖాను పుంఖాలు రచనలు చేస్తూ, గంటలు, గంటలు చర్చల్లో గడిపేటప్పుడు వాటన్నిటిలో జెన్నీకి భాగం ఉండేది. పిల్లలు అనారోగ్యానికి గురైతే, జెన్నీతో పాటు పిల్లలను చూసుకుంటూ, ఆమె ఆందోళనలో భాగం పంచుకుంటూ, ఆమె దుఃఖంలో పాలుపంచుకుంటూ, ధైర్యం చెబుతూ, స్వయంగా దుఃఖిస్తూ, నిద్రలేని రాత్రులు కలిసి గడిపేవాళ్ళు వాళ్ళిద్దరూ.
జెన్నీ కులీన ధనిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల, ఆమె పెద్దల అంగీకారంతో ఈ పెళ్ళి జరగటం వల్ల, కనీసం ప్రారంభ సంవత్సరాలలో కొంత ఆర్థిక వెసులుబాటు దక్కేది. అలాగే రెండవ పిల్లతో పాటు పుట్టింటి నుంచి సహాయకురాలిగా ‘లెంచెస్‌’ రావటం జెన్నీకి ఇంటి పనుల నుండి విశ్రాంతి దొరికింది. ఇటువంటివి ఎన్నో వారి అనుబంధం బలపడటంలో ప్రముఖ పాత్ర పోషించాయి.
అందుకే అనుబంధం బలపడటానికి పరిస్థితులు ప్రతికూలిస్తున్నప్పుడు, పలుచబడుతున్న బంధాన్ని గుర్తెరిగి, పెంపొందించేందుకు ప్రత్యేక ప్రయత్నం జరగని పక్షంలో, ఎన్ని సారూప్యతలున్న జంటలైనా, వివాహంతో ఏకమైనా, సహజీవనంతో కలిసి మిగిలే ప్రయత్నం చేసినా… వారి అనుబంధం సంతోషంగా, సంతృప్తిగా కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతాయి.
ఏదేమైనప్పటికీ, పలుచబడిన బంధం ఒక ఆవేశపు క్షణం ఆధారంగా మిగలకుండా పోయినప్పటికీ, ఉద్యోగిగా అవకాశం
ఉన్నంతమేర సమాజసేవ చేస్తూ, ఉద్యోగపర్వంలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ, ఒంటరి తల్లిగా, తన తల్లి సహకారంతో, తన ప్రతిభను, ప్రవర్తనను గుర్తెరిగి సహకరించిన మిత్రులు, బంధువుల మద్దతుతో, ముగ్గురు పిల్లలను బాధ్యత గల పౌరులుగా, సాహిత్యకారులుగా, కళాకారులుగా, అన్నింటికన్నా ముఖ్యంగా మంచి మనుషులుగా తీర్చిదిద్ది, సమాజంలో స్థాయి, గుర్తింపు కలిగిన మంచి కుటుంబాలతో వియ్యమంది, మనుమలు, మునిమనుమలతో చక్కటి కుటుంబం ఏర్పరచుకున్న నంబూరి పరిపూర్ణ, పరిపూర్ణ వ్యక్తి.
జీవితపు అలుపెరుగని పోరాటంలో ఎదురవుతున్న అన్ని విపరీతాలను, ఈ 90 ఏళ్ళ వయసులో ఎదురైన ప్రథమ సంతానం దాసరి శిరీష అకాల మరణంతో సహా అన్ని విపత్తులకు తలవంచి, ఎదురొడ్డి నిలిచి, ముందుకు సాగుతూ, ఇప్పటికీ సాహిత్యాభిలాష, రచనాభిలాష నిత్యనూతనంగా కొనసాగిస్తున్న పరిపూర్ణ నిర్ద్వంద్వంగా మహా మహిళా యోద్ధ. ఆమె స్ఫూర్తి, ఎందరికో వెలుగు దారి. వెలుగు దారులలోనే ఆమె పయనం కడదాకా పరుగిడాలని ఆశిస్తూ… ఆ అమ్మకు మనఃపూర్వక నమస్సుమాంజలులు.

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.