1940, 50 దశాబ్దాలు ఉత్సాహం, చైతన్యం, కార్యదీక్ష, అంకితభావం, సృజనాత్మకతలతో నిండినవి. ఒకవైపు జాతీయోద్యమ ఉధృతి, మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధపు సంక్షోభం, సమసమాజపు కలలనందించిన సోవియట్ యూనియన్ ప్రభావం, వీటితో తెలుగు ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు, విద్యార్థులు ఉద్యమాలలో భాగమైన కాలమది. ఫాసిస్టు వ్యతిరేకత ఆంధ్రదేశంలో ఉధృతంగా
ప్రచారమైన రోజులవి. గ్రామగ్రామాన కమ్యూనిస్టు నినాదాలు మారుమోగిన కాలమది. ఆ కాలంలోని చైతన్యాన్నంతా తనలో ఆవహింపజేసుకుని, విద్యార్థినిగా, గాయనిగా, కార్యకర్తగా, సాంస్కృతిక దళ సభ్యురాలిగా, నటిగా తనలోని సమస్త శక్తులనూ సమాజానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్న ఒకానొక బాలిక నంబూరి పరిపూర్ణ. కుటుంబ నేపథ్యమూ సహకరించింది. అన్నయ్య నంబూరి శ్రీనివాసరావు మాటలు, మార్గదర్శకత్వం వెన్నుతట్టి పిలిచాయి. మద్రాసు, విజయవాడ వంటి నగరాలు, పట్టణాలే కాదు గ్రామాలు కూడా మూడు అడుగుల పరిపూర్ణ, సన్నగా చిన్నగా ఉన్న పరిపూర్ణ, స్టేజీ ఎక్కి తన కంఠంతో, నాట్యంతో, నటనతో ప్రజల మనసులలో అగ్ని పుట్టించేది. నిర్భీతి, సాహసం, నమ్మిన విలువల పట్ల అంకితభావం, ఆత్మగౌరవం, సంగీత సాహిత్యాలతో సున్నితమైన మనసు నిండా సహజ స్వభావ సిద్ధమైన భావుకత ` వీటితో నంబూరి పరిపూర్ణ ఆనాటి విద్యార్థి, యువజనోద్యమాలలో ప్రకాశించింది.
ఆనాడు, ఈనాడు కూడా ఉద్యమం స్త్రీల సృజనాత్మకతనూ, నాయకత్వ లక్షణాలనూ తనలో ఇముడ్చుకోలేకపోయింది. వివాహం, నాయకుడైన భర్తను ప్రశ్నించక అనుసరించడమే ఉద్యమాలలోని స్త్రీల కర్తవ్యం, గమ్యం అయింది. దాసరి నాగభూషణం గారనే ఒక కమ్యూనిస్టు నాయకుడితో వివాహం పరిపూర్ణ పాలిట వరమా శాపమా అంటే శాపమే. కానీ శాపాన్ని వరంగా మార్చుకోగలిగిన జీవితాన్ని దిద్దుకోగలిగిన తనను తన స్వంత అస్తిత్వంతో ఆవిష్కరించుకోగలిగిన సృజనశీలి పరిపూర్ణ. అగ్రవర్ణానికి, ఆధిపత్య భావజాలానికి ఎదురుతిరిగి నిలబడి బతుకు పోరాటంలో నిలిచి, గెలిచింది. పరిపూర్ణ మానవిగా మార్గదర్శకురాలయింది పరిపూర్ణ.
బీదరికం, ఉద్యమం నుంచి దూరం కావటం, భర్త నుంచి దూరం కావటం, ముగ్గురు పిల్లల పోషణ భారం మీదపడటం ఇవేమీ ఆమెను కుంగదీయలేదు. స్వయం ప్రకాశితగా నిలబెట్టాయి. తనను తాను కాపాడుకుంటూ, ఇతరులకు స్ఫూర్తిగా నిలబడటం ఎలాగో కష్టపడి నేర్చుకుంది. కానీ ఆమె జీవితాన్ని చూసి ఉద్యమ నాయకత్వం ఏమీ నేర్చుకోలేదు. అది చారిత్రక విషాదం. స్త్రీల పట్లా, దళితుల పట్లా, వామపక్ష ఉద్యమాలలో మార్పు రావాల్సిన అవసరాన్ని డా.కొమర్రాజు అచ్చమాంబ నుంచి నంబూరి పరిపూర్ణగారి వరకూ ఎందరో స్త్రీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ జీవితాలనే పాఠాలుగా చేసి నేర్పాలని ప్రయత్నించారు. అవి విఫలయత్నాలే అయ్యాయి. కానీ వారి జీవితాలు, జీవిత గమనంలో వారు వేసిన దారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమందికి తమ గమ్యాన్ని చూపించాయి. నడక నేర్పించాయి. అందువల్లే చరిత్రలో నంబూరి పరిపూర్ణ నిలబడిపోతారు. అధిపత్య వ్యక్తుల పేర్లు వినపడవు. కాలగమనంలో వారు తిరోగామి శక్తులుగా గుర్తింపబడతారు. పరిపూర్ణకీ, నాకూ 1985 నుంచీ స్నేహం. వారింటికి వెడితే, ఇంటిని ఎలా కళాత్మకంగా, పరిశుభ్రంగా, మానవీయంగా, ప్రేమాదరణలతో తీర్చిదిద్దుకోవాలో అర్థమైంది. ఉద్యమ జీవితం నుంచి దూరమైనా ఉద్యమ విలువలనూ, ఉద్యమాలు అసలెందుకు మొదలవుతాయో ఆ ఆదర్శాలనూ, ఆశయాలను జీవితంలో నిలుపుకోవడమెలాగో అర్థమైంది. అసలైన విషయం అది అని తెలిసింది.
పరిపూర్ణ హాయిగా నవ్వటం చూశాను. ఆనందంగా బతకటం చూశాను. కోపంతో, చిరాకుతో, విసుగుతో కూడా ఆమెను చూశాను. కానీ దిగులు, దుఃఖం, కుంగిపోవటం… వీటితో ఆమెను ఎన్నడూ చూడలేదు. నేనే కాదు… నా స్నేహం చాలదు అవి చూసేందుకు. కానీ ఆమె పిల్లలతో సహా, ఆత్మీయ బంధువులతో సహా, ప్రాణ మిత్రులతో సహా ఎవరూ ఆమెనలా చూసి ఉండరని నాకు నమ్మకంగా తెలుసు. ఆమె ఆ విధంగా కూడా నాకు మార్గదర్శకురాలయింది. 1986లో దూరదర్శన్‌కు ‘ఇద్దరూ ఒకటే’ అనే చిన్న ఫిలింకి స్క్రిప్ట్ రాశాను. ఆడ, మగ పిల్లలిద్దరినీ వివక్ష చూపకుండా పెంచాలనేది ఆ కథ సారాంశం. అందులో పరిపూర్ణకు కోడలుగా నేను, కొడుకుగా అక్కినేని కుటుంబరావు నటించాం. అప్పుడప్పుడూ నవ్వుతూ నా అత్తగారు మీరు అంటే… మా అబ్బాయి వీరు అని కుటుంబరావుని అభిమానించేవారు. చిన్నవాళ్ళమనే కారణంతో గౌరవం తగ్గించే ప్రసక్తే లేదు ఆమె వద్ద. ప్రేమించటమంటే గౌరవించటమని ఆమె విశ్వాసం. ప్రతి సంబంధంలోనూ ‘రెస్పెక్ట్’ ముఖ్యమని ఆమె అనేకసార్లు చెప్పారు. ఇంట్లోనే కాదు ఆమె ఆఫీసుని, తన ఉద్యోగాన్ని నిర్వహించిన తీరు కూడా ఆమె విలువలను ప్రతిబింబిస్తుంది. మామూలుగా స్నేహాలు వ్యక్తుల మధ్య ఏర్పడి అక్కడే ఆగుతాయి. పరిపూర్ణ స్నేహం అక్కడ ఆగదు. ఆమె పిల్లలు దాసరి అమరేంద్ర, దాసరి శిరీష, దాసరి శైలేంద్రల వరకూ వెళ్తుంది. వారితో మంచి స్నేహం కలుస్తుంది. అంతటితో కూడా ఆగదు. మనవరాలు తోట అపర్ణ, మేనకోడలు నంబూరి మనోజ్ఞ… ఇలా ఎందరితోనో అల్లుకుపోగల చనువుని ఇస్తుంది. మూడు తరాలను ప్రభావితం చేసిన పరిపూర్ణ జీవితం ఆమెది. ఆమె కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. తన ఆత్మకథను ‘వెలుగుదారులలో…’ అనే పేరుతో రాశారు. ఆమె జీవితం గురించి ఎలాంటి దాపరికాలూ లేకుండా రాసిన ఆ పుస్తకం చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఉద్యమాలు, రాజకీయాలు, కుల, లింగపరమైన వివక్షలు, వాటికి వ్యతిరేకంగా వ్యక్తులు చేసిన పోరాటాలు, అవి ఉద్యమాలకు ఇచ్చిన స్ఫూర్తి, వ్యక్తిగతం రాజకీయంగా మారే సందర్భాలు, ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆమె చేసింది కేవలం వ్యక్తిగత పోరాటం కాదనీ, రాజకీయమనీ అర్థమైతే ఇప్పటి తరాలకు ఎంతో మేలు జరుగుతుంది.
వెలుగుదారులలో… పుస్తకం నంబూరి పరిపూర్ణని చిరంజీవిని చేసింది. ఆ పుస్తకం చదివితే ఆమెతో స్నేహం కలుస్తుంది. ఆమె వేసిన దారిలో నడవాలనిపిస్తుంది. జీవితాన్ని సృజనాత్మకంగా జీవించటం కూడా ఒక ఱఅ్‌వశ్రీశ్రీవష్‌బaశ్రీ లక్షణమని తెలుస్తుంది. పరిపూర్ణగారూ మీకు వీడ్కోలు లేదు. మీరు ప్రతి తరానికీ వెలుగుచూపే దారులేసి నడిపిస్తూనే ఉంటారు. (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో…)